పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.
పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.
బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు - 2023 నిర్వహించింది. తక్కువ సమయంలోనే, వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 51 కథలు వచ్చాయి. కథలన్నీ చాలా బావున్నాయి. బాల సాహిత్య నిపుణులు ఈ కథలను చదివి, చర్చించి ప్రచురణకు 24 కథలు ఎంపిక చేశారు. ఈ కథల పోటీలు నిర్వహించి మరియు పుస్తక రూపాన్నిచ్చింది బాలచెలిమి. - వేదకుమార్ మణికొండ
అనగనగా సంకెళ్లపల్లి గ్రామంలో రామయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళది చాలా పేద కుటుంబం. తినడానికి కూడా అన్నం ఉండేది కాదు రామయ్య ఎప్పుడూ అడవిలోకి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్మేవాడు. ఒక రోజు ఇంట్లో సీతమ్మ రామయ్యతో ఇలా అన్నది. ‘‘ఎప్పుడూ అడవిలోకి వెళ్లి కట్టెలు తెచ్చే బదులు చెట్లను నరుకుతూ వ్యాపారం చేయి’’ అని సలహా ఇచ్చింది.
రామయ్య వెంటనే మొదటిగా రెండు మూడు చెట్లను నరుకుతూ వ్యాపారం చేసాడు. లాభం ఎక్కువగా రావడంతో రామయ్య మరిన్ని చెట్లను నరుకుతూ, ఊరి వాళ్ళని కూలీలను తెచ్చుకొని చెట్లను నరుకుతూ లారీలకు లారీలు నింపుతూ అమ్మేవాడు. రామయ్య కొన్ని రోజుల్లోనే ధనికుడిగా మారిపోయాడు. ఒక రోజు రామయ్య కూలీలను తీసుకొని రావడానికి ఊరిలోకి వెళ్తాడు. కూలీలను రమ్మంటే మేము రామంటారు. మీరు మాకు చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు. అందుకే రాలేమన్నారు. కట్టెలు తీసుకెళ్లడానికి లారీ వస్తుంది. కానీ కూలీలు రాకపోయే సరికి రామయ్య సీతమ్మలు లారీ నింపడానికి అడవికి వెళ్తారు.
రామయ్య చెట్లను నరుకుతాడు. సీతమ్మ లారీలలో కట్టెలను వేస్తుంది. రామయ్య చెట్లను కోసేటప్పుడు చెట్టు కొమ్మ వచ్చి రామయ్య మీద పడుతుంది. రామయ్యకు కాలు, చేయి విరుగుతాయి. ఇంకా చాలా గాయాలు అవుతాయి. రామయ్యను సీతమ్మ ఇంట్లో ఉన్న డబ్బులతో ఆసుపత్రికి తీసుకెళ్తుంది. డాక్టర్ చూసి అతని కాలుకు చేతుకు కట్టు కడతాడు. రామయ్య మంచంకే పరిమితం అవుతాడు. సీతమ్మ అన్ని అమ్ముకుంటూ అతనిని బాగు చేయించుకుంటుంది. రామయ్య మళ్ళీ పేదవాడిగా మారుతాడు.
చెట్లు మనకు గాలిని ఇస్తు, ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కానీ నేను చేసింది చాలా పెద్ద తప్పు అని తెలుసుకున్నాడు. చెట్లను నరకవద్దని నిర్ణయించుకొని రామయ్య సీతమ్మలు ప్రభుత్వం వారు ఇచ్చే ఆర్థిక సహాయంతో గేదెలను కొనుక్కొని పాల వ్యాపారం చేస్తూ కుటుంబం గడుపుతున్నారు. ఈ వ్యాపారం అనతి కాలంలోనే ‘‘మూడు పువ్వులు ఆరు కాయలుగా’’ వర్ధిల్లింది. దంపతులిద్దరూ సంతోషంగా ఉన్నారు.
కె. ప్రసన్న,
10వ తరగతి, జెడ్పీ స్కూల్, రాయిలాపూర్,
రామాయంపేట, మెదక్ జిల్లా.
ఫోన్ : 944176210