యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గ్రామం గొలనుకొండ. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిమీద 70కి.మీ.ల దూరంలో వున్న ఆలేరుకు, 16కి.మీ.ల దూరంలో వుంటుంది గొలనుకొండ. హైదరాబాదుకు 86కి.మీ.ల దూరం. ప్రసిద్ధ రామాలయం, లేడిబండలున్న జీడికల్ సమీప గ్రామం గొలనుకొండ.
గొలనుకొండకు కొండగుర్తు గొలనుకొండ గుట్ట. గొలనుకొండలో వున్న ఈ అండాకారపు గుట్ట చాలా ఎత్తుగా వుంటుంది. చూపరులకు లింగంగా అగుపిస్తుంది. దీనికి దక్షిణాన ఒకప్పుడు చాలా పెద్ద మెట్లకోనేరు వుండేదట. ఆ కోనేరు పేరుమీదుగానే గ్రామానికి కొలనుకొండ అనే పేరొచ్చిందని గ్రామస్తులంటుంటారు. ఇపుడు దాని ఆనవాలుగా గుట్టకానుకుని ఒక రాతిద్వారం మిగిలివుంది.
పాతవూరు పాటిగడ్డ వూరికి పడమట దండకుంటకు ఎదురుగా వుంది. అక్కడ కొంతకాలం కిందటిదాక 4పెంకుటిండ్లు వుండేవట. ఈ దండకుంటకు దక్షిణపు అంచున వున్న రెండు నిలువుల బండరాయిమీద చెక్కిన రాతలున్న దీన్ని ‘లెక్కలగుండు’ అని గ్రామస్తులు పిలుస్తారు. ఈ గుండును గతంలో చరిత్ర కారులు పివి పరబ్రహ్మశాస్త్రిగారు, విరువంటి గోపాలకృష్ణగారు, శ్రీరామోజు హరగోపాల్ చరిత్రబృందంతో కలిసి చూడడం జరిగింది. పరబ్రహ్మశాస్త్రి లెక్కలగుండు మీది రాతలను గ్రామంలోని భూమి కొలతలలెక్కలు కావచ్చన్నారు. కాని, ఆ రాతలను అచ్చుతీయలేదు. ఇప్పుడేమో వాటిని అచ్చుతీయడానికి వీల్లేకుండా దండకుంటకు పోసిన కొత్తమట్టికట్ట లెక్కలగుండును ముంచేసింది.
గొలనుకొండగుట్టకు పడమటివైపున గుహాలయం వుంది. దీన్లో శంభులింగేశ్వరస్వామిగా స్థానికులు పిలుచుకునే శివాలయం వుంది. నిజానికి ఈ దేవాలయం రామలింగేశ్వరాలయం. విష్ణుకుండినులు నిర్మించిన శివాలయాలన్నీ రామలింగేశ్వ రాలయాలే. ఉత్తరంవైపు ఎత్తు తక్కువున్న గుహలో ప్రతిష్టించబడిన 1అడుగు కైవారమున్న శివలింగం, మీటరున్నర పొడువున్న చతురస్రాకారపు పానవట్టం వున్నాయి. అంతరాళంవలె వున్న గుడిముందర భాగంలో చిన్న దీపస్తంభం వుంది. గుహలో రెండవ వైపు దక్షిణంగా (ఆ రెంటిమధ్యన గోడలేవీ లేవు.) రాతి గోడలోనే తొలిచిన ఎత్తైన గద్దెమీద ఎడమవైపు నుంచి వరుసగా నంది, అర్ధనారీశ్వరుడు, గణపతుల అర్ధశిల్పాలున్నాయి. అర్ధనారీశ్వర శిల్పం ఈ ప్రాంతంలో మరెక్కడా లేదు. లలితాసనంలో కూర్చున్న ఈశ్వరీ, ఈశ్వరుల అర్ధనారీశ్వర శిల్పంలో గొప్పశిల్పకళ ఉట్టిపడుతున్నది. శివుని అర్ధభాగం కిరీటం, జటలు, చెవికి కుండలం, సగం మీసం, కుడివెనక చేతిలో త్రిశూలంతో, కుడి ముందరచేయి అభయహస్తంగా, నిలిపివుంచిన కుడికాలుకు కడియం, నడుముపై కటివస్త్రంతో కనిపిస్తుంది. ఈశ్వరి అర్ధభాగం కిరీటం, సిగ, చెవికి కర్ణాభరణాలు, మెడలో కంఠహారం, ఎడమ వెనక(శివుని) చేతిలో జింక, ఎడమ ముందరి(పార్వతి) చేయి ఎడమ మోకాలిమీద ఆన్చివుంది. ఎడమరొమ్ము, ఎడమచేతికి గాజులు, కంకణం, హస్తాభరణాలు, మడిచిన ఎడమకాలు, కాలికి కడియం, పాంజీబు, ఎడమవైపున చీరెవున్నాయి. అర్ధనారీశ్వరుని మెడలో కపాలమాల వుంది. దేవతాధిష్టానపీఠంపై మూడు సింహాలున్నాయి. ఈ అధిష్టానపీఠం జైన మహావీరుని అధిష్టానపీఠాన్ని పోలివుంది. ఇది కాపాలికులు లేదా పాశుపతులు జైనం మీద తమ ప్రాభవాన్ని తెలిపే గుర్తుగా చెక్కారా లేక అర్థనారీశ్వరుని శిల్పలక్షణ (iconography)మా? అనేది సందేహం. అంబ లేదా దుర్గ వాహనం సింహం. సింహం జైనతీర్థంకరులలో మహావీరునికి కూడా వాహనం. ఇక్కడ 3సింహాలు జైనశైలిలో అధిష్టానపీఠంపై చెక్కివుండడం ఆలోచనీయం.
అర్థనారీశ్వరునికి ఎడమపక్కన గణపతి శిల్పం కూడా అందంగా అర్ధనారీశ్వరునికి సమానమైన ఎత్తులో చెక్కివుంది. శిల్పశైలి సమానం. కరండమకుటం, చేటచెవులు, ఎడమచేతిలోని ఉండ్రాయి తీసుకుంటున్న ఎడమవైపుకు తిరిగిన తొండం, కుడి ముందరచేతిలో ఉండ్రాయి, కుడివెనకచేతిలో గొడ్డలి, ఎడమ వెనకచేతిలో పాశం, వక్షంపై జంధ్యం, పొట్టమీద నాగబంధం, లలితాసనంలో కూర్చుని వున్నాడు వినాయకుడు. ఈ శిల్పాల తలలపైన జోడులింగాలు, ఏకలింగం స్వయంభువు లింగాలరీతిలో కొండరాతిమీద చెక్కివున్నాయి. అటువంటివే గుడివెనక గుహలో కూడా కనిపించాయి.
గణపతికి కిందుగా దక్షిణపు రాతిగోడకు భూమట్టానికి సమాంతరంగా చెక్కిన సప్తమాతృకలు చెక్కబడివున్నారు. వీరి కిరీటాలు స్తూపాకారంలో వున్నాయి. అందరు చతుర్భుజులే. మాతృకలందరు వీరాసనంలో కూర్చొని వున్నారు. వాహనాలు స్పష్టంగా కనిపించడంలేదు.
అర్ధనారీశ్వరశిల్పానికి కుడిపక్కను నందికి అవతల రాతిగద్దెమీద నిలబెట్టివుంచిన ఒక వీరగల్లు వుంది. దానికి కుడిపక్కన అందమైన సూర్యవిగ్రహం వుంది. ఎరుపురంగు ఇసికరాతిలో చెక్కివున్న ఈ శిల్పం ఈ ప్రాంతంలో అరుదైనదే.
ఈ గుడికి ముందర ముఖమంటపాన్ని తర్వాతి కాలంలో నిర్మించినట్టుగా వుంది. అందులో ఒక ఉపాలయం వుంది. అందులో త్రిభుజాకార మణికిరీటంతో ధ్యానాసనంలో కనిపిస్తున్న చిన్నశిల్పాన్ని ముచికుంద మహాముని విగ్రహ మంటున్నారు.
శివాలయానికి ఉత్తరాన శిథిలదేవాలయం వుంది. దానిలో గరుడవాహన శిల్పమున్న దేవతాధిష్టానపీఠం వుంది. దానిపై వుండాల్సిన గోపాలస్వామి విగ్రహం గుడిపక్కన తలలేకుండా నిలబెట్టివుంది. అందమైన నల్లనిరాతిలో చెక్కిన శిల్పంలో గోపాలునికిరు వైపుల చామరధారిణులు, గోవులు చెక్కబడ్డారు. తలవరకే వున్న ఈ శిల్పానికి తల, చేతులు విరగ్గొట్టబడివున్నాయి. గుడిపక్కన గుండుమీద 3వరుసల్లో ఒక శాసనం వుంది. ఈ శాసనంలో 19వ శతాబ్దపు తెలుగులిపిలో, తెలుగుభాషలో ‘పరీధావి సంవత్సర శ్రావణ శుద్ధ విదియ బుధవారం నాడు పోగరి గోపరాజు వారి జక్కరాజు గోపాలక•ష్ణునికి గుడి కట్టించెను’ అని ఉన్నది. పొగరి అనే మాట శివాలయం నేలకు పరిచిన బండల మీద కూడా కనిపిస్తున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం పొగరి వంశస్తులు గొలనుకొండలో ఉండేవారని, వారు భూస్వాములని, నిజాం పాలనలో అధికారులని తెలుస్తున్నది.(కొత్త తెలంగాణా శాసనాలు-2024, శాసనం సంఖ్య:83, పే.సం.233)
ఇక్కడి కొంచెం ఎత్తులో కొండరాతిగోడకు చెక్కిన పన్నిద్దరాళ్వారుల అర్ధశిల్పాలున్నాయి. వాటిమీద శిథిలాక్షరాలలో రెండుపంక్తుల శాసనముంది. కాని, కొన్ని పొడి,పొడి అక్షరాలే తప్ప అర్థమిచ్చే పదాలు అగుపించడం లేదు. అక్కడికి తూర్పుగా కొండపైకి వెళ్ళే చోట గోపాలస్వామి సన్నిధి వుంది. అక్కడ పూర్వం ఒక వైష్ణవాచార్యుడు తపస్సు చేసేవాడని ప్రజలు చెప్పుకుంటారు.
శంభులింగేశ్వరుని గుడిలో శివలింగం వెనకవైపు రాతిగోడలేదు. కాని, విష్ణుకుండినులనాటి పొడవైన ఇటుకలతో, డంగుసున్నంతో కట్టబడిన గోడవుంది. గుడివెనకవైపు సొరంగ మార్గం, గుహ వున్నాయి. ఆ గుహలో ఒకరాతిగుండుమీద చెక్కిన 5 శివలింగాలున్నాయి. వాటిలో దక్షిణంవైపున్న శివలింగం సోమసూత్రం (అభిషేకజలం వెళ్ళే పానవట్టం కాలువ) దక్షిణం దిక్కు వుంది. మిగిలిన 4లింగాల సోమసూత్రాలు తూర్పు దిక్కుకు వున్నాయి. వాటివెనక వున్న గుహలో పదులకొద్ది ఎర్రనిరంగులో టెర్రకోట మట్టిపూసలు గ్రామస్తులకు దొరికాయి. పూసలు, ఇటుకలు 2వేల సం.రాల నాటివి. అంటే ఇక్కడ సాతవాహనుల కాలంనాటి నివాసాలుండేవని అర్థమవుతున్నది. ఆ గుహలోనుంచి దక్షిణంవైపు దూరివెళ్ళేవిధంగా రాతిసొరికె వుంది. దానిలోపల విశాలమైన గుహవుందని చెప్తారు. అన్వేషించాల్సిన స్థలం.
గొలనుకొండలో గుడి ముందర మూతి విరిగిపోయిన నందిశిల్పం. అది శైలిలో విష్ణు కుండినుల కాలానికి చెందినది. మెడలో తాడు, మూపున పెద్దమువ్వల పట్టెడ, కొమ్ములకు పట్టితో కనపడుతున్నది. గుడిముందర పదిదాకా నాగశిల్పాలున్నాయి. అందులో ఒకటి సున్నపురాతిలో చెక్కిన నాగశిల్పం 1,2 శతాబ్దాల నాటిది. గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర అడుగు ఎత్తున్న ముదురాకు పచ్చరంగు రాతిలో చెక్కిన చతుర్భుజ కపాలభైరవుని విగ్రహం వుంది.
డంగుసున్నం, మూరెడుపొడవున్న ఇటుకలతో కట్టిన గుడివెనక గోడ విష్ణుకుండినుల (క్రీ.శ.4 నుంచి 6వ శతాబ్దాలు) కాలానికి చెందినవని చెప్పడానికి తిరుగులేని గుర్తులు. శివలింగం, దానిపానవట్టం అసాధారణంగా వున్నాయి. ఆ పెద్దదైన చతురస్రాకారపు పానవట్టం, పెద్ద శివలింగం విష్ణుకుండినుల కాలానికి చెందినవే. గొలనుకొండకు పడమటినుండి దక్షిణంగా ప్రవహించే ఆలేటివాగు (భిక్కేరు) పారుతున్నది.
జీడికల్ తొవ్వకు తీరుపల్లివారి బాయిదగ్గర పాటిగడ్డ ఉన్న జాడలున్నాయి. అక్కడ జీర్ణోద్ధారరేఖ (బ్రహ్మసూత్రం)తో రెండడుగుల ఎత్తైన శివలింగం ఉంది. అక్కడొక శివాలయం ఉండి వుండాలి. ఊరిబయట జీడికల్ రోడ్డును కలిసే తారురోడ్డుకు పక్కన అమ్మదేవతల విగ్రహాలు, గుడులజాడలు అగుపిస్తున్నాయి. ఈ అమ్మదేవతలలో రాష్ట్రకూటుల శైలిలో చెక్కిన చాముండి శిల్పం వుంది. ఊరిబయట అనంతారం తొవ్వకు దగ్గరలో మారెమ్మ దుబ్బమీద ఎత్తైన రాతిస్తంభం వుంది. దాన్ని దీపస్తంభమని పిలుస్తారు గ్రామస్తులు.
గొలనుకొండ గ్రామం పురాతనకాలం నుండి మానవా వాసంగా వుందని చెప్పడానికి ఈ గ్రామానికి పడమటవున్న దండకుంటకు కొంచెం దూరంగా రాకాసుల బండలు అని స్థానికులు పిలుచుకునే పెదరాతియుగంనాటి సిస్టుసమాధు లున్నాయి. అట్లే వూరికి తూర్పున అనంతారం తొవ్వలో దారికటు, ఇటు చెలకల్లో సిస్టు (పెట్టె)సమాధుల ఆనవాళ్ళుగా రాతిసలపలు, రాతిగుండ్లు కనిపిస్తున్నాయి. గతంలో ఈ సమాధుల్లో ఒక సమాధిని తవ్వినపుడు అందులో నుండి కుండలు, ఇనుప పనిముట్లు దొరికాయని గ్రామస్తులు చెప్పారు. కొత్తరాతియుగానికి చెందిన రాతిగొడ్డండ్లు, బొరిగెలు, వడిసెలరాళ్ళు, రొట్టెలకోలలు వంటి రాతిపనిముట్లు కూడా అపుడపుడు దొరుకుతుంటాయి. 15యేండ్ల కింద (2003లో) విరువంటి గోపాలకృష్ణ గారితో, గ్రామస్తులతో కలిసి రచయిత గొలనుకొండ గుట్ట మీదికి వెళ్ళినపుడు పైన రాతిబండల నడుమ పడివున్న నల్లని కుండపెంకులు (NBP&W) దొరికాయి.
గొలనుకొండ నుంచి జీడికల్ పోయే దిక్కు వేయిస్తంభాలు అని పిలిచే జాగలో అడ్డం, నిలువు సమానదూరాల్లో పాతిన మూరెడెత్తు మిగిలిన రాతికంభాలున్నాయి. కొన్ని పడిపోయి వున్నాయి. కొన్నే నిలబడి వున్నాయి. ఇవి ఇట్లా పాతడానికి కారణమేమైవుంటుంది. ఇవి ముడుమాలలో నిలిపిన నిలువురాళ్ళ వలె ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘రాక్ ఎలైన్ మెంట్లా’? అనిపిస్తున్నాయి.
గొలనుకొండ ఊరిబయట పెద (ఆలేరు)వాగు ఒడ్డున రాతిగుండుకు చెక్కివున్న అమ్మదేవత విగ్రహాన్ని స్థానికులు ‘గంగమ్మ’ అని పూజిస్తుంటారు. ఏటి ఒడ్డున దేవతలను గంగమ్మలనడం ఆనవాయితీ. గొలనుకొండ దేవి ద్వాదశహస్త(12 చేతులు), జ్వాలాశిఖి, తాంత్రికుల శిల్పాలలో వుండే గోరక్షాసనంలో వుంది దేవత. అన్ని చేతులకన్నా ముందున్న కుడిచేతిలో ఖడ్గం, ఎడమచేతిలో రక్తపాత్రతో, చెవులకు పెద్దకుండలాలు, మెడలో కంఠహారం, చిన్న కిరీటంతో దేవత కనిపిస్తున్నది. ఆమె పాదాల కింద వున్న వాహనం ఏదో స్పష్టంగా కనిపించడం లేదు. ఇటువంటి శిల్పాలు చాలా అరుదు. మా చరిత్రబృందానికి ఒకటి రెడ్లవాడలో జ్వాలామాలిని రూపంలో, రెండు బొల్లికుంటలో కాళికాదేవి రూపంలో, మూడు ఏదులాబాదులో దేవీరూపంలో అగుపించాయి. అట్లే మూసీతీరంలో గంగమ్మల కొలువులెక్కువ. ముఖ్యంగా బెస్తవారీ దేవతను కొలుస్తుంటారు.
గొలనుకొండలో రామలింగేశ్వరాలయ నిర్మాణం చేసింది విష్ణుకుండినులే. విష్ణుకుండినులలో చివరి రాజులు పరమమాహే శ్వరులు, శైవంలో అతిశైవులు. 6,7వ శతాబ్దాలలో మాహేశ్వరులు, కాలాముఖులు, శాక్తేయులు, లకులీశులు కనిపిస్తారు. బౌద్ధంలో, జైనంలో, శైవంలో తాంత్రికవిద్యలు పెరుగుతున్న కాలమది. బౌద్ధంలో హారీతి, తారల పూజలతో వజ్రయానం తంత్రయానంగా పేరుపడ్డది. జైనంలో చక్రేశ్వరి, పద్మావతి, కూష్మాండిని యక్షిణుల ఆరాధనలు చోటుచేసుకున్నాయి. శైవంలో భైరవి, కాళీ, దుర్గలను ఉపాసించే శాక్తేయులు వచ్చారు. నదీతీరాల్లో, కొండగుహల్లో ఈ దేవతల శిల్పాలు బయట పడుతున్నాయి. గొలనుకొండ గంగమ్మ దేవత జ్వాలామాలిని ప్రతిమాలక్షణాలకు దగ్గరగా కనిపిస్తున్నది.
గొలనుకొండ గ్రామంలో రామచంద్రబండ మీద 6 అడుగుల ఎత్తున్న హనుమాండ్లు రెండుచేతులను జోడించి, ఎడమవైపు తిరిగి అంజలి ఘటించినట్లుగా, ఆ చేతులలో తామర పుష్పం పట్టుకుని వున్నాడు. ముడివేసిన సిగతో, తలపైనుంచి తిరిగిన వాలం చివర ముడితో, పార్శ్వముఖంతో, మెడలో హారాలతో, మొలకు గజ్జెల మొలతాడు, కుచ్చుల ధోవతి ధరించి వున్నాడు. కాళ్ళకు కడియాలు, గజ్జెలు కనిపిస్తున్నాయి. హనుమాండ్లకు తలకు కుడివైపున చక్రం, ఎడమవైపున శంఖం చెక్కివున్నాయి. ఈ శైలి ఆంజనేయ విగ్రహాలన్నీ మధ్వ వైష్ణవ సంప్రదాయాన్ననుసరించి చెక్కించినవే. శాయిగూడెంలో రామునిబండలెక్కనె గొలనుకొండలో రామచంద్రబండ వుంది.
గొలనుకొండకు పడమటినుండి దక్షిణంగా ప్రవహించే ఆలేటివాగు (భిక్కేరు) పారుతున్నది.
ధన్యవాదాలు:
కొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, చంటి మరియు గొలనుకొండ గ్రామస్తులకు, బి.రాజయ్య, మధుసూదన్ (వీఆర్ ఏ)లకు, గొలనుకొండలోని నా పూర్వవిద్యార్థులకు.
- శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698