పూర్వపు (యునైటెడ్) మహబూబ్‍నగర్ జిల్లా నుండి ఏర్పాటైన జోగుళాంబ గద్వాల్ తెలంగాణ అక్షరాస్యత చూస్తే రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో అక్షరాస్యత రేటు కేవలం 49.87% స్త్రీల అక్షరాస్యత రేటుకు 39.48% మాత్రమే. ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల మహిళల్లో ఈ రేట్లు 37.65% మరియు 30.44%తో అత్యంత వెనుకబాటులో ఉంది.
2022-23లో జిల్లాలో 6-14 సంవత్సరాల వయస్సు గల మొత్తం 1,12,312 మంది పిల్లలలో దాదాపు 68.5% (76,907) మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ పాఠశాలలు అనేక సమస్యలతో సతమత మవుతున్నాయి. UDISE 2021-22 ప్రకారం, జిల్లావ్యాప్తంగా 641 ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 244 పాఠశాలల్లో అవసరమైన ఫర్నీచర్ ఉండగా, 440 పాఠశాలల్లో మాత్రమే క్రీడా మైదానం ఉంది. బాలికల మూత్ర శాలలు 399 పాఠశాలల్లో మాత్రమే పని చేస్తున్నాయి. డిజిటల్ యుగంలో ఉన్నామని చెప్పుకుంటున్న సమయంలో జిల్లాలో 244 పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మరియు వీటిలో 118 మాత్రమే ఇంటర్నెట్ కనెక్టివిటీని కలిగి ఉన్నాయి. మౌలిక వసతులు లేక ఉపాధ్యాయులు విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. అంతే కాకుండా ఇలాంటి స్థితిగతులను చూసి ఉపాధ్యాయులు జిల్లా నుండి బదిలీ అయి వెళ్లిపోతున్నారు.
ఇక జిల్లాలలో ఉపాధ్యాయుల కొరత రాష్ట్రంలోనే అత్యధికం. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక అంచనా ప్రకారం కావలిసిన ఉపాధ్యాయులను అంచనా వేసినట్లయితే జిల్లాకు 3,522 మంది ఉపాధ్యాయులు అవసరం ఉంది. అవసరం బట్టి కాకుండా విద్యా శాఖ మాత్రం ఉన్న ఖాళీలనే భర్తీ చేస్తామని జిల్లాకు కేవలం 176 మంది ఉపాధ్యాయుల కోసమే నోటిఫికేషన్ వేశారు. ఉపాధ్యాయుల కొరత, పర్యవేక్షణ అధికారుల కొరత కారణంగా గద్వాల జిల్లా విద్యార్థుల విద్యా ప్రమాణాలు అతి తక్కువగా ఉన్నాయని జాతీయ, రాష్ట్ర స్థాయి నివేదికల ద్వారా అర్ధం అవుతుంది.
తెలంగాణ విద్యాశాఖ మరియు SCERT సంయుక్తంగా మూడవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన వార్షిక ఎఫ్, ఎల్, ఎన్ అసెస్‍మెంట్ నివేదిక ప్రకారం తెలుగులో కేవలం 16% మంది విద్యార్థులు గణితంలో కేవలం 23% విద్యార్థులు మాత్రమే మూడవ తరగతి స్థాయి సామర్ధ్యాలు కలిగి ఉన్నారని తెలిసింది. అంటే అత్యధిక శాతం మంది విద్యార్థులకు చదవడం రాయడం రాదని అర్ధం.
ఇక నేషనల్ అచీవ్‍మెంట్ సర్వే (NAS) – 2021 యొక్క ఫలితాలు ఇంకా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు తెలుగులో 33%. మంది గణితంలో కేవలం 27%. మంది విద్యార్థులు మాత్రమే పడవ తరగతి సామర్ధ్యాలు కలిగి ఉండడం విచారకరం. SC, ST మరియు BC వర్గాల విద్యార్థులలో అభ్యసన సామర్ధ్యాలు ఇంకా తక్కువని ఈ నివేదికలు తెలియ చేస్తున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జిల్లాల పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకారం ప్రకారం కూడా మౌలిక సదుపాయాల విషయంలో దేశంలో ఉన్న 738 .జిల్లాలకు గద్వాల జిల్లా 605 స్థానం ఉంది.
విద్యా స్థితి గతులు సరిగ్గా లేని కారణంగా బడిలో చేరని పిల్లలు కొందరైతే చేరిన పిల్లలు కూడా బడి మానేసి సీడ్ పత్తి తోటలలో వ్యవసాయ పనులలో బాల కార్మికులుగా మారిపోతున్నారు. అంతే కాకుండా జిల్లాలోని దాదాపు మొత్తం 13 మండలాల నుండి పిల్లలు వివిధ రంగాలలో పని చేయడానికి గణనీయమైన సంఖ్యలో జిల్లా మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు.
జిల్లాలో విద్యార్థులకు ఇంకో ప్రధాన సమస్య ప్రజా రవాణా సౌకర్యాలు మరియు రోడ్డు కనెక్టివిటీ అందుబాటులో లేకపోవడం వలన ఉన్నత పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు ఇంటర్ చదివే విద్యార్థులు అనేక ఇబ్బందులకు ఎదురుకుంటున్నారు. గ్రామాల గుండా ప్రజా రవాణా యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంది మరియు రద్దీ కారణంగా కొన్ని ప్రదేశాలలో బస్సులు ఆగవు. వారి షెడ్యూల్ కళాశాల సమయాలకు అనుగుణంగా లేదు మరియు కళాశాలకు వెళ్లే చాలా మంది విద్యార్థులు ఆలస్యంగా చేరుకుంటారు. కొన్ని రూట్లలో బస్సులు కూడా నిలిపివేయబడ్డాయి. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి తర్వాత బాలికల హాజరు మరియు నిలుపుదలపై ప్రభావం చూపింది. అంతే కాకుండా ఆడపిల్లలు చదువులు మానేయవలసి వస్తుంది. బాల్య వివాహాలకు కూడా ఈ పరిస్తితికి ఒక కారణమే.
ఇలాగే పరిస్థితులు కొనసాగితే ఒక తరాన్ని విద్యకు దూరం చేసిన తరంగా అందరం చేరిపోతున్నాం. ఈ పిల్లలంతా అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, పేదవర్గాల బిడ్డలు. తక్షణం చర్యలు తీసుకోకపోతే ఈ విష వలయంలో తిరుగాడుతూనే ఉంటారు. ఈ నిర్లక్ష్య ప్రభావం ఇప్పుడు కాదు, ఇంకో పదేళ్ళకు తెలుస్తుంది. రాబోయే తరం విద్యలేక, ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది చాలా ఇబ్బంది పడతారు. నైపుణ్యం లేని నిర్లక్ష్య రాస్యులుగా, అసంఘటిత రంగంలో నిస్సహాయంగా దోపిడీ గురి కాబడే రెండవ తరగతి పౌరులుగా, వలస కూలీలుగా మిగిలిపోతారు. అతి పేదరికంలోకి నెట్టి వేయబడుతారు.
అందుకే ఈ పరిస్తితిని ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీగా గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలి. జోగుళాంబ గద్వాల జిల్లా విద్యా సమస్యలు అన్ని జిల్లాలకంటే భిన్నంగా ఉన్నందు వలన ఈ సంక్షోభ పరిస్థితిని ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిగణించాలని జిల్లాకు ప్రత్యేక అదనపు నిధులు కేటాయిస్తూ జిల్లాకు ‘‘ప్రత్యేక విద్యా ప్రణాళిక’’ రూపొందించాలి. ఈ విషయంలో జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ చాలా అవసరం. ఈ పరిస్థితిని గట్టు కె.టి దొడ్డి మండలాల యువతి యువకులకు వివరించినప్పుడు మంచి స్పందన వచ్చింది. మా వంతుగా ఎండా కాలం సెలవులలో మా మండల విద్యార్థులకు చదువులతో పాటు ఆట పాటలను అందిస్తామని ముందుకు రావడం ఎంతో సంతోషించ వలసిన అంశం.
వేసవి చదువుల పండుగ
బాల్యానికి భరోసా నిస్తామని కదిలిన యువత:
భారత ప్రజలమైన మేము…. అంటూ హాలు నిండా ఉన్న యువతి యువకులు భారత రాజ్యాంగ పీఠికను చేతులు ముందుకు చాచి గర్వంగా చదువుతుంటే దేశ యువత సామాజిక స్ప•హతో లేరనే వాదనలన్ని తప్పు వాదనలని అనిపించింది. గద్వాల జిల్లా కె.టి. దొడ్డి, గట్టు మండలం బాలలకు రక్షణగా ఉంటామని ఎండాకాలంలో ప్రతి గ్రామంలో బాలలను ఆట పాటలు ఆడిస్తూ చదువులో ఆసక్తిని పెంచి మళ్ళీ తిరిగి బడికి ఆత్మ విశ్వాసంతో తరగతిలోకి మా మండలాల పిల్లలు అడుగు పెట్టాలని ‘వేసవి చదువుల పండుగ’ అనే విన్నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టటానికి దాదాపు 150 మంది యువతి యువకులు తరలి వచ్చారు. జిల్లా విద్యా శాఖ ఈ ఉత్సాహాన్ని చూసి ఎం.వి. ఫౌండేషన్ తీసుకున్న ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ రిసోర్స్ పర్సన్స్ బాలలకు నేర్పే మెళుకువలను శిక్షణ ఇవ్వడానికి అనుమతిచ్చారు.
శిక్షణ కంటే ముందు యువతి యువకులకు కార్యక్రమ ఉద్దేశ్యాన్ని చెప్పడానికి గ్రామాలలో యువతీ యువకులకు సమావేశాలు పెట్టడం జరిగింది.
ఇలాంటి సమావేశాలు చాలా చూసాము ఏం ఉపయోగపడవు అన్నారు. వారికి తమ గ్రామమలలో ఉన్న పిల్లల గురించి అని చెప్పడం జరిగింది. పిల్లలు చాలా మంది వివిధ రకాల పనులు చేస్తున్నారని. రోజు బడికి పోతున్న పిల్లలకి తరగతికి దగ్గ చదువు రావడం లేదని ఎండా కాలంలో పిల్లలు ఎండకు తిరుగుతూ చదువుకు దూరం పనికి దగ్గర అవుతారని. అంతకు ముందు నేర్చుకున్నది కూడా మరచి పోతారని ఈ పిల్లల తల్లిదండ్రులు నిరక్ష రాశుయులని వారికి ఈ పిల్లలకు చదువులో సహాయం చేయడం తెలియదని వివరించడం జరిగినది.
ఇలాంటి నేపథ్యం ఉన్న పిల్లల కోసం రోజుకు రెండు గంటలు స్వచ్ఛందంగా ఏమి ఆశించకుండా బాధ్యత తీసుకోవచ్చా అని అడిగినప్పుడు వారికున్న సందేహాలను క్లియర్ చేసినంక యూత్ స్పందించి పిల్లలకు నేర్పిస్తే బాగానే ఉంటుంది అన్నారు. రోజు రెండు గంటలు అయితే చెప్పగలుగుతాము అని అన్నారు. అలాగే మా గ్రామ పిల్లలకు మేము చదువుతో పాటు ఆట పాటలు నేర్పించడం మాకు సంతోషం అన్నారు. ఉదయం చెప్పుతామనికొంతమంది అన్నారు. మరి కొంత మంది సాయంత్రం చెపుతాము అన్నారు. ఈ విధంగా అన్ని గ్రామాల నుండి సమావేశాలు పెట్టి యూత్‍ను ఒప్పించడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇందులో మహిళా యూత్ ఎక్కువగా ముందుకు రావడం జరిగింది.
ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో Dial your village సభ్యులు పదకొండు రోజుల ‘పాలమూరు యాత్ర’లో భాగంగా ఈ రెండు మండలాలలోని కొన్ని గ్రామాల యువతీ యువకులు తమ గ్రామం కోసం ఏదో ఒకటి చేయాలానే స్ఫూర్తి పొందినట్లు చెప్పారు.
మొత్తం వంద మంది సిద్ధ మయ్యారు. ఇందులో 54 మంది యువకులు 66 మంది యువతులు పాల్గొన్నారు. అందరు కూడా ఇంటర్, డిగ్రీ, B.ED,TTC చేసిన వాళ్ళు ఉన్నారు. అందరు కూడ తెలుగు, గణితం మీద ప్రభుత్వ ఉపాద్యాయులతో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ తర్వాత మరింత ఉత్సాహంతో అందరు పిల్లలకు నేర్పిస్తాము అన్నారు. ప్రతి గ్రామానికి ఇద్దరు, ముగ్గురు, నలుగురు ముందుకు రావడం జరిగింది. 58 గ్రామాలలో దాదాపు 103 మంది నమోదు చేసుకున్నారు. రెండు మండలాలలో 3,654 మంది పిల్లలకు 103 సెంటర్స్ ప్రారంభించడం జరిగింది. ఈ పిల్లలు 5వ తరగతి నుండి 8వ తరగతి చదువుతున్న పిల్లలు వేసవి చదువుల పండుగలో పాల్గొంటున్నారు. మొదలు పెట్టి మూడు నాలుగు రోజులే అయినా యువత పిల్లలలతో మమేకమైన తీరు గ్రామస్థులను తల్లిదండ్రులను అబ్బుర పరుస్తుంది. పిల్లల కేరింతలు ఆటలు పాటలు ఈలలతో గ్రామాలు బాల్యానికి భరోసా నిస్తున్న యువతి యువతులకు నీరాజనాలు పడుతున్నారు. వేసవి సెలవులు అయిపోయి మళ్ళీ బడులు తెరిచే వరకు ఈ చదువుల పండుగ కొనసాగుతుంది.
ముగింపు సమావేశంలో గట్టు, కె.టి.దొడ్డి యువతి యువకులమైన మేము బాల్యానికి భరోసా నిచ్చామని రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన మూల సూత్రాల స్పూర్తి అయిన సమానత్వాన్ని భావితరాలకు అందిస్తూ, సమాజ ప్రజాస్వామీకరణలో తమ వంతుగా భాగ్యస్వామ్యం అయ్యామని తలెత్తుకుని గర్వంగా ఈ దేశ యువతకు సందేశం ఇస్తారనే గట్టి విశ్వాసం కలిగింది. యువత తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ గారు, జిల్లా విద్యా శాఖ అధికారులు, మండల అధికారులు సానుకూలంగా స్పందించి అన్ని రకాల సలహాలు సూచనలు చేయడంతో యువతకు మరింత ఉత్సాహన్ని ఇచ్చింది.
జిల్లాలో రెండు మండలాల యువత చేపట్టిన చదువుల ఉద్యమం మరింత మందికి స్ఫూర్తి నివ్వాలని అదే విధంగా ప్రజా ప్రతినిధులు జిల్లా ఇన్‍చార్జ్ మంత్రి గారు, మంత్రి, ముఖ్య మంత్రి గారు జోగుళాంబ జిల్లాకు ప్రత్యేక విద్యా ప్రణాళికను రూపొందించి విద్యార్థులకు అండగా ఉంటారని ఆశిద్దాం.
-ఆర్.వెంకట్ రెడ్డి
జాతీయ కన్వీనర్, ఎం.వి.ఫౌండేషన్
ఎ: 9949865516