దేశాన్ని ప్రేమించడమంటే దేశంలోని మనుషుల్ని ప్రేమించడం. మనుషుల్ని ప్రేమించడమంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎలాంటి వివక్షతలు, అసమానతలు లేని ప్రజాస్వామిక, మానవీయ స్పర్శతో పరిఢవిల్లే మానవ సమాజాన్ని నిర్మించుకోవడం. దానికవసరమైన భావనల, పాలనావిధానాల, హక్కుల, బాధ్యతల సమోన్నత చట్టరూపమే రాజ్యాంగం.
భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రంగా నిర్మించుకునే దీపదారి మన రాజ్యాంగం.
వివిధ రాష్ట్రాలు, జాతులు, ప్రాంతాలు, కులాలు, భిన్న సంస్క•తలు, భాషలు, భౌగోళిక స్థితులు కలిగిన వైవిధ్యపూరితమైన మనదేశ ప్రజలందరి మధ్య ఐక్యతను సాధించి భిన్నత్వంలో ఏకత్వం సాధ్యమని నిరూపించి ఫెడరల్ వ్యవస్థకు ప్రాణం పోసింది మన రాజ్యాంగం.
ఈ దేశంలో పౌరులందరూ సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. అందరికీ సమాన హక్కులూ, బాధ్యతలూ అన్నదే రాజ్యాంగ సారాంశం. రాజ్యాంగం ఏ తారతమ్యాలు లేకుండా ప్రజలందరికీ విద్యాహక్కు, వైద్య సదుపాయాల హక్కు, ఆరోగ్యకరంగా, ఆత్మాభిమానంతో జీవించే హక్కు, తమ ఆలోచనలను, విశ్వాసాలను భయం లేకుండా చెప్పగలిగే భావ ప్రకటనా హక్కు, తమ జీవిత విధానాన్ని యిష్టపూర్వకంగా నిర్దేశించుకునే స్వేచ్చ యిచ్చింది.
రాజ్యాంగం లేకముందు కొన్ని సమూహాలకి ఎలాంటి హక్కులు లేవు. సంపన్నులు, విద్యావంతులకు మాత్రమే ఓటు హక్కు వుండేది. విద్య, వైద్య, రాజకీయ, ఉపాధి అవకాశాలు అన్ని సమూహాలకు సమానంగా లేవు. రాజ్యాంగం ఆ సమూహాలన్నిటినీ మనుషులుగా గుర్తించింది. వయోజనులైన అందరికీ ఓటుహక్కును యిచ్చింది. తరతరాలు ఎలాంటి అవకాశాలు పొందలేక పోతున్న ఆ సమూహాలకోసం ప్రత్యేక సదుపాయాలు, రిజర్వేషన్లు కల్పించింది. దీనితో ఆ సమూహాలు తమ హక్కుల్ని వినియోగించుకున్నారు. విద్యావంతులయ్యారు. ఉన్నత పదవుల్లో, ఉద్యోగాల్లో వున్నారు.
సామాజికంగా, రాజకీయంగా ఎదిగి చట్ట సభల్లో గణనీయంగా వున్నారు. ఇలా ఈనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆదివాసీ సమూహాలు, స్త్రీ సమాజం సామాజిక, ఆర్థిక, రా•కీయరంగాలలో బలమైన శక్తిగా ఆవిర్భవించారు. ఇది దేశంలో ఒక మౌలికమైనమార్పు. ఈ రాజ్యాంగం లేకపోతే ఈ సమూహాలకు ఈ అభివృద్ధి సాధ్యమయ్యేది కాదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి దీనికి దోహదం చేసాయి.
ఈ సమూహాలే కాక సమాజంలోని అన్ని వర్గాల ప్రజల హక్కులు, ప్రయోజనాలు రాజ్యాంగం నెరవేర్చింది. రాజ్యాంగ రచనకు, ఆచరణకు వివిధ వైపుల నుంచి ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతున్న సందర్భంలో మనమున్నాం. భారతీయ సామాజిక వ్యవస్థను సమూలంగా మార్చి అసమానతలు లేని, వివక్షతలు లేని, అందరికీ సమానహక్కులు కలిగిన నూతన సమాజ నిర్మాణానికి శాంతియుత, సహేతుక మార్గాన్ని చూపుతున్న మన రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయడమే ఇవ్వాళ్టి నిజమైన దేశభక్తి.
ఏప్రిల్ 14 రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేడ్కర్ పుట్టినరోజు. వారికి జేజేలు.
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్