పి.వి. నరసింహారావు

పి.వి.నరసింహారావు!
తెలుగు వాడి తేజం!
ఒక చైతన్యఝరి!
ఒక అద్భుత సాహితీలహరి
బహుముఖప్రజ్ఞాశాలి.. బహుభాషావేత్త..
అంతేకాదు.. కాలం, సమాజపత్మం మీద చేసిన అందమైన హస్తాక్షరి


బీజం నుండి భుజం వరకు ఆయన వ్యక్తిత్వం ఎదిగింది. బిందువు నుండి సింధువు వరకు ఆయన ప్రజ్ఞ బహుముఖీనంగా విస్తరించింది.
పి.వి. గారి అపురూప వ్యక్తిత్వాన్ని పరిచయం చేయడానికి భాష చాలదు. ఆయన మేథస్సును అంచనా వేయడానికి ఊహ చాలదు. దేశం (రాజకీయ రంగం)లో సమకాలీన సంక్షుభిత రాజకీయాలను మేధావులు కూడా ప్రభావితం చేయగలరని పి.వి. గారి ద్వారా నిరూపితమైనది.
పి.వి. నరసింహారావుగారు 1921లో జూన్‍ 28వ తేదీన వరంగల్‍ జిల్లా నర్సంపేట మండలం, లక్నపల్లి గ్రామంలో రుక్మాబాయమ్మ, సీతారామారావు దంపతులకు జన్మించారు. తరువాత కరీంనగర్‍ జిల్లా భీమదేవరపల్లిలోని వంగర గ్రామానికి చెందిన రంగారావు, రత్న బాయమ్మలకు దత్తుడై, తొలుత వేలేరులో, తదుపరి హన్మకొండలో చదువుకొన్నారు. వందేమాతరం ఉద్యమంలో పాల్గొని ఉన్నత పాఠశాల చదువుల నుండి బహిష్కరణకు గురైనారు. నిజాం రాష్ట్రం వీడి పూనా నగరంలోని ఫర్గూసన్‍ కాలేజిలో చేరి బిఎస్సీ వరకు చదివారు. ఆ తరువాత నాగపూర్‍ యూనివర్సిటిలో ‘లా’ చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై స్వర్ణ పతకం పొందారు.
పి.వి. గారు హైదరాబాద్‍ తిరిగి వచ్చి శ్రీ రామక•ష్ణారావు గారి వద్ద జూనియర్‍గా చేరి న్యాయవాద• వ•త్తిని ప్రారంభించారు. కాని నిజాం నిరంకుశత్వ విధానాలు, రజాకార్ల ఆగడాలు వారిని స్థిమితంగా ఉంచలేకపోయాయి. స్వామీ రామానందతీర్థగారి పిలుపుతో స్వాతంత్య్రోద్యమంలో చేరారు. టి.హయగ్రీవాచారి కె.వి.నర్సింగరావు, గోవింద రావు షరాఫీ ప్రభ•తులతో కలిసి మహారాష్ట్రలో చాందా నగరం చేరి అజ్ఞాతవాసం చేస్తూ సమర శంఖారావం చేశారు.


1948లో పోలీసు చర్య వల్ల హైదరాబాద్‍ సంస్థానం విముక్తి పొంది, భారత్‍ యూనియన్‍లోకి విలీనమయ్యాక, పి.వి. గారు మార్క్సిస్టు మిత్రుడు పాములపర్తి సదాశివరావు గారితో కలిసి ‘కాకతీయ’ వారపత్రికను నిర్వహించారు. చిత్రమేమిటంటే ఆర్యసమాజోద్యమంతో ఎదిగి, ప్రజాకవిగా మారిన కాళోజీ నారాయణరావు – కమ్యునిజం వైపు వెలుగు చూపిన పాములపర్తి సదాశివరావులకు ఆప్తమిత్రుడయ్యారు పి.వి.
పి.వి.గారు మౌలికంగా సామ్యవాది. సౌమ్యశీలి. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యునిగా చేరి, 1952లో కరీంనగర్‍ ణ.•.• అధ్యక్షుడయ్యారు.
1957లో కరీంనగర్‍ జిల్లా మంథని నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందిన పి.వి. గారు తమ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత 1962, 67, 72 సంవత్స రాల్లో కూడా శాసనసభ్యునిగా గెలుపొంది మంథని ప్రాంతాభివ•ద్ధికి పాటుపడినారు.
1962లో నీలం సంజీవరెడ్డిగారి మంత్రివర్గంలో మొదటిసారిగా న్యాయశాఖ, జైళ్ళు, సమాచార శాఖ మంత్రిగా చేరారు. ‘ఓపెన్‍ జైలు’ ప్రతిపాదన తెచ్చి మొదటి ఓపెన్‍ జైలును అనంతపురంలో ఏర్పాటు చేయించారు. ఖైదీల సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకున్నారు. వరంగల్‍ జైలు ఖైదీలకు అజంజాహి మిల్లు కార్మికుల ద్వారా తివాచీలు, చద్దర్లు తయారు చేయించడంలో శిక్షణ యిప్పించారు.


1964-67 మధ్యకాలంలో దేవాదాయ శాఖ మంత్రిగా శిథిలమైన దేవాలయాలను ఉద్దరించడానికి బడ్జెట్టు మంజూరు చేయించారు.
1967లో పి.వి. గారు వైద్య ఆరోగ్య శాఖామాత్యులయ్యారు. గర్భవతులైన గ్రామీణ పేద స్త్రీలకు సత్వర వైద్యసదుపాయం అందేలా ఏర్పాట్ల చేయించింది పి.వి. గారే.


1968-71లో తనకు అత్యంత యిష్టమైన విద్యాశాఖ మాత్యులై ఎన్నో సంస్కరణలు చేపట్టారు. తెలుగు అకాడమికి రూపకల్పన చేసింది పి.వి. గారే.
1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వువ్వెత్తున ఉబికింది. 1971లో కాంగ్రెస్‍ పార్టీ అధిష్టాన వర్గం పి.వి. గారిని ముఖ్యమంత్రిగా నియమించింది. ముఖ్యమంత్రిగా చరిత్రాత్మకమైన భూసంస్కరణల చట్టాన్ని ప్రవేశ పెట్టి నూతన ప్రజాస్వామిక విప్లవానికి నాంది పలికినారు. తెలంగాణ రాష్ట్రంలోని భూస్వాములకు పి.వి. గారి సంస్కరణలు నచ్చలేదు. కాంగ్రెస్‍ అధిష్ఠాన వర్గానికి మొరపెట్టుకున్నారు. రాబోయే ఎలక్షన్లలో పార్టీకి భారీ పరాజయం తథ్యమని పి.వి. సమర్థుడైన నాయకుడు కాడని ఫిర్యాదుల వెల్లువ వెళ్ళింది. దానికి జై ఆంధ్ర ఉద్యమం తోడైంది. రాష్ట్రంలో అనిశ్చిత రాజకీయ పరిస్థితి ఏర్పడిందని నాటి ప్రధాని ఇందిరాగాంధీ పి.వి. గారితో రాజీనామా చేయించింది. దాంతో పి.వి. శకం ముగిసిందని నాటి తిరుగుబాటు దారులు సంతోషించారు. కానీ అధిషాన వర్గం పి.వి. గారిని 1974లో అఖిల భారత కాంగ్రెస్‍ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమించి, రాష్ట్రాని కన్నా దేశానికే పి.వి. గారి సేవలు అవసరమనే సంకేతాన్ని అందించింది.


1977లో కాంగ్రెస్‍ పార్టీ, దేశ వ్యాప్తంగా ఘోర పరాజయం పొందిన తరుణంలో, పి.వి. గారు హనుమకొండ నియోజకవర్గం నుంచి లోక్‍సభకు ఎన్నికై తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టి, ప్రతిపక్షంలో కూర్చొని తన ప్రతిభాపాటవాలు ప్రదర్శించారు. కీలకమైన పబ్లిక్‍ అకౌంట్స్ కమిటికే చైర్మన్‍గా ఎన్నికై దేశమంతా పర్యటించి, వివిధ ప్రభుత్వరంగ సంస్థలు పనిచేస్తున్న తీరు తెన్నులను నిశితంగా పరిశీలించారు.


1980లో లోక్‍ సభ ఎన్నికల్లో, తిరిగి హనుమకొండ నియోకజవర్గం నుంచి గెలిచి, శ్రీమతి ఇందిరాగాంధి మంత్రి వర్గంలో, విదేశాంగ మంత్రిగా చేరారు. తన బహుభాషా ప్రావీణ్యంతో అసమాన ప్రతిభతో భారతదేశ విదేశాంగ విధానాన్ని అలీన రాజ్య సిద్ధాంతాన్ని, ఐక్యరాజ్యసమితి, మొదలు అనేక దేశాలలో చాటిచెప్పి విదేశాలకు మనదేశం పట్ల గల గౌరవభావాన్ని అధికం చేశారు.
శ్రీమతి ఇందిరాగాంధీ హత్య అనంతరం, శ్రీ రాజీవ్‍ గాంధి ప్రధాని కావడంలో కీలకపాత్ర పోషించారు. రాజీవ్‍ మంత్రివర్గంలో మానవ వనరుల అభివ•ద్ధి శాఖను జవహర్‍ నవోదయ విద్యాసంస్థలు, జాతీయ సాక్షరతా మిషన్‍, నెహ్రూయువకేంద్ర మొదలైన 40 విభాగాలతో ప్రతిపాదించి, ఆ శాఖకు క్యాబినెట్‍ హోదా మంత్రిగా, 1985 నుండి 1989 వరకు, అమూల్యమైన సేవలందించారు.


1991లో రాజీవ్‍ గాంధీ దారుణంగా హతుడైన అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పి.వి. గారు దేశప్రధానిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం బుసలు కొడుతున్న తరుణమది. ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమై మన బంగారం నిల్వలను కూడా విదేశాలకు తాకట్టు పెట్టవలసిన దుస్థితిలో దేశం వున్నది. పి.వి. నేత•త్వం వహించింది మైనారిటీ ప్రభుత్వానికి, గోల్డ్ బాండ్‍ స్కీం వంటి పలు పథకాలు ప్రవేశపెట్టి 50 సంవత్సరాల్లో సున్నాశాతం అభివ•ద్ధిరేటును 7% స్థాయికి పెంచి ఆర్థికంగా ఘన విజయం సాధించారు. పాకిస్తాన్‍, చైనా, అమెరికాలు పర్యటించి ఆయా దేశప్రభుత్వాల వైఖరులనీ భారత్‍కు అనుకూలంగా మార్చారు. తనకంటూ ఓ బలమైన వర్గాన్ని ఏర్పరచుకోలేకపోయిన పి.వి. గారు, నెహ్రూ కుటుంబేతర వ్యక్తిగా దేశానికి నాయకత్వం వహించి అపరచాణక్యునిగా పేరు తెచ్చుకున్నారు.
రాజకీయనాయకులలో సాహితీ సాంస్క•తిక స్పర్శ కనిపించదు. కానీ పి.వి. గారిలో మరో కోణం సాహిత్యం. వారు అష్టభాషా ప్రవీణ్యులు. 28 భాషల్లో ప్రవేశమున్నది. ఎన్నో గ్రంథాలకు పీఠికలు రాశారు. లోపలిమనిషి, అబల జీవితం, గొల్ల రామవ్వ, నీలిరంగుపట్టుచీర, సహస్రఫణ్‍ మొదలైన రచనలు వారి సాహితీ స•జనకు నిదర్శనాలు. పాశ్చాత్య రచనలెన్నో అధ్యయనం చేసిన మేధావి. సాహిత్యంతో పాటు హిందుస్థానీ సంగీతాన్ని బాగా ఆస్వాదించేవారు.
1975లో కౌలాలంపూర్‍లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కీలకపాత్ర వహించారు. 1982లో వరంగల్‍లో జరిగిన పోతన పంచశతి ఉత్సవాలకు మూలపురుషుడు పి.వి. గారే హైద్రాబాద్‍లో ఉర్దూ విశ్వవిద్యాలయానికి క•షి చేశారు. తిరుపతిలో రాష్ట్రీయ సంస్క•త విద్యాపీఠాన్ని, నెలకొల్పారు. ఆకాశవాణిలో సంస్క•తం ఉర్దూ-భాషల్లో వార్తలు చదవటాన్ని ప్రవేశపెట్టింది పి.వి. గారే.


పి.వి. గారికి ఎనమండుగురు సంతానం. ఆంధప్రదేశ్‍ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కీ।।శే।। పి.వి. రంగారావు వీరి జ్యేష్ఠపుత్రులు. సికింద్రాబాద్‍ లోక్‍సభ నియోజకవర్గం ఎంపి, పారిశ్రామికవేత్త కీ।।శే।। పి.వి. రాజేశ్వరరావు గారు వీరి ద్వితీయ పుత్రులు. మూడోకొడుకు పి.వి. ప్రభాకరరావు గారు వ్యాపారవేత్త, శారద, సరస్వతి, వాణి, జయ, విజయలు కుమార్తెలు. వీరిలో శ్రీమతి సురభివాణీ దేవి అంతర్జాతీయ చిత్రకళా కారిణిగా పేరుతెచ్చుకున్నారు.


1970లో భార్య సత్యమ్మ మరణించినా, 1980లో మాత•వియోగం కలిగినా చలించక, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితమిచ్చిన స్థితప్రజ్ఞుడు శ్రీ పి.వి.
పి.వి. గారు వ్యక్తులకు, అధినేతలకు విధేయుడు కాడు, తను నమ్మిన కాంగ్రెస్‍ పార్టికే విధేయుడైనారు. అందుకే వారు ఎన్నడూ పార్టీని వీడలేదు. వెన్నుపోటుకు గురైనారే కానీ వెన్నుపోటు పొడవలేదు.


ఆధునిక భారతచరిత్రలో అరుదైన శకాన్ని స•ష్టించి, అభ్యుదయ భావాలతో జీవించిన ఆధ్యాత్మిక వేత్త, రాజకీయ వేదాంతి.
‘‘మనం బతకాలంటే కలిసి బతకడం నేర్చుకోవాలి’’ అని చెప్పిన పి.వి. గారి జీవన మహా ప్రస్థానం 2004 సంవత్సరం డిసెంబర్‍ 23వ తేదీన ముగిసింది. జాతి ఓ గొప్ప మేధావిని కోల్పోయిందని ప్రపంచదేశాలు సంతాప సందేశాన్ని ప్రకటించాయి.
పి.వి. గురించి మహాకవి దాశరథి ఏనాడో చెప్పిన కవిత –
‘‘మా పి.వి. మేధావి ‘మధుర కళాజీవి’
అతని వంశం వాగ్దేవి – అతని పరం నవ భావి’’
ప్రజాకవి కాళోజి అన్నట్లు – పి.వి. ఓ మహాపురుషుడే కాదు ఓ మధురమైన కల.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్క•తిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)

  • డా।। వి.వి. రామారావు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *