జీవుల పుట్టుక, పరిణామం ఓ వైవిధ్యభరితం! ఈ విషయంగా అనేక శాస్త్రీయ ఆవిష్కరణలు, రుజువులు మనకు అందుబాటులో వున్నా, మతాలు మాత్రం ఆధారంలేని కథనాల్ని నిరంతరం మానవుల బుర్రల్లోకి చొప్పిస్తూనే వున్నాయి. ముఖ్యంగా చదువును వెలగబెట్టిన వారు ఈ అపనమ్మక కథనాల్ని ఓ సాంస్కృతిక వారసత్వంగా తరతరాలకు అందిస్తూనే వున్నారు. ఈ భావవాదులు ఓ వైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూనే శాస్త్రీయ ఆలోచనలకు నిరంతరం అడ్డుకట్ట వేస్తూనే వున్నారు. అయినా, జీవపరిణామ సిద్ధాంతం నిరంతరం కొత్త ఆవిష్కరణల్ని చేస్తూనే వున్నది. ఇందులో ప్రధానంగా ముందు జలచరాలని, తర్వాతి కాలంలో ఉభయచరాలని, వీటి నుంచే భూచరాలు రూపుదిద్దుకున్నట్లు అనేక ఆధారాలు, శిలాజల గుర్తులు లభిస్తూనే వున్నాయి.
ఈ నేపథ్యంలోనే రాకాసిబల్లుల ఉనికి గూర్చిన జురాసిక్‍పార్క్, గాడ్జిల్లా లాంటి సినిమాలు నిర్మించారు. అతిపెద్ద ఆకారం వున్న కొన్ని రాకాసిబల్లులు కూడా పక్షుల్లా ఎగిరేవని తెలిసింది. అంటే సరీసృపాలకు, పక్షులకు మధ్యస్థ జీవులుగా వీటిని గుర్తిస్తారు. ఇలా జలచరాలు ఉభయచరాలుగా, ఉభయచరాలు సరీసృపాలుగా, పక్షులుగా, తర్వాతి కాలంలో సస్తనజాతి (పాలిచ్చే) జంతువులుగా రూపాంతరం చెందిన సదృశ్యాలు శాస్త్రీయంగా అనేక నిరూపణలు మనముందున్నాయి. జలచరాలు మొప్పులతో, ఊపిరితిత్తులతో శ్వాసించే శక్తిని కలిగివుంటే, ఉభయచరాలు మొదట మొప్పులతో, తర్వాత చర్మంతో, ముఖకుహరంతో అభివృద్ధి చెందిన ఊపిరితిత్తులతో శ్వాసక్రియను జరుపుకుంటే, భూచరాలు మొత్తంగా ఊపిరితిత్తులతో జరుపుకోవడం జీవుల పరిణామ క్రమాన్ని సూచిస్తుంది. అలాగే రక్తప్రసరణ వ్యవస్థ, గుండె గదులు కూడా! దీనికి కాసినేరియా (casineria) అనే మొదటితరం సరీసృపాన్ని ఉదహరిస్తారు.
300 మిలియన్ సం।।ల (carboniferous period) క్రితం జీవించినట్లుగా భావిస్తున్న కాసినేరియా, సుమారు 15 సెం.మీ. పొడవున్న బల్లిలాంటి జీవి. ఇది అమ్నియోటిస్ వర్గానికి చెందినదని దీని శిలాజాన్ని పరిశీలించిన శాస్త్రజ్ఞులు భావించారు. ఈ జీవి మొదటితరం సరీసృపంగా, ఉభయచరాలకు, పక్షులకు, సస్తనజాతికి మధ్యస్థ జీవిగా దీనిని గుర్తించారు. వీటన్నింటిని శాస్త్రీయంగా చూసినప్పుడు జీవపరిణామం ఎంత విశిష్టతను కలిగివుందో తెలుస్తున్నది. ఈ సందర్భంగా కొన్ని రకాల సరీసృపాల జీవన విధానాన్ని, వాటి ప్రాముఖ్యతను చూద్దాం!
మాపట్లనే వివక్షత ఎందుకు?
జంతువర్గంలో అత్యంత వివక్షతకు గురైతున్న వర్గం మాదే! మా వర్గంలో తాబేళ్లు, బల్లులు, మొసళ్ళు, పాములు వున్నాయి. ఒక్క తాబేళ్ళపై తప్ప మిగతా వాటిపట్ల మీ మానవులు అనేక అపోహల్ని, అనుమానాల్ని, కల్పించుకొని భయాల్ని ఏర్పరచుకున్నారు. వీటికి సహేతుక కారణాలు లేకున్నా, మా ఆకారం, శరీర ఆకృతితో పాటు కొన్నింటి ద్వారా జరిగే అపాయల్ని దృష్టిలో పెట్టుకొని ఈ భయం కాబోలు! కానీ, మీరు ఊహించుకున్నంత ప్రమాదకారులం కామనేది మీ మానవులే ప్రచారం చేస్తూ వుంటారు. అయినా, మాపై వ్యతిరేకత అలాగే కొనసాగడం గమనార్హం!
ఇతిహాసాల్లో, పురాణాల్లో, మాపట్ల ఆరాధన, గౌరవం కనపడినా కొన్ని సందర్భాలలో మావర్గాన్ని క్రూరంగా చిత్రీకరించారు. విష్ణు అవతారంగా కూర్మాన్ని (తాబేలు), వరాహాన్ని (పంది), మత్స్యాన్ని (చేప) ఆరాధ్య జీవులుగా గుర్తించినా, గజేంద్రమోక్షంలో ఏనుగును రక్షించే నెపంతో మా మొసళ్ళను ఓ క్రూర జంతువర్గంగా చిత్రీకరించారు. నిజానికి ఏనుగులు ఆటవికంగా వుండి (శాఖాహారులైనా) వనాల్ని ధ్వంసం చేస్తాయి. అది వాటి స్వాభావిక నైజం. కాని, మా మొసళ్ళు నీటిని శుభ్ర పర్చడంతో పాటు, చిన్నస్థాయి నీటి జంతువుల్ని, చేపల్ని తిని జీవిస్తూ ఆహారపు గొలుసులో అమోగమైన పాత్రను నిర్వహిస్తాయి!
పోతే జంతు ప్రేమికుల సహవాసంతో, స్పందనతో ఈ మధ్యన మాపట్ల కొంత అనుకూల వాతావరణం ఏర్పడింది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో మాలోని కొన్ని రకాల జంతువుల్ని (మొసలి, ఊసరవెల్లి, పాము) పెంచుకోవడం ముదావహం! మీ రియాల్టి ప్రదర్శనల్లో పాములతో (విషరహిత) సహవాసం చేయడం అభినందనీయమే! ఇక పాముల్ని ప్రేమించేవారి సంఖ్య కూడా పెరగడం, మీరు భయపడేంత విషసర్పాలం కాము అనే నినాదాన్ని బలోపేతం చేయడం ఆహ్వానించ తగ్గదే! ఇప్పటికి భూమిని ఆదిశేషుడు మోస్తున్నాడని హిందూమతం నమ్మితే, అమెరికన్లు తాబేలే భూమిని మోస్తున్నట్లు (aesop’s fables) నమ్మడం విచిత్రం కదా! పోతే ఇవన్నీ ఓ ప్రతీకలే!
సహజ కవచదారులం – అయినా భయంతో జీవిస్తాం!
మహాభారతంలో కర్ణుడు సహజ కవచకుండలాలతో జన్మించినా, యుద్ధరంగంలో ఆయనకు అవి ఉపయోగం లేకుండా పోయాయి. మా (తాబేళ్ళ) పరిస్థితి అంతే! ఏ జంతువుకు లేని ఓ విషిష్ట రక్షణకవచం మా వీపు భాగాన వుండడం, ప్రకృతి ప్రసాధించిన ఓ వరమే! అయినా, మీ గొడ్డళ్ళు, కత్తులు మమ్మల్ని నరకయాతనకు గురిచేస్తాయి. మీ ఇనుపవలలు మమ్మల్ని అనునిత్యం బంధిస్తాయి. మా తలను, కాళ్ళను కుంచించి, మా కవచంలోకి లాక్కొని మేం రక్షించబడినామని భావిస్తాం. కాని ఆ సంతోషం స్వల్ప కాలమేనని, వేటగాల్ల చేతల్లోకి పోతేగాని తెలియదు. శత్రువుతో పోరాడడానికి, మా కవచాన్ని డాలుగా చేసుకొని రక్షించుకుంటారు. కాని, మా సహజ రక్షణ కవచం మీ నుండి రక్షణ కలిగించలేక పోతున్నది.
ముఖ్యమైన విషయం ఏంటంటే, జంతువర్గంలో మాజాతే అత్యంత జీవన ప్రమాణాన్ని కలిగి వున్నాయి. సగటున 80 సం।। నుంచి 150 సం।। వరకు జీవించినట్లు మీ రికార్డులే తెలుపుతున్నాయి. కొన్ని అనుకూల పరిస్థితుల్లో మేం 250 సం।। వరకు జీవించినట్లుగా ఆధారాలు వున్నాయి కూడా! మొత్తం మా జాతిలో చుక్క (స్టార్) తాబేళ్ళు అందంగా వుండడంతో వీటి వేట ప్రపంచ వ్యాపితంగా కొనసాగుతున్నది. ముఖ్యంగా భారతదేశ తీర ప్రాంతాల్లో ఈ జాతి అధికంగా కనపడుతుంది. అందుకే మమ్మల్ని బంధించి, దొంగచాటుగా తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీన్ని మీరు నివారించగలిగితే, మీరు పరోక్షంగా పర్యావరణానికి దోహదపడినట్లే!
తాబేలు నడక – అరిబడ (arribada)
దాదాపు జంతువర్గంలో గుడ్లుపొదగబడిన తర్వాత పసిగుడ్లు (chicks) కొన్ని రోజులు తల్లి సంరక్షణలో వుంటాయి. కాని, మేం గుడ్లు పొదగబడిన వెంటనే మా దారిన మేం పోతాం. ఆ పసిగుడ్లు వెంటనే తమ దారిని తాము వెతుక్కుంటాయి. పాకడం ప్రారంభిస్తాయి. ఇవి కూడా సమూహంగా కదులుతాయి. ఈ వింతల్ని ఒరిస్సా తీరాల్లో మీరు చూడవచ్చు!
సముద్రాల్లో జీవించే తాబేళ్ళు కూడా తీర ప్రాంతానికే వచ్చి గుడ్లు పెట్టాల్సిందే! పొదగాల్సిందే! విచిత్రమేమంటే, పుట్టిన చోటు నుంచి సుదీర ప్రాంతాల్లో జీవనయానం సాగించే మేము, గుడ్లను పెట్టడానికి మాత్రం తిరిగి పుట్టిన తీరానికే వచ్చి గుడ్లు పెట్టడం ప్రకృతి వింత కాదా! అంటే సుమారు 15-18 సం।। తర్వాత తిరిగి రావడం ఓ ప్రకృతి ప్రసాదిత లక్షణంగా మీరు చెప్పుకుంటారు. ఇలా పుట్టిన వెంటనే సాగే మా ప్రయాణం భూమధ్యరేఖ ప్రాంతానికి, శ్రీలంక, ఆస్ట్రేలియాకు, లేదా ఇతర అనుకూల ప్రాంతాలకు వెళ్ళి జీవించి, జతకడుతాం. గర్భందాల్చిన తర్వాత తిరిగి మా ప్రయాణం వెణక్కి మళ్ళుతుంది. అలా పుట్టిన చోటికి సామూహికంగా రావడం, సామూహికంగా (2-3 రోజుల్లో) గుడ్లను పెట్టడం జరుగుతుంది. ఇలా వేలుగా కదిలి గుడ్లు పెట్టడాన్ని స్పానిష్ భాషలో అరిబడా అంటారు. ఈ ప్రయాణం కొన్నిసార్లు సుమారు 9,000 కి.మీ. కూడా సాగుతుంది.
ఇంతంత దూరాల్ని మేం నడచినా, నీటిలో పయనించినా మా నడకను మీరు తాబేలు నడకని హేళనచేయడం బాగుందా.
ఇక ఆలివ్ రిడ్‍లే (olive ridley) తాబేళ్ళు భారతదేశ తీర ప్రాంతాల్లో, ఉత్తరార్థగోళంలోని కోస్టారిగా, మెక్సికో తీర ప్రాంతాల్లో జీవిస్తాయి. గుడ్లు పెట్టడానికై ఇవి సుమారు 1,50,000
తాబేళ్ళు గుంపుగా కదిలి, పుట్టిన తీరానికి చేరి గుడ్లను పెట్టి, పొదిగి, తిరిగి తమ ఆవాస ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. పోతే, మగ తాబేళ్ళు మాత్రం కేవలం సంపర్కానికే పరిమితమైతాయి.
భూ అయస్కాంతంతో మా సంబంధం
మా జీవన విధానం భూ అయస్కాంతముతో ముడిపడి వుంటుందని మీ శాస్త్రజ్ఞులు భావిస్తారు. కారణం 200 అక్షాంశాన్ని ఆధారంగా మా సంతానోత్పత్తి జరుగుతుందని, ఈ ప్రాంతంలోనే మేం గుడ్లను పెట్టి, పొదుగుతామని తేలింది. దానికై మేం సముద్ర అలల్ని, సూర్యుడి స్థానాన్ని, ఉపరితల గాలుల్ని, రుతువుల్ని, చంద్రుడి గమనాన్ని గమనిస్తామని తేలింది. బహుషా ఈ విధానమే, మేము పుట్టిన తీరాలలోనే తిరిగివచ్చి గుడ్లు పెట్టడానికి కారణం కావచ్చు కదా!
మీ శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం, మేం గుడ్ల నుంచి బయటకు రాగానే ఇసుక రేణువులు మా పొట్టభాగాన అతుక్కోవడం, అవి ముద్రలుగా ఏర్పడడం, ఈ ఆధారంతోనే మేం తిరిగి వస్తామని, ఇచ్చటనే గుడ్లను పొదుగుతామని, దీన్నే తాబేళ్ళ అయస్కాంత గుర్తింపు (geomagnetic identification) విధానమని అంటారు. కారణాలు ఏమైనా మేం ఇలా తిరిగి వచ్చి పుట్టిన ప్రదేశంలోనే గుడ్లు పెట్టడం దాదాపు ఏ జంతువుల్లో కానరాదు కాబోలు!
పేరుగొప్ప – ఊరు దిబ్బ :
హిందు ఇతిహాసాల్లో అమెరికన్లలో మాపట్ల ఎనలేని గౌరవం వున్నా ఇవన్నీ కథలకే పరిమితం. మాపట్ల మీ మానవుల ఆరాధన ఎంతనో, మాపైన అఘాయిత్యాలు అంతే! మమ్మల్ని వేటాడని రోజు, వలవేసి పట్టి ఖండాంతరాలకు ఎగుమతి చేయని దినం, స్టారు హోటళ్లలో మా మాంసాన్ని రుచి చూడని దేశం, ప్రాంతం లేదంటే మీరు నమ్మకపోవచ్చు! పోతే మా పుట్టక, చావు వేల సంఖ్యల్లో వుండడంతో, మేము అభివృద్ధికర దశలో వున్నట్లుగా భావిస్తున్నారు. ముఖ్యంగా చుక్క తాబేళ్ళ వ్యాపారం ప్రపంచవ్యాపితమై పోయింది. చాలా దేశాల్లో మమ్మల్ని పెంపుడు జంతువులా పెంచుకుంటే, మీకు మంచి జరుగుతుందని భావించి మమ్మల్ని బందీ చేస్తున్నారు. మీ నమ్మకాలకు మమ్మల్ని బలి చేస్తున్నారు.
మాపై వేట ఇలాగే కొనసాగితే, మా ఆవాసాల్ని దెబ్బతీస్తే, డైనోసార్స్ కాలం నుంచి జీవిస్తున్న మా జాతి ఉనికిని కోల్పోతే, నీటి ఆవాసాలన్నీ చేపలచే, ఇతర నీటి జంతువులచే నిండిపోతాయి. ఇదే జరుగుతే, ఆ జీవులకు ఆక్సిజన్ కొరత ఏర్పడి, అన్ని మరణిస్తాయి. అప్పుడు మానవులతో పాటు, ఇతర జంతువులకు ఆహారపు కొరత ఏర్పడుతుంది. అంటే, ఆహారపు గొలుసులో, పర్యావరణ రక్షణలో మాకు మేమే సాటి. కనీసం ఇప్పుడన్నా మా ఉనికి గూర్చి ఆలోచిస్తారని… (వచ్చే సంచికలో పాముల ప్రాధాన్యతను చూద్దాం!)
- డా।। లచ్చయ్య గాండ్ల, ఎ : 9440116162