పుస్తక ప్రదర్శనలో విభిన్న ఇతివృత్తాలతో వైవిధ్యభరిత రచనలు
![](http://deccanland.com/wp-content/uploads/2025/01/Screenshot_3.jpg)
పుస్తకం కొత్త పుంతలు తొక్కుతోంది. యువతరం సృజనాత్మకతకు పట్టం కడుతోంది. కథ, నవల, చరిత్ర, పక్రియ ఏదైనా సరే కొత్త తరం ఆలోచనలకు, భావజాలానికి ఊపిరిలూదుతోంది. సామాజిక మాధ్యమాల ఉద్ధృతిలో.. పుస్తక పఠనం ప్రమాదంలో పడిపోయిందనే ఆందోళన వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణంలోనూ ఠీవీగా దర్శనమిస్తోంది. వైవిధ్యభరితమైన సాహిత్యంతో పాఠకులను ఆకట్టుకొంటోంది. సామాజిక జీవనంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త ఇతివృత్తాలతో పాఠక ప్రపంచాన్ని తట్టి లేపుతోంది. పుస్తకానికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఒక్కో పుస్తకం వందలు, వేల సంఖ్యలో అమ్ముడవుతోంది. ఈ క్రమంలోనే నవ తరం పాఠకుల అభిరుచికి ప్రాతినిధ్యం వహించే కొత్తతరం రచయితలు ముందుకు వస్తున్నారు. తమదైన ప్రాపంచిక దృక్పథంతో, భావజాలంతో అద్భుతమైన రచనలు చేస్తున్నారు. హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో యువ రచయితల పుస్తకాలు, స్టాళ్లు పాఠకులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ రచయితల కోసం స్వయంగా 7 స్టాళ్లను ఏర్పాటు చేసింది. మరోవైపు పలు ప్రచురణ సంస్థలు సైతం యువ రచయితలకు సముచితమైన ప్రోత్సాహాన్ని అందజేస్తున్నాయి. ఇంచుమించు అన్ని స్టాళ్లలోనూ కొత్త తరం రచయితల పుస్తకాలు కనిపిస్తున్నాయి. దీంతొ పుస్తక ప్రదర్శన సందర్శకులతో కళకళలాడింది.
కొత్తగా.. పొత్తమొచ్చెనా..
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రతి సంవత్సరం కొత్త రచయితలను పరిచయం చేస్తోంది. ఏటా లక్షలాది మంది పాఠకులు పుస్తక ప్రదర్శనకు తరలి వస్తున్నారు. వేలాది పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. సమస్త ప్రపంచం మొబైల్ ఫోన్లోనే ఇమిడి ఉందని భావిస్తున్న పరిస్థితుల్లోనూ పుస్తకమే సమస్తమై పాఠకులకు చేరువవుతోంది. కొత్తగా రాయాలనుకొనే ఎంతోమందికి ఇది స్ఫూర్తినిస్తోంది. ‘ప్రతి సంవత్సరం బుక్‌ఫెయిర్‌కు వస్తాను. మొదట్లో పెద్దగా పుస్తకాలు చదివే అభిరుచి కూడా లేదు.. కానీ క్రమంగా అలవాటైంది. ఓ 20 పుస్తకాలు చదివిన తర్వాత నేను కూడా రాయగలననే ఆత్మస్థైర్యం వచ్చింది. ఇప్పుడు రాస్తున్నాను’ అని ఓ యువ రచయిత చెప్పారు. సామాజిక దృక్పథంతో రాస్తున్న వాళ్లు కూడా వినూత్నంగా తమ ఆలోచనలను ఆవిష్కరిస్తున్నారు. ‘తాము సైతం’ అంటూ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో భాగస్వాము లవుతున్న పలువురు యువ రచయితలు తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకున్నారు. వారిని అభినందిద్దాం.
- ఖైజర్ భాష
ఎ : 9030 6262 88