దాశరథి కృష్ణమాచార్య

తెలంగాణలో జన్మించిన, గణనీయ వైతాళికులలో, మహాకవి దాశరథి అగ్రేసరులు.
‘‘ప్రాణము లొడ్డి ఘోరగహనాటవులన్‍ బడగొట్టి, మంచి మా
గాణములన్‍ స•జించి, ఎముకల్‍ నుసిచేసి, పొలాలు దున్ని, భో
షాణములన్‍ నవాబుకు స్వర్ణము నిండిన రైతుదే తెలంగాణము రైతుదే;
ముసలినక్కకు రాజరికంబు దక్కునే’’
అంటూ గర్జించి, హైదరాబాద్‍ సంస్థానవిముక్తి మహో ద్యమంలో దూకి, నిజాం నవాబు – మీర్‍ ఉస్మాన్‍ అలీఖాన్‍ను ఎదిరించి, తెలంగాణ విముక్తికై కారాగారశిక్ష అనుభవించి, లక్ష్యాన్ని సాధించిన స్వాతంత్రోద్యమ కవి సింహం దాశరథి.


దాశరథి పూర్తి పేరు. దాశరథి కృష్ణమాచారి. దాశరథి 1925 జూలై 22 నాడు, ఖమ్మం జిల్లా, మానుకోట తాలూకాలోని, చినగూడూరు గ్రామంలో జన్మించినాడు. శ్రీమతి వేంకటమ్మ శ్రీమాన్‍ వేంకటాచార్యులు ఆతని తల్లిదండ్రులు. దాశరథి రంగాచారి దాశరథి తమ్ముడు. వీరిది శ్రీవైష్ణవ కుటుంబం. పేదరికంలో అలమటించేవారు. తండ్రి నుండి, చిన్ననాడే సంస్కృతభాషా సాహిత్యాలను, తల్లి నుండి తెలుగు పరిమళాలనూ మానవతా దృక్పథాన్నీ సంగ్రహించి నాడు దాశరథి. చినగూడురులో నాల్గవ తరగతినీ, ఖమ్మం ఉస్మానియా హైస్కూల్‍లో మెట్రిక్యులేషన్‍ను పూర్తి చేసినాడు. ఖమ్మంలో చదువుకుంటున్నప్పుడే మీర్జాగాలిబ్‍ శృoగారాత్మక సాహిత్యాన్ని, ఇక్బాల్‍ విప్లవగీతాలను అధ్యయనం చేసినాడు. మరోవైపు ఉపనిషత్తుల సారాన్ని ఎదలో పొదుగుకొన్నాడు దాశరథి.


ఆనాటి హైదరాబాద్‍ సంస్థానంలో 1100 జాగీర్లుండేవి. వాటిలో ‘గార్ల’ జాగీరు ఒకటి. ఈ జాగీరు కింద ఉండే, పేద ప్రజల బాధలను చూచినాడు దాశరథి. పన్నులు చెల్లించలేక, వెట్టిచాకిరితో, ఆకలికి మాడిపోయే, నిరుపేదల కన్నీటి బతుకులను చూచి, దాశరథి గుండె విలవిలలాడి పోయింది. కర్కోటకులైన భూస్వాముల అత్యాచారాలు, అక్రమ భోగభాగ్యాలు, నిజాం తాబేదార్లు సాగించే హింసాకాండను చూచిన దాశరథిలో ఈ అన్ని దౌష్ట్యాలకూ కారణభూతుడైన నిజాం నిరంకుశత్వం పట్ల, ఆగ్రహ ద్వేషాలు పెల్లుబికినాయి. ఆతని హృదయం, అగ్నిగోళమైంది. ఆతని కోపం ‘అగ్నిధార’గా ప్రవహించింది.
‘‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనొ
అందాక ఈ
భూగోళమ్మున అగ్గిపెట్టెదను’’ అంటూ విప్లవ చైతన్యమూర్తియై ప్రజ్వరిల్లినాడు. ప్రజల బాధలకు, కారణభూతులైన భూస్వాముల ఆటకట్టించాలనీ, రైతుల హక్కుల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులతో కలిసి పోయినాడు దాశరథి. కార్యకర్తగా, కావ్యకర్తగా ఉద్యమించాడు. కోయగూడేలలో తిరిగి వాళ్లను సమైక్య పరచినాడు. లంబాడీలను, హరిజనులను, రైతులను, కూలీలను, వర్తకులను మేల్కొలిపి, వాళ్లను స్వాతంత్రోద్యమంలో భాగస్వాములుగా చేసినాడు. పుంఖానుపుంఖంగా కవితలు రచించి, పీడిత ప్రజల, భావాలకు ప్రతినిధిగా తన కలాన్ని ఝళిపించినాడు
‘‘వీణియ తీగపై పదనుపెట్టిన నా కరవాలధారతో
గానము నాలపించెదనీ స్వకంఠము నుత్తరణంబొనర్చి
స్వర్గానికి భూమి నుండి
రసగంగలు చిమ్మెద – పీడిత ప్రజా
వాణికి ‘మై’కమర్చి అభవవాదులకున్‍, వినిపింప జేసెదన్‍’’ అంటూ బాధాతప్త ప్రజలనోటికి ‘మైక్‍’గా కూరిపోయినాడు దాశరథి. దాశరథి కవిత్వంలోని తీవ్రభావాలు అటు ప్రజలనూ, ఇటు తీవ్రవాదులనూ బాగా ఆకర్షించేవి. దాశరథి కమ్యూనిస్టు సెల్‍ సమావేశాలకూ, అజ్ఞాత సమావేశాలకూ హాజరయ్యేవాడు.


ఆనాటి ఉద్యమ ధ్యేయం తెలంగాణ స్వాతంత్య్ర సంపాదన – ఒక్కటే. అందుకై కమ్యూనిస్టు వాళ్లూ, కాంగ్రెసు వాళ్లూ కలసి ‘ఆంధ్ర మహాసభలలో’ పాల్గొనేవాళ్లు. దాశరథి కూడా ఆ సభలలో పాల్గొని – ‘‘ఆంధ్రమహాసభకు అరుదెంచుడి జనులారా’’ అంటూ ప్రజలను ఆహ్వానించేవారు.
మరోవైపు తెలుగు భాషా సంస్కృతుల పునరుద్ధరణకై కంకణం కట్టుకొన్న ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలలో పాల్గొని, కావ్యగానం చేసేవాడు దాశరథి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవ సభ 1944లో ఓరుగల్లు కోటలో ఏర్పాటైంది. రజాకార్లు సభపై వేసిన పచ్చని పందిళ్లను తగులబెట్టినారు. అప్పుడు దాశరథి నిర్భయంగా ‘‘జ్వాలలో ఆహుతి అయిపోతాం గాని, కవి సమ్మేళనం జరిపి తీరుతాం’’ అంటూ కాలిన పందిళ్ల బూడిద వేడిగా కాళ్లకు తగులుతుండగా, గళం విప్పి –
‘‘ఓ పరాధీన మానవా! ఓపరాని
దాస్యము విదల్చలేని శాంతమ్ముమాని
తలుపులను ముష్టిబంధాన కలచివైచి
చొచ్చుకొనిపొమ్ము స్వాతంత్య్ర సురపురమ్ము’’
అంటూ ప్రబోధించినాడు. సభాధ్యక్షులైన శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు లేచి ‘సింహగర్జన చేశావు నాయనా’ అంటూ దాశరథిని మెచ్చుకొన్నారు. శ్రీదేవులపల్లి రామానుజరావు గారు దాశరథి మెడలో పుష్పహారం వేసారు. తరువాత ‘మంచిర్యాల’లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సభా కవిసమ్మేళనానికి, దాశరథి అధ్యక్షత వహించి ప్రజలను ప్రబోధించినాడు.


ఒకరోజు, మానుకోట తాలూకా ‘జయ్యవరం’ గ్రామంలో, రాత్రంతా సభ జరిపి, మరునాడు చిన్నగూడూరుకు వచ్చిన దాశరథిని పోలీసులు అరెస్టుచేసి చేతులకు బేడీలు, నడుముకు తాడు కట్టి, ‘పదిమైళ్ల’ దూరంలో ఉన్న ‘నెల్లికుదురు’ పోలీసుస్టేషనుకు, నడిపించుకొంటూ తీసికొని వచ్చినారు. అప్పుడు అవకాశం చూచి, దాశరథి తప్పించుకొని, పొలాల్లో, నదుల్లో, అరణ్యాల్లో పడి 30 మైళ్ల దూరంలో ఉన్న, ‘‘నాగారం’’ అనే గ్రామంలో తలదాచుకొన్నాడు. మిత్రులు అతన్ని రక్షించినారు. అప్పటినుండి దాశరథి మారువేషంలో సంచరిస్తూ ప్రజలను తన ప్రసంగాలతో
ఉత్తేజపరిచేవాడు.


1945-46 ప్రాంతంలో దాశరథికి కమ్యూనిస్ట్లతో అభిప్రాయభేదాలేర్పడ్డాయి. అప్పుడు దాశరథి హైదరాబాదు సంస్థానంలో బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపనకూ భారత యూనియన్‍లో హైదరాబాద్‍ రాష్ట్రం విలీనం కావడానికీ, మహోద్యమాన్ని సాగిస్తున్న ‘స్టేట్‍ కాంగ్రెసు’లో చేరినాడు. స్వామీ రామానందతీర్థ నాయకత్వంలో, జమాలాపురం కేశవరావు, కొండా వెంకటరంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు మొదలగువారితో కలసి, స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు దాశరథి.
1947 ఆగస్టు 15నాడు భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. కాని నిజాము మాత్రం, భారత యూనియన్‍లో చేరక, తాను స్వతంత్రుడనని ప్రకటించుకొన్నాడు. అంతేకాదు ‘‘భారత పతాకం హైదరాబాద్‍ సంస్థానంలో ఎగురువేయడం నేరం’’ అని ప్రకటించినాడు. మరోవైపు రజాకార్లు, నిజాం అండదండలతో దుశ్చర్యలకూ హింసాకాండకు పాల్పడ్డాడు. దానితో దాశరథి గుండె ప్రజ్వరిల్లింది. అజ్ఞాతవాసంలో మారువేషంలో ఉన్న, దాశరథి బాహాటంగా బయటకు వచ్చి నిజాం నిరంకుశత్వాన్ని నిరసించినాడు.


‘‘నిజాం రాజు జన్మజన్మల బూజు’’ అంటూ, ఉద్యమ కవితావేశమూర్తియై, దాశరథి సత్యాగ్రహానికి తలపడ్డాడు. అప్పటిదాకా పొంచి ఉన్న పోలీసులు ‘గార్ల’ గ్రామంలో, దాశరథిని అరెస్టు చేసి, ఉద్యమ రహస్యాలను చెప్పమని ‘ఠాణా’లో నిలబెట్టి కొరడాలతో కొట్టినారు. నిజాం ప్రభుత్వం దాశరథికి 16 నెలల కఠినకారాగార శిక్షను విధించింది. కొన్ని నెలలు వరంగల్‍ జైల్లో ఉంచి, తరువాత దాశరథిని నిజామాబాద్‍ సెంట్రల్‍ జైలుకు పంపింది నిజాం ప్రభుత్వం. నిజామాబాద్‍ జైల్లో దాశరథి ముఖం కడుక్కునే బొగ్గుతో జైలు గోడ మీద
‘‘ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన
రాజుకు మాకెన్నటేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ
కోటి రత్నాల వీణ’’
అని రాస్తే జైలు అధికారులు తుడిచివేసినారు. అపుడు అదే జైల్లో ఉన్న త్యాగమూర్తి శ్రీవట్టికోట ఆళ్వారుస్వామిగారు, ఆ పద్యాన్ని మళ్లీమళ్లీ గోడమీద రాసేవారు.


నిజామాబాద్‍ జైల్లో, సున్నం, సిమెంటు కలిపిన, వడ్ల గింజలున్న అన్నం, రొట్టెలనూ, భోజనం చేసిన ఫలితంగా దాశరథి ఆరోగ్యం చెడిపోయింది. 1948 జనవరి 11 నాటి రాత్రి నిజామాబాద్‍ జైలు ఖైదీలపై రజాకార్లు దాడి జరిపిన దుస్సంఘటన ఫలితంగా, దాశరథి తల పగిలింది ఎడమ భుజం ఎముక విరిగింది. చికిత్స కోసం దాశరథిని హైదరాబాద్‍ చంచల్‍గూడ సెంట్రల్‍ జైలుకు మార్చింది ప్రభుత్వం. జైల్లో దాశరథి స్వామి రామానందతీర్థను దర్శించుకొన్నాడు. స్వామీజీ దాశరథి సాహసాన్ని ప్రశంసించినారు.
‘అగ్నిధార’ మొదలు ‘నేత్రపర్వం’ దాకా ముప్పైకిపైగా, గ్రంథాలు రచించినారు దాశరథి. 200కు పైగా చలన చిత్రగీతాలు రాసినాడు దాశరథిని గూర్చి అనేక విశ్వ విద్యాలయాల్లో పరిశోధనలు జరిగినవి. ఆతని రచనలు అనేక భాషలలోనికి అనువాదితమైనాయి. తెలుగులో గజల్‍ రుబాయీ పక్రియలను, పప్రథమంగా ప్రవేశపెట్టిన ప్రయోక్త దాశరథి మహాకవే.


‘జాతీయోద్యమ రథసారథిగా’ భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా తామ్రపత్ర సన్మానాన్నీ, అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ ఆర్‍. వెంకట్రామన్‍గారి చేతుల మీదుగా సన్మానాన్ని అందుకొన్నాడు దాశరథి. ‘కళాప్రపూర్ణ’, ‘డి.లిట్‍’ వంటి గౌరవ పట్టాలతో వివిధ విశ్వవిద్యాలయాలు దాశరథిని సన్మానించినవి. అమెరికా తెలుగు వాళ్లు ‘ఆంధ్ర కవితాసారథి’గా సన్మానించారు. ‘ఒంగోలు ‘గండపెండేరం’ తొడిగి సన్మానించింది. వరంగల్‍ దాశరథికి స్వర్ణోత్సవం చేసింది. ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం 1977లో ఆస్థానకవిగా నియమించి సన్మానించింది. అనేక దేశాలలో పర్యటించి, దాశరథి తెలుగుభాషా సాహిత్య సంస్కృతులను గూర్చి ప్రసంగించినాడు.


1983లో అప్పటి ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం, ఆస్థానకవి పదవిని రద్దు చేయడంతో దాశరథి కలతపడ్డాడు. ఆ కలత అనారోగ్యానికి దారి తీసింది. 1987 నవంబరు 5వ తేదీనాడు ఉదయం 11 గం.లకు శాశ్వతంగా కన్నుమూసినాడు. దాశరథి.
బ్రతికినంతకాలం అవిశ్రాంతంగా తిమిరంతో సమరం జరిపిన, దాశరథి హఠాన్మరణానికి సాహిత్యలోకం స్వాతంత్య్ర సమరయోధుల సంఘం కన్నీరుమున్నీరుగా విలపించి నివాళులర్పించింది. (తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)

  • డా. తిరుమల శ్రీనివాసాచార్య

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *