తన మూలాలను మరిచిపోయిన యుగంలో మనుషులు ఉన్నారు. అంతే కాదు తమ మనుగడకు అవసరమైన నీరు ఇతర వనరులు మానవాళి గుడ్డితనం, పట్టనితనం వల్ల బాధితమయ్యాయి అని పేర్కొంది. రాచెల్ కార్సన్ తన సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథంలో. ఇటీవలనే మహానగరాలకు సంభవించిన జలవిపత్తు గురించి ఆందోళన పడ్డాం. ముఖ్యంగా బెంగుళూరు లాంటి నగరం ఎదుర్కొన్న తాగునీటి సంక్షోభం గురించి తెలుసుకున్నాం. పర్యావరణానికి సంబంధించిన ప్రతి సమస్య, సంక్షోభం మనది కాదులే, మనకు రాదులే అనే ఉదాసీన వైఖరిని ప్రదర్శించటం అత్యంత ప్రమాదకరం. అంతే కాదు అది పర్యావరణ నేరస్థులుగా మనల్ని చూపుతుంది. లేదా బాధ్యతలేని పౌరులుగా నైనా నిలబెడుతుంది. ఒక్క రాచెల్ మాత్రమే కాదు, పర్యావరణ వేత్తలు చెప్పే ప్రతి మాటా వేయి చెవులతో ఆలకిచదగ్గవి. వేల చేతులతో ఆచరణకు పూనుకోవలసినవి.
ఆంత్రపోసీన్ యుగాన్ని ఎదుర్కోవటమెలా? అనే విషయం ఎంతో చర్చ అంతర్జాతీయంగా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా శిలాజ పెట్టుబడి వల్ల భూ వ్యవస్థకు సంభవించిన సంక్షోభాలను తట్టుకుని నిలబడటం, మనగలగటం అనే అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. శిలాజ పెట్టుబడి ఏమిటి అంటే శిలాజ ఇంధనంపై ఆధారపడసాగిన పెట్టుబడి, దాని ద్వారా సాధించిన అభివృద్ధి, ఆ అభివృద్ధి పర్యవసానాలు అన్నీ మనముందు సవాళ్లుగా నిలుస్తున్నాయి.
ఆంత్రపోసీన్ యుగం అంటే మానవ ప్రమేయం, జోక్యం ప్రకృతి విషయంలో పెరిగిన కాలానికి కొలమానం. మనిషి ప్రమేయం పెరగటంతో భూ వ్యవస్థలో వచ్చిన మార్పులు, తెచ్చిపెట్టుకున్న సంక్షోభాలు, వీటిని అధిగమించటం. ముఖ్యంగా మనం ఎంతగానో ప్రేమించి, సమర్థిస్తున్న పెట్టుబడిదారీ విధానికి విప్లవాత్మకమైన ప్రత్యామ్నాయాలను బదులుగా అన్వేషించుకోవటం ఈ నాటి అనివార్యత.
భూమి ఆవిర్భావ చరిత్రను నిర్ణయించే క్రమంలో భూగర్భ శాస్త్రవేత్తలు చేసిన కాల నిర్ణయం ప్రకారం హాలోసీన్ యుగం గడిచిపోయిన తరువాత ప్రవేశించిన కాలాన్ని ‘ఆంత్రపోసీన్’గా వ్యవహరిస్తున్నారు. హాలోసీన్ యుగం నుండి విడిపోయాం. ఒక చీలిక లేదా పగులు ఏర్పడింది. దీన్ని ‘ఆంత్రపోజెనిక్ రిఫ్ట్’ అని పాల్ క్రట్జెన్ తన శాస్త్ర, పర్యావరణ శాస్త్ర చర్చలలో భాగంగా వాడాడు. క్రట్జెన్ ఒక క్లైమెటాలజిస్ట్. భవిష్యత్ భూ వ్యవస్థను ప్రభావితపరిచే మహాశక్తిగా మానవులు రూపుదిద్దుకున్నారనేది ప్రతిపాదన. అయితే ఆంత్రపోసీన్ యుగం ఎప్పుడు మొదలైందనే విషయంగా చర్చ సాగుతూనే ఉంది. 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవ కాలం నుంచి అని చెపుతున్నప్పటికీ 1940,1950లను పేర్కొంటున్నారు. 1950 అనేది మానవాళి పర్యావరణంపై చూపే ప్రభావంతో మహావేగవృద్ధిని పొందిందనేది ఒక వాస్తవం. అణ్వాయుధ పరీక్షల తర్వాత వచ్చిన భూ వ్యవస్థలోని మార్పులు దీనిని సూచిస్తున్నది.
ఆంత్రపోసీన్ అనేవి రెండవ ప్రపంచ యుద్ధానంతరం భూతలంపై జరిపిన అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగా శాస్త్రవేత్తల బృందం జరిపిన ఉద్యమ ప్రారంభం నుంచి కనిపిస్తుందని అంటారు. భూ వ్యవస్థలను భంగపరచకుండా ఉండటం, భగ్నం చేయకుండా ఉండటం అనేది ఆధునిక పర్యావరణ ఉద్యమాలకు వాటి పరివృద్ధికి దోహదపడింది. ఆ తరువాత 1962లో రాచెల్ కార్సన్ తన సైలెంటోస్ప్రింగ్ రచనలో పర్యావరణ ఉద్యమం మరింత ఊపందుకుంది. గ్లోబల్ వార్మింగ్‌కు సంబంధించి ఈ గ్రంధం తొలి హెచ్చరికలను చేసింది. భూతాపాన్ని తగ్గించటం, వెనక్కి మరల్చటం సాధ్యం కాదు కనుక భూతాప వృద్ధికి దోహదపడే పరిస్థితులను కల్పించుకోవద్దనే హెచ్చరిక ఇది. భూ పరిణామ వ్యవస్థలో వచ్చిన చారిత్రక మార్పు దశను గుర్తించటం ఆంత్రపోసీన్ యుగంలో ప్రధానాంశం ప్రకృతి. సమాజాల సంపర్కంలో వచ్చిన, తెచ్చిపెట్టుకున్న అనర్థాలను ఎట్లా సరిచేసుకోవాలనేదే ‘ఆంత్రపోసీన్’ యుగం అనే చర్చ ఆలోచించవలసి ఉంది. శాస్త్రవేత్తలు, శాస్త్ర సంబంధ అవగాహనను ఎలాగూ కల్పిస్తారు. అయితే మనం గ్రహించాల్సిందేమిటి? మానవులు – పర్యావరణం ముఖాముఖి తలపడుతూ ఉండటంతో వచ్చిన మార్పులు పెట్టుబడిదారీ వాదంతో తలెత్తినవీ, పారిశ్రామిక విప్లవం, ప్రపంచాన్ని వలసరాజ్యాలుగా విస్తరించటం, శిలాజ ఇంధనాల వాడకం ఒకదానినొకటిగా పెనవేసుకున్నవే.
ప్రకృతి మానవ చరిత్రను నడపటం లేదా శాసించటమో చేసింది. ఇప్పుడు మానవుడు ప్రకృతి, పర్యావరణ, భూవ్యవస్థల చరిత్రను శాసిస్తున్నాడు, ఈ శాపకత్వ స్థితి నుండి మనిషి తప్పుకోవాలి ఉపసంహరించుకోవాలి.
భౌతిక ఆవరణం, ఆ ఆవరణంపై ఆధారపడిన జీవం ఒకటికొకటి పరస్పరాధారితాలు. భూమిపై జీవం ఉద్భవించింది. ప్రాణిత్వాన్ని కలిగించింది భూమి. ఆ జీవం తిరిగి భూ పరిస్థితులను మారుస్తూవస్తున్నది. చర్య, ప్రతిచర్యల చక్రం జీవితానికి ఆవరణ వ్యవస్థల మధ్య తిరుగుతూనే ఉన్నది. అయితే బుద్ధిజీవి, ఆలోచనాశీలి అయిన మనిషి ఎందుకు పదే పదే దాడి చేస్తున్నాడు. భూ చరిత్రను ఎరిగిన ఎవరైనా జీవం, భౌతిక ప్రపంచం విడిగా మనలేవు. మనిషి లేకపోయినా ఆవరణవ్యవస్థ నిలవగలుగుతుంది. అసలు ఆ వ్యవస్థనే అంతం చేసుకుంటే మనిషి నిలబడే చోటేది?
జీవులకు, ఆవరణానికి మధ్య ఒక ఐక్యత, సంబంధం నిరంతరం ఉంటుంది. అట్లా ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. హానికారకమైన పనులు, పదార్థాలూ పర్యావరణంలోకి విడుదల చేయటం వల్ల కాలాంతరంలో అవి మానవాళికి సమస్యలను సృష్టించగలదనే విషయం కూడా తెలిసిందే కదా! ఒకటి వినా రెండవది ఉండదని తెలిసిన తరువాత కూడా మానవ ఆలోచన, ఆచరణ మారాలి ఆంత్రపోసీన్ యుగంలో మనిషి మరింత వివేకవంతంగా విచక్షణాయుతంగా వ్యవహరించాలి. ఆవ్యవహార జ్ఞానమే ఈనాడు మనకు పెరగాల్సింది.
- డా।। ఆర్. సీతారామారావు
ఎ : 986656351