ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ జర్నలిస్టు అమీర్ అలీఖాన్ ఆగస్టు 16న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్‍లో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇరువురితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలకు అభినందనలు తెలియజేశారు. అసెంబ్లీ కార్యదర్శి వారికి రూల్ బుక్ అందజేశారు.
తెలంగాణ సకల జన సేనాని ‘ప్రొఫెసర్ కోదండరాం’
కోదండరామ్ అసలు పేరు ముద్దసాని కోదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్ కోదండరాంగా సుపరిచితుడు. విద్య అంతా వరంగల్‍లోనే జరిగింది. వరంగల్‍లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తవగానే రాజనీతి శాస్త్రంలో పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదులో చేరాడు. ఆయన ఒక విద్యావేత్త, ఆచార్యులు, రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. 2004లో తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసాడు. దీనికి ఆయన అధ్యక్షునిగా వ్యవహరించాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 2009 డిసెంబరు 24న తెలంగాణ రాజకియ జాయింట్ యాక్షన్ కమిటీ (TJAC) కన్వీనర్ గా చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, తెలంగాణ కొత్త రాష్ట్రము ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర సమితితో విభేదించి కొత్తగా తెలంగాణ జన సమితి పేరుతో ప్రాంతీయ పార్టీని 2018 మార్చి 31న ప్రారంభించాడు.
ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన ఆచార్య కోదండరామ్.. తనకు కేటాయించిన సెక్యూరిటీని నిరాకరిచారు. తాను ప్రజల మనిషినని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది అవసరం లేదని స్పష్టం చేశారు. సెక్యూరిటీ వల్ల ప్రజలతో సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా తనకు తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు. భద్రతా సిబ్బంది ఉంటే ప్రజలు తన వద్దకు రాకుండా నిలువరించే ప్రమాదం లేకపోలేదన్నారు.
పత్రికా సంపాదకులు అమీర్ అలీఖాన్
‘సియాసత్’ దినపత్రిక ఎడిటర్‍గా, ఉర్దూ జర్నలిజంలో సామాజిక కార్యకర్తగా అమీర్ అలీఖాన్ చేసిన కృషిని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. అతని తండ్రి జహీద్ అలీ ఖాన్ కూడా సామాజిక సేవలకు ప్రసిద్ధి చెందారు.
- దక్కన్‍న్యూస్, ఎ : 9030 6262 88