దక్కన్ పీఠభూమిలో పశ్చిమదిశగా మహారాష్ట్ర కేంద్రంగా చుట్టు పక్కల రాష్ట్రాలలో దాదాపు 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న బసాల్ట్ పొరలు ఉంటాయి. ఇవి తక్కువ ఎత్తులో ఉన్న చదునైన గుట్టలరూపంలో ఉంటాయి. వీటి ఆకారం మెట్లవలె ఉన్నందున ఇంకా అవి దేశంలో దక్షిణం వైపు ఉన్నందున వీటిని ‘‘దక్కన్ ట్రాప్’’లు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ రంగారెడ్డి మరియు మహబూబునగర్ జిల్లాలో ఈ దక్కన్ ట్రాపులు వ్యాపించి ఉన్నాయి.
ఇవి భూమిలో ఏర్పడిన ఛిద్రాల నుండి 6.5కోట్ల సంవత్సరాల క్రితం బయటకు వచ్చిన లావా ప్రవాహాలు ఘనీభవించి ఏర్పడ్డ బసాల్ట్ అనే అగ్నిశిల. ఈ బసాల్ట్ పొరలలో అక్కడక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన స్తంభాలు ఉన్నాయి. వీటిని కాలమ్నార్ బసాల్ట్ /జాయింట్లు అంటారు. ఈ బసాల్ట్ ప్రవాహాల సమూహాలను భూవైజ్ఞానిక పరిభాషలో Deccan Volcanic Province (DVP) అంటారు.
ఎలా ఏర్పడతాయి?
స్తంభాకార బసాల్ట్ ఎలా ఏర్పడతాయి అనే విషయం లో స్పష్టత లేదు. సాధారణంగా వీటిని ఎండిపోయిన బురదలో ఏర్పడే పగుళ్ళతో పోల్చవచ్చు. లావా ప్రవాహాలు పరుచుకుని ప్రవహించే క్రమంలో చల్లబడి,సంకోచం చెంది, బహుభుజ ఆకారం పగుళ్లు ఏర్పడి, అవి నిలువుగా క్రింది వైపు విస్తరించి స్తంభాలుగా ఏర్పడుతాయి. ‘‘శీతలీకరణ బిందువు’’చుట్టూ లావా తన్యత వల్ల సంకోచం చెంది, ఒకే నిడివి గల పగుళ్ళు ఏర్పడ్డాక అవి నిలువుగా అధోముఖంగా విస్తరించి, ఏకరూప స్తంభాల సమూహాలు ఏర్పడుతాయి. ఇలా ఒక క్రమపద్ధతిలో సమానదూరాలతో ఈ పక్రియ పునరావ•తం కావడం వల్ల బసాల్ట్ పొరలో స్తంభాకార బసాల్ట్ నిర్మాణం ఏర్పడుతుంది. వీటిని ‘‘కాలమ్నార్ జాయింట్’’ లు అని కూడా అంటారు. ఈవిధంగా ఒకే విధమైన ఆకారం ఉన్న బహుభుజ పగుళ్ళు లావాపొరను అనేక స్తంభాలుగా చీలుస్తుంది. ఈ సంకోచంవల్ల ఏర్పడిన చీలిక ఎల్లప్పుడూ ఉపరితలానికి లంబంగా కిందివైపు విస్తరించి స్తంభాల నిర్మాణంలో పాత్ర వహిస్తుంది.
ఈ స్తంభాలు లావాప్రవాహాం కూర్పు, స్నిగ్ధత, స్వభావం, చల్లబడేవిధానం మొదలైన పరిస్థితులను బట్టి స్తంభాలు వివిధ ఆకారాలలో ఏర్పడతాయి, ఇవి షట్కోణాకారంలో పంచ కోణాకారంలో చతుర్ముఖ ఆకారంలో ఒకోసారి అసమాన ఆకారంలో కూడా ఏర్పడుతాయి.
బసాల్ట్ స్తంభాల ఉద్భవం:
లావా కూర్పు: దక్కన్ పీఠభూమిపైన ఏర్పాడ్డ లావా ప్రవాహాలు ధూలైటిక్ బసాల్ట్ రకం, (Tholeiitic Basalt) వీటిలో ఇనుము మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక స్నిగ్ధత కలిగి వాయువు శాతం తక్కువగా ఉంటుంది. వీటిలో ఏర్పడే స్తంభాలు షట్కోణాకారంలో ఎక్కువగా ఉంటాయి. ఈ భౌతికశాస్త్ర నియమాలను అనుసరించి ఏర్పడ్డ షడ్భుజాకారాలవల్ల రాతి పొరలలోని ఒత్తిడిని విడుదల చేయబడటమే కాకుండ కనిష్ట
ఉపరితల వైశాల్యంలో గరిష్ట పరిమాణంగల ద్రవ్యరాశి ఇమడటానికి కారణం అవుతాయి. ఈ కారణంగా బసాల్ట్ స్తంభాలు ప్రాకృతిక సౌష్టవాన్ని సంతరించుకుని అందమైన ఆకారాలుగా కనిపిస్తాయి.
లావాలో ఉన్న ప్లాజియోక్లేజ్, పైరాగ్జిన్ మరియు ఆలివిన్ వంటి ఖనిజాలు లావా చల్లబడే క్రమంలో బసాల్ట్ స్తంభాలలో ఒక క్రమపద్ధతిలో స్పటికీకరణ చెందుతాయి. మొదట ప్లాజియోక్లేజ్ దాని తర్వాత పైరాగ్జిన్ దాని తర్వాత తక్కువ పరిమాణంలో ఉండే ఆలివిన్ స్పటికీకరణ జరుగుతుంది. లావా చల్లబడే క్రమంలో ఈ స్తంభాలలో ఇతర ఖనిజాల స్పటికీకరణ కూడా జరగటంవల్ల ఇవి నిలువుగా మరింత పెరుగుతాయి.
బసాల్ట్ స్తంభాల ఆకార పరిమాణం మరియు ఇతర లక్షణాలు అనేక అంశాల ద్వారా ప్రభావితమవుతాయి.
లావా ప్రవాహాంలో వేగవంతమైన శీతలీకరణరేటు చిన్న స్తంభాలను ఏర్పరుస్తుంది. నెమ్మదిగా శీతలీకరణ జరగటంవల్ల పెద్ద స్తంభాలు ఏర్పడటానికి దారి తీస్తుంది. లావా యొక్క కూర్పు స్తంభాల పరిమాణాన్ని ప్రభావితం చేస్తుంది, అధిక ఇనుము మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉంటే స్తంభాలు పెద్దగా ఏర్పడటానికి అవకాశం ఉంది. ఎక్కువ స్నిగ్ధత గల లావా పెద్ద స్తంభాలకు దారి తీస్తుంది. మరియు తక్కువ స్నిగ్ధత గల లావా స్తంభాలను చిన్నవిగా చేస్తుంది. అధికవాయుశాతం ఉన్న లావా ఎక్కువగా క్రమరహిత ఆకారంలో ఉండే స్తంభాలు ఏర్పడటానికి అవకాశం
ఉంటుంది. లావా అధికపీడనం వద్ద ఘనీభవించినట్లైతే పెద్ద పరిమాణంగల స్తంభాల పుట్టుకకు దారితీస్తుంది. వేగవంతమైన స్ఫటికీకరణ చిన్నసైజు స్తంభాల పుట్టుకకు దారి తీస్తుంది. పైన పేర్కొన్న వాటితో పాటు మొత్తం టెక్టోనిక్ సెట్టింగ్‍లు మరియు ఇతర భౌమపరిస్థితులు బసాల్ట్లోని స్తంభాల పుట్టుకను ప్రభావితం చేస్తాయి.
బసాల్ట్ స్తంభాలు – రకాలు:
1.చతుర్ముఖ ఆకారంలో నిటారుగా ఉండే స్తంభాలు
2.షట్కోణాకారంలో ఉన్న స్తంభాలు
3.బహుముఖ స్తంభాలు
ఇంకా ఈ స్తంభాలు సాధారణమైన ఏకాండిగా, శాఖారహితం గాను, శాఖలుగా విభజన చెందినవిగా కాని ఉండవచ్చు. ఒకోసారి ఇవి వంపు తిరిగి కూడా ఉంటాయి.
స్తంభాల వ్యాసం ఒక మీటరు కన్నా తక్కువగా ఉంటే చిన్నవిగా, ఒకటి నుంచి ఐదు మీటర్ల వ్యాసం వరకు ఉన్న వాటిని మధ్యమమైనవిగా, ఐదు మీటర్ల వ్యాసం పైన ఉన్న వాటిని పెద్దవిగా వర్గీకరించారు. వీటి ధోరణి (Orientation) నిలువుగా లేదా కొంచెం పక్కకు ఒరిగి కాని ఉండవచ్చు కొన్ని స్తంభాలు పూర్తిగా అడ్డంగా ఉండవచ్చు.
బసాల్ట్ స్తంభాల విభజన:
1.జెయింట్ కాజ్‍వే రకం (పెద్ద షట్కోణాకారం స్తంభాలు)
2.ఫింగల్ కేవ్ రకం (చిన్న షట్కోణాకారం కలవి)
3.కాలమ్నార్ జాయింట్ రకం (చతుర్ముఖ బహుముఖ ఆకారం కలిగినవి)
4.బ్లాకీ రకం (చిన్న చిన్న సమాన పరిమాణంలో ఉండే స్తంభాలు)
5.డైక్ రకం (దగ్గర దగ్గరగా ఉన్న నిలువు స్తంభాలు)
ఇవే కాకుండా అతి సూక్ష్మమైన బసాల్ట్ స్తంభాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లు తెలుస్తోంది.
బసాల్ట్ల స్తంభాల పొడవు గరిష్టంగా 30 మీటర్లు ఉన్నట్లు గుర్తించబడ్డది, కాని 10 నుండి 15 మీటర్ల పొడవు కలిగినవి అరుదుగానే ఉంటాయి. చిన్నస్తంభాల పరిమాణం 1-2 సెంటీమీటర్ల వరకు ఉండవచ్చు. అయితే 10 సె.మీ నుండి 20 సెంటీమీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే స్తంభాలు చాలా అరుదుగా ఉంటాయి. సాధారణ స్తంభాలు ఒకటి నుండి అయిదు మీటర్ల పొడవు ఉంటాయి. రెండు నుండి మూడు మీటర్ల పొడవు లలో ఉన్న స్తంభాలు చాలా ఎక్కువగా ఉండటం గమనించారు.
తెలంగాణా రాష్ట్రంలో బసాల్ట్ స్తంభాలు:
తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి సిద్ధంగా ఉన్న బసాల్ట్ స్తంభాలు చాలా చోట్ల ఇటీవలే కనుగొనబడ్డాయి.
ఇవి ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం దృష్టి ఇంకా పడలేదు కానీ ఔత్సాహికులైన అన్వేషకులు వీటి గురించి ప్రపంచానికి తెలియజేశారు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
మన్నె ఏలియా-ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ మండలం, శాంతపూర్. డా.కటకం మురళి – పొచ్చెర, బోధ్ మండలం, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తవపూర్ గ్రామం. తిరుపతి గిత్తే -ఆసిఫాబాద్-కొమరంభీం జిల్లా, కెరిమెరి మండలం, బోరెలాల్ గూడ, ఆసిఫాబాద్-కొమరంభీం జిల్లా, కెరిమెరి మండలం, రాంనగర్, ఆసిఫాబాద్-కొమరంభీం జిల్లా, కెరిమెరి మండలం, గౌరి, ఆసిఫాబాద్-కొమరంభీం జిల్లా, కెరిమెరి మండలం, కేలి(బి)లలో ఇంకా తోడిశెట్టి ప్రణయ్ మరియు డా.M.A వాసు, గిన్నెదారి గ్రామం వద్ద చిన్నసైజులో ఉన్న అరుదైన మినియేచర్ బసాల్ట్ స్తంభాల ఉనికిని గుర్తించించారు. వీటన్నింటి పై సమగ్రంగా అధ్యయనం జరగవలసి ఉంది.
అనంతగిరి కొండల్లో బసాల్ట్ స్తంభాలు:
హైదరాబాద్‍కు పశ్చిమదిశగా వికారాబాద్ వద్ద ఉన్న అనంతగిరి కొండలలో కనిపించే బసాల్ట్ స్తంభాలు NGRIకి చెందిన అర్చన, బి. కోటెక్వార్ ప్రభృతులచే (2014) అధ్యయనం చేయబడ్డాయి. ఈ ప్రాంతంలో 9 లావా ప్రవాహాలు ఉన్నాయి. ఒకటవ ప్రవాహం అన్నిటికన్నా దిగువన ఉంది మరియు 9వ ప్రవాహం అన్నిటికి ఎగువన ఉంది. ఎగువన ఉన్న 3 ప్రవాహాలు లేటరైట్‍గా మారాయి. ఈ లేటరైట్ పొర మందం 5 మీటర్లు ఉంటుంది.
అనంతగిరి కొలొనేడ్ నిర్మాణక్రమం:
సాధారణ, సక్రమంగా మరియు పెద్ద వ్యాసం కలిగిన నిలువు వరుసల శ్రేణిలో ఉన్న స్తంభాలను ‘‘కొలొనేడ్’’ అంటారు. సక్రమంగా లేని తక్కువ సరళ మరియు చిన్న వ్యాసం కలిగిన స్తంభాల శ్రేణిని ‘‘ఎంటాబులేచర్ ‘‘అంటారు. వీటిలో స్తంభం యొక్క భుజాల సంఖ్య 3 నుండి 8. మధ్య ఉండవచ్చు 6 ముఖాలతో ఉండటం సర్వ సాధారణం.
అన్నిటికన్నా మీద ఎగువ (అప్పర్) కొలొనేడ్ జోన్ (UCZ), మధ్యలో మిడిల్ ఎంటాబ్యులేచర్ జోన్ (MEZ) దాని కింద దిగువ కొలొనేడ్ జోన్ (LCZ) ఉన్నట్టు గుర్తించారు.
ఎగువ కోలనేడ్ జోన్ (UCZ) క్రమంగా క్రిందికి ఎంటాబులేచర్ జోన్ (MEZ) గా మారుతుంది. ఇది క్రింద ఉన్నLCZ ను UCZ నుండి వేరు చేస్తూ మథ్యలో ఉంటుంది. UCZ లో స్తంభాలు 5 ముఖాలతో ఉన్నాయి, వీటి సగటు ఎత్తు 2 మీటర్లు మరియు వెడల్పు 1 మీటర్లు. స్తంభాల దొంతరలు 5 మీటర్ల మందంతో ఉంటాయి. స్తంభాలు నిలువుగా ఉండి అక్కడక్కడ కొద్దిగా శాఖలుగా చీలి ఉన్నాయి.
వీజ్గులో స్తంభాలు చతుర్ము ఖంగా, వొంపుగా ఉండి ఇవి ఒకదానిని ఒకటి ఖండిస్తూ విసనకర్ర ఆకారంలో విస్తరించాయి. ఈ స్తంభాల ఎత్తు 3 మీటర్లు, వెడల్పు 0.5 మీటర్లు ఉంది. ఈ స్తంభాల దొంతర 15 మీటర్ల మందంలో ఉంది.
అట్టడుగున ఉన్న LEZ ఉపరితలం వైపు రంధ్రాలు కలిగి (వేస్కులర్ గా) ఉండి, చతుర్ముఖ/ పంచముఖ నిలువు స్తంభాలు కలిగి ఉంది. వీటి సరాసరి పొడుగు 1 మీటర్, వెడల్పు 0.9మీటర్ లుగా ఉంది. స్తంభాల దొంతర మందం 10 మీటర్లు గా ఉంది. ఈ స్తంభాల శ్రేణిని కచ్ లో ఉన్న బసాల్ట్ స్తంభాల శ్రేణితో పోల్చవచ్చు ఈ వరద బసాల్ట్ స్తరాలు (flood basalt)ఏ విధంగా చల్లబడినవి వాటి భౌమచరిత్ర మొత్తం ఈ అధ్యయనంలో మొదటిసారిగా బయటపడింది.
తెలంగాణలోని ఇతర ప్రకృతి సిద్ధంగా ఉన్న స్తంభాకార (columnar) బసాల్టస్ ప్రదేశాలపై ఇలాంటి అధ్యయనాలు జరుగవలసి ఉన్నాయి. వీటిలో కొన్ని జియో హెరిటేజ్ సైట్/ జియో పార్క్లుగా గుర్తింపుకు అర్హతలు కలిగి ఉండవచ్చు. ఆదిలాబాద్ జిల్లా అడవులకు జలపాతాలకు ప్రక•తి అందాలకు ప్రసిద్ధి చెందింది. అనంతగిరి కొండ కూడా గుర్తింపు పొందిన పర్యాటక ప్రదేశం.
ప్రపంచ వ్యాప్తంగా బసాల్ట్ స్తంభాలు:
ప్రపంచ వ్యాప్తంగా ఈ స్తంభాకార బసాల్ట్లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. చాలా దేశాల్లో వీటిని పర్యాటక ప్రదేశాలుగా జాతీయ స్మారక చిహ్నాలుగా ప్రకటించారు. వాటిలో కొన్ని:
జైంట్ కాజ్ వే గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉత్తర ఐర్లాండ్‍లో ఉన్న బసాల్ట్ స్తంభాలు. వీటిలో 40 000 ఇంటర్ లాకింగ్ కలిగి ఉన్న బసాల్ట్ స్తంభాలు ఉన్నాయి. దీనిని ‘‘వరల్డ్ హెరిటేజ్ సైట్’’ గా పరిరక్షణ చేస్తున్నారు. డెవిల్స్ టవర్ వయోమిలో ఉన్న స్తంభాలు 380 మీటర్ల ఎత్తులో చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ close encounters of the third kind అనే చిత్రం తెరకెక్కింది. ఇది ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం గా ప్రసిద్ధి చెందింది.
ఆర్గాన్ పైప్ అరిజోనా:
ఇది గ్రాండ్ కానయన్ లో ఉంది. బసాల్ట్ స్తంభాలు ఆర్గాన్ పైప్ ఆకారంలో ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. విక్టోరియా ఆస్ట్రేలియాలో ఉన్న బసాల్ట్ స్తంభాలు, లండన్ బ్రిడ్జి అనే పేరుగల రాతి స్తంభాలు ప్రఖ్యాతి చెందినవి. సైచిలిస్ దీవులలో ఉన్న బసాల్ట్ స్తంభాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇంకా ఐస్లాండ్,ఇధియోపియా, మెక్సికో, తైవాన్ మెదలైన దేశాల్లో కూడా బసాల్ట్ స్తంభాలు చూడవచ్చు.
భారత దేశంలో బసాల్ట్ స్తంభాలు:
సెయింట్ మేరీస్ ఐలాండ్ కర్నాటకలో ఉడిపి జిల్లా లో మాల్పె పట్టణం సమీపంలో ఉంది. దీన్ని కోకోనట్ ఐలాండ్ అని కూడా అంటారు. ఈ ద్వీపంలో ఉన్న బసాల్ట్ స్తంభాలు దాదాపు 5.26 ఎకరాలలో విస్తరించి ఉన్నాయి. ఈ స్తంభాలు 10 నుండి 20 మీటర్ల పొడవులో షణ్ముఖ, పంచముఖ ఆకారాలు కలిగి అందంగా తంతెలుగా ఉంటాయి. ఈ నిర్మాణాలను 2020లో యునెస్కో ప్రపంచవారసత్వ ప్రదేశం (Geoheritage Site)గా గుర్తించింది. భారతప్రభుత్వం కూడా నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్‍గా గుర్తించి అభివృద్ధి చేస్తున్నారు.
ప్రకృతి సిద్ధంగా ఉన్న స్తంభాకార బసాల్ట్ నిర్మాణాలు భారత దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. ఇటీవలే యవత్మాల్ దగ్గర, కొల్హాపూర్ దగ్గర కూడా కనుగొనబడ్డాయి. అనేక ఇతర ప్రదేశాల్లో ఇప్పటికే వీటి ఉనికి గురించి సమాచారం ఉంది. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి పరిరక్షణ చర్యలు తీసుకోబడలేదు. ఇలాంటి బసాల్ట్ స్తంభాలు ఇంకా అనేక ప్రాంతాల్లో కొత్తగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటి గుర్తించి వాటిని అభివృద్ధి చేసి భావితరాలకు వారసత్వంగా అందించడం అవసరం.
-చకిలం వేణుగోపాలరావు
డిప్యూటి డైరెక్టర్ జనరల్ జిఎస్సై(రి)
ఎ: 9866449348
శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698