12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దక్కన్ల్యాండ్
‘‘దక్కన్ల్యాండ్’’ మాసపత్రిక పది సంవత్సరాల సందర్భంగా ప్రముఖలు అభిప్రాయలు తెలిపారు.
2024 ఆగస్టు మాసంతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
మరికొందరి అభిప్రాయాలు ప్రచురించగలమని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం.
విశ్లేషణాత్మక దక్కన్ ల్యాండ్
పది వసంతాలు నింపుకొని నూట ఇరవై ఐదు సంచికల్ని ప్రచురించి లోతైన విశ్లేషనలను అందించిన సామాజిక, రాజకీయ మాసపత్రిక దక్కన్ల్యాండ్ తెలంగాణ మీడియా రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంది. అందుకు పత్రికా సంపాదకుడు శ్రీ యం. వేదకుమార్ అభినందనీయుడు. నాకు తెల్సినంత వరకు ఇటీవల కాలంలో సమగ్రంగా పలు అంశాలను ఒక మీడియా వేదిక మీదకు తీసుకువచ్చి నిరంతరాయంగా కొనసాగిన మాసపత్రిక దక్కన్ల్యాండ్ అయితే ఈ పత్రికకు సంబంధించినంత వరకు రెండు అంశాలు నాకు నచ్చాయి. ఒకటి వర్తమానానికి సంబంధించిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక అంశాల్ని సమన్వయం చేసి వివరణాత్మకంగా పాఠకులకు అందిం చడం… రెండవది వర్తమానంతో పాటు చరిత్ర, సాంస్కృతిక అంశాలకు సంబంధించి సమతుల్యాన్ని పాటించడం, వాస్తవానికి సామాజిక, రాజకీయ అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపే పత్రికల కంటే దక్కన్ ల్యాండ్ భిన్నంగా ఉంది. నేను దక్కన్ల్యాండ్ కంటెంట్/ విషయ సూచికను పరిశీలించి నప్పుడు ఒకింత ఆశ్చర్యానికి గురైనాను. ఎందుకంటే విభిన్న అంశాల్ని ఒక చోట చేర్చి అర్థవంతమైన విషయ పరిజ్ఞానాన్ని పాఠకులకు అందించడం అంత సులభమైన పనికాదు.
నేను దాదాపుగా గత దశాబ్ద కాలం పైగా దక్కన్ల్యాండ్ చదువుతున్నాను. నా కిష్టమైన తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక అంశాల్ని గురించి అనేక కొత్త విషయాలను నేర్చుకొన్నాను. ముఖ్యంగా ప్రముఖ చరిత్రకారుల విశ్లేషణలు అనేక నూతన కోణాల్ని ఆవిష్కరించాయి. ప్రతినెల నాకు ఆతృతగా ఎదురుచూసే స్థానిక చారిత్రక అంశాల గురించి తెలుసుకొని సంతోషపడతాను. దక్కన్ల్యాండ్ పత్రిక తెలంగాణ సమాజానికి అందించే నూతన జ్ఞానంలో యిది ఒక ముఖ్య అంశం. ఆంధ్ర పాలకుల వలసాధిపత్యంలో తెలంగాణ తన చరిత్రను దాదాపుగా మరిచిపోయింది, వివక్షకు గురైంది. తెలంగాణ సోయి పెరిగిన తర్వాతనే ఈ ప్రాంతం తన అస్థిత్వ మూలాలను వెతుక్కొవడం ప్రారంభించింది. తత్ఫలితంగా ఉద్యమకారులు యింత వరకు కనిపించకుండా పోయిన, మసగబారిన చరిత్రను కొంత మేరకైనా తవ్వి తీసినారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ చరిత్ర పై పరిశోధనలు బాగా పెరిగినాయి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే దక్కన్ల్యాండ్ తెలంగాణ చరిత్ర, సంస్కృతి విశ్లేషణనకు ఎంతగానో తోడ్పడుతుంది.
నేటి పరిస్థితుల్లో తెలంగాణ పేరు మీద అనేక గ్రూపులు, సమూహాలు ముందుకువస్తున్నాయి. కొన్నిసార్లు చరిత్రను చిరకాలంగా పాత అంశాలనే తిరగరాస్తు క్రెడిట్ తీసుకుంటున్నారు. అట్లాంటి ధోరణులకు భిన్నంగా దక్కన్ల్యాండ్ స్థానిక, ప్రాంతాల చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అనేక కొత్త పరిశోధనలకు సముచిత స్థానాలన్ని కల్పిస్తుంది ఇది ఆహ్వానించదగిన పరిణామం. తెలంగాణ ప్రత్యేకతను చాటే అనేక అంశాలు అంటే ఆదివాసీలు జీవన విధానం, ఉత్సవాలు, పండుగలు, వేడుకలకు సంబంధించిన అనేక విశ్లేషణలు, వ్యాసాలు దక్కన్ల్యాండ్లో ప్రచురిత మవుతున్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ అస్థిత్వాన్ని, ఉనికిని ప్రతిబింబించే అనేక అంశాలకు ఈ పత్రిక ప్రముఖ వేదికగా రూపాంతరం చెందింది. తెలంగాణపై వివక్ష, పక్షపాత ధోరణి అంతర్గత వలసవాదం ప్రభావం తదితర అంశాలకు సంబంధించిన విశ్లేషణలు తెలంగాణ పౌర సమాజనికి, మేథో వికాసానికి ఎంతగానో తోడ్పడినాయి అనేది వాస్తవం. మొత్తంగా దక్కన్ల్యాండ్ పత్రిక తెలంగాణ ఆకాంక్షల్ని వారసత్వాన్ని ప్రస్ఫుటంగా ముందుకు తెచ్చింది.
ఏదైనా ఒక పత్రిక తన మనుగడను సాగించి, ముందుకు పోవాలంటే సంపాదక వర్గం నిర్థిష్ట లక్ష్యాలను, అజెండాను కలిగిఉండాలి. ఈ విషయంలో శ్రీ యం. వేదకుమార్ స్వతహాగా తెలంగాణ ఉద్యమకారుడు, ప్రాంతీయ అభిమాని, పర్యావరణం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన వాడుగా ముందుండి పత్రికను నిబద్ధతతో నడిపిస్తున్నాడు. ఒంటిచేతితో నిర్వహణ బాధ్యతను మోస్తూ, అభిమానుల సహాయ సహకారాల్ని తీసుకుంటు ప్రతికను ముందుకు నడిపిస్తున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రచురణరంగంలో ఆయనకున్న అనుభవం కూడా తోడ్పడింది. అకడెమిక్ ప్రచురణలో నాకున్న కొద్ది అనుభవంతో చూస్తే వేదకుమార్గారి నిర్వహణ సామర్థ్యం మెచ్చుకోతగింది. అందువల్లనే దక్కన్ల్యాండ్ ఏవిధమైన ఆటంకాలు లేకుండా నిరంతరంగా ప్రతినెల పాఠకుల చేతిలో ఉంటుంది.
తెలంగాణ అస్థిత్వ ఆకాంక్షలకు ప్రతీకగా, విస్త•తస్థాయిలో ప్రజాభిప్రాయ వేదికగా వెలువడుతున్న దక్కన్ల్యాండ్ పత్రిక వేదకుమార్గారి నాయకత్వంలో అజేయంగా నిలవాలని ఆక్షాంక్షిస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
- ఆచార్య అడపా సత్యనారాయణ
ఎ : 947340555