సంవేదన అ సంభాషణ అ సంయనమనం అ సమన్వయం పన్నెండు వసంతాల దక్కన్‍ల్యాండ్‍

కాలానికి ఒక విలువను ఆపాదించేది సందర్భం. భిన్న భిన్న సందర్భాలను కాలమూ, సమాజమూ ఎప్పటికప్పుడు అనుభవిస్తూ, అధిగమిస్తూ ముందుకు సాగుతాయి. ఈ ప్రయాణంలోని సంక్లిష్టతలను అర్థం చేసుకుంటూ నిర్మాణాత్మక ఆలోచనలనూ, ఆచరణలనూ ప్రోది చేసే వివిధ రంగాలలో పత్రికారంగం అత్యంత కీలకమైనది. గత పన్నేండ్లుగా దక్కన్‍ల్యాండ్‍ మాస పత్రిక ఈ బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తున్నది.


తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన ఆవశ్యకతను చర్చించే వేదికగా, ప్రజాస్వామ్య భావజాల వేదికగా, సమస్త ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణ వేదికగా 2012 సెప్టెంబర్‍లో ప్రారంభమైన పత్రిక దక్కన్‍ల్యాండ్‍.


ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను, వివక్షలను అంశాలవారీగా, రంగాల వారీగా విశ్లేషిస్తూ వ్యాసాలను ప్రచురించింది. రాష్ట్ర సాధనకోసం వివిధ ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాలకు, పోరాటాలకు వెన్ను దన్నుగా నిలబడింది. చరిత్ర పట్టించుకోని తెలంగాణా ప్రాంత ఔన్నత్యాలను, సాహితీ సాంస్కృతిక విశేషాలను, వృత్తి కులాల జీవన వ్యధలను, జానపద కళారూపాల విశిష్టతలను, ఆదివాసీ ప్రజల సాంస్కృతిక, వారసత్వ జీవన విధానాలను తెలంగాణ ప్రజలకే కాక యావత్‍ ప్రపంచానికి తెలియజేసింది. ప్రతి ప్రాంతానికీ, ప్రతి ప్రజా సమూహానికీ తమదంటూ ఒక జీవన విధానం, ఒక సంస్కృతీ వుంటాయనే ఎరుకను కలిగించింది. ఉద్యమకాలంలో అవసరమైన పరస్పర సహకారం, ఐక్యత అవసరాలకు పెద్దపీట వేసింది. ఉద్యమ నిర్వహణలో చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటూ అందరినీ కూడగట్టింది.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నూతన పరిస్థితులను ఆకలింపు చేసుకోవడంలోనూ, ఎదుర్కోవడంలోనూ ఎదురయ్యే బలహీనతలనూ, లోపాలను గుర్తిస్తూనే అంతకు మించి సుస్థిర తెలంగాణ స్థాపనకు జరుగుతున్న కృషికి ఊతమిస్తూ దానిని ప్రజల ముందుకు తీసుకెళ్లడం అనే బాధ్యతను దక్కన్‍ల్యాండ్‍ నిర్వహించింది. జలవనరుల వినియోగం, రవాణావ్యవస్థ, పారిశ్రామిక, సమగ్ర పట్టణ ప్రణాళికలు, మూసీనది సుందరీకరణ, పర్యావరణ, వారసత్వ సంపదల పరిరక్షణ వంటి ప్రజోపయోగ అంశాలపై వివిధ రంగాల నిపుణులతో చర్చించి, ప్రభుత్వ అధికారులకు తగు సూచనలు చేసింది. ప్రజాస్వామ్యం పట్ల సంపూర్ణ విశ్వాసమున్న దక్కన్‍ల్యాండ్‍ ఫెడరల్‍ వ్యవస్థ రక్షణ, రాజ్యాంగ రక్షణలపట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూనే వుంది.
మేధావులకు, పర్యావరణ, సాంకేతిక శాస్త్ర విశ్లేషకులకు, పురావస్తు శాసనాల పరిశోధకులకు, సోషల్‍ ఇంజనీరింగ్‍పై సామాజిక శాస్త్రవేత్తలకు, పారిశ్రామిక, వ్యవసాయ రంగ, జీవావరణ శాస్త్రజ్ఞులకు, సాహితీ సాంస్కృతిక కళాకారులకు, పరిశోధక విద్యార్థులకు, బాలసాహితీవేత్తలకు ఒక్క మాటలో చెప్పాలంటే మానవ సంబంధిత ప్రతి అంశానికీ వేదికగా నిలిచింది. మున్ముందూ నిలుస్తుంది.


పన్నేండ్లు పూర్తి చేసుకున్న ఈ శుభసందర్భంలో పత్రికకు సహకరిస్తున్న రచయితలకీ, పాఠకులకీ, పత్రిక శ్రేయోభిలాషులకీ శుభాకాంక్షలు… ధన్యవాదాలు!!

(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *