ఆధునిక సమాజంలో అడవితల్లి బిడ్డలు ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

కష్టం ఎంతైనా తరగని చిరునవ్వు.. తరాలు మారినా మారని సంస్కృతి ఆదివాసీలకే సొంతం. అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ అద్దం పడుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాత తరాలకు అందిస్తున్నారు. గుస్సాడీ ఉత్సవాలతో గ్రామాల మధ్య ఐక్యతను చాటుతూ దండోరా సంబరాలతో ఆకట్టుకుంటున్నారు. గుస్సాడి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహార అలవాట్లు వారి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి అలవాట్లు, వేషభాషల గురించి తెలుసుకుందాం.


సంప్రదాయానికి ప్రతీక వాయిద్యాలు
నార్నర్‍(ఆసిఫాబాద్‍): ఆదివాసీ గిరిజనులు అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆచారాలు నేటికీ పాటిస్తున్నారు. ప్రస్తుత కాలంలో డీజేలు, వివిధ రకాల సౌండ్‍ సిస్టమ్స్ ఉన్నప్పటికీ వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో సంప్రదాయ వాయిద్యాలను ఉపయోగిస్తున్నారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కన్వీనర్‍, గుంజాల గోండిలిపి అధ్యక్షుడు ప్రొఫెసర్‍ జయధీర్‍ తిరుమల్‍రావు ఆదివాసీ తెగలకు సంబంధించిన 40 రకాల వాయిద్యాలు సేకరించి 2019 మార్చి 2, 3 తేదీల్లో హైదరాబాద్‍లో ఆదివాసీల ‘రేలపూల రాగం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమం ద్వారా సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాకృతిక జానపదం వినిపించడం లేదు. కళాకారులు బతికితే సంగీతం బతుకుతుందనే ఉద్దేశంతో ఆదివాసీలు నేటి యువతరానికి పరిచయం చేస్తున్నారు.


ఆదివాసీ వాయిద్యాలు:

డోల్‍(డోలు): డోలు, డప్పులను ఆదివాసీలు దైవ కార్యక్రమంతో పాటు ఇతర శుభకార్యాల్లో వాయిస్తారు. గ్రామపెద్ద లేదా సమాజంలో గుర్తింపు పొందిన ఆదివాసీ వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాల్లో వాయిస్తారు. ఒక్కో కార్యానికి ఒక్కోతీరు (బాజా) ఉంటుంది. పెళ్లిలో 10 రకాల డోలు వాయిస్తారు. అవసరాన్ని బట్టి డోల్యల్‍, చెడ్యంగల్‍ అనే ఇద్దరు వ్యక్తులు ఆయా రకాల్లో వాయిస్తారు.
డప్‍(డప్పు): దండారీ, దేవి ఉత్సహాల్లో డప్పులు వాడుతారు. ఇది కూడా పలు రకాలుగా ఉంటుంది. బాజాల తీరు, కార్యాన్ని బట్టి వాయిస్తారు. ఆదివాసీల సంస్కృతిలో భాగంగా వారి ఆచారం ప్రకారం వాయిస్తూ నృత్యం చేస్తారు.
పెప్రే(సన్నాయి): పెప్రేలను ప్రధాన్‍, తోటిలు వాయిస్తారు. డోలు, డప్పులకు తోడు పెప్రే అవసరం ఉంటుంది. సన్నాయి లేకపోతే ఏ ఉత్సవమైనా ఘనంగా జరగదు. ఈ రెండు ఉంటేనే ఉత్సవంలో జోస్‍ వస్తుంది.
కాలికోం(కొమ్ము): పెప్రేతో పాటు కాలికోం ఉంటుంది. వీటిని ప్రధాన్‍లు వాడతారు. దీనిని ఉత్సవం ప్రారంభంలో లేదా ఏదైనా కార్యక్రమం ప్రారంభంలో అప్పుడప్పుడు ఊదుతూ ఉంటారు.


తుడుం: డోలు, డప్‍లలో తుడుం ఉంటుంది. తుడుంను కేవలం దైవ, పూజా కార్యక్రమంలో మాత్రమే
ఉపయోగిస్తారు. దేవుళ్లకు సంబంధించిన కార్యంతో పాటు అతిథుల స్వాగతానికి మాత్రమే దీనిని వాడతారు.
కిక్రీ: ఇది తోటి, ప్రధాన్‍లలో ఉంటుంది. పెర్సాపెన్‍, పెద్ద దేవుల పురణ కథలను కిక్రీ సమేతంగా పాడి వినిపిస్తారు.
డోల్‍కి: ఇది ఆదివాసీలు వివాహ సమయంలో గుడికి వెళ్లేటప్పుడు ఉపయోగిస్తారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రాత్రి డెంసా కార్యక్రమంలో దీనిని వాడతారు.


ఆకట్టుకునే సంస్కృతి, సంప్రదాయాలు..
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఏటా దసరా తర్వాత ఆశ్వీయుజ పౌర్ణమితో దండారీ ఉత్సవాలు ప్రారంభిం దీపావళి అమావాస్యతో ముగిస్తారు. ఈ సమయంలో గుస్సాడీ వేషధారణ చేసి ఒక గ్రామం వారు మరో గ్రామానికి వెళ్తారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి ఒడ్డున గల పద్మల్‍పురి కాకో ఆలయంలో నిర్వహించే వేడుకలకు ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివస్తారు. ఆదివాసీల ఆరాధ్య దేవతలకు బియ్యంతో పాయసం, పప్పుతో రుబ్బిన గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు. దండారీ, పెర్సాపెన్‍ ఉత్సవాల సమయంలో ఆదివాసీలు గోదారమ్మకు శాంతి పూజలు నిర్వహిస్తారు.


ఇప్పపరక నూనెకు ప్రాధాన్యం
ఆదివాసీలు సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నారు. సహజవనరులైన భూమి, నీరు, అడవిలో దొరికే ఫలాలపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. చెట్టు, పుట్ట, నీరు వంటివాటికి పూజలు చేస్తూ వాటితో అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారు. ఆదివాసీలు ఆషాఢమాసంలో నిర్వహించే తొలి పండుగ అకాడి(వన) దేవతలకు పూజలు. సాగు పూజలు, శుభకార్యాలు, పెర్పపేన్‍, తదితర పూజలకు ఇప్పపరక నూనెకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అడవిలో సేకరించిన ఇప్ప పరకలతో తీసిన నూనెతో నైవేద్యం తయారుచేసి దేవతలకు సమర్పించడంతో పాటు దీపారాధనకు వినియోగిస్తారు. ఆదివాసీ గ్రామాల్లో టేకు మొద్దులతో తయారు చేసిన గాన దర్శనమిస్తుంది.
ఈనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించేందుకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు.

  • ఎసికె. శ్రీహరి
    ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *