చింతచెట్టు కింద పాఠాలతో హైదరాబాద్‍ అభివృద్ధి – ఎఫ్‍బిహెచ్‍, ఛైర్మన్‍ మణికొండ వేదకుమార్‍ ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రికకు రాసిన వ్యాసం


(ఎఫ్‍బిహెచ్‍, ఛైర్మన్‍ మణికొండ వేదకుమార్‍ ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రికకు రాసిన వ్యాసం యథాతంగా)

సెప్టెంబర్‍ 28 ఈ తేదీ రాగానే 1908లో హైదరాబాద్‍ను ముంచెత్తిన వరదలే గుర్తుకొస్తాయి. అప్పట్లో ఈ వరదలు నాటి నగరంలో అధికభాగాన్ని జలమయం చేశాయి. వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చాయి. అఫ్జల్‍ గంజ్‍ పార్క్ (నేడు ఉస్మానియా ఆసుపత్రిలో భాగం)లో ఉన్న ఓ చింత చెట్టు నాటి జ్ఞాపకాలను నేటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈ ఏడాది సైతం సెప్టెంబర్‍ 28న 10.30 గంటలకు ఈ చింతచెట్టు కింద జరిగే సమావేశం ఒకనాటి బీభత్సాన్ని గుర్తు చేసుకుంటూ, నేటి నగరాభివ•ద్ధికి నిపుణులు చేసే సూచనలకు వేదిక కానున్నది.


1908లో మూసీ నదికి వచ్చిన వరద కనివిని ఎరుగనిది. మరో మూడేళ్లకు చివరి నిజాం మీర్‍ ఉస్మాన్‍ అలీ ఖాన్‍ గద్దెనెక్కారు, సమస్యను గుర్తించారు. సిటీ ప్లాన్‍ రూపొందించాలని సంకల్పించారు. 1914లో సిటీ ఇంప్రూవ్‍మెంట్‍ బోర్డు (సిఐబి) ఏర్పాటు చేశారు. సర్‍ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకత్వంలో, ఇంజనీర్‍ అలీ నవాజ్‍ జంగ్‍తో సీఐబి పని చేసింది. హైదరాబాద్‍ పట్టణానికి ఎగువభాగాన మూసీ ప్రవాహాన్ని అరికట్టడానికి 1920లో ఉస్మాన్‍ సాగర్‍, 1927లో హిమయత్‍ సాగర్‍ జంట జలాశయాల నిర్మాణాలు జరిగాయి. మంచినీటి సరఫరా వ్యవస్థ, కాలనీల నిర్మాణం, నూతన డ్రైనేజీ వ్యవస్థ, రివర్‍ ఫ్రంట్‍ వాల్‍ నిర్మాణం, రాష్ట్ర హైకోర్టు, విక్టోరియా మెటర్నిటీ హాస్పిటల్‍, ఉస్మానియా జనరల్‍ హాస్పిటల్‍, స్టేట్‍ లైబ్రరీ, ఆర్టీసీ బస్‍ డిపో, నయాపూల్‍ ఇతర పౌర సదుపాయాలపై ప్రతిపాదనలు అమలయ్యాయి. అప్పట్లో నగర ప్రణాళిక బాగ్‍ (ఉద్యానవనాలు), బౌలి (బావులు), తలాబ్‍ (చెరువులు)తో ముడిపడి ఉండింది.


గత వందేళ్లలో నగరం ఊహకు అందని విధంగా విస్తరించింది. దీంతో ఒకనాటి పరిస్థితులే తిరిగి ఏర్పడుతున్నాయన్న భయాలు కూడా కలుగుతున్నాయి. అనేక ప్రాంతాలు ఓ మోస్తరు వర్షానికే జలమయమైపోతున్నాయి. పుట్టగొడుగుల్లా మురికివాడలు వెలుస్తున్నాయి. చక్కగా ప్లాన్‍ చేసిన ప్రాంతాలు సైతం ఇరుకిరుగ్గా మారుతున్నాయి. అక్రమ నిర్మాణాలను చట్టబద్ధం చేస్తూ రావడం కూడా ఇందుకు ఓ కారణం. ఈ నేపథ్యంలోనే ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍, సెంటర్‍ ఫర్‍ దక్కన్‍ స్టడీస్‍ సంస్థ, చత్రి, కోవా, మూసీ పరిరక్షణ కమిటీ, తెలంగాణా రిసోర్స్ సెంటర్‍, R.W.As ఇతర ఎన్జీఓలతో కలసి అర్బన్‍ ప్లానింగ్‍పై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వానికి, నగరాభివృద్ధితో ముడిపడిన సంస్థలకు అనేక సూచనలు చేసింది. 1908 నాటి వరదల పరిస్థితికి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన చింతచెట్టు నీడలో ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. 2008 సెప్టెంబర్‍ 28 నుంచి కూడా ఏటా ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నగరాభివృద్ధికి సూచనలు, వాటి అమలుకు కార్యాచరణ రూపకల్పన లాంటి అంశాలన్నీ ఈ సమావేశాల్లో చర్చకు వస్తుంటాయి. ఈ చింత చెట్టు అప్పట్లో కొన్ని వందలమందిని కాపాడింది. అలాంటి చెట్టు నేటికీ పచ్చగా ఉంది. ఈ చెట్టును, ఆ స్థలాన్ని నగర సహజ వారసత్వంలో భాగంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అప్పట్లో భారీ వరదలకు పెద్ద పెద్ద కట్టడాలు (మసీద్‍-ఎ-బర్ఖ్జంగ్‍, పేట్ల బుర్జు లాంటివి) ఎంతమేరకు మునిగిపోయాయో తెలిపే సూచికలు ఇప్పటికీ ఆ వరదల తీవ్రత నేటి తరానికి తెలియచేస్తున్నాయి. అంతే కాదు, సర్‍ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్‍ నిజామత్‍ జంగ్‍, అలీ నవాజ్‍ జంగ్‍, దాంగోరియా లాంటి ప్రముఖ ప్లానర్లు, అడ్మినిస్ట్రేటర్ల గుర్తులను భద్రపర్చుకోవాలి. హిమాయత్‍ సాగర్‍, ఉస్మాన్‍ సాగర్‍ లాంటి జలాశయాలతో పాటు, కాకతీయుల, కుతుబ్‍ షాహీల నాటి మరెన్నో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను కాపాడుకోవాలి. నేడు హైదరాబాద్‍లో పలు కాలనీలు కొద్దిపాటి వర్షాలకే మునిగిపోతున్నాయంటే, అవన్నీ ఒకనాటి చెరువుల్లో, నీటి ప్రవాహ మార్గాల్లో, నాలాల్లో నిర్మించినవే. చింతచెట్టు కింద జరిగిన సమావేశాల్లో ఈ విధమైన ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి. ప్లానర్లు, అడ్మినిస్ట్రేటర్లు చేసిన తప్పిదాలను గుర్తించి, వాటికి పరిష్కారాలు అన్వేషించే ప్రయత్నాలు జరిగాయి. రకరకాల కారణాలతో అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంపై శ్రద్ధ వహించాలి. 1908 తరువాత కూడా పలు సందర్భాల్లో మూసీ నదికి వరదలు వచ్చాయి. 1970లో ఉస్మాన్‍ సాగర్‍కు భారీగా వరద నీరు చేరింది. చెరువు కట్టకు ముప్పు ఉందని గేట్లు ఎత్తేయడంతో వరద నీరు నగరాన్ని ముంచెత్తింది. ఆ తరువాతి కాలంలో మూసీ వరద కాకున్నా పట్టణ వరదలు ప్రధాన సమస్యగా మారాయి. వీటిని తట్టుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. హైదరాబాద్‍ నగరం నేడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. వర్షాకాలంలో కాల్వలుగా మారుతున్న రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోవడం, పెరిగిపోతున్న ట్రాఫిక్‍, వాహన కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం, మంచినీటి సమస్య, డ్రైనేజీ ఇక్కట్లు, ప్రజా రవాణా, మూసీ కలుషితం కావడం.. ఈ జాబితాకు అంతు ఉండదు. వీటిలో చాలా వాటిని పరిష్కరించేది చక్కటి సిటీప్లానింగ్‍. ఆ విషయంలో ఇప్పటికైనా శ్రద్ధ వహించాలి.


హైదరాబాద్‍ క్రమంగా విశ్వనగరంగా మారిపోయింది. కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే తాగునీటి సదుపాయాలు, రహదారులు అభివృద్ధి చెందాయి. ఓఆర్‍ఆర్‍ వంటివి ఎన్నో వచ్చాయి, ఆర్‍ఆర్‍ఆర్‍ వంటివి మరింకెన్నో వస్తున్నాయి. ఎయిర్‍ పోర్ట్, మెట్రో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. చెరువులు, నాలాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఏ నగరానికైనా మాస్టర్‍ ప్లాన్‍ అత్యంత కీలకం. హైదరాబాద్‍కు సమగ్ర మాస్టర్‍ ప్లాన్‍ రూపకల్పన, అమలు విషయంలో కూడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 50 ఏళ్లను పరిగణనలోకి తీసుకోవాలి. 1975 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వివిధ సంస్థల ద్వారా హైదరాబాద్‍కు ఆరు మాస్టర్‍ ప్లాన్లు వచ్చాయి. వాటిని కలిపి ఇంటిగ్రేటెడ్‍ మాస్టర్‍ ప్లాన్‍ అమలు చేయాలి.
నగరం ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య డ్రైనేజీ, వరదనీళ్లు. ఎక్కడికక్కడ మురుగునీటిని శుద్ధిచేసి ఆ నీటిని స్థానికంగా వినియోగించుకునేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి. శుద్ధి అయిన మిగులు నీటిని చెరువుల్లోకి, మూసీనదిలోకి పంపించేలా చూడాలి. వరద నీటి కాల్వల నిర్వహణ, నిర్మాణంపై దృష్టిపెట్టాలి. ఐదేళ్లలోగా ఈ పనులు పూర్తయ్యేలా చూడాలి. వాన నీటిని ఒడిసిపట్టి వినియోగించుకునేలా చేయాలి. ఈ విషయంలో భవన నిర్మాణ నిబంధనలను కఠినం చేయాలి. ఘనవ్యర్థాల సేకరణ, ప్రాంతాల వారీగా సెపరేషన్‍, రీసైకిల్‍ చేసి పూర్తి స్థాయిలో వినియోగించుకొనే వ్యవస్థను ఏర్పరుచుకోవాలి. హైదరాబాద్‍ జనాభా కోటి దాటింది. మొత్తం తెలంగాణ జనాభాతో పోలిస్తే నాలుగో వంతు ఈ నగరంలోనే ఉన్నట్లయింది. రాజధానికి 100 కిలోమీటర్ల వెలుపల కౌంటర్‍ మాగ్నెట్స్గా చిన్న పట్టణాల అభివృద్ధిని తీవ్రతరం చేయాలి. తద్వారా ఉపాధి, విద్యావకాశాల కోసం హైదరాబాద్‍కు ప్రజలు వలస రాకుండా చూడవచ్చు. హైదరాబాద్‍ యావత్‍ దేశపు గ్రోత్‍ ఇంజిన్లలో ఒకటి. దీన్ని ద•ష్టిలో ఉంచుకొని కేందప్రభుత్వం కూడా హైదరాబాద్‍ నగరానికి ఇతోధికంగా నిధులు మంజూరు చేయాలి. మరీ ముఖ్యంగా ప్రజా రవాణా వసతులు, పట్టణ డ్రైనేజ్‍ వ్యవస్థ, తాగునీరు, మూసీ నది ప్రక్షాళనకు ముందుకు రావాలి. శీతోష్ణస్థితి మార్పుల ప్రభావానికి హైదరాబాద్‍ లోనవుతోంది. అతి తక్కువ సమయంలోనే అత్యంత భారీస్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి మార్పులను తట్టుకునేందుకు నగరం సిద్ధంగా ఉన్నదా? బెంగళూరు, ముంబై లాంటి నగరాలు ఇటీవలి కాలంలో మౌలిక వసతుల కొరతకు గురయ్యాయి. అలాంటి దుస్థితి మన హైదరాబాద్‍కు రావద్దనుకుంటే తక్షణమే నడుం బిగించాలి. నగరాభివృద్ధి అనగానే కొన్నిసార్లు అధికారులు అత్యుత్సాహంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న భవనాలను కూడా కూల్చేస్తుంటారు. వందేళ్ల క్రితం సిఐబి హయాంలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలెన్నో కనుమరుగైపోయాయి. అలాంటి పొరపాట్లే ఇప్పుడు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి.
కాంక్రీట్‍ జంగిల్‍గా మారిన నగరాన్ని ఆకుపచ్చ నగరంగా మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడు మాత్రమే అభివృద్ధి ఫలితాలు అందుకోగలుగుతాం. అభివృద్ధి, ప్రజానివాస హక్కులు, చెరువులు, కుంటల పరిరక్షణ, ప్రజారవాణా, చారిత్రక వారసత్వ కట్టడాల సంరక్షణ లాంటివన్నీ కలసికట్టుగా కొనసాగాలి. ఆ దిశలో ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ లాంటి సంస్థలెన్నో కృషి చేస్తున్నాయి, చేస్తాయి కూడా.

వేదకుమార్‍ మణికొండ
చైర్మన్‍, ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍
(ఆంధ్రజ్యోతి 28.9.2024)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *