కాటం లక్ష్మీనారాయణ

శ్రీ కాటం లక్ష్మీనారాయణగారు కాలంచేసి అప్పుడే ఏళ్లు గడిచిపోయాయి. గుండ్రటి ముఖం. ఎత్తైన మనిషి, ఖద్దరు తప్ప మరొకటి ఏనాడు దాల్చని నియమవ్రతుడు. ఇందిరాగాంధీతో సహా ఎంతటి వారినైనా సరే ఢీకొట్టగల సాహసి. మంత్రులు, అధికారులు అందరూ సన్నిహితులే అయినా ఏనాడు పదవుల కోసం, ప్రాపకాల కోసం వాడుకోని నిస్వార్థ శీలి. ఎన్నేళ్లు జీవించారు అనేకాదు. ఎన్ని మంచిపనులు చేశారన్నదే జీవితానికి ప్రాతిపదిక అయితే 86 ఏళ్ల నిండు జీవితాన్ని కాటం లక్ష్మీనారాయణ అనుభవించారు. 86కు మించిన మైలురాళ్ల నధిగమించిన మంచిపనులు సమాజానికి ఉప•యోగకరమైన, స్ఫూర్తివంతమైన పనులు చేశారని చెప్పవచ్చు. జీవిత సార్థక్యానికి ఇంతకంటే కావలసింది ఏముంది?


స్వాతంత్య్రోద్యమ కాలంలో సాహసోపేతంగా ఉద్యమాలు నిర్వహించారు. జైలుకు వెళ్లారు. స్వాతంత్య్రానంతరం ఏ చిన్నపాటి పదవుల కోసమైనా పాకులాడకుండా ఎన్నెన్నో పెద్ద పెద్ద సభలు నిర్వహించి స్ఫూర్తిని నిలిపారు. స్వాతంత్య్రోద్యమ చరిత్రను భావితరాలకు అందించాలనే ఆరాటపడ్డారు. సంపుటాల రూపంలో ముద్రింపజేశారు. స్వాతంత్య్రోద్యమ వీరులు చివరి దశలో కష్టపడకుండా పింఛను సౌకర్యాన్ని కల్పించడంలో చురుకైన పాత్ర పోషించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తాము చేపట్టిన ఏ పనినైనా అంతుచూసే దాకా వదిలిపెట్టని దృఢవ్రతులు కాటం లక్ష్మీనారాయణ.
1924 సెప్టెంబర్‍ 19న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‍లో లక్ష్మయ్య, సత్తెమ్మ దంపతులకు జన్మించిన లక్ష్మీనారాయణ అనువంశికమైన యాదవుల ధైర్య సాహసాలు, నిర్భయశీలం అలవడ్డాయి. కాటమరాజును వంశ మూలకర్తగా భావించేవారిలో ఆ నిర్భయశీలం ఉండటంలో ఆశ్చర్యపోవలసినది ఏమీలేదు. తాతగారు కాటం నారాయణ స్థానిక జమిందారుల ఆకృత్యాలను, సామాజిక దురాచారాన్ని ఎదిరించి బహుజనులను ఐక్యపరచి సహాయ నిరాకరణ చేయించినధీరుడు. తాతగారి పేరు పెట్టుకున్నందుకు కాబోలు ఈ మనవడికి కూడా తాతగారి లక్షణాలన్నీ అక్షరాల అబ్బాయి.


1942 అక్టోబర్‍ 12న బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్‍ చాదర్‍ఘాట్‍ విక్టరీ ప్లే గ్రౌండ్‍లో సత్యాగ్రహం చేయడానికి సమాయత్త మయ్యారు. బూర్గులవారు ‘‘మహాజనులారా…’’ అని కంఠమెత్తగానే పోలీసులు లాఠీ ఝుళిపించారు. సభలోని వారంతా భయంతో చెల్లాచెదురయ్యారు. 19 ఏళ్ల కాటం లక్ష్మీనారాయణ స్థిరంగా నిలబడి నినాదాలు చేశారు. బూర్గుల వారితో పాటే లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. ఆనాటి నుంచి లక్ష్మీనారాయణ బూర్గుల రామకృష్ణారావును గురువుగా భావించారు. ఈ గురుశిష్యుల అనుబంధం చివరిదాకా కొనసాగింది. ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు గాను లక్ష్మీనారాయణకు ఏడేళ్ల జైలుశిక్ష వేసి చంచలగూడ జైలుకు పంపించారు. ఆ జైల్లో స్థానిక నాయకులెందరో ఉన్నారు. వారి అనుభవాల సారాన్ని లక్ష్మీనారాయణ గ్రహించారు. తమను తాను మలుచుకున్నారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో సైతం బెంబేలు పడిపోయి.. నీరుగారిపోకుండా వాటిని తమకు అనుకూలంగా మలుచుకోగలిగే స్థిరచిత్తం, సంయమన శీలం లక్ష్మీనారాయణకు ఆ జైలు జీవితం నేర్పింది. జైలు నుంచి తిరిగి వచ్చాక ‘లా’ పూర్తిచేసి బూర్గుల వారివద్దనే జూనియర్‍ లాయర్‍గా చేరారు. బూర్గుల వారి కార్యక్రమాలన్నింటిలోనూ చేదోడువాదోడుగా లక్ష్మీనారాయణ నిలిచారు. ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో క్రియాశీలక పాత్ర వహించారు.


రాజకీయ ఉద్యమాల్లోనే కాక దళిత జనోద్ధరణం, ఖాదీ ప్రచారం, హిందీ వ్యాప్తి లాంటి సమకాలీనమైన సంస్కరణ కార్యకలాపాలకు స్పందించారు. నిజాం ప్రభుత్వ ఆజ్ఞను ఉల్లంఘించి హిందీ పాఠశాలను స్థాపించారు. పోలీసులు దాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించారు. లక్ష్మీనారాయణ తదనంతర కాలంలో హిందీ ప్రతిష్టాన్‍ సంస్థకు మేనేజింగ్‍ ట్రస్టీగా వ్యవహరించడానికి హిందీ మాత• భాష గానీ, దక్షిణ భారత హిందీ రచయితల సమ్మేళనాలు బెంగుళూరు, చెన్నై, త్రివేండ్రం, గోవా లాంటి నగరాల్లో ఘనంగా నిర్వహించడానికి బీజాలు పడింది ఇక్కడే. ప్రముఖ గాంధేయవాది స్వర్గీయ రామక•ష్ణదూత్‍ 1946లో ఆజన్మాంతం ఖద్దరునే ధరిస్తామని 120 మంది యువకుల చేత చేయించిన ప్రతిజ్ఞలో లక్ష్మీనారాయణ గారున్నారు. ఆనాటి నుంచి ఖద్దరు ధరించారు.


ఆచార్య ఎన్‍.జి.రంగా ప్రేరణతో 1945లో లక్ష్మీనారాయణ హైదరాబాద్‍ యువజన కాంగ్రెస్‍ను స్థాపించి భాయి రామ్మూర్తి నాయుడిని అధ్యక్షునిగా చేసి తాను ప్రధాన కార్యదర్శిగా వ్యవహ రించారు. దీన్ని బ్రిటిష్‍, ఆంధ్ర పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఉర్దు పత్రికలు మాత్రం యువకుల్ని చదువు కోనీయకుండా రాజకీయాల్లోకి దించుతున్నారంటూ ఆడిపోసుకుంటే.. ఆంధ్ర పత్రికలు, తెలుగు పత్రికలు ఘనంగా ప్రశంసించాయి. బూర్గుల లాంటి పెద్దలు వెలిగిస్తున్న చైతన్య జ్యోతి మసకబారిపోకుండా, వారు సత్యాగ్రహాలు నిర్వహించి జైలుకు పోయినప్పుడు స్తబ్దత ఏర్పడకుండా కాటం లక్ష్మీనారాయణ యువజన కాంగ్రెస్‍ క•షిచేసింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. నిజాం రాజ్యానికి మాత్రం విముక్తి లభించలేదు. బూర్గుల వారు, కాటం వారు ప్రపంచ నాయకుల ద•ష్టికి దీనిని తీసుకువచ్చి వారి సహకారాన్ని, సానుభూతిని పొందాలనుకున్నారు. 1947 ఆగస్టు 15 ఇరువురు మద్రాసు (చెన్నై), రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్‍ నేతల నుంచి నైతిక సహకారాన్ని అభ్యర్థిస్తూ టెలి గ్రాములు ఇచ్చారు. ఇది తెలుసుకున్న నిజాం ప్రభుత్వం హైదరాబాద్‍లో కాలుపెట్టిన మరుక్షణం గురుశిష్యులిద్దరిని అరెస్టు చేసింది.


జైల్లో ఉన్నప్పుడు బూర్గుల కె.వి.రంగారెడ్డి, కాశీనాథుని వైద్య లాంటి నాయకులతో ఏదోరకంగా రాజీపడాలని నిజాం ప్రభుత్వం ఓ ఎత్తుగడ వేసింది. 22 వేలమంది చావుబతుకులకు తెగించి జైళ్లలో ఉంటే రాజీ ప్రతిపాదనలా? ఇది ఉద్యమ స్ఫూర్తికే కళంకం అని యువ ప్రతినిధి అయిన కాటం లక్ష్మీనారాయణ లేఖలు రాయడంతో ఆ ప్రతిపాదనకు గండి పడింది. కాటం లక్ష్మీనారాయణ జైల్లో ఉన్నంతకాలం వారి కుటుంబ పోషణ కోసం కె.వి.రంగారెడ్డి నెలకు 15 రూపాయలు ఇచ్చేవారట. కె.వి.రంగారెడ్డి గారికి లక్ష్మీనారాయణ అంటే అంత అభిమానం. కాస్త వయసులో పెద్దవారైన మర్రి చెన్నారెడ్డి గారితోనూ లక్ష్మీనారాయణకు అంతే సాన్నిహిత్యం ఉండేది. మర్రి చెన్నారెడ్డి, లక్ష్మీనారాయణ ఒకే సైకిల్‍ ఎక్కి హైదరాబాద్‍లో చక్కర్లు కొట్టేవారట.


1947 మే నెల 11న పెళ్లి చేసుకున్న లక్ష్మీనారాయణ నాలుగు నెలలకే మళ్లీ అరెస్టయ్యారు. ఇలా పోలీసుల యాక్షన్‍ జరిగేదాకా అంటే 1948 సెప్టెంబర్‍ దాకా జైలుకు వెళ్లడం తిరిగి రావడం, మళ్లీ జైలుకు వెళ్లడం మళ్లీ తెరిగి రావడం అన్నది లక్ష్మీనారాయణ జీవితంలో చాలా మామూలు విషయమైపోయింది. ఆంధప్రదేశ్‍ అవతరణాంతరం మంత్రి పదవుల కోసం పాకులాడకుండా ఆర్థిక, సాంఘిక, వైజ్ఞానిక రంగాల్లో రాష్ట్ర పునర్‍ నిర్మాణం కోసం 1949 డిసెంబర్‍లో ‘జనతా’ పేరుతో ఉర్దూలో వారపత్రికను ప్రారంభించారు. 1945-46లలో మందుముల రామచంద్రారావు స్థాపించిన ‘రయ్యత్‍’ పత్రికలో పనిచేసిన అనుభవం లక్ష్మీనారాయణకు ఈ సందర్భంలో ఉపకరించింది. రజాకారుల చేతిలో హతుడైన షోయబ్‍ 1952లో రాష్ట్ర కర్షక సంఘం స్థాపించారు. ఎస్‍.బి. చౌహాన్‍ లాంటి మేటి నాయకులు ఈ సంఘం కార్యవర్గ సభ్యులుగా ఉండేవారు.


తెలుగు భూమి అనే మరో పత్రికను 1969లో ప్రారంభించారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ నాటి ఉద్యమ సమయంలో చాలామంది రచయితలు, నాయకుల లాగానే సమైక్యవాదిగా నిలిచారు. ప్రభాకర్‍ జీ లాంటి సర్వోదయ మండలి ఆచార్యుల ఆశీస్సులతో సర్వోదయ సాహిత్య ప్రచారాన్ని, భూదానోద్యమ కార్యక్రమాలను వ్యాపింపజేశారు. ఇప్పటికీ సర్వోదయ మండలి భూదానోద్యమ సంస్థలు తమ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాయి. ఆంధప్రదేశ్‍లో తెలుగు అకాడమి లాగా హిందీ అకాడమీ ఉండాలని చెప్పి ప్రభుత్వం చేత ఏర్పాటు చేయించి దానికి ఉపాధ్యక్షులయ్యారు. హిందీ పుస్తక ప్రచురణలకు ఆర్థిక సాయం, రచయితలకు శిక్షణ శిబిరాలు నిర్వహింపచేశారు.


దేశ స్వాతంత్య్రోద్యమంలో అన్నివిధాల త్యాగాలు చేసిన దేశభక్తులకు వరం లాంటిది స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్‍ పథకం. ఈ పథకాన్ని హైదరాబాద్‍ వారికీ వర్తింపజేయాలని కేందప్రభుత్వంతో లక్ష్మీనారాయణ గారు చర్చలు జరిపారు. మొదట కేందప్రభుత్వం అంగీకరించలేదు. మరుసటి రోజు లక్ష్మీనారాయణ తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుని సత్యాగ్రహం అనే అట్టను మెడకు తగిలించుకుని ప్రధాని నివాసం ముందు నిరాహారదీక్ష చేశారు. ఢిల్లీ పత్రికలు దీన్ని ప్రముఖంగా ప్రచురించాయి. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ లక్ష్మీనారాయణను పిలిపించుకుని ఏమిటి సంగతి అని వివరాలు అడిగారు.


సంస్థానాల్లోని స్వాతంత్య్ర సమరయోధులను మీరు గుర్తించకపోవడం కన్నా మాకు అవమానం ఏమున్నది? బ్రిటిష్‍ ఆంధ్ర నాయకులు ఒక బ్రిటిష్‍ వారిమీదనే పోరాడారు. కానీ సంస్థానాల వారు అటు సంస్థానాధిపతులకు వ్యతిరేకంగాను, ఇటు బ్రిటిష్‍ వారికి వ్యతిరేకంగానూ పోరాడారు. 15 ఆగస్టు మాకు స్వాతంత్య్ర దినం వచ్చినట్టు కాదా! హైదరాబాద్‍ విముక్తి జరిగిన సెప్టెంబర్‍ 17ను స్వాతంత్య్ర దినంగా జరుపుకోమంటారా? ఒక్క హైదరాబాద్‍ సంస్థాన ప్రజలే కాదు… అసలు సంస్థానాల ప్రజలు భారతీయులు అవునా.. కాదా… ప్రకటించండి అని సూటిగా, ధైర్యంగా కాటం లక్ష్మీనారాయణ ఇందిరాగాంధీని ప్రశ్నించారు. దీంతో 22 వేలమంది స్థానిక స్వాతంత్ర సమరయోధులకు పెన్షన్‍ సౌకర్యం లభించింది.


లక్ష్మీనారాయణ గారు చేసిన మహత్తర క•షి హైదరాబాద్‍ స్వాతంత్య్ర చరిత్రను ప్రామాణిక పద్ధతిలో గ్రంథస్తం చేయించే క•షి చేపట్టారు. ఆ ప్రామాణికలో వచ్చిందే వెల్దుర్తి మాణిక్యాల రావు గారి 844 పేజీల హైదరాబాద్‍ స్వాతంత్య్ర సమర చరిత్ర. ఇది ఇప్పటికీ ప్రామాణిక గ్రంథం. చాలా పెద్దఎత్తున సభలను ఒక్కచేతి మీదుగా నిర్వహించడం లక్ష్మీనారాయణ గారి గొప్పతనాల్లో ఒకటి. హైదరాబాద్‍ స్వాతంత్య్రోద్యమ చరిత్రను హైదరాబాద్‍లో అప్పటి రాష్ట్రపతి జైల్‍సింగ్‍ చేత ఆవిష్కరింపజేశారు. లక్ష్మీనారాయణ గారి కుమారులు ప్రముఖ లాయర్‍ కాటం రమేష్‍ రాసిన ఆంధ్రదేశ స్వాతంత్య్ర చరిత్రను 1992 భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్‍లో ఆవిష్కరింపజేశారు.


పి.వి.నరసింహారావు, టి.అంజయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి, భవనం వెంకట్రావు నలుగురు ముఖ్యమంత్రులతో ఒక పెద్ద సభ నిర్వహించారు. కాటం లక్ష్మీనారాయణ నిర్వహించిన సభల్లో ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, పీఠాధిపతులు, స్వాతంత్య్ర సమర యోధులు, దలైలామా లాంటి వారు ఎందరో పాల్గొనేవారు.
తన కోసం వీసమాత్రమైనా అడగకపోవడం, సర్వజన శ్రేయస్సు కోసం, విలువల కోసం ఎంతటి వారినైనా నిర్మొహమాటంగా విమర్శించ డానికి వెనుకంజ వేయక పోవడం లక్ష్మీనారాయణగారి వ్యక్తిత్వంలోని ప్రధాన గుణం. 86ఏళ్ల పరిపూర్ణ జీవితం గడిపి 25 ఫిబ్రవరి, 2010న అస్తమించారు. అలాంటి వారిని స్మరించుకోవడం స్ఫూర్తిదాయకం.


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్క•తిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
ఆచార్య వెలుదండ నిత్యానందరావు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *