‘‘దక్కన్‍ల్యాండ్’’ మాసపత్రిక పది సంవత్సరాల సందర్భంగా ప్రముఖలు అభిప్రాయలు తెలిపారు.
2024 ఆగస్టు మాసంతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
మరికొందరి అభిప్రాయాలు ప్రచురించగలమని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం.
వారథిగా వర్థిల్లాలి
గోలకొండ పత్రిక, మీజాన్, వరంగల్ వాణి, జనధర్మ వంటి తెలంగాణ వారపత్రికలూ, దినపత్రికలు ప్రజల మన్ననలు పొందినట్టే ‘దక్కన్ ల్యాండ్’ మాసపత్రిక ఆధునిక తెలంగాణవాసులను ఆకట్టుకున్నది. సినిమాలు నిర్మించడంలో కానీ, పత్రికలు నెలకొల్పడంలో కానీ వ్యాపారపరమైన సామర్థ్యం కలిగిన కోస్తాంధ్రవారే ముందున్నారు. కానీ కొన్ని నిర్దిష్టమైన విలువలకు అంకితమై, కొండొకచో ఏటికి ఎదురీది పత్రికలు నిర్వహించిన చరిత్ర తెలంగాణ సంపాదకులకు ఉన్నది. నిజాం రాజ్యంలో సైతం బ్రిటిషాంధ్రలో పాలకులు నిషేధించిన చలం రచనలను ‘సుజాత’ పత్రికలో ప్రచురించిన సాహసం తెలంగాణ పాత్రికేయులది. తెలంగాణలో కవులే లేరని బ్రిటిషాంధ్రవారు ఎద్దేవా చేస్తే గోలకొండ కవుల ప్రత్యేక సంచికతో సీమాంధ్ర కంటే ఎక్కువమంది కవులు తెలంగాణలో ఉన్నారంటూ సాధికారికంగా సమాధానం ఇచ్చారు తెలంగాణ పత్రికాప్రపంచానికి ఆదిగురువైన సురవరం ప్రతాపరెడ్డి.
‘ప్రజాఫ్రంట్’ నాయకుడుగా తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టీఆర్సీ) నడిపిస్తున్న మణికొండ వేదకుమార్ ‘దక్కన్ ల్యాండ్’ పేరుతో సామాజిక, రాజకీయ మాసపత్రికను స్థాపించారు. 2012 సెప్టెంబర్‍లో వెలువడిన తొలిసంచిక ముఖచిత్రం దక్కన్ శిలలు. అంటే పత్రిక విధానం, సంపాదకుడి అభిరుచి ఏమిటో పాఠకులకు ముఖచిత్రం చూస్తే అర్థమైపోయింది. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్నీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో నడుస్తున్న భాగోతాన్ని ఎండగడుతూ వ్యాసాలు ప్రచురించడం సాహసంతో కూడిన పని. పాలకులకు నచ్చకపోయినా, వారు ఆగ్రహిస్తారని తెలిసినా ప్రజలకు తెలియవలసిన అంశాలను ధైర్యంగా సేకరించి, ప్రచురించడం ఆదర్శమైన పత్రిక బాధ్యత. దీన్ని నెరవేర్చిన కారణంగానే వేదకుమార్ సమాజం నుంచి గౌరవం పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమవార్తలను ఉన్నవి ఉన్నట్టుగా ప్రచురించే పత్రికలూ, చూపించే టీవీ చానళ్ళూ పరిమితం కావడంతో ఇటువంటి పత్రికలకు అపరిమితమైన పాఠకాదరణ ఉండేది. తెలంగాణ ఉద్యమ నిర్మాణం, ఎత్తుగడలు, ఉద్యమ కార్యక్రమాల తబ్శీళ్ళు తెలుసుకొనగోరేవారికి ‘దక్కన్ ల్యాండ్’ సంచికలను తిరగవేస్తే అవసరమైన సమాచారం లభిస్తుంది. దక్కన్ టీవీ, దక్కన్ ప్రచురణలు, దక్కన్ పరిశోధనలను నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. ఆయన ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ అంటే అతిశయోక్తి కాదు. ఇంతటి కార్యదీక్ష, సామర్థ్యం, విషయపరిజ్ఞానం, సౌజన్యం చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటాయి.
-కొండుభట్ల రామచంద్రమూర్తి
సంపాదకుడు
గొప్ప విజయము
సరిగ్గా పదిసంవత్సరాలు. తెలంగాణ ఉద్యమం చివరి దశ 2009 డిసెంబర్‍కి తెలంగాణ ప్రకటన వచ్చి, వెనుకంజ వేసిన సంక్షోభకాలం. తెలంగాణ మళ్లీ క్రాస్‍రోడ్స్లో నిలబడింది.
ఉద్యమం ఉవ్వెత్తున జరగవలసిన సందర్భంలో ఉన్నది. అలాంటి సంక్షుభిత సందర్భంలో మాసపత్రికగా ‘దక్కన్‍ల్యాండ్’ ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాఫ్రంట్ నాయకుడు మణికొండ వేదకుమార్ ఈ పత్రికను స్థాపించి, సంపాదకుడిగా ఉన్నారు. అప్పుడు సందిగ్ధ సందర్భంలో ప్రారంభమయిన ఆ ‘దక్కన్ ల్యాండ్’’ నిర్విఘ్నంగా, నిర్విరామంగా, పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక గొప్ప విజయం.
దక్కన్ పీఠభూమి లాంటి ఒక ఒంటరి సమాజంలో రూపు దిద్దుకున్న ప్రత్యేక సంస్కృతిని పత్రిక ఎత్తి చూపింది. హైదరాబాద్ గంగా జమునా తహజీబ్, సమభావన సంస్కృతి ఇక్కడ పరిఢవిల్లిన సామరస్యం, భాషా సహిష్ణుతలు ఇవన్నీ కూడా దక్కన్ ల్యాండ్ వస్తువులయ్యాయి. జీవన ప్రేమలు, మానవ సంబంధాలు, ఆరాం జిందగీ, వ్యాపార లౌల్యతలు లేని, సాదాసీదా జీవితాలను ప్రేమించిన తెలంగాణ జీవితాలకు చిత్రిక పట్టింది. వ్యవహార విజయాల కన్నా, జీవన విజయాలకు ప్రాధాన్యత నిచ్చే తెలంగాణ జీవితాలకు ప్రతిబింబంగా పత్రిక పదేళ్లు నడిచింది.
– అల్లం నారాయణ
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్
దక్కన్ ప్రాంత పునర్ వికాసానికి
వాహికగా నిలబడిన దక్కన్‍ల్యాండ్ పత్రిక
భారాన్ని బాధ్యతగా తీసుకుని అత్యంత కీలకమైన సమయంలో సర్వశక్తులూ ఒడ్డి యుద్ధంలో నిలబడ్డ వ్యక్తి వేదకుమార్. ఆయన యుద్ధ సంధ్యలో ప్రారంభించిన ‘దక్కన్ ల్యాండ్ పత్రిక’ దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా నా శుభాకాంక్షలు. వేదకుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణా సామాజిక అస్తిత్వానికి, సాంస్కృతిక వారసత్వ వైభవానికి, ఈ ప్రాంత పునర్ వికాసానికి వాహికగా నిలబడిన దక్కన్ ల్యాండ్ ప్రారంభమై దశాబ్దం గడిచిపోయింది. తెలంగాణాలో పదేళ్లు పూర్తి చేసుకున్న పత్రికలు చాలా అరుదు. అందునా తెలంగాణా ఉద్యమంలో, తెలంగాణ కోసమే ఆవిర్భవించి, భావ వ్యాప్తికోసం నినదించిన వార, పక్ష, మాస పత్రిక లేవీ పెద్దగా నిలదొక్కుకున్న దాఖలాలు లేవు. దక్కన్ ల్యాండ్ ది ఆ రకంగా అరుదైన రికార్డు. ‘పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు’ అని నార్ల వారు ఎందుకన్నారో తెలియదు గానీ ఈ కాలంలో ఒక్క పత్రిక నిరంతరాయంగా నిర్వహించడం మాత్రం పదివేల సైన్యాన్ని పోషించడంతో, నడిపించడంతో సమానం. అందుకే వేదకుమార్‍కు జేజేలు. మలిదశ తెలంగాణ ఉద్యమం మహోధ•తంగా జరుగుతున్న నేపథ్యంలో 2012 లో కోట్లాది గొంతుల బృందగానాన్ని ఆవిష్కరించి, అప్పటి నుంచీ నిర్విరామంగా నెలనెలా వెలు వడుతున్న దక్కన్ ల్యాండ్ ఇప్పుడు మొదటి దశాబ్ది పూర్తి చేసుకోవడం గొప్ప విషయం.
వేదకుమార్ అత్యంత సహనశీలత, భూత దయ కలిగిన సాహసి, స్వాప్నికుడు. నిజానికి మణికొండ వేద కుమార్‍కు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఆయన కుటుంబం తెలంగాణలో గడిచిన యాభై ఏళ్లలో జరిగిన ప్రతి యుద్ధంలో, ప్రతి సందర్భంలో ఉన్నారు. కాకపోతే స•జనాత్మక, సాంస్కృతిక, కళా రంగాల్లో ఉన్నారు. వారి తండ్రిగారు భూపతి రావు గారి వారసత్వంగా వచ్చిన వందలాది ఎకరాల భూమిని కాకుండా ఆయన ఇచ్చిన విలువలని మిళితం చేసుకున్న వాడు వేదకుమార్. ఆయన సోదరుడు బి. నర్సింగ రావు తన జీవితాన్ని తెలంగాణా రంగుల కళకు అంకితం చేసిన ఆర్ట్ లవర్. దాదాపు యాభై ఏళ్లుగా ఆ సోదరులిద్దరూ ఒకే లక్ష్యంతో సమాంతరంగా నడుస్తున్నారు. నర్సింగ్ రావు ‘మాభూమి’ అని భూస్వాములకు వ్యతిరేకంగా పీడితులు సాగించిన వీరోచిత పోరాటాల పక్షాన నిలబడితే వేదకుమార్ ‘మెరుగైన తెలంగాణా సమాజం కోసం అన్న అడుగు జాడల్లో నిర్మాతగా నడిచిన వాడు. అలాగే బెటర్ హైదరాబాద్, బెటర్ తెలంగాణా కోసం తపిస్తున్నవాడు. ‘దక్కన్ ల్యాండ్’ పత్రిక కూడా అలాంటి బెటర్ ఆలోచన నుంచి పుట్టిందే. తెలంగాణా సమాజం స్వరాష్ట్రం కోసం దిక్కులు పిక్కటిల్లేలా నిలబడి నినదిస్తున్న సమయంలో 2012 సెప్టెంబర్‍లో వేదకుమార్ ఈ పత్రిక మొదలు పెట్టి ఒక దివిటీగా నిలబెట్టాడు. అప్పటికే 2010 నుంచే ఆయన తెలంగాణా రిసోర్స్ సెంటర్ (TRC) పేరుతో ఒక వేదికను నిర్మించారు. తెలంగాణా ఉద్యమ సందర్భంగా భావ వ్యాప్తిలో, అప్పటి పరిణామాల విశ్లేషణలో ఈ వేదిక నిర్వహించిన పాత్ర అత్యంత కీలకమైనది. ఉద్యమ సందర్బంగా 200 చర్చలు నిర్వహించి తెలంగాణా వాదాన్ని పదునెక్కించిన ఘనత వేదకుమార్ గారిది.
– ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
మణికొండ వేద స్వప్నం – దక్కన్ ల్యాండ్
ఉత్తమ సమాజాలు, ఉదాత్త వ్యవస్థలు ఎట్లా నిర్మిత మవుతాయనే ప్రశ్న ఎప్పుడూ దేశ, కాల పరిమితులు దాటి అందరూ వేసుకోవలసిందే ఉత్తమంగా, ఉదాత్తంగా రూపొందటానికి ఎవరు, ఎటువంటి కృషి సాగించాలి అనే ప్రశ్నకూడా అర్థవంతమైనదనే భావించాలి. ‘దక్కన్‍ల్యాండ్’ పత్రిక స్థాపించక ముందు బహుశా ఈ రెండు ప్రశ్నలూ తనకు తాను వేసుకుని ఉంటారు వేదకుమార్‍గారు. ఉన్నత ఆశయాలు, ఉత్క్రష్ట లక్ష్య సాధనా తత్పరులైన వ్యక్తులను, ఆలోచనాపరులను, ఆచరణ వాదులను రూపు దిద్దుకోగలిగినప్పుడే ఉత్తమ సమాజాలు ఏర్పడతాయని, ఆ సమాజాల నిర్వహణకు కావలసిన ఉదాత్త వ్యవస్థలు కూడా ఆవిర్భవిస్తాయని అచంచలమైన, దృఢమైన నమ్మకం. ఒకటి తనకు కలిగి ఉండకపోతే వేదకుమార్ ‘దక్కన్‍ల్యాండ్’ పత్రికను ప్రారంభించి ఉండేవారు కాదని అనిపిస్తుంది.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించే నాటికి డక్కన్ ల్యాండ్ వయసు కేవలం పన్నెండు సంచికలు మాత్రమే. ఇప్పుడు నూటా ఇరవై మూడు సంచికలకు ఎదిగింది. అంటే సామాన్యమేమీ కాదు. వేదకుమార్ చాలా మృదువుగా కనిపిస్తారు కాని ఆయనది వజ్ర సంకల్పం. అది అభేద్యం. ప్రవాహ ఉధృతికి అడ్డుతగిలే వేటినైనా నీరు వొడుపుగా కోసుకుంటూ ముందుకు వచ్చినట్లు ఈ గడచిన పదేళ్లలో అక్షరాలా 123 సంచికలతో దూసుకొచ్చారు.
దక్కన్ పీఠభూమి బహు సంస్కృతులు, బహుళ నాగరికతల నిలయం. అనేక వందల ఏళ్లుగా గొప్ప సాంస్కృతిక వైభవోపేత వైవిధ్యాన్ని నింపుకుంది. నిలుపుకుంది కూడా. ఎన్నో భిన్నమైన ఆదివాసి జాతులు, సంస్కృతులకు అపురూపమైన వేదికగా చిరకీర్తిని అందుకుంది. అటువంటి పలు అంశాలను శోధించి రాసిన నిపుణుల వ్యాసాలను డెక్కన్‍లాండ్ ప్రకటించి తన ప్రత్యేకతను చాటి చెప్పింది.
డా।। ఆర్. సీతారామారావు
‘‘దక్కన్’’ సంస్కృతి పరిరక్షణలో దశాబ్ది
పది సంవత్సరాలు, నూటా ఇరవై నెలలు ఏకబిగిన ఒక్క సంచిక కూడా ఆపకుండా మాసపత్రికను వెలువరించడం అనేది ఒక
ఉద్యమకారునికి, పరిశోధకునికి ఎంతో కష్టతరమైనది. కష్టమైన పనినే ఇష్టంగా మలచుకునే వ్యక్తిత్వం దక్కన్ ల్యాండ్ సంపాదకుడు మణికొండ వేదకుమార్‍ది.
సెప్టెంబర్ 2012 సంచికతో దక్కన్‍ల్యాండ్ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. హిమాయత్‍నగర్‍లోని తన కార్యాలయంలో ‘చర్చ’ కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న కాలంలో సైతం ప్రతివారం ఏదో ఒక అంశంపై సంబంధిత నిపుణులను వక్తలుగా ఆహ్వానించి క్రమం తప్పకుండా నిర్వహించిన అనుభవం మిత్రులు వేదకుమార్‍కున్నది. ఆయన పట్టుదలను కొన్నేళ్లపాటు గమనించిన నాలాంటి వాళ్ళకు ‘దక్కన్‍ల్యాండ్’ పత్రికను నిరాటంకంగా కొనసాగించగలరనే నమ్మకం ప్రారంభంలోనే ఏర్పడింది.
ప్రారంభ సంచిక నుండి 124వ సంచిక (డిసెంబర్ 2022) వరకు ప్రతి సంచికలో తన లక్ష్యాన్ని ప్రకటించుకున్న సంపాదకవర్గం పర్యావరణ, వారసత్వ సంపద పరిరక్షణ కోసం, రాజకీయార్థిక సామాజిక, జీవవైవిధ్య అభిప్రాయ వేదికగా పలు బిన్నాభిప్రాయాల వ్యాసాలను ప్రచురించింది. వివిధ సమస్యల పరిష్కారం కోసం పాఠకుల్లో అవగాహనను పెంపొందించడం కోసం నిపుణుల అభిప్రాయాలను అందించింది.
ఎప్పటికప్పుడు సమాజ అవసరాలను గ్రహించి అవసరమైన సాహిత్య సృష్టిని కొనసాగిస్తున్న దక్కన్‍ల్యాండ్ మరెన్నో దశాబ్దాలు ఇలాగే నెలనెలా వెన్నెలలా వెలుగులను ప్రసరిస్తూ తమస్సు నుండి తేరుకునే స్పృహను ప్రజల్లో కలిగించాలని, జనబాహుళ్యపు జీవన వికాసానికి స్ఫూర్తి నందించాలని కోరుకుంటూ… దక్కన్‍ల్యాండ్ బృందానికి, ఆదరిస్తున్న బుద్ధిజీవులకు మనఃపూర్వక అభినందనలు.
వి. ప్రకాశ్
దక్కన్ ల్యాండ్ ఈ స్థాయిలో చిరకాలం కొనసాగాలి
గత పదేళ్లుగా మణికొండ వేదకుమార్ గారి సారధ్యంలో దక్కన్ ల్యాండ్ మాస పత్రిక చరిత్ర, సంస్కృతి, తెలుగు భాషా సాహిత్యాలు, ముఖ్యంగా తెలంగాణ భాషా సాహిత్యాలు, వారసత్వ సంపద, సహజ వనరుల పరిరక్షణ, సద్వినియోగం, పర్యావరణం, ప్రకృతి విపత్తులు, నివారణ, జీవ వైవిధ్యం, వ్యవసాయం, విద్యా, వైద్యం, గ్రామీణ పట్టణ ప్రణాళికా తదితర వైవిధ్యభరితమైన అంశాలపై కథనాలు, వ్యాసాలతో పాటు కథలు, జీవితానుభవాలు, బాలల సాహిత్యం ప్రచురించడం అభినందించదగిన అంశం.
దక్కన్ ల్యాండ్ ప్రతీ సంచికలో కూడా దాచుకోదగిన ఉన్నత స్థాయిలో వ్యాసాలు ప్రచురణ అవుతున్నాయి. పత్రికకు ISSN గుర్తింపు రావడం వలన పత్రికలో ప్రచురించబడిన వ్యాసాలకు కూడా పరిశోధన స్థాయి ఏర్పడింది. ఇది ఔత్సాహిక పరిశోధకులకు వరం లాంటిది. దక్కన్ ల్యాండ్ పత్రిక ఈ స్థాయిని నిలుపు కుంటూ కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. తాను నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పత్రికను ఇంకా చాలా కాలం నడపడానికి వేదకుమార్ గారు కంకణబద్దుడై ఉన్నారని నేను భావిస్తున్నాను. ప్రతీ నెల రచనల కోసం రచయితలను ఆయన పలకరిస్తూ
ఉంటారు. వ్యాసం పంపమని గుర్తు చేస్తూ ఉంటారు. దశాబ్ద కాలం నిరంతరాయం పత్రికను నడిపిన వేదకుమార్ గారికి, పత్రిక సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను.
– శ్రీధర్‍రావ్ దేశ్‍పాండే
తెలంగాణ సోయి యాది చేసిన డెక్కన్ ల్యాండ్
తెలంగాణ సాధన కోసం మలి దశ ఉద్యమం ఊపు అందుకోవడంలో వారం వారం తెలంగాణ చర్చ వేదిక తో పాటు తెలంగాణ అస్తిత్వం ప్రాధాన్యతను నూతన తరం ఉద్యమకారులకు ఎంత గానో ఉపయోగ పడింది. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగిందని వందల ప్రాణాలు పోలీస్ కాల్పులలో అమరులు అయ్యారని, ఉద్యమాన్ని ఉక్కు పాదంతో ఆణచి వేశారని, మళ్ళీ తెలంగాణ ఉద్యమం రాదని నా లాంటి సామాజిక కార్యకర్తలు చాలా సార్లు విన్నమే గానీ అంత లోతుగా విషయాలను తెలుసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉండేది.
తెలంగాణ మలిదశ ఉద్యమం రాజకీయ పక్షాలు, మేధావులు సమాజంలోని అన్ని వర్గాలు కలిసి ఉద్యమిస్తున్న సమయం. తెలంగాణలో గ్రామ గ్రామాన, పట్టణాలలో ఎక్కడ చూసినా సభలు, సమావేశాలు గణాంకాలతో నీళ్ళు, నిధులు, ఉపాధి, ఆట పాట ధూమ్ దాంలు విద్యా విషయాల మీద మేధావుల అవేశ పూరిత ఉపన్యాసాలు, ఆట పాట తెలంగాణ యాసతో ధూమ్ ధాంలు కొన్ని సార్లు అర్థం అయి అర్ధం కాక ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అనేక మంది. ఆ సందర్భంలోనే దక్కన్ ల్యాండ్ అనే మాస పత్రిక వెలవడడం అందులో సామాన్య జనానికి, సామాజిక కార్యకర్తలకు ఉద్యమ భావ జాల లోతులను అర్ధం చేసుకోవడానికి తోడ్పడింది.
ఈ డిజిటల్ యుగంలో పత్రికలు నడపడం అంత తేలిక కాదు. పట్టువదలని విక్రమార్కులుగా 125 సంచికలను తేవడం అంటే ఆశ మాశి కాదు. ఈ పత్రిక ఇలాగే కొనసాగాలని పత్రికా సంపాదకులు వేదకుమార్ గారికి, తెర వెనుక తెర ముందు కష్ట పడి పని చేస్తున్న అందరికీ పేరు పేరునా నా హ•దయపూర్వక అభినందలు తెలియ చేస్తున్న. తెలంగాణ సోయినీ మరువకుండ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కోరుతూ…
– ఆర్. వెంకట్ రెడ్డి
తెలుగు పాఠకుల గుండెల్లో నిలిచిన దక్కన్ ల్యాండ్
దశాబ్ద కాలం పాటు నిరంతరంగా ఒక్క సంచిక కూడా పాఠకులకు ఆపకుండా వెలువరించడం దక్కన్ పత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్ నిబద్ధత సూచిస్తుంది. సెప్టెంబర్ 2012 సంచికతో ప్రారంభమైన దక్కన్ ల్యాండ్ తన ప్రస్తానాన్ని కొనసాగించడం ఎంతో కష్టసాధ్యమైంది. కష్టమైన పనిని ఇష్టంగా మార్చుకుని చేస్తున్న ప్రయత్నం తెలుగు పాఠకుల గుండెల్లో నిలిచిపోయింది. హిమాయత్ నగర్‍లో తెలంగాణ ఉద్యమ సందర్భంగా చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు 200ల సమావేశాలు నిర్వహించి అనేక సమస్యలపై వివిధ వర్గాలకు, ఉద్యమాలకు బాధ్యత వహిస్తున్న శక్తులను పిలిపించి సమాజానికి అనేక విషయాలపై ఉన్న సందేహాలను, అనుమానాలను నివృత్తి చేసి సమస్యల పట్ల పోరాడే స్ఫూర్తిని కలిగించి, తెలంగాణ సాధించడంలో చర్చ నిర్వహించిన పాత్ర మరువలేము. దక్కన్ పత్రికలో వచ్చిన ప్రతి వ్యాసం పాఠకులకు అనేక కోణాలను ఆవిష్కరించి తన మార్గాన్ని ఎంచుకొని కార్యాచరణకు సిద్ధం కావడానికి ఒక మార్గం సృష్టించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత వచ్చే పరిణామాలను అభివృద్ధిని చాలా స్పష్టంగా అనేక మంది వ్యక్తులు తమ అభిప్రాయాల ద్వారా వివరించి ఉద్యమానికి వన్నెతెచ్చిన విషయం మరువరానది. దక్కన్ పత్రిక దశాబ్ద కాలం ప్రచురించిన వ్యాసాలన్నీ కేవలం చదవడానికి కాకుండా పరిశోధనకు ఉపయోగించుకోవడానికి, విద్యార్థులు ఉద్యమానికి సంబంధించిన సామాజిక సమస్యల పట్ల అవగాహన పెంచుకోవడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. సంపాదకవర్గం నిర్ణయించుకున్న సామాజిక ఎజెండా మేరకు పర్యావరణం, వాతావరణ సమతుల్యత, వారసత్వ సంపద పరిరక్షణ, రాజకీయ సామాజిక సమస్యల పరిష్కారం కోసం వివిధ కార్యాచరణలుగా నిర్ణయించుకోవడం ఒక గొప్ప సాహసం. వీటి అన్నిటిని ఆయా సందర్భాలలో పాఠకుల దృష్టికి తీసుకురావడం కోసం అనేక క్షేత్రస్థాయి పర్యటనలతో పాటు అవగాహన పెంపొందించడం కోసం నిర్వహించిన చర్చలు సామాజిక కార్యకర్తలకు తమ మార్గనిర్దేశంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. గత దశాబ్ద కాలంగా వెలుబడిన వ్యాసాలను పరిశీలిస్తే తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలు అనుభవించిన ఆవేదనను ఆగ్రహాన్ని ఆవిష్కరించడం విద్యార్థులు, రైతులు, కార్మికులు, చేస్తున్న పోరాటాల వెనుక ఉన్న సామాజిక దృక్పథాన్ని వెలువరిస్తూనే వాటిని అణచడానికి చేస్తున్న వివిధ ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకురావడం, వాటిని వీలైనంత మేరకు వెలువరించే ప్రయత్నం చేయడం ఒక సామాజిక బాధ్యతగా పత్రిక తీసుకోవడం అభినందనీయం. దీనితో పాటు సాంస్కృతిక ఉద్యమాలు, సాహితీ సమీక్షలు, రచయితల రచనలపై విశ్లేషణలు కవుల పరిచయాలు, పుస్తక పరిచయాలు, నదీ జలాల వివాదాలు, రైతాంగ పరిస్థితి, చెరువుల ప్రాముఖ్యత, వ్యవసాయ సంక్షోభం, భూ నిర్వాసితుల సమస్యలు, కోర్టు తీర్పులు, గల్ఫ్ బాధితుల సమస్యలు, పతన మవుతున్న ఆర్థిక పరిస్థితి, సింగరేణి నిజాం షుగర్స్ కార్మికుల కష్టాలు, వీటితోపాటు హైదరాబాద్ వారసత్వ సంపద పరిరక్షణ, ఒక్క మాటలో చెప్పాలంటే దక్కన్ పత్రిక తడమని సమస్య లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా దశాబ్దాల కాలం పాటు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో పాలకులు అనుసరించిన నిర్బంధాన్ని, విధ్వంసాన్ని, అనేక చర్చల ద్వారా వ్యాసాల ద్వారా వివరించి వాటి పరిష్కారాల కోసం తపన పడుతున్న, పోరాడుతున్నఅనేక సామాజిక శక్తులకు, ఒక బలమైన ఆలోచన కలిగే విధంగా పత్రిక ఆర్గనైజర్ గా పని చేయడం అవసరం అని గుర్తించి సంపాదకవర్గం వివిధ కోణాల్లో ఆవిష్కరించడం అద్భుతం. చర్చ నిర్వహించిన అనేక సమావేశాల్లో పాల్గొనే అవకాశం, మాట్లాడే అవకాశం కలగడం ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం కలిగించింది.
కేంద్రం బలంగా ఉండి రాష్ట్రాలు బలహీనంగా ఉండాలని భావిస్తున్నది. వీటిపట్ల మరోసారి అన్ని వర్గాలు కలిసి నిరంతరం చర్చలు నిర్వహించి ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉండే కార్యాచరణలో అందరూ భాగస్వామ్యం కావడానికి దక్కన్ పత్రిక కృషిని మరింత పదునుతో కొనసాగించాలని కోరుకుంటు న్నాను. దశాబ్ద కాలం పైగా పత్రికను నడపడం ప్రజల ఆకాంక్షల కనుగుణంగా అనేక విషయాల పట్ల ఒక సమగ్ర దృక్పథాన్ని వివరించడం మామూలు విషయం కాదు. సమాజం ప్రజల మధ్య కంటే స్మార్ట్ ఫోన్లలోనే ఉంటున్న అనివార్య స్థితి నుండి ప్రజల్లో ఉండే విధంగా సంస్కృతిని పెంచాల్సిన బాధ్యతను మోస్తున్న దక్కన్ పత్రిక నిర్వాహకులకు అభినందనలు. దక్కన్ పత్రికను, చర్చను ప్రజా ఉద్యమాలను వేరుగా చూడలేము. అందువలన దక్కన్ పత్రిక నుంచి అటువంటి కార్యాచరణ కోరుకోవడం అవసరమని భావిస్తున్నాను.
– దేవి ప్రసాద్,
మాజీ అధ్యక్షులు తెలంగాణ ఎన్జీవోస్ యూనియన్
ఈ దశాబ్ది ‘తెలంగాణ’ మాస పత్రిక దక్కన్ ల్యాండ్
ప్రపంచంలో ఎక్కడైనా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలుLegislature, Executive, Judiciary and Mediaలు. ప్రజాస్వామ్య గతితార్కిక గమనాన్ని రికార్డు చేసేది మీడియా. అంతేకాదు ప్రజాస్వామిక విలువలకు బలం మీడియా. స్వేచ్ఛా వేదికగా పత్రికలుండాలి. ప్రజాస్వామిక ఆకాంక్షల్ని ప్రతిఫలించేవి కావాలి పత్రికలు. అందుకే నార్ల ‘పత్రికొకటి చాలు పదివేల సైన్యమ్ము’ అన్నారు. ప్రజల తరపున నిలిచే ప్రతిపక్షగళం పత్రిక. ప్రభుత్వం, ప్రజల మధ్యన వారధి. విచక్షణతో కూడిన పత్రికారచనలు ఉద్యమంతో సమానం. పత్రికలు ఉద్యమాల కాగడాలుగా నిలిచిన సందర్భాలెన్నో. అట్లా తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర సాధనలో ఎత్తిన అక్షరపతాకం, 2012 సెప్టెంబరు నెలలో ప్రారంభించబడ్డ పత్రిక ‘దక్కన్ లాండ్’. నిర్లక్ష్యంచేయబడ్డ తెలంగాణా చరిత్ర, సంస్కృతుల ఔన్నత్యాలను చాటడానికి దక్కన్ లాండ్ తనవంతు కృషి చేసింది. మరుగునవడ్డ తెలంగాణ చారిత్రక ప్రదేశాలను, సాంస్కృతిక అంశాలను వ్యాసాల రూపంలో, కథనాల రూపంలో ప్రచురిస్తూ వస్తున్నది. దక్కన్ లాండ్ సమగ్రమైన సమాచారాత్మక, విశ్లేషణాత్మక, ప్రత్యేక వ్యాసాలను సందర్భానుసారంగా ప్రచురిస్తున్న తెలుగు మాస పత్రిక.
– శ్రీరామోజు హరగోపాల్
దక్కన్ ల్యాండ్ : ప్రజల పత్రిక
దక్కన్ ల్యాండ్ తన పేరుకు తగ్గట్లుగా ఒక దశాబ్దానికి మించి ఈ ప్రాంతపు భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక కథనాలను అందిస్తోంది. సమాజం, చరిత్ర, సంస్కృతి, వారసత్వం పై రచయితలు, పాఠకులను ఒక్కటి చేయడంలో ఈ మాసపత్రిక కీలకపాత్ర పోషించింది. తెలంగాణ తన ఉనికి చాటుకునేందుకు పోరాడుతున్నప్పుడు రాష్ట్ర డిమాండ్ పై విభిన్న కథనాలను ప్రచురించడం ద్వారా నాడు ఎంతో అవసరమైన గొంతుకను వినిపించింది. ఉద్యమకారుల భావోద్వేగాలకు వేదికగా నిలిచింది. అలా చేయడం ద్వారా దక్కన్ ల్యాండ్ తనను తాను ప్రజల పత్రికగా నిరూపించుకుంది. భాష, సమాజం, కళలు, ఆర్కిటెక్చర్‍పై విస్తృత శ్రేణిలో అంశాలను ప్రచురించడం ద్వార వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారందరినీ పత్రిక చేరుకోగలుగుతోంది.
పత్రికకు రచనలు అందిస్తున్న వారు వివిధ నేపథ్యాలకు చెందిన వారు. వారి రచనలు వారి నిశిత దృష్టి, అనుభవం, జీవితాన్ని కాచివడబోసినట్లుగా ఉంటాయి. ఎంచుకున్న అంశం లోతుపాతులను తెలియజేస్తాయి. ఫలితంగా నూతన దృక్పథాలను పొందడంలో పాఠకులకు తోడ్పడుతాయి. చరిత్ర, ఆర్కియాలజీ, ఆర్కిటెక్చర్ వంటి రంగాల్లో పరిశోధనల ఫలితాలను కూడా ఈ పత్రిక ప్రచురిస్తోంది. తద్వారా వాటిపై మరింత అధ్యయనాలు జరిగేందుకు అవసరమైన సోర్స్ మెటీరియల్‍ను అందిస్తోంది. ఈ రకంగా చూస్తే దక్కన్ ల్యాండ్ తనకు తానుగా ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకుంది. అది ఒక పత్రిక మాత్రమే కాదు. జర్నల్ కూడా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి విశిష్టతను దక్కన్ ల్యాండ్ సాధించింది. ప్రింట్ మీడియా సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ, దక్కన్ ల్యాండ్ మాత్రం ఒక దశాబ్ది కాలంగా మనుగడ కొనసాగించడం మాత్రమే గాకుండా పటిష్ఠ రీతిలో ఎదుగు తోంది. తన స్థానంలో మరింతగా నిలదొక్కుకుంది.
తడకమళ్ల వివేక్
టీఎస్పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు)
దక్కన్ ల్యాండ్ తెలంగాణ ఎన్సైక్లోపీడియా
మలిదశ తెలంగాణా ఉద్యమంతో సమాంతరంగా అడుగులు వేసినవారు వేదకుమార్ గారు ప్రత్యేకరాష్ట్ర ఆకాంక్ష కోసం నిరవధికంగా ప్రతివారం విభిన్న చర్చల ద్వారా రాష్ట్రఆవశ్యకతను నిగ్గుతేల్చి చూపి నవారు. వారి ప్రయత్నం అంతటితో ఆగలేదు. తెలంగాణా ఆత్మను సుస్థిరంగా నిలిపే ఉద్దేశంతో దక్కన్ ల్యాండ్ సామాజిక రాజకీయ మాస పత్రిక నిర్వహణకు పూనుకున్నారు. గతాన్ని తెలుసుకొని వర్తమానంతో బేరీజువేసుకొని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవడం విజ్ఞత. ఆక్రమంలోనే ఈ పత్రిక నడుస్తున్నది. కేవలం గత వైభవాన్ని చాటడంతోనే పత్రిక సరిపెట్టుకోలేదు. ఆధునీకరణ .. ప్రపంచీకరణలో పర్యావరణం దెబ్బతింటున్న విషయం జగమెరిగిన సత్యమే. అందువల్ల పర్యావరణ పరిరక్షణాంశాలను మెలకువలతో పాటు ఈ ప్రాంత ఒనరులను ముందుకు తెస్తూ వాటి వినియోగావశ్యకతను.. విధానాన్ని పత్రిక ఉద్ఘాటిస్తున్నది.
NEWS అంటేనే. నలుమూలల (North.. East.. West.. South)వార్తలు కదా! అందుకే తెలంగాణా వార్తలకే పరిమితం కాకుండా దేశవిదేశాల విశేషవార్తలను మన కరతలామలకం చేస్తున్నది. అంతే కాకుండా బాల రచయితలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ బాలచెలిమి పేరిట వాళ్ళ రచనలను ప్రచురించడం సంతోషందాయకం. వ్యక్తిగతంగా నేను అనేక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలు.. ఆయాగ్రామాల పుట్టుపూర్వోత్తరాలతో పాటు అనేక వ్యవహారపదజాలాల మూల అర్థాలను ఈ దక్కన్ ల్యాండ్ నుండే తెలుసుకున్నాను. విషయ పరిజ్ఞానం కోసం నాలుగు కాలాలపాటు భద్రంగా దాచిపెట్టకోగలిగిన దక్కన్ ల్యాండ్ పత్రికను వ్యయప్రయాసాల కోర్చి ఒంటి చేత్తో తెస్తున్నందుకు వేదకుమార్ గారికి హార్థిక కృతజ్ఞతాభినందనలు తెలుపుకుంటున్నాను. పత్రికను నెలనెలా టంచన్ గా అందుకోగలిగినందుకు సంతోషిస్తూ వీరితో మలిదశ ఉద్యమంలో కొన్ని అడుగులు వేసినందుకు గర్వపడుతున్నాను.
– తిరునగరి దేవకీదేవి
అస్తిత్వ భావవ్యాప్తికి అద్దం పట్టిన పత్రిక
మనం ఇలా ఎందుకున్నాం? మనదాన్ని మనం ఎందుకు కాపాడుకోలేక పోతున్నాం? మన వైభవాన్ని మనమైనా ఎందుకు చెప్పుకోలేక పోతున్నాం? ప్రతిదాంట్లోనూ ఆధిపత్యమే ప్రతిదీ వివక్ష పూరితమే దేన్ని కదిలించినా అసమానతల జీవితమే మనదైంది? నీళ్ళూ, నిధులు,నియామకాలంటూ మనవి మనకు కావాలని మన చరిత్ర, సంస్కృతి, భాష, జీవన సుఖ దుఃఖాలు మనవంటూ రక్షించుకునే అస్తిత్వంలోంచే ‘దక్కన్‍ల్యాండ్’ పత్రిక ఆవిర్భవించింది. మణికొండ వేదకుమార్ వస్తేరానీ కష్టాల్ నష్టాల్ అంటూ అడుగు వేస్తున్నందుకు రోజూ హృదయాలింగనం చేసుకోవాల నిపిస్తుంది. అస్తిత్వ భావవ్యాప్తిలో అగ్రగామి పత్రికగా దక్కన్‍ల్యాండ్‍ను తీర్చి దిద్దుతున్నందుకు వేదకుమార్‍ను అభినందిస్తూనే మన జాతి రహదారి మరింత విస్త•త పరచాలని ఆకాంక్షిస్తున్నాను.
-డా।। నాళేశ్వరం శంకరం
స్వతంత్ర అభిప్రాయాల వేదిక
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో పుట్టి రాష్ట్ర అవతరణ అనంతరం కూడా ఆయా రచయితలు తమతమ స్వతంత్ర అభిప్రాయాలు వెలిబుచ్చడానికి ఒక వేదికగా నిలుస్తున్నది దక్కన్ ల్యాండ్. పత్రికకు సమాంతరంగా తెలంగాణ రిసోర్స్ సెంటర్ ప్రతి శనివారం సాయంత్రం ‘‘చర్చ’’ పేరుతో ఏర్పాటు చేసిన వేదిక ఉద్యమకారులు, మేధావులు తమతమ గళాలను వినిపించడానికి వీలు కల్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రిసోర్స్ సెంటర్‍లో మాట్లాడని మేధావి లేరు. ఈ నేపథ్యంలో దక్కన్ ల్యాండ్ యొక్క సుగుణమేంటంటే… తెలంగాణ రిసోర్స్ సెంటర్ ‘‘చర్చ’’ కార్యక్రమంలో మాట్లాడిన ప్రతి ప్రధాన వక్త విలువైన ప్రసంగ పాఠాలు వృధాగా పోకుండా ప్రతి నెలా వాటిని ప్రచురించి భావి తరాలకు భద్రంగా అందించింది.
– డా. ద్యావనపల్లి సత్యనారాయణ
దక్కన్ చైతన్య వాహిని దక్కన్ ల్యాండ్
సమాజానికి అండగా నిలబడవలసిన అనివార్యత ఏర్పడి నప్పుడు కాలం ఒక కవిని ఉద్భవింపజేస్తుంది. అట్లాంటి చారిత్రక అవసరం ఉన్న తెలంగాణ మహోద్యమ కాలంలో ఆవిర్భవించిన సామాజిక, రాజకీయ పత్రిక ‘దక్కన్‍ల్యాడ్’. పేరులోనే ఉన్నతమైన ప్రాంతీయ అస్తిత్వాన్ని నిబిడీకృతం చేసుకున్న దక్కన్‍ల్యాండ్ నేడు దశాబ్దికాలాన్ని పూర్తి చేసుకోవడం పత్రికారంగంలో ప్రధాన విషయంగా చర్చించుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం అనేక మలుపులు తిరిగిన కీలకమైన దశలో ప్రారంభమైన దక్కన్‍ల్యాండ్ తెలంగాణ ప్రజల హృదయస్పందనలను లోకానికి వినిపించింది. ఇంతటి చారిత్రక బాధ్యతను మోసుకుంటూ నడిపించిన ఉద్యమ సంపాదకుడు మణికొండ వేదకుమార్ గారు. సామాజిక సేవాతత్వాన్ని, సాహిత్య సాంస్కృతిక కళాభిరుచిని హృదయం నిండా నింపుకున్న అచ్చమైన సహృదయుడు వేదకుమార్‍గారు. మానవీయ విలువలున్న కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ కొత్త ఆదర్శ పథంలో ప్రయాణిస్తున్న ఈ పర్యావరణ ఉద్యమకారుడు పత్రికను కూడా ఆస్థాయిలో తీసుకురావడానికి నిరంతరం తపించిపోయేవారు. తెలంగాణలో ఒక అనిశ్చితి, అధిపత్యం, సంక్షోభం ముసురుకున్న కాలంలో ప్రజాఫ్రంట్ నాయకుడిగా ఉద్యమానికి అవసరమైన సాధనంగా ‘దక్కన్‍ల్యాండ్’ పత్రికను స్థాపించడం వేదకుమార్‍గారి చైతన్యానికి సంకేతం.
డా. ఎస్. రఘు
సమాజానికి అవగాహన కల్గిస్తున్న దక్కన్ ల్యాండ్
మనిషి విషపూరిత ఆలోచనలతో సంచరిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రాచీన జానపద కళలను గురించి పట్టించుకునే వాళ్ళెవరు. వాటిని గురించి మాట్లాడే వాళ్ళెవరు, రాసేవాళ్ళెవరు? పురాతన కట్టడాల ప్రాముఖ్యతను గురించి చెప్పే వాళ్ళెవరు. వాటి సంరక్షణ కోసం అహర్నిశలు పాటుపడే వాళ్ళెవరు? ప్రక•తిని గురించి, పర్యావరణ సంరక్షణ గురించి నేటి సమాజానికి కనీస అవగాహన కలిగించేవాళ్ళెవరు? ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే దక్కన్ ల్యాండ్ మాస పత్రిక. తెలంగాణ ఉద్యమకారుడు. పర్యావరణ ప్రేమికుడు అయిన యం. వేదకుమార్ సంపాదకత్వంలో 2012 సెప్టెంబర్ నుంచి వెలువడుతున్న ‘దక్కన్ ల్యాండ్’ పత్రిక దశాబ్దకాలాన్ని పూర్తిచేసుకొని నేటికీ విజయవంతంగా కొనసాగుతున్నది. ఇట్లాంటి అరుదైన పత్రికను కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. దక్కన్‍ల్యాండ్• మాపపత్రిక ఈ పదిసంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి, దేనికీ తలొగ్గక తాను అనుకున్న విధంగా పత్రికను నడిపించడం సంపాదకులు వేదకుమార్‍కే సాధ్యమైంది.
-అంబటి వెంకన్న
‘‘చరిత్ర పుటల్లో దక్కన్ ల్యాండ్’’
సరిగ్గా పది సంవత్సరాల క్రితం ప్రారంభమయిన ‘‘దక్కన్‍ల్యాండ్’’ మాసపత్రిక క్రమంగా తెలంగాణ విద్యావంతుల మన్ననలు పొందుతూ దిగ్విజయంగా ముందుకు దూసుకపోతున్న ఈ శుభసందర్బంలో దాని వ్యవస్థాపకులు సంపాదకులు అయినటువంటి మణికొండ వేదకుమార్ గారికి నా హృదయపూర్వక శుభాభివందనాలు. మొదటి నుండి కోస్తాంధ్ర పెట్టుబడిదారులదే పత్రికారంగంలో గుత్తాధిపత్యం. వారి గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ మన ప్రాంతం వాళ్లు స్థాపించిన దినపత్రికలు గానీ లేదా మాసపత్రికలు గానీ ఏవీకూడా పట్టుమని పదిసంవత్సరాల కాలంపాటు నిలదొక్కుకుని నడిచిన సందర్భాలు బహు అరుదు. ఈ అరుదైన ఘనతను వేదకుమార్ నేతృత్వంలో వెలువడుతున్న దక్కన్‍ల్యాండ్ సాధించడం హర్షణీయం.
– ప్రొ।। జి.లక్ష్మణ్
తెలంగాణ బ్రాండ్ దక్కన్ ల్యాండ్
భాషకు స్వేచ్ఛై
అభిప్రాయాలకు వేదికై
ప్రాచీన ఆధునిక భావాలకు పొత్తిళ్ళై
చారిత్రక శాసన సంస్కృతుల ముఖచిత్రమై
ఆశయానికి జెండైన దక్కన్ ల్యాండ్
తెలంగాణ ఆకాంక్షల బ్రాండ్
డిసెంబర్ 9 ప్రజాస్వామ్యాన్ని వెనక్కి నెట్టిన కాలం. ఇచ్చిన తెలంగాణను తిరిగేసిన కాలం. పత్రికలన్ని సీమాంద్ర గోడలకే సున్నాలేస్తున్న కాలం. చానళ్లన్ని పెట్టుబడీదారుల గొంతులై కూస్తున్న కాలంలో దక్కన్ ఆశయంతో, దక్కన్ పీఠభూమి సంస్కృతిని ప్రతిబింబించే తెలంగాణ అగ్గికలమై అక్షర పతాకమై ఉదయించిన మాసపత్రిక దక్కన్ ల్యాండ్. సమాజ అభివృద్ధి బాధ్యతగా సంస్కరణలే లక్ష్యంగా వారసత్వాన్ని కాపాడుతూ ఆధునికంగా వెలుగు దారిని అస్తిత్వ ఆకాంక్షలను మనకందిస్తున్న దక్కన్ ల్యాండ్ మాసపత్రిక శతవసంతాలు పూర్తిచేసుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను.
వనపట్ల సుబ్బయ్య
వెలుగులోకి తెస్తున్న ‘దక్కన్ ల్యాండ్’
‘దక్కన్ ల్యాండ్’ పత్రిక దక్కనీయ సంస్కృతి పునరుద్ధరణలో భాగంగా నేను భావిస్తున్నాను. పత్రికకు పేరు పెట్టడంలో సంపాదకుల దృష్టిలోయీ సాం స్కృతికాంశం యిమిడి వుంటుందని నేను భావిస్తున్నాను. ISSN ఆమోదం (International Standard Serial Number) రావడం అత్యంత ముదావహం. పరిశోధకులకు – చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సమాజం-ఇదివరంలాంటిది. దీనివల్ల యిందులో ప్రచురితమయ్యే వ్యాసాలకు అదనపు అర్హత లభిస్తుంది. అంతరించి పోతున్న వారసత్వ సంపద, చేతి వృత్తులు, ప్రజా కళలను పరిరక్షించాలన్న సత్సంకల్పంతో ‘దక్కన్‍ల్యాండ్’ మొదలై అనేక ఇబ్బందులకు లోబడి, క్రమం తప్పకుండా వెలువడ్డం ప్రశంసనీయం.
వకుళాభరణం రామకృష్ణ
దక్కన్‍న్యూస్