పర్యావరణంలో రేడియోధార్మిక పదార్థాలు వాయు, ద్రవ, ఘన పదార్థాల రూపంలో చేరడంతో జీవకోటి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి తోసివేయడం అనాదిగా జరుగుతోంది. అణ్వాయుధాల విస్పొటనం, న్యూక్లియర్ వ్యర్థాలు, రేడియోధార్మిక ఖనిజాల గనులు, రేడియోధార్మిక ఉపయోగాలు, రేడియోధార్మిక పదార్థాల లీకేజీ, రేడియోషన్ పరీక్షలు, కాస్మిక్ కిరణాలు, న్యూక్లియర్ వ్యర్థాలు, రక్షణరంగ అణ్వాయుధాలు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలలో ప్రమాదాలు లాంటి కారణాలతో రేడియోధార్మిక మూలకాలు పర్యావరణంలో చేరుతాయి.
రేడియోధార్మికత ఆవిష్కర్త:
1896లో హెన్రీ బెక్రెల్ కనుగొన్న రేడియోధార్మిక పదార్థాల ద్వారా ప్రమాదకర అల్ఫా, బీటా, గామా వికిరణాలు నిరంతరం వెలువడతాయి. కేంద్రక సంలీనం, కేంద్రక విచ్ఛిత్తి పక్రియల ద్వారా కూడా కృత్రిమ రేడియోధార్మిక కేంద్రకాలు బయట పడతాయి. రేడియోధార్మిక పదార్థాలతో నిరంతర కాలుష్యం, అప్పుడప్పుడు, ప్రమాదాల సందర్భాల్లో కాలుష్యం జరుగుతుంది. యురేనియం, రేడియం, రెడాన్, థోరియం, పొటాషియం-40, కార్బన్-14, ట్రిటియం లాంటి రేడియోధార్మిక కేంద్రకాలు సహజంగా ఏర్పడతాయి.
రేడియోధార్మిక వికిరణాల దుష్ప్రభావాలు:
ఎక్స్-కిరణాల ద్వారా ఆయారంగాల్లో సేవలు అందించే వారి దరికి నిశ్శబ్దంగా ప్రమాదకర తీవ్ర వికిరణాలు చేరి పలు అనారోగ్యాలు కలుగుతున్నాయి. ఆహార పదార్థాల రూపంలో శరీరంలోకి ప్రవేశించిన రేడియోధార్మిక పదార్థాల వికిరణాలు మానవాళికి అనారోగ్య కారణాలు అవుతున్నాయి. రేడియోథెరపీ ద్వారా చేసే క్యాన్సర్ చికిత్సలో కూడా రేడియోధార్మిక వికిరణాలను వాడతారు. రేడియోధార్మిక వికిరణాలు సోకిన వ్యక్తులకు రక్తహీనత, లుకేమియా, హీమరేజ్, హృదయనాళ సంబంధ అనారోగ్యాలు, నేల కాలుష్యం, జన్యు మార్పులు, బర్నస్, జీవకణాల విధ్వంసం, వృక్ష సంపదతో పాటు వణ్యప్రాణులపై దుష్ప్రభావం, సముద్ర జీవులపై దుష్ప్రభావం లాంటివి కలుగుతాయని తెలుస్తున్నది. మానవాళి చరిత్రలో జరిగిన న్యూక్లియర్ ప్రమాదాల్లో ఫుకుషిమా డైరీ న్యూక్లియర్ డిజాస్టర్(2011), చెర్నోబైల్ డిజాస్టర్(1986), మైల్ ఐలాండ్ ఆక్సిడెంట్(1979) లాంటివని అతి ముఖ్యమైనవి. మానవ ప్రేరేపిత కేంద్రక విచ్ఛిన్న ఆటమ్ బాంబు (హిరోషిమా/నాగసాకి ఘటనలు), కేంద్రక సంలీన హైడ్రోజన్ బాంబు విస్పొటనాలు కూడా రేడియోధార్మిక కాలుష్యానికి తరతరాలుగా ప్రధాన కారణం అవుతున్నాయి.
రేడియోన్యూక్లైడ్స్ ప్రభావం:
పర్యావరణంలో భాగాలైన గాలి, అవక్షేపాలు, ఉపరితల జలం, తాగు నీరు, ఆహార పదార్థాల్లో ప్రమాదకర రేడియోధార్మిక అవశేషాలు క్రమంగా పెరుగుతున్నట్లు ప్రయోగశాల ఫలితాలు హెచ్చరికలు చేస్తున్నాయి. పర్యావరణంలో ప్రధాన భాగమైన గాలి ద్వారా రేడియోధార్మిక పదార్థాలు ఇతర భాగాలకు వ్యాపిస్తున్నాయని గమనించారు. సూక్ష్మబిందువులు, కణాలు లేదా (పార్టికిల్స్) ఏరోసోల్స్ రూపంలో రేడియోధార్మిక పదార్థాలు గాలిలో ఉంటు న్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రేడియోధార్మిక న్యూక్లైడ్స్ పరమాణువుల రూపంలో గాలిలో ఉండడం గమనించారు. బెరిలియమ్-7, సీసియం-137 లాంటి రేడియోన్యూక్లైడ్స్ గాలిలో వ్యాపించి ఉండడం గమనించారు. గాలి పవనాలతో రేడియోధార్మిక కణాలు వ్యాపిస్తూ వానలు, మంచులతో కలిసి అవక్షేపాలుగా మారడం జరుగుతున్నది. ప్రమాదకర రేడియోధార్మిక అవశేషాలు చెక్క బూడిదలో కూడా ఉన్నాయని తెలుసుకున్నారు.
రేడియోధార్మిక కాలుష్యాన్ని కట్టడి చేయడానికి రేడియోధార్మిక పదార్థాలను శుద్ధి చేసి వదలడం, పద్దతి ప్రకారం సురక్షితంగా నిలువ ఉంచడం, న్యూక్లియర్ పరీక్షలను నిషేధించడం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ఆచరణలో పెట్టడం, తిరిగి వాడుకోవడం (రీయూజ్), వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడం లాంటి చర్యలను విధిగా తీసుకోవాలి.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
ఎ : 9949700037