‘కాకతమ్మ సైదోడు ఏకవీర’ అన్న క్రీడాభిరామం పద్యపాదం, ఓరుగల్లులో గానీ, సమీపంలో గానీ ఈ ఇద్దరు దేవతలను పక్కపక్కనే ప్రతిష్టించారన్న సమాచారాన్నందిస్తుంది. కాకతమ్మ విగ్రహం, దేవతాలయం ఉనికి ఇంకా వెలుగు చూడాల్సి ఉంది. అయితే, ఏకవీర దేవాలయం మాత్రం, వరంగ ల్లుకు కూతవేటు దూరంలో ఉన్న మొగిలచర్ల (మొగలి పొదలున్న చెరువుల)లో ఉంది. క్రీ.శ.12వ శతాబ్ది తొలినాళ్లలో అంటే కాక తీయులు స్వతంత్రులుగా అప్పుడే కుదురుకుంటున్న రోజుల్లో తమ ఇలవేలుపుగా ప్రతిష్టించుకొని, ఆలయాన్ని నిర్మించుకొన్నారు. కాకతీయ ప్రభువులందరూ రోజూ ఏకవీర ఆలయాన్ని సందర్శించేవారని సమకాలీన సాహిత్యం స్థానిక కథనాలు చెబుతున్నాయి. రుద్రమదేవి అనునిత్యం అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందేదట!
రాచమర్యాదలతో నిత్య ధూపదీప నైవేద్యాలందుకొన్న అలనాటి అపురూప ఏకవీర ఆలయం, నేడు కళతప్పి వెలవెల బోయింది. దీపం తరువాత, కనీసం ఆలయాన్ని శుభ్రం చేసే వారు లేక, సరైన నిర్వహణ లేక, మండపస్థంభాలు కుంగుతూ, దూలాలు పక్కకు తప్పుకుంటూ, గోడలు వంగుతూ, నేడోరేపో నేల రాలుతుందా అన్నట్లుంది. ముందువరుసల స్థంభాలు కూలకుండా ఇసుక బస్తాలు నింపి ఎవరో పుణ్యం కట్టుకొన్నారు.
తొలినాళ్లలో కట్టిన ఈ ఆలయం ఒకే ఒక రాతి వరుస గోడతో గర్భాలయ, అర్థమండపాలు, చుట్టూ ప్రదక్షిణాపథం, దాని చుట్టూ ఉపపీఠం, దానిమీద స్థంభాలు, ఆలయం ముందు మహామండపం, కాకతీయుల కాలపు తొలి ఆలయ వాస్తు శిల్పానికి అద్దంపడుతుంది. అర్థ మండపం ద్వారశాఖలకు రాతి కిటికీలు, మహా మండపం మధ్యలో రంగశిల, ముందు రాతి బండలను గుహాలయాలుగా మలచిన తీరు ప్రశంసనీయం.
ఇన్ని ప్రత్యేకతలున్న ఏకవీరాలయం, శిథిలమై, మళ్లీ కాకతీయు లెప్పుడొస్తారో, తనకు మునుపటి వైభవం ఎప్పుడొస్తుందోనని ఎదురు చూస్తుంది. మహామండప ముందు స్థంభాలు పంటి బిగువున అలాగే వంగి ఉన్నాయి. పై బరువు మోయలేక కాడి కిందపడేయటానికి సిద్ధమౌతున్న ముసలి ఎద్దుల్ని గుర్తుకు తెస్తున్నాయి. ప్రభుత్వ సాయం కోసం చూడకుండా, గ్రామస్తులంతా చేయీ, చేయి కదిపితే, ఆ శిథిలాలయ ఆశ నెరవేరుతుంది.
–ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
ఎ : 9848598446