పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.
పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.
బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు - 2023 నిర్వహించింది. తక్కువ సమయంలోనే, వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 51 కథలు వచ్చాయి. కథలన్నీ చాలా బావున్నాయి. బాల సాహిత్య నిపుణులు ఈ కథలను చదివి, చర్చించి ప్రచురణకు 24 కథలు ఎంపిక చేశారు. ఈ కథల పోటీలు నిర్వహించి మరియు పుస్తక రూపాన్నిచ్చింది బాలచెలిమి. - వేదకుమార్ మణికొండ
కులాయి నీరు వ•ధాగా పోతుంది’’ అంటూ రమణమ్మ పక్కింటి రాధమ్మతో చెప్పింది అయినా నీటి వృధాను అరికట్టలేదు. సరి కదా వినిపించనట్టు ఊరకుండేది రాధమ్మ. ప్రతిరోజు ఇదే తంతు. రమణమ్మ చెప్పడం రాధమ్మ వినిపించుకోకపోవడం. కానీ రమణమ్మకు నీరు వృధాగా పోయేసరికి బాధనిపించింది ఎందుకంటే రమణమ్మ పర్యావరణ కార్యకర్త. ప్రతి నీటి చుక్క ఎంతో మందికి జీవనాధార మని, వృధా నీటిని అరికడితే ఎంతో పొదుపు చేసిన వారం అవుతామని చెబుతుండేది. రమణమ్మ ఉపన్యాసానికి అందరిలో మార్పు వచ్చి నీటిని పొదుపు చేసేవారు.
కానీ, రాధమ్మలో మార్పు రాలేదు. దెయ్యాల గంగమ్మగా పేరు ఉన్న రాధమ్మ జోలికి ఎవరు పోయేవారు కాదు. ఏ విధంగానైనా సరే రాధమ్మకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నది రమణమ్మ.
ఒక రోజు ఇరుగు పొరుగు వారి సహకారంతో రాధమ్మ ఇంటికి కుళాయి నీళ్ళు రాకుండా బంద్ చేయించింది. ఇది తమకు తెలియనట్టు అందరూఊరుకున్నారు. అందరికీ కులాయి ద్వారా నీరు వస్తుంది. కానీ రాధమ్మకు రాకపోయే సరికి మల్ల గుల్లాలు పడింది. కానీ ఎవరిని ఏమి అడగడం లేదు. ఇంట్లో ఉన్న నీటితో సరిపెట్టుకుంది. రాధమ్మకు తాగడానికి మంచినీరు కూడా లేదు. కులాయి రావడం లేదు. ఇరుగుపొరుగును అడుగుదామంటే అహం అడ్డుపడింది.
పర్యావరణ కార్యకర్త అయిన పక్కింటి రమణమ్మతో కూడా ఏమి చెప్పలేదు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోర్ నుండి నీరు తెచ్చుకోవడం ప్రారంభించింది. ఒకరోజు బిందెలతో నీరు తెస్తుండగా కాలుజారి కింద పడింది. కాలికి స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదమేమీ లేదు, కట్టుకట్టారు కాలికి విశ్రాంతి తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు.
రాధమ్మ పరిస్థితి ఇప్పుడు ‘‘ముందు నుయ్యి వెనక గొయ్యి’’ అన్నట్లు తయార యింది. ఇరుగుపొరుగు వారందరూ మానవతాదృక్పథంతో రాధమ్మ ఇంటికి వచ్చి ఆమెకు సేవలు చేశారు. తమ ఇంటికి వచ్చే కుళాయి నీళ్లను కూడా రాధమ్మకు ఇచ్చారు. రాధమ్మ ఇరుగు పొరుగు వారితో నేను మీతో మాట్లాడకపోయినా నాకు నీరు అందించి మీ సహృదయత చాటారు. ఇన్ని రోజులు కుళాయి ద్వారా నీరు వృధాగా పోయినా నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నీటి విలువ నాకు తెలిసి వచ్చింది.
ఇంకెప్పుడు కూడా నీటిని వృధా చేయనని పర్యావరణ కార్యకర్త పక్కింటి రమణమ్మతో చెప్పి పశ్చాత్తాప పడింది. రాధమ్మలో మార్పు చూసి మరుసటి రోజు నుండి నీరు వచ్చే ఏర్పాటు చేసింది రమణమ్మ.
యాడవరం సహస్ర గౌడ్, ఏడవ తరగతి
శ్రీ చైతన్య, సిద్దిపేట.
ఫోన్ : 9441762105, 949117596