రాష్ట్రం: ఉత్తర్ ప్రదేశ్
ప్రకటితం: 1983
విభాగం: కల్చరల్ (మాన్యుమెంట్)
సార్వత్రిక విలువ: ఆగ్రాకు చెందిన రెడ్ ఫోర్ట్ పదహారో శతాబ్దానికి చెందింది. మొఘల్ రాజు అక్బర్ దీన్ని యమునా నదీతీరంలో నిర్మించాడు. ఇప్పుడు దీన్ని షాజహాన్ గార్డెన్స్ వాయువ్య భాగంలో చూడవచ్చు. దీనికి దగ్గర్లోనే తాజ్ మహల్ ఉంది. ఈ రెడ్ ఫోర్ట్ రెడ్ శాండ్ స్టోన్‍తో నిర్మించబడింది. 2.5 కి.మీ. పొడవునా కోట గోడలున్నాయి. ఆగ్రా ఒకప్పుడు మొఘల్ పాలకుల రాజధానిగా
ఉండింది. ఈ కోటలో జహంగీర్ ప్యాలెస్, ఖాస్ మహల్ (షాజహాన్ నిర్మించింది), దివాన్ -ఇ-ఖాస్ వంటి సభా మందిరాలు, రెండు అందమైన మసీదులను చూడవచ్చు. ఈ కట్టడాలన్నీ కూడా పర్షియా ప్రభావంతో కూడిన ఇండో-ముస్లిం శైలిలో ఉన్నాయి.
ప్రాథమ్యం : (III)
(III) : పదిహేడో శతాబ్దంలో మొఘల్ పాలనలో ఆగ్రా కోట కీలకంగా ఉండింది. అక్కడ విలసిల్లిన నాగరికతకు అది చక్కటి నిదర్శనంగా నిలిచింది.
మొదట్లో ఇది చౌహాన్ రాజ్ పుత్ లచే యమునా నది ఒడ్డున ఒక మట్టికోటగా నిర్మితమైంది. ఎన్నో రాజవంశాలు ఇక్కడి నుంచే తమ పాలన కొనసాగించాయి. ఆరు మంది మొఘల్ రాజులు కూడా వివిధ కాలాల్లో ఇక్కడి నుంచే పాలించారు. 1300 ఏళ్ల ఉనికిలో ఎన్నో ఉత్థానపతనాలను చవిచూసింది. ప్రస్తుతం ఉన్న ఆర్కిటెక్చరల్ గొప్పదనం మాత్రం 70 ఏళ్ల వ్యవధిలో పాలించిన ముగ్గురు మొఘల్ రాజులకు చెందుతుంది – అక్బర్, జహంగీర్, షాజహాన్. వీళ్లే భారీ కట్టడాలతో ఈ గొప్ప కోటను నిర్మించారు.
అక్బర్ హయాంలో సామాన్య శకం 1560లలో సైనిక అవసరాల కోసం ఈ కోటను పునర్నించారు. కోట గోడలు 70 అడుగుల ఎత్తులో ఉన్నాయి. 1562లో ఈ కోట నిర్మాణం పూర్తయింది. ఈ కోట ఎప్పుడూ పటిష్ఠంగా యుద్ధానికి సన్నద్ధంగా ఉండేది. కోట నుంచి సైనికులు బయటకు వెళ్లేటప్పుడు వాయిద్యాలు మోగేవి. జెండాలు రెపరెపలాడేవి.
ఆగ్రా కోట భారీ దర్వాజాలు, బురుజులు, దర్బార్ హాల్స్, భవనాలతో ఉంటుంది. వాణిజ్య ప్రాంతాలు, బహిరంగ స్థలాలతో ఉంటుంది. ఏనుగులు, గుర్రాలు కూడా ఉండేవి. ఆగ్రా కోట నిర్మాణంలో రాజ్ పుత్ శైలి, తిమురిడ్ (ఇరాన్ – మధ్య ఆసియా) శైలి మిళితం కావడాన్ని కూడా చూడవచ్చు. పొడువాటి హాల్స్, పెవిలియన్స్, కంట్రీయార్డస్ ఉన్నాయి. హిందూ ముస్లిం అలంకరణలతో నిర్మితమయ్యాయి. ‘బెంగాల్, గుజరాత్ అద్భుతమైన డిజైన్లతో 500 భవనాలు’ కోటలో ఉన్నట్లుగా అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు అబుల్ ఫాజల్ పేర్కొన్నాడు. రాజ్ పుత్ కుటుంబానికి చెందిన అక్బర్ భార్య కోసం నిర్మించిన జహంగీరీ మహల్ మధ్యఆసియా ఆర్చీలను, రాజ్ పుత్ శైలిని మిళితం చేస్తుంది.
షాజహాన్ ఈ కోటకు మరెన్నో భవనాలను, మసీదులను జోడించాడు. వాటి నిర్మాణానికి పాలరాతిని వినియోగించాడు. ఎన్నో స్తంభాలతో కూడిన దివాన్ -ఇ-ఆమ్‍ను నిర్మించాడు. కోహినూర్ వజ్రం మధ్యలో మెరిసిపోతుండగా నెమలి సింహాసనంపై ఆసీనుడయ్యేవాడు. ఒక్క వందేళ్ల కాలంలోనే ఆ కోటలో మొఘల్ రాజులు ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. కోట గుమ్మటాల ఎత్తు పెంచారు. ఎంతో దూరం నుంచి కూడా అవి కనబడుతుంటాయి. రాజుల ఆంతరంగిక మందిరంగా ఉండే ఖాస్ మహల్ మరింత ఆకర్షణీయతను సంతరించుకుంది. ముంతాజ్ మహల్ కోసం నిర్మించిన మూసామాన్ బురుజు అష్టభుజి ఆకారంలో ఉండేది. అక్కడి నుంచి చూస్తే యమునా నది కనిపిస్తుంది. వీటికి తోడుగా హమామ్స్, శీష్ మహల్ కూడా అందంగా నిర్మించారు.
విషాదం ఏమిటంటే షాజహాన్ తన కుమారుడు ఔరంగాజేబు ద్వారా బందీ అయింది కూడా ఇక్కడే. అక్కడి నుంచి ఆయన యమునా నదిని మాత్రమే చూడగలిగే వాడు. చరమాంకంలో ఆయన కోట దాటి వెళ్లలేకపోయాడు. తాజ్ మహల్‍లో ముంతాజ్ మహల్ సమాధి పక్కనే ఆయనను సమాధి చేశారు. వరల్డ్ హెరిటేజ్ సైట్‍గా ఆగ్రా కోట అందరినీ ఆకట్టుకుంటోంది. ఏఎస్‍ఐ దీని రక్షణ, నిర్వహణ బాధ్యతలు చూస్తోంది.
- అమితా బేగ్
అనువాదం : ఎన్. వంశీ