దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు తీపి కబురు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) సింగరేణి సాధించిన 4701 కోట్ల రూపాయల లాభాలలో సంస్థ వ్యాపార విస్తరణ ప్రణాళికల కోసం రూ.2,289 కోట్ల కేటాయించగా.. మిగిలిన 2412 కోట్ల రూపాయలపై 33 శాతాన్ని లాభాల వాటా బోనస్‍గా కార్మికులకు చెల్లించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. శుక్రవారం (సెప్టెంబర్ 20) రాష్ట్ర మంత్రిమండలి సభ్యులతో కలిసి సచివాలయంలో లాభాల బోనస్‍ను ప్రకటించారు. 33 శాతం వాటా కింద రూ.796 కోట్లను కార్మికులకు లాభాల వాటాగా చెల్లిస్తుండగా ఒక్కొక్క కార్మికుడు సగటున రూ.1,90,000 వరకు అందుకోనున్నాడు. సింగరేణి చరిత్రలో ఇదే అత్యధిక లాభాల వాటా బోనస్‍గా నిలువనుంది. అలాగే సింగరేణి చరిత్రలో తొలిసారిగా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల బోనస్‍ను వర్తింపజేస్తున్నట్లు తెలిపారు.
85 కోట్లు అధికం..
2022-23 ఆర్థిక సంవత్సరంలో లాభాల వాటా కింద ప్రకటించిన 32 శాతంతో రూ.711 కోట్లను కార్మికులకు పంపిణీ చేయగా ఇప్పుడు 33%తో రూ.796 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఇది అప్పటి కన్నా 85 కోట్లు అధికం. అప్పుడు కార్మికులు సగటున ఒక లక్ష 70 వేల రూపాయలు లాభాల బోనస్‍గా అందుకోగా ఇప్పుడు సగటున ఒక లక్ష 90 వేల రూపాయలు అందుకోబోతున్నారు. గత ఆర్థిక సంవత్సరం సంస్థలో అత్యధికంగా 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపడంతో ఎప్పుడూ లేనంతగా రూ.4701 కోట్ల నికర లాభాలను కంపెనీ ఆర్జించింది.
లాభాల్లో వాటా..
1990 దశకంలో తీవ్ర నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కార్మికులు, అధికారులు సమష్టిగా కృషి చేసి లాభాల బాట పట్టించారు. ఈ నేపథ్యంలో కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చి ప్రోత్సహించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 1999 -2000 సంవత్సరంలో తొలిసారిగా నాడు వచ్చిన 300 కోట్ల రూపాయల లాభాల్లో 10% అనగా 30 కోట్లను లాభాల వాటా బోనస్‍గా ప్రకటించారు. నాడు కంపెనీలో ఉన్న ఒక లక్ష 8 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి సగటున 2,782 రూపాయలను లాభాల వాటాగా పంపిణీ చేశారు. ఈ సాంప్రదాయం దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనూ లేదు.
నాటి నుంచి సింగరేణి సంస్థ వరుసగా లాభాలు సాధిస్తూ దేశంలోనే అగ్రస్థాయి సంస్థగా నిలుస్తూ వస్తోంది. దీనితో లాభాల వాటా బోనస్ను ప్రతీ ఏడాది పెంచుతూ కార్మికులకు పంపిణీ చేస్తున్నారు. 2013-24లో లాభాల బోనస్ 20 శాతానికి పెరిగింది. అప్పుడు సగటున కార్మికుడు 13,751 రూపాయలు లాభాల వాట బోనస్ గా స్వీకరించాడు. 2021- 22 నాటికి ఇది 30 శాతానికి చేరుకోగా సగటున కార్మికుడికి సుమారు 90 వేల రూపాయల వరకు లాభాల వాటా అందింది. ఈ ఏడాది సింగరేణి చరిత్ర లోనే అత్యధికంగా 33 శాతం లాభాల వాటా బోనస్‍గా ప్రకటించడం వలన మస్టర్లు అధికంగా ఉన్న కార్మికులు 2.5 లక్షలకు పైగా బోనస్ అందుకునే అవకాశం ఉంది. అయితే సగటున మాత్రం 1,90,000 రూపాయలను కార్మికులు అందుకోనున్నారు.
పొరుగు సేవల సిబ్బందికి కూడా బోనస్…
సింగరేణి కాలరీస్ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది పొరుగు సేవల కింద పని చేస్తున్న కాంట్రాక్టు, ఒప్పంద కార్మికుల కూడా లాభాల బోనస్ను చెల్లించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కంపెనీలో 25 వేల మంది వరకు కాంట్రాక్టు, పొరుగు సేవల సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో గత ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత మస్టర్లు పూర్తిచేసిన వారికి నిబం ధనల ప్రకారం బోనస్ను చెల్లించనున్నారు. సగటున రూ.5వేల వరకు లాభాల బోనసును కాంట్రాక్టు కార్మికులు పొందే అవకాశంఉంది.
బహుముఖ వ్యాపార విస్తరణ
ఈ ఏడాది వచ్చిన 4701 కోట్ల రూపాయల లాభాలలో 2289 కోట్ల రూపాయాలను కంపెనీ విస్తరణ, అభివ•ద్ధి పనుల కోసం కేటాయిస్తున్నట్లు డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క తెలిపారు. కంపెనీ ఆర్థిక సుస్థిరత, భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వ మార్గ నిర్దేశంలో బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు.. ఇందులో భాగంగా సోలార్ విద్యుత్ను 1,000 మెగావాట్లకు పెంచాలని, రామగుండంలో 500 మెగావాట్ల పంప్డుడ్ స్టోరేజీ ప్లాంట్‍ను ఏర్పాటు చేయాలని, ప్రస్తుత 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మరో 800 మెగావాట్ల సామర్థ్యం కల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, రామగుండంలో తెలంగాణ జెన్‍కో భాగస్వామ్యంలో 800 మెగావాట్ల ప్లాంటును, ఒడిశాలో 2400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి సంబంధించి ప్రణాళికలను రూపొందించి ముందుకెళ్తున్నట్లు తెలిపారు.
సింగరేణి సంస్థలో వీకే ఓసీ, గోలేటి ఓసీ, నైనీ ఓసీలను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు, తద్వారా ఏడాది ఉత్పత్తి లక్ష్యం 72 మిలియన్ టన్నులకు చేరుకోనుందన్నారు. అలాగే నూతన సీహెచ్‍పీల నిర్మాణం, కార్మికుల సౌకర్యార్థం క్వార్టర్లు, కార్మికుల పిల్లల కోసం సింగరేణి పాఠశాల ఆధునికీకరణ, రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు, ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణ, క్యాథ్ ల్యాబ్‍ల ఏర్పాటు, క్యాంటీన్ల ఆధునికీకరణ, హైదరాబాద్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాపార విస్తరణ చర్యలతో కంపెనీకి ఉజ్వల భవిష్యత్ ఉందని, కాబట్టి కార్మికులు, అధికారులు సమర్థంగా పనిచేస్తూ రక్షణ, నాణ్యతతో కూడిన ఉత్పత్తికి కృషి చేసి సంస్థను ఆదర్శవంతమైన కంపెనీగా తీర్చిదిద్దాలని కోరారు.
సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, గడ్డం వినోద్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేంసాగర్ రావు, ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘ నాయకులు జనక్ ప్రసాద్, అధికారుల సంఘం నాయకులు లక్ష్మీపతి గౌడ్, జీఎంలు సుభానీ, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికులకు లాభాల వాటాను ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కార్మికుల తరఫున సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి సంస్థలో గల 41,500 మంది కార్మికులు, అధికారులకు ఈ బోనస్‍ను దసరా పండుగకు ముందు చెల్లించేందు ఏర్పాట్లు చేయాలని ఆయన సిబ్బంది, ఆర్థిక శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.
–చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్