పచ్చల (Emeralds) సొబగు

బెరిల్‍ ఖనిజ కుటుంబానికి చెందిన మహారత్నం మరకతం. జలనీలం, పచ్చని బెరిల్‍ (green Beryl), వైఢూర్యం మొదలయినవి ఒకే ఖనిజ రూపాలు.
పచ్చల ప్రస్తావన: మరకతం, పచ్చ అనేది రాచరికంతో ముడిపడి ఉన్న ప్రసిద్ధ రత్నం. ఇది విధేయతకు, ప్రేమకు చిహ్నం. మరకతం కులీనులు మరియు ప్రభువులచే ఎక్కువగా ఆదరించబడ్డది. ఈ రత్నం చరిత్ర ప్రారంభదశ నుండి మానవ సమాజానికి చిరపరిచితం. రాణి క్లియోపాత్ర పచ్చలపట్ల ఆసక్తికి పేరుగాంచింది. రోమన్లు దీనిని వీనస్‍ దేవతతో అనుబంధించారు. అప్పటి క్లియోపాత్రా నుండి ఇప్పటి ఎలిజబెత్‍ టేలర్‍ దాక అందరిని అలరించిన ఈ బెరిల్‍ కుటుంబం రత్నం ప్రస్తావన మన సాహిత్యంలో కూడా కనిపిస్తుంది.


మహాజనపదాల కాలంలో ఉత్తర భారతం, దక్షిణాదితో సంబంధంలోకి వచ్చిన నాటి నుండి, మౌర్యుల కాలం నాటి బౌద్ధస్థూపాలలో బెరిల్‍-వైఢూర్యం దొరికింది. బుద్ధుని కాలంలో బెరిల్‍ రత్నం వాడుక ఉన్నట్టు తెలుస్తుంది.


బెరిల్‍ ప్రస్తావన అర్ధశాస్త్రంలో ఉంది. బ•హద్సంహితలో వజ్రాలు మరియు ఇంద్రనీలాల తర్వాత మూడవ స్థానంలో పచ్చ పేర్కొనబడ్డది. భట్టాలపాలుడు ‘‘… ఇత్యాది ఉత్క•ష్టాని చత్వరీ వజ్ర, ముక్త, పద్మరాగ, మరకతాఖ్యాని’’ అన్నాడు. అంటే వజ్రం, ముత్యం, మాణిక్యం మరియు మరకతం అనే ఈ నాలుగు రత్నాలు ఉత్తమమైనవి. నరహరి తన ‘రజనిఘంటువు’లో లోహితక, వజ్ర, మౌక్తికా, మరకట, నీల మహోపలః పంచ.. అనగా మాణిక్యం, వజ్రం, ముత్యం, మరకతం మరియు నీలమణి అనే ఐదు గొప్ప విలువైన రాళ్లు అని.


ఆయుర్వేద గ్రంథం ‘రసజలనిధి’లో మరకత ప్రస్తావన ఉన్నది. గరుడ పురాణంలో, అగస్త్యసంహితలో కూడా దీని ప్రస్తావన ఉన్నది. మహాభారతంలో కూడా మరకత ప్రస్తావన ఉన్నది. వాల్మీకి రామాయణంలో కూడా పుష్పకవిమాన వర్ణనలో మరకతం ప్రస్తావించబడింది. శివపురాణం, స్కాంధపురాణాలలో మరకత లింగాల ప్రస్తావన ఉంది. వేదాలు, పురాణాలలో అనేక చోట్ల నవరత్నాల ప్రస్తావన ఉంటుంది. మరకతం నవరత్నాలలో ఒకటి. ఐతే మరకతంగా ప్రసిద్ధి చెందిన ఈ రత్నం నిజానికి వైడూర్యం ( Bery ) మాత్రమే. నిజమైన మరకతం లేదా జాతిపచ్చ ఆ కాలంలో ఈజిప్టు నుండి మాత్రమే వచ్చేది. ఎమరాల్డ్ గనులు భారత దేశంలో చాలాకాలం తరువాత కనుగొనబడ్డాయి.


క్రీస్తుశకం ప్రారంభంలో ఇండో-రోమన్‍ వాణిజ్యం కారణంగా బెరిల్‍ ప్రజాదరణ పొందింది. ప్లినీ తన నేచురలిస్‍ హిస్టోరియాలో బెరిల్‍ భారతదేశంలో కాకుండా మరెక్కడా కనుగొనబడ లేదని వ్రాశాడు. దీని స్ఫటికాల యొక్క షట్కోణ రూపాన్ని కళాకారులు మలిచారని అప్పట్లో అతను భావించాడు. అది సహజ రూపం అని అతనికి అప్పటికి తెలియదు. మహా భారతంలో పొడుగు షట్కోణాకారం బెరిల్‍ స్ఫటికాలు గడ్డిమొనలతో పోల్చబడింది. కాళిదాసు రత్నసలాకాను (బెరిల్‍ యొక్క పొడవైన గడ్డి ఆకుపచ్చ స్ఫటికాలు) కుమారసంభవంలో ప్రస్తావించాడు.


వెల్లూరు చుట్టుపక్కల కనిపించే ఆకుపచ్చ బెరిల్‍, ఆక్వామారిన్‍ తరచుగా పాండ్య చేర మరియు చోళ రాజ్యాల మధ్య వివాదానికి దారితీసింది. పున్నాట, పోదనూరు గనుల మైసూర్‍ వద్ద ఉన్నవి చేరరాజ్యం చేత నియంత్రించబడ్డాయి. వెల్లూరులోని గనులు, వాణియంబాడి గనులు చోళులచే నియంత్రించబడ్డాయి. ఈ బెరిల్‍ aquamarine మొత్తం కోయంబత్తూరులో ప్రాసెస్‍ చేయబడి ముజిరిస్‍ ద్వారా రోమ్‍కు ఎగుమతి చేయబడింది. నిజమైన బెరిల్‍ రత్నాలతోపాటు ‘అనుకరణబెరిల్‍ రత్నం (ఆకుపచ్చ గాజు)’ వంటిది కూడా అప్పుడప్పుడు ఎగుమతి చేయబడింది.
వార్మింగ్టన్‍ రచనలు దక్షిణ భారతదేశం నుండి ఎగుమతి చేయబడిన ఆకుపచ్చ ఆక్వామెరైన్‍లపై రోమన్ల ఆసక్తిని సూచిస్తున్నాయి. బెరిల్‍ రోమన్‍ లను ఎంతగా ఆకర్షించింది అంటే అక్కడ బెరిల్లస్‍ అనే పేరు బాగా ప్రాచుర్యం పొందింది.


వైఢూర్యం, మరకతం వ్యుత్పత్తి:
అష్టాధ్యాయిని (4.3.84)లో పాణిని (500 BC)లో ఈ మణి విదూరనగరం నుండి వచ్చిందని, అందుకే దీన్ని వైఢూర్యం అన్నారు. నిజానికి ఈ ఖనిజం వాలవాయపర్వతం నుండి వచ్చింది. విదూర నగరం రత్నాలు సానపట్టే కేంద్రం మాత్రమే. ఈ నగరం మరియు రత్నం పేరు మధ్య ఉన్న సంబంధం విషయంలో ఏకాభిప్రాయం లేదు. కొంత మంది దీన్ని కేవలం కల్పనగా పరిగణించారు. కాని, బుద్ధభట్టుడు తన రత్నపరీక్షలో పాణిని అభిప్రాయాలను సమర్థించాడు. పాణిని ‘వాలవాయ’, బుద్ధభట్టుని ‘వాలికా’ పర్వతాలు ఒకే విధంగా ఉన్నాయి. అప్పటి కొంగ మరియు చోళరాజ్యాల సరిహద్దులు ఇప్పుడు కోయం బత్తూర్‍ సమీపంలోని సేలంలో భాగం అని తెలుస్తున్నది. ఇక్కడ నుండి పురాతన కాలంలో రోమన్లకు బెరిల్‍ సరఫరా చేయబడింది. ఆల్ఫ్రెడ్‍ మాస్టర్‍ వేలూరియాను బెరిల్‍కు సమానమైనది అని సూచించారు.


ద్రావిడ భాషలలో వెల్‍ అనగా తెలుపు మరియు ఉర్‍ పట్టణం. సంస్క•తంలో విదూర అంటే సుదూర ప్రదేశం. తమిళనాడులోని వెల్లూరు మరియు కర్ణాటకలోని బేలూర్‍ వంటి ఒకటి కన్నా ఎక్కువ వెలూర్లు ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ బెరిల్‍ రత్నం యొక్క ప్రాసెసింగ్‍ కేంద్రాలుగా వుండవచ్చును.


A.K బిస్వాస్‍ గారి అభిప్రాయం ప్రకారం వేలూరియ మొదట క్వార్టజ్ స్ఫటికాలపరంగా వాడారు, అది కాలక్రమంలో నీలం మరియు ఆకుపచ్చమణి బెరిల్‍కు కూడ పొడిగించబడింది. క్రమంగా అది సంస్క•తంలో వైఢూర్యం గాను కొంత మార్పుతో గ్రీకు, అరబిక్‍, పర్షియన్‍ భాషలలోకి ప్రవేశించింది. బెరిల్లస్‍ అనే లాటిన్‍ పదం బెరిల్‍ అనే ఆంగ్ల పదానికి దారితీసింది. జర్మన్‍ పదం దీతీఱశ్రీశ్రీవ అంటే కంటిఅద్దాలు. నీరోచక్రవర్తి పచ్చని బెరిల్‍తో చేసిన అద్దాలు ధరించేవాడు అంటారు. మూలకాల యొక్క ఎటువంటి చేరికలు లేదా జాడలు లేని బెరిల్‍ రంగులేనిది దానిని ఘోషనైట్‍ అంటారు. కళ్లద్దాల లెన్స్కు ఘోషనైట్ను పూర్వం ఉపయోగించేవారు. పచ్చల యొక్క ఆహ్లాదకరమైన పచ్చని రంగు కళ్లకు హాయిని కలిగిస్తుంది. ప్రస్తుతం వైఢూర్యం అనే పదాన్ని తరచుగా క్రిసోబెరిల్‍కు ఉపయోగిస్తున్నారు. ఇది సాంకేతికంగా సరైనది కాదు, వాణిజ్య పరమైన అలవాటు మాత్రమే.
బుద్ధభట్టుడు పిల్లి కన్నువలె ఉండే ‘స్ఫులింగాని బాహా’ అనే వైఢూర్యం గురించి వివరించాడు. A.K BISWAS అభిప్రాయం ప్రకారంcats eye బెరిల్‍లో సాధారణంగా ఉండదు. క్రిసోబెరిల్‍ లో కనిపిస్తుంది. దానిని వైఢూర్యం అని పొరపాటుగా బుద్ధభట్టుడు పేర్కొని ఉండవచ్చు. భారతదేశంలోని ప్రాచీన పండితుల అభిప్రాయం ప్రకారం వైఢూర్యం అంటే తెలుపు మరియు, ఆకుపచ్చ, కొన్నిసార్లు నీలం రంగులో ఉండే బెరిల్‍ మాత్రమే తప్ప వేరే ఏదీ కాదు.


కౌటిల్యుని అర్థశాస్త్రంలో వైఢూర్యం రంగు నీలకమలం, శిరీష పుష్పం లేదా నీటిరంగు, ఆకుపచ్చవెదురు మరియు చిలుకలరెక్కల రంగు అని వివరించాడు. ఇది మార్జలాక్ష లేదా క్రిసోబెరిల్‍ లక్షణాలకు స్పష్టంగా భిన్నంగా ఉంది. బుద్ధభట్టుడు వేరొక సందర్భంలో బెరిల్‍ రంగు నెమలి కంఠం వలే లేదా ఆకుపచ్చ వెదురు వంటిది అన్నాడు.


అగస్త్య రత్నపరీక్ష మరియు గరుడపురాణంలో బెరిల్‍ రంగు గ్లోవార్మ్ ప•ష్టభాగం రంగుతో పోల్చబడింది. ముదురు ఆకుపచ్చ మరకతం రామాయణంలో గాని కౌటిల్యుని అర్ధశాస్త్రంలో గాని ప్రస్తావించబడలేదు. మహాభారతంలో ఉన్నది తరువాత ప్రక్షిప్తం కావచ్చు.
ప్రారంభ దశలో పచ్చకి భారతదేశంలో ఉన్న పేరు ‘మసరక’ ఇది మ్రి లేదా ఈజిప్ట్ నుండి వచ్చినదనే అర్థాన్ని సూచిస్తుంది. గ్రీకులు దీనిని స్మరాగ్డస్‍ అని పిలిచారు. మరు అంటే ఎడారి మరియు కత అంటే తీరం, ఈ రాయి ఈజిప్టులోని క్లియోపాత్రా గనుల నుండి వచ్చిందని ‘‘మరకత’’ పదం సూచిస్తుంది. బుద్ధభట్టుడు (క్రీ.శ. 5వ శతాబ్దం) తన రత్నపరీక్షలో మరకతాలు వరవర పర్వతం నుండి మరియు సముద్ర తీరం దాటి, తీరానికి సమీపంలో ఉన్న గనుల నుండి వచ్చాయని పేర్కొన్నాడు. ఈజిప్టు పచ్చల గనులు రెండు గ్రూపులుగా ఉన్నాయి ఒకదానిని జెబెల్‍ సాకేత్‍ అంటారు, మరొకటి సబ్రా లేదా జబ్రా. ఈ జాబ్రా పర్వతమే వరవరగా భారతీయ ప్రాచీన గ్రంథాలు పేర్కొన్నాయి. వరవర అంటే ఈశాన్య ఆఫ్రికా ప్రాంతము అని అర్ధం. అగస్త్యమతం మరియు రత్నసంగ్రహములలో కూడా ఇలాంటి భౌగోళిక వివరణలే ఉన్నాయి.


ఒక పురాణకథ ప్రకారం రత్నాలు చనిపోయిన బలి రాక్షసుడి యొక్క వివిధ శరీరభాగాల నుండి వచ్చాయి. (ఎముకల నుండి వజ్రం, కళ్ళ నుండి నీలమణి మరియు పిత్తం నుండి పచ్చ, ఇలా వివిధభాగాల్లో నుండి వివిధరత్నాలు ఏర్పడ్డాయి.) వధించబడిన రాక్షసుని పిత్తాన్ని గరుడుడు తన ముక్కున కరుచుకుని వరవర పర్వతం ప్రాంతంలో పడేశాడట. గరుడం, హరిణ్మణి మొదలైన పదాలు పచ్చకి అలా ఆపాదించబడ్డాయి. తెలుగులో కూడా మంచి నాణ్యత గల పచ్చలను గరుడపచ్చ అంటారు. పన్నా అనే పదానికి పాము అని, అలాగే పడిపోయినది అని కూడా అర్థం. ఇలా మరకతం, పచ్చ, పన్న మొదలైన పేర్లు వచ్చాయి.


ఇంకా మరకతానికి అనేక పర్యాయపదాలు ఉన్నాయి. అందులో కొన్ని ‘‘గరుత్మతం, అస్మగర్భం, హరిణ్మణి, రాజనీలం, గరుడాంకితం, సౌపర్ణం, రౌహినేయం, గరుడోద్గీర్ణం, గరుడోత్తీర్ణం, గరుడం, అస్మగర్భజం, గరలరిః, వాపబోలం లేదా వప్రవాళం, బుధరత్నం’’ మొదలైనవి. మరకతం యొక్క గ్రీకు, రోమన్‍, లాటిన్‍, అరబిక్‍ పేర్లు సంస్క•త నామానికి ఇంచు మించు, ఫొనెటిక్‍గా సమానంగా ఉంటాయి.


బెరిల్‍ ఎగుమతి, దిగుమతులు:
బిస్వాస్‍ అభిప్రాయం ప్రకారం ముదురు ఆకుపచ్చ మరకతం గ్రీకు, రోమన్‍ వాణిజ్యకాలంలో మాత్రమే ఈజిప్ట్ నుండి మనకు దిగుమతి చేయబడింది. భారతదేశం నుండి పశ్చిమానికి ఎగుమతి అయిన ఆకుపచ్చబెరిల్‍ ను ఓరియంటల్‍ పచ్చలు (oriantal emeralds) అని ప్లినీ పేర్కొన్నాడు. పైన పేర్కొన్న వివరాల ఆధారంగా భారతీయ బెరిల్‍ రోమ్‍ మరియు గ్రీస్‍లకు ఓరియంటల్‍ ఎమరాల్డ్ ఆక్వా మారిన్‍ మరియు బెరిల్‍గా ఎగుమతి చేయబడింది. దీనిని స్థానికంగా వైఢూర్యం, జలనీలం, నీలవైఢూర్యం అనేవారు. నిజమైన పచ్చ-ఎమరల్డ్ మొదట ఈజిప్టు నుండి అలెగ్జాండర్‍ దండయాత్ర సమయంలో తక్కువ పరిమాణంలో మొదటిసారి భారతదేశానికి వచ్చింది. ఇండో రోమన్‍ వాణిజ్యం సమయంలో ఇవి పెద్ద మొత్తంలో దేశంలోకి వచ్చాయి. మన దేశానికి పచ్చల దిగుమతులు ప్రధానంగా హాంకాంగ్‍, జాంబియా మరియు రష్యా తదితర దేశాల నుండి జరుగు తున్నాయి. అప్పట్లో పచ్చలు పోర్చుగీస్‍ వారి ద్వారా దిగుమతి అయ్యేవి అంటారు.


మరకతం నిర్మితి:

చాలా రత్నాలు ఎక్కువ కాఠిన్యం కలిగి ఉండి, వివిధ రంగులో ఉంటాయి. కాఠిన్యం అణునిర్మాణంలో కాన్ఫిగరేషన్‍ వల్ల వస్తుంది. అణునిర్మాణంలో క్రోమియం, వెనెడియం, ఇనుము మొదలైన మూలకాల చేరిక, వాటి అమరిక కారణంగా వివిధ రంగులు ఏర్పడవచ్చు.
బెరిల్‍ కుటుంబానికి చెందిన ఖనిజ విషయానికొస్తే, రసాయని కంగా దీని ఫార్ములా Be2Al2(SiO3)6. ఆక్సిజన్‍ పరమాణువులు టెట్రాహెడ్రల్‍ నిర్మాణంలో సిలికాన్‍ పరమాణు వులతో చుట్టుముట్టబడి ఉంటాయి. ఎటువంటి మలినాలులేని సాధారణ బెరిల్‍ ఏ రంగు లేకుండా ఉంటుంది. దీనినే ఘోషనైట్‍ అంటారు. అల్యూమినియంలోకి క్రోమియం రీప్లేస్‍మెంట్‍ యొక్క చేరిక ఉన్నప్పుడు (0.2pc). ఇది ముదురు ఆకు పచ్చని మరకతం (పచ్చ) అనబడుతుంది. ఆక్వామారిన్‍ (జలనీలం/ నీలవైఢూర్యం) కూడా ఇనుము లేశమాత్రంగా ఉన్న సముద్ర నీలంరంగులో ఉన్న బెరిల్‍.
లాటిస్‍ నిర్మాణంలో ఇనుము అల్యూమినియం స్థానంలో చేరినప్పుడు దీని రంగు లోతైన నీలంగా ఉంటుంది. లాటిస్‍ నిర్మాణంలో ఇనుము (Fe3) స్థానం బట్టి Golden Beryl or Yellow Beryl (హీలియోడార్‍) అనే పేరుల తో వ్యవరించబడుతోంది. జాలక (latice space) ప్రదేశంలో ఇనుము మరియు వెనాడియం యొక్క ఇంటర్‍స్టీషియల్‍ స్పేస్‍ లో కలయికతో బెరిల్‍ గడ్డి ఆకుపచ్చ (Grass Beryl) బెరిల్‍గా మారుతుంది. అణు నిర్మాణంలోని మూలకాల వైవిధ్యం కారణంగా ఈ బెరిల్‍, పచ్చ/మరకతం (Emerald), ఆకుపచ్చ బెరిల్‍ ( Green Bery ), మోర్గానైట్‍, బిక్స్ బైట్‍ (Red Bery ) హెలియోడార్‍, ఘోషనైట్‍ మరియు ఆక్వామెరైన్‍ (జల నీలం/ నీల వైఢూర్యం)గా వ్యవరించబడుతోంది.
మొత్తం మీద పైన పేర్కొన్న ఖనిజాలు మరియు వాటి వైవిధ్యాలు సమిష్టిగా బెరిల్‍ కుటుంబం లోనివే. వైఢూర్యం అనే పేరు క్రమంగా బెరిల్‍గా మారింది. ఈ రత్నం స్ఫటికాలు పెద్దవిగా షట్కోణాకారంలో ఉంటాయి. మొహ్స్ స్కేల్‍పై బెరిల్‍ 7.5 నుండి 8 వరకు కఠినత్వం కలిగి ఉంటాయి. కానీ పెళుసుగా ఉంటాయి.


మరకతం లభ్యత: IBM నివేదిక ప్రకారం మనదేశంలో పచ్చల మొత్తం నిల్వ 55.87 టన్నులు. జార్ఖండ్‍లోనే ఈ నిలువలు ఉన్నాయి. ఇవి అంచనాల ఆధారంగా లెక్కింపు వేసినవి. వీటి గ్రేడ్లను ఇంకా వర్గీకరించలేదు. రాజస్థాన్‍ నుండి అజ్మీర్‍ రాజసమంద్‍ బెల్ట్లో పచ్చలు కనుగొన్నారు. ఇవి చాలావరకు అక్కడక్కడ, వివిధరకాలుగా ఉన్నాయి. ఒరిస్సాలో ఇవి బీరా-మోహరాజ్‍ పూర్బెల్ట్, బోలంగీర్‍ జిల్లానుండి కనుగొనబడ్డాయి. ఛత్తీస్‍గఢ్‍లో పచ్చలు డియోభోగ్‍, రాయ్‍పూర్‍ జిల్లాలో ఉన్నట్టు అంచనా. తమిళ నాడులోని కోయంబత్తూరు జిల్లాలో కూడా ఇవి (ఆక్వామెరిన్‍) ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ధ•వీకరించని నివేదిక ప్రకారం తిరువూరు ప్రాంతంలో, ఖమ్మంజిల్లాలో, చిత్తూరుజిల్లాలో అక్కడక్కడ ఆక్వామెరిన్లు ఉన్నాయి.
కొలంబియన్‍ పచ్చలు నాణ్యమైనవిగా పరిగణించబడతాయి. పాకిస్తాన్‍ లోని స్వాత్‍ లోయలో దొరికే పచ్చలు మరియు ఆఫ్ఘనిస్తాన్‍ లోని పంచషీర్‍ పచ్ఛకి మంచి పేరు ఉంది. ఇథియోపియన్‍ పచ్చలు కూడా చాలా మంది ఇష్టపడుతారు. బ్రెజిల్‍, జింబాబ్వే, రష్యా మరియు మడగాస్కర్‍ల నుండి కూడా మంచి పరిమాణంలో పచ్చలను ఉత్పత్తి జరుగుతూంది. తక్కువ పరిమాణంలో భారతదేశంతో సహా అనేక దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి.
నీలం ఆకుపచ్చ కలర్‍లో ఉండి పూర్తి పారదర్శకంగా ఉండే నిర్మలమైన పచ్ఛలు వజ్రాల కన్న విలువైనవి. మార్కెట్లో ఎక్కువగా జాంబియన్‍ పచ్చలు కనిపిస్తాయి. అంతగా నాణ్యత లేని పచ్చలు ఇప్పుడు ఎక్కువ మార్కెట్‍లో కనిపిస్తున్నాయి దీనికీ తోడు క•త్రిమ పచ్చలు మార్కెట్‍ను ముంచెత్తుతున్నాయి. పచ్చలు సాధారణంగా ఎక్కువగా మలినాలు కలిగి ఉంటాయి, వీటిని ‘ఫారెస్ట్ పచ్చలు (forest emeralds)’గా విక్రయిస్తారు. నూనె చికిత్స ఈ రత్నాలకు చాలా సాధారణం. ఆయిల్‍ ఫ్రీ పచ్చలు ఎక్కువ ధర పలుకుతాయి.


చరిత్రలో మరకతం: హజ్రత్‍ అమీర్‍ ఖుస్రో అల్లావుద్దీన్‍ ఖిల్జీ యొక్క సేనాని మల్లిక్‍ నాయబ్‍తో ఉండి దక్కన్‍ దండయాత్ర (1310-1312 క్రీ.శ.)లో వశపరుచుకున్న అపార సంపద గురించి ఇలా వివరించాడు. ‘ఏనుగులు మోసుకెళ్లే పెట్టెల నిండా విలువైన రత్నాలు ఉన్నాయి, ఆ రత్నాల శ్రేష్ఠత చూపరులను పిచ్చెక్కించింది. సూర్యకాంతిలో మెరుస్తున్న పచ్చల కాంతి, సూర్యుడే పచ్చల కాంతిని ప్రతిబింబిస్తున్నాడేమో అనిపించింది. నిర్మలమైన నీటివంటి స్వచ్ఛతతో, పచ్చలు స్వర్గం యొక్క పచ్చిక బయళ్లను మసక బారేటట్లు చేయగల సొగసును కలిగి ఉన్నాయి.’


నెమలి సింహాసనం 30 నుండి 60 క్యారెట్ల 110 పచ్చలతో పొదిగి ఉండేది. 108కెంపులు, నీలాలు మరెన్నో వజ్రాలు ఇతర రత్నాలతో అలంకరించబడి ఉండేదని టావెర్నియర్‍ పేర్కొన్నాడు. మొఘల్‍ ఖజానాలో అత్యుత్తమమైన అతిపెద్ద పచ్చలు ఉండేవి.
భద్రాచలం దేవస్థానంలో కూడా పదివేల వరహాలు ఖర్చుతో కంచర్ల గోపన్న చేయించిన పచ్చల పతకం ఉంది. నల్లగొండ శివారులలో ఉన్న పానగల్‍లోని శివాలయం పేరు ‘పచ్చల సోమేశ్వరాలయం’. భువనగిరిలో కూడా పచ్చలసోమేశ్వరాలయం ఉన్నది.
ఆయుర్వేదంలో మరకతం:
మరకతాన్ని ఆయుర్వేదంలో సకలరోగ నివారిణిగా వాడుతారు. మరకతాన్ని నేలవంకాయరసంలో ఒకరోజు, కొండ పిండివేళ్ళ రసంలో ఒకరోజు నానబెట్టి, ఆరబెట్టి, పూతవేసి పుటంవేస్తే మరకతభస్మం అవుతుంది. ఇది ఆయుర్వేద వైద్యంలో వాడబడుతుంది.


-చకిలం వేణుగోపాలరావు,
డిప్యూటి డైరెక్టర్‍ జనరల్‍ జిఎస్‍ఐ(రి)
ఎ: 986644934
8

శ్రీరామోజు హరగోపాల్‍, ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *