సాహిత్య విమర్శలో విభిన్న, విలక్షణ స్వరం ‘సమన్వయ’

డా।। ఎస్‍.రఘు వృత్తిరిత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులు. ప్రవృత్తిరిత్యా కవి, సాహితీ విమర్శకులు, సమీక్షకులు. తెలుగు సాహిత్య బోధన, సృజన, విమర్శనా రంగాలను ‘సమన్వయం’తో సుసంపన్నం చేస్తుండటం హర్షణీయం. కవిత్వం, విమర్శ రెండింటిని ఉత్తమ ప్రమాణాలతో వెలువరించినవారు అరుదు. ఇట్లాంటి వారిలో రఘు ఒకరు.


డా।। ఎస్‍.రఘు విద్యార్థి దశ నుండే సృజనాత్మక సాహిత్యం వెలువరిస్తున్నవారు. వయసు, విద్యార్హతలు, లోక పరిశీలన, జీవితానుభవాలు పెరుగుతున్నకొద్ది చిక్కని జీవనలిపి నానీలను, వచన కవిత్వాన్ని, విమర్శను, సాహిత్యలోకానికి అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వెలువడిన ‘సమన్వయ’ సాహిత్య వ్యాస సంపుటి విమర్శన పక్రియలో వీరికి మొదటి గ్రంథం. ఇందులోని వ్యాసాలు చదివినవారెవరైనా దీనిని విమర్శ పక్రియలో మొదటి వరుసలో చేర్చి తీరుతారు.పుష్కరకాలం క్రితం ప్రారంభమైన వీరి సాహిత్య సమీక్ష, విమర్శ నేడు స్ఫూర్తివంతంగా కొనసాగుతుంది.


డా।। రఘుకు కవిత్వం ఎంత అభిమాన పక్రియో కథ కూడా అంతే. వారితో మాట్లాడినా, వారి విమర్శ, సమీక్షలు చదివినా ఈ విషయం స్పష్టమౌతుంది. ఒకరకంగా ఈ రెండు (కవిత, కథ) పక్రియలు బహిర్నేత్రాలు అయితే విమర్శ అంతర్నేత్రం. అందుకే వీరి విమర్శ త్రిగుణాత్మకంగా నిష్పాక్షికతతో ఉంటుంది. ఆధునిక సాహిత్యం, సాహిత్య పక్రియలపై లోతైన అవగాహన, అనవరత అధ్యయనం మూలంగా ఆయా రచనల్లోని సామాజిక పరిస్థితులను ఉన్నత ప్రమాణాలతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు వ్యాఖ్యానించగలిగారు. వట్టికోట ఆళ్వారుస్వామి ‘‘జైలు లోపల’’ కథలపై రాసిన ‘‘జైలులోపల కథల్లో వట్టికోట హృదయం’’ వ్యాసం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ వ్యాసం ద్వారా వాటిలోని ఆరు కథలు (పరిగె, మెదడుకు మేత, పతితుని హృదయం, అవకాశం ఇస్తే, మాకంటే మీరేం తక్కువ)లను, వాటి నేపథ్యాలను ప్రతిభావంతంగా విశ్లేషించడం ద్వారా రచయిత ప్రతిభ, సమాజంపట్ల వారు నెరవేర్చిన బాధ్యతను, నాటి సమాజపు తీరుతెన్నులను సరిగ్గా అంచనా వేసి నేటి పాఠకులకు భవిష్యద్వర్తమానాలకు నేపథ్యమైన భూతకాలపు జ్ఞానాన్ని ఆకళింపు చేస్తారు. అందుకు ఈ వాక్యాలు చక్కని ఉదాహరణ. ‘‘ఆళ్వారుస్వామి తెలంగాణ తొలి ప్రజారచయిత. ఒక రచనకు వస్తువును కాల్పనిక లోకం నుండి తీసుకొని భావుకతా ధోరణిలో రాసే సాధారణ ఆత్మాశ్రయ రచయిత కాదు ఆళ్వారుస్వామి. ప్రజాదరణ కోసమో, కీర్తి వ్యామోహంతోనో, సంచలనాత్మక వైఖరితోనో రచనా వ్యాసంగాన్ని స్వీకరించలేదు. తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని సమస్యలు, అస్తవ్యస్త రాజకీయ పరిస్థితులు, అనివార్య స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, తన ప్రాంత విముక్తి కోసం, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాల కోసం నిరంతరం తపించిపోయిన నిబద్ధ రచయిత, నిస్వార్ధ ఉద్యమ సారథి. జైలు జీవితంలోనూ సాటి ఖైదీల హక్కుల కోసం పోరాడాడు.ఖైదీలతో కాలక్షేపం చేయకుండా వాళ్ళ జీవిత మూలాల్లోకి వెళ్ళి ఒక్కొక్కరి విషాద వృత్తాంతాలతో మమేకమై వాటిని కథలుగా మలచగలిగాడు. పరిసరాలు, సామాజిక నేపథ్యాలు, రాజకీయ వాతావరణం మనుషులను ఏ దుస్థితికి తీసుకువెళ్తాయో ‘జైలులోపల’ కథలు చదివితే అర్థమవుతుంది… పాలనా వ్యవస్థకున్న హింసాత్మక ప్రవృత్తి, బతుకుదెరువుకు అడ్డంపడే ఆధిపత్యవర్గాల పెత్తనం, పుట్టుబానిసలా చూస్తూ వెట్టిచాకిరి చేయించుకోవాలనే వాతావరణం మీద జైలు జీవితం తర్వాత స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లుగా ఆళ్వారుస్వామి తదనంతర జీవితాన్ని, రచనల్ని చదివితే అర్థమవుతుంది’’ అని విశ్లేషించారు. ఎస్‍.రఘు ‘జైలులోపల’ కథల ద్వారానే నాటి వ్యవస్థలోని రుగ్మతలనన్నింటిని చెప్పటంతోపాటు ఆళ్వారుస్వామి సమగ్ర జీవిత దృక్పథం ఆవిష్కరించడటం విశేషం.


వైజ్ఞానికాభివృద్ధి అన్ని రంగాలలో శరవేగంగా జరుగుతున్న కాలమిది. కాలం గడుస్తున్నకొద్దీ, మనిషి ఆధునికతను సంతరించుకుంటున్నకొద్దీ, నాగరికతను పెంపొందించుకుంటున్నకొద్దీ జీవితాన్ని సాఫీగా, సుఖంగా గడిపితీరాలి. కాని మరిన్ని సంక్లిష్ట సమస్యల్లోకి, ఊహించని కొత్త సమస్యల్లోకి కూరుకుపోతూ దుర్భర జీవితాలను గడిపే దురదృష్టవంతులే ఎక్కువగా కనిపిస్తున్నారు. వీటిని ఆధునిక తెలంగాణ కథలు అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాయి. ఆ పరంపరలో వచ్చినదే కోట్ల వనజాత ‘‘ఇత్తు’’ కథల సంపుటి. దీనిని సమీక్షిస్తూ రఘు తెలంగాణ కథా ప్రస్థానాన్ని ఎంత సమర్థవంతంగా చిత్రించారో వారి ఈ మాటల్ని అవలోకిస్తే స్పష్టమవుతుంది. ‘‘జీవితానికి ఎన్ని వెలుగునీడల పార్శ్వాలున్నాయో కథలోనూ అవన్నీ ప్రతిఫలిస్తాయి. కథ మానవ స్పందనల్ని విడిచి, జీవిత సరిహద్దు రేఖల్ని దాటి అడుగుకూడా ముందుకు వేయదు. కథను కష్టాల కూడలిలో దు:ఖాన్ని ఆవిష్కరించుకునే వేదికగా, అంతరంగాల్ని అర్థం చేసుకునే మానసిక శాస్త్రంగా మలచుకున్నాం. కథను ఒక్కోసారి రాజకీయ పాఠశాలగా, ఉద్యమ కార్యక్షేత్రంగా, మనసు మడతల్లో దాచుకున్న నెమలీకలా, కవి సంచరించే ఉద్వేగ ఉద్యానవనంగా తీర్చిదిద్దుకున్నాం. ఈ వరసలో తెలంగాణ కథ సామాజిక ఉద్యమాల్ని, పోరాటాల్ని చిత్రిస్తూనే కొత్త దిద్దుబాటలో ప్రయాణం మొదలుపెట్టింది (పుట:45). కథా పక్రియకున్న తాత్వికశక్తిని ఆవిష్కరించిన మాటలివి. కవిత్వం కథలను సమన్వయ దృష్టితో విమర్శ చేస్తూ నేడు వాటి వస్తు వైవిధ్యం, విస్తృతి, తాత్విక నేపథ్యాలను చర్చించడంతోపాటు పాఠకుడికి ఆయా పక్రియల విజ్ఞానం అందించడం రఘు విమర్శలోని అదనపు ప్రయోజనం.


సంస్థాన పాలకుల, జమీందార్ల, గ్రామీణ పెత్తందార్ల, అధికార్ల వల్ల ప్రజలు సర్వవిధ పారతంత్య్రాలకు లోనుకావటం వట్టికోట ఆళ్వారుస్వామి కాలపునాటి అవలక్షణాలు, సర్వత్రా వ్యాపించిన స్వార్ధం నేటి కాలపు అవలక్షణాలు. కాగా ప్రకృతి బీభత్సం, కరవు మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఎన్నటికీ ఎంతకూ ఎదగనీయని దయనీయ స్థితి. వాటిని సమర్థంగా తమ ‘ఇత్తు’ కథా సంపుటిలోని ప్రతి కథలో బలంగా చెప్పగలిగారు రచయిత్రి కోట్ల వనజాత. కథకురాలు పౌరసరఫరా శాఖ ఉద్యోగిని కావటంతో ‘ఇత్తు’ కథాసంపుటిలో సమకాలీన సమాజానికి చెందిన ఇతివృత్తాలు ప్రాధాన్యం వహించాయి.


‘ఇత్తు’లోని ‘బహుముఖం’ కథను సమీక్షిస్తూ ‘అప్రమత్తంగా లేకపోతే ఒకరి అత్యాశకు ఇంకొకరు బలవుతారు’ అని కథకురాలు ఒక పాత్ర ద్వారా చెప్పించిన మాటలను ఉటంకించి నేటి ‘కాలధర్మం’ ఎట్లా వికృతరూపం సంతరించుకుందో చూపించిన వారయ్యారు. పాలలో కనిపించని వెన్నలాగ ప్రతీచో•, ప్రతీరంగంలో స్వార్థపరులు, అత్యాశాపరులు ఉన్నారన్న సత్యాన్ని ‘విమర్శ’ ద్వారా చెప్పటమూ అవసరమైన ఒక అత్యావశ్యక కళ. ఈ కళలో నేర్పరి రఘు.


ఇక నిలువరించలేమేమో అన్నంత వేగంగా ఆంగ్లభాషా ప్రాబల్యం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ భాష, యాసలోని మాధుర్యాన్ని, అందులోని మన అస్తిత్వాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత తెలంగాణ సాహితీవేత్తలపైన ఎంతో ఉంది. ఆంగ్లభాషా వ్యామోహాన్ని నిలువరించటమే ప్రధాన కారణం కాకపోయినా నేల-చెట్టు, తల్లి-బిడ్డలకున్న విడదీయరాని అనుబంధమే తెలంగాణ ప్రజలు-తెలంగాణ భాష, యాసలకున్నదన్న సత్యాన్ని తమ కథల ద్వారా ప్రకటించిన విదుషీమణి డా।।పాకాల యశోదారెడ్డి. ఒకజాతి అస్తిత్వాన్ని కాపాడేవి వారి భాషా సంస్కృతులే అన్న విషయాన్ని ప్రగాఢంగా విశ్వసించినవారు యశోదారెడ్డి. అందుకే తన సమకాలికులు ఏమన్నా పట్టుదలతో తన కథల ద్వారా తెలంగాణ భాష-యాసలకు పట్టం కట్టినారనవచ్చు. ‘యశోదారెడ్డి కథలు-ప్రాంతీయ జీవనచిత్రణ’’ అన్న వ్యాసంలో రఘు తనదైన ప్రత్యేక విమర్శనాత్మక శైలిలో యశోదారెడ్డి రచనలను ఎలా మదింపు చేశారో చూడండి. ‘‘ప్రబంధయుగంలోని కవులు వర్ణనల కోసమే ప్రబంధ రచనలు చేశారా అన్నట్లుగా యశోదారెడ్డి తెలంగాణ భాషా సౌందర్యాన్ని, సం స్కృతిని మాండలిక యాసలోని ఆకర్షణను లోకానికి వెల్లడి చేయాలనే ఆకాంక్షతోనే కథారచన చేశారు. ‘ఒకజాతి సంస్కృతికి భాష ఆయువుపట్టు వంటిది. ఆ ప్రత్యేకత, ఆచారములు, వ్యవహారములు, ఆహార విహారాదులన్నింటిని అద్దమునందువలె ప్రతిఫలింపచేయునది. ఆ భాండాగారములో జాతీయములు, పదబంధములు, సామెతలు, ఉపమానములు, అలంకారోక్తులు, విశేషోక్తులు, ప్రౌఢోక్తులు ఎన్నియో చేరి ఉండును. ఆ విశిష్ట సంపత్తిని తాననుభవించి మరికొంత చేర్చి భద్రముగా తన తరువాతి తరములకప్పగించుట జాతీయుని కనీసపు ధర్మము’’ అని యశోదారెడ్డి స్పష్టంగా ‘‘మా ఊరి ముచ్చట్లు’’ ముందు మాటలో చెప్పారు. అంతేకాదు విశాలాంధ్రలోని ఆంధ్ర, తెలంగాణ ప్రాంతీయ భాషలకు సమన్వయము సరిగ్గా కుదరలేదు. ఒకరాడు భాష మరొకరికి వింతగా తోచినదనే చేదు నిజాన్ని ఆనాడే గుర్తించి నిర్మొహమాటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరవయ్యవ శతాబ్దం ఉత్తరార్థంలో ప్రారంభమైన ఉర్దూ భాషా ప్రభావం, రెండున్నర జిల్లాల భాషా ఆధిపత్యాల మధ్య తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని, తెలంగాణ భాషా వైభవాన్ని కాపాడాలని సంకల్పించుకున్నారు. ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో కథారచనకు పూనుకోవడం ఒక చారిత్రక ధర్మంగా భావించిన తొలి రచయిత్రిగా యశోదారెడ్డిని గుర్తించవచ్చునని తీర్మానించడం ద్వారా చారిత్రక ధర్మం, బాధ్యతతోపాటు సమకాలీన ధర్మాన్ని పాటించే సాహితీవేత్తలు మాత్రమే భవిష్యత్తరాలకు స్ఫూర్తి నింపగలరన్న విషయాన్ని చెప్పకనే చెప్పినారు.


రఘు తెలంగాణ ప్రాంతీయుడైతే కావచ్చు. ఇక్కడి భాష, యాసలపై, మట్టిపై మమకారం ఎనలేనిదే కావచ్చు. కాని భూగోళం నిండా దాగున్న మానవ సంవేదనలన్నీ సాహితీవేత్తలకు ప్రధాన వస్తువులేనన్న ఎరుకతో ప్రాంతీయావధులను దాటి ఆలోచించగల సహృదయ విమర్శకుడు. డా।।చింతకింది శ్రీనివాసరావు ‘కాన్పుల దిబ్బ’ కథా సంపుటిని సమీక్షించడం ద్వారా చాటిచెబుతారు. ఈ దృక్కోణంలో రాయబడిందే కళింగాంధ్ర నేలలో ‘కథల కానుపు’ అనే వ్యాసం.
కథ, కవిత, విమర్శ డా।।రఘుగారికి అభిమాన పక్రియలు. కథలను విశ్లేషించినంత స్థాయీస్ఫోటనంతోనే కవితలనూ విశ్లేషిస్తారు. ఇది రఘులోని సాహిత్యకారుడి బహుముఖీనత.కవిత్వాన్ని, అందలి మర్మాలను విప్పిచెప్పటంలోని నేర్పు వీరి వ్యాసాలలోని అక్షరమక్షరంలో తొణికిసలాడుతుంది.


విమర్శకులు చాలామంది సాధారణంగా కవితను ఉటంకించి అందులోని అంశాలనే యధాతధంగా వ్యాఖ్యానిస్తారు. కాని రఘుగారు కవిత, కవి నేపథ్యం, కవి హృదయం, వాటి మూలాలు పట్టుకొని పొట్టుకు పొట్టు, గింజకు గింజ ఒలిచి చూపిస్తారు. దానికి ఎన్‍.గోపి గారి ‘‘వాన కడిగిన చీకటి’’ కవితాసంపుటిపై రాసిన ‘‘కవిత్వం కడిగిన చీకటి’’ వ్యాసం ఒక ఉదాహరణ. అందులో ఉటంకించిన గోపిగారి కవితా పంక్తులు, రఘు విశ్లేషణ చూస్తే నా అభిప్రాయంతో మీరూ ఏకీభవిస్తారు. అది: ‘‘ఇప్పుడు లోపల కూడా వర్షం/ఏదో జరుగ కూడనిది జరిగినట్టు/ఒక అసహజ వికృత శీతవాయువు పరుగులు పెడ్తుంది/ప్రవాహంలో ఒక రక్తపుజీర /ఇటే కొట్టుకొస్తుంది/నీటిలో మునిగిన పాదాలు వొణుకుతున్నాయి/ఇది నిన్న తూటాలకు కూలిన/వీరుని నెత్తురు కదా!/ఇప్పుడు అతడూ నేనూ తప్ప / రోడ్డుమీద ఎవరూ లేరు’’ – నిజంగానే పాఠకుడు సమకాలీన వ్యవస్థలోని భీతావహ దృశ్యంలో పాత్రధారిగా, ఒంటరిగా వర్షంలో తడుస్తూ నిలబడిపోతాడు. ఇక్కడ కవి కురిపించిన వర్షం సహజమైన వర్షంలా లేదు. సామాజిక అస్తిత్వ ఉద్యమాల మేఘాల నుంచి కురుస్తున్న నెత్తుటి వర్షం ఇది. గోపిగారు ఉద్యమ క్షేత్రంలోకి, జెండాల నీడల్లోకి, వైయక్తిక వాదోపవాదాల్లోకి ప్రత్యక్షంగా ప్రయాణించరు. కాని వాటిలోని ఆదర్శాలను, ఆశయాలను, లక్ష్యాలను ఏనాడు విస్మరించలేదు. అవసరమైన సందర్భాల్లో తన చైతన్యాన్ని తీవ్రంగా ప్రకటించారు. ప్రగతిశీల మానవీయ విలువలకు గల ప్రాధాన్యాన్ని నిరూపించారు.’’ గోపిగారి కవిత్వం చదివిన అందరికీ అందే భావన కాదిది. రఘులాంటి ప్రతిభా విమర్శకులకు మాత్రమే అందేది.


‘‘ఎన్‍.అరుణ కవిత్వంలో నాస్టాల్జియా’’ అన్న వ్యాసంలో ‘‘భూమి పొరల్లో ఎన్నో విలువైన ఖనిజాలు, ముడిపదార్ధాలు నిక్షిప్తమై ఉంటాయి. అవి ఆ ప్రాంత సహజ సంపద. అలాగే మనిషి గుండెల్లో ఎన్నో అమూల్యమైన అనుభవాలు, జ్ఞాపకాలు దాగి ఉంటాయి. అవన్నీ ఆయా వ్యక్తుల వైయక్తిక భావోద్వేగాల జీవన నిధులు. ప్రతి మనిషి కొన్ని సందర్భాల్లో అసంకల్పితంగా వెనకటి జ్ఞాపకాల్లోకి వెళ్ళి విహరించి వస్తాడు. ఆ విహారంలో ఒక తెలియని ఆనందం, ఆవేదనల మిశ్రమాను భూతులకు లోనైన మనిషి కవి అయితే దాన్ని అద్భుతమైన కవిత్వంగా మలుస్తాడు. కవితాసృజనలో ఇది ఒక సహజమైన సందర్భం. బలమైన కవి సమయం.’’ అని నాస్టాల్జియాకు రఘు చెప్పిన నిర్వచనం ఆమోదయోగ్యంగా స్థిరపడుతుంది. విమర్శకులు కొన్ని సందర్భాల్లో కొన్ని పక్రియలకు, కవుల కవితలకు వెలువరించిన అభిప్రాయాలు నిర్వచనాలుగా స్థిరపడుతాయి. ఈ ‘సమన్వయ’లో నిర్వచనప్రాయమైన అభిప్రాయాలు సూత్రాలు ఆ వరుసలోకి చేరతాయి.


ప్రశాంతమైన ప్రజా జీవితాల్ని అస్థిరపరిచిన దుష్ట శక్తులకు సంధించిన దామెర రాములు కవితాత్మక ప్రశ్నలను వివరిస్తూ రఘు చెప్పిన మా•లు ప్రస్తావవనార్హం. ‘‘దశాబ్దాల క్రితం విసిరిన ఈ ప్రశ్నలకు ఇన్నాళ్ళైనా సమాధానం దొరకడం లేదు. దారి పొడుగునా రక్తతర్పణం చేసిన దేహాలు మొలకెత్తుతున్నాయి. అడుగడుగునా నిలువెత్తు స్మారక స్థూపాలు పుట్టుకొస్తున్నాయి. ఊరేగింపులో ముందువెనుకలుగా నినాదమైన గొంతు అకస్మాత్తుగా అదృశ్యమైపోతుంది. జీవితమే ప్రశ్నార్థకమైన వేళ ప్రశ్నల కొడవళ్ళు మరింత పదునెక్కి పనిచేయాలి. ఆయుధం అలంకారం కాదు. ఉపమానం అసలే కాదు. ప్రతీక ముసుగులో దాగుడు మూతలాటలసలే కుదరదు. ఆయుధం క్రియావాచకమై వికసించాలి.’’ ఈ మాటల ద్వారా రఘు ప్రజాపక్షమేనని చెప్పవచ్చు. అవును, కవి ప్రజాపక్షమైనప్పుడు సహృదయ విమర్శకుడూ కవి దారిన నడువక తప్పదు. ఆతని సిద్ధాంతాన్ని చదువక తప్పదు. ‘సమాజ హితేన సహితం సాహిత్యం’ అన్న ఉక్తికి అర్థం ఇదేకదా!
డా।।కూరెళ్ళ విఠలాచార్య ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన ఎం.ఫిల్‍. సిద్ధాంత గ్రంథం ‘‘తెలుగులో గొలుసుకట్టు నవలలు’’ విశిష్ట పరిశోధనగా భావించవచ్చు. గొలుసుకట్టు నవలలపై తెలుగులో 1973 నాటికి ఎట్లాంటి సమాచారం లేదు. అయినా ఆ అంశంపై పరిశోధన చేయ సంకల్పించటం డా।।కూరెళ్ళ వారి ఆత్మవిశ్వాసం, పరిశోధనాసక్తి, అభిరుచి, ప్రతిభలకు మించి సాహసం చేశారనే చెప్పవచ్చు. ఈ పక్రియపై వచ్చిన సిద్ధాంత గ్రంథం, పరిశోధనా గ్రంథాలలో ఇదే మొదటిది. ఇప్పటివరకు ఇదే చివరిది. ఒక ప్రామాణిక పరిశోధనా గ్రంథంగా నేటికీ దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గ్రంథ సమీక్ష చేస్తూ రఘు నేటి పరిశోధక విద్యార్థులకు ఎన్నో విలువైన సూచనలు చేశారు. అవి: పరిశోధక విద్యార్థిలో క్రమశిక్షణ, జిజ్ఞాస, అధ్యయనం, ఎన్నుకొన్న అంశంపై అవగాహన, చైతన్యం నేపథ్యం తెలిసి ఉండడం లేదా తెలుసుకోవడం, ప్రభావాలు, ప్రయోజనాలు, ప్రయాసలు, కృతాద్యవస్థలు, అసౌకర్యాలు, క్షేత్రపర్యటనలు, సంబంధిత వ్యక్తులతో ఇంటర్వ్యూలు, వారి అంగీకారం, వీటన్నింటికి తోడు ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉండితీరాలి. ఇవన్నీ డా।।కూరెళ్ళ వారిలో కనిపిస్తాయి. రచన తప్ప ఏ ఆధారమూ లేని విషయంపై పరిశోధన చేయడానికి పడ్డ కష్టం, అనుసరించిన పద్ధతుల ఆధారంగా నిరూపించిన పరిశోధక విద్యార్థుల లక్షణాలుగా చెప్పవచ్చు. డా।।రఘు ఏ పక్రియపై వ్యాసం రాసినా అనేక కొత్త విషయాలు చెప్తూ విమర్శకు సంబంధించిన మౌలికాంశాలకే వన్నె తెస్తారు.


‘సమన్వయ’లో కథ, కవిత, పరిశోధన, నాటకం, చిత్రకళ, యాత్రాచరిత్ర పక్రియలపై పదహారు వ్యాసాలు మనకెంతో అవగాహన, సమాచారంతో పాటు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. విమర్శ ఒక దండకారణ్యం అనే భావన నుంచి చదివే పాఠకులకు ఇదొక పూలవనమన్న భావన ఈ వ్యాస సంపుటి ద్వారా కలిగించారు. అందుకు కారణం వీరు వాడిన భాష, వ్యక్తీకరణ విధానం. భావి పరిశోధకులకు, విమర్శకులకు, కవులకు, సాహిత్యాభిమానులకు స్ఫూర్తిమంతమైన విమర్శనాగ్రంథంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
ఈ ‘సమన్వయ’ గురించి, దీని కర్త గురించి ప్రముఖ విమర్శకులు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేకర్‍రెడ్డిగారి అభిప్రాయం గమనార్హం. ‘‘తెలుగు సాహిత్య విమర్శ ఎదగలేదు, చచ్చిపోయింది, ఉన్నట్టా, లేనట్టా, ఇంటెన్సివ్‍కేర్‍ యూనిట్‍లో ఉంది-వంటి విమర్శకులకు, అసంతృప్తులకు రఘు విమర్శ ధీటుగా సమాధానం చెప్పకపోయినా తెలుగు సాహిత్య విమర్శ ఎదుగుదలకు ఆయన విమర్శ ఆశాకిరణంగా కనిపిస్తుంది. తెలుగులో మరొక విమర్శక మొలక రఘు. ఈ మొలక మంచి చెట్టుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. రఘుకు విదూషక సాహిత్యం మీదకాని, విధ్వంసక, కాలక్షేప సాహిత్యం మీదకాని విశ్వాసం, ఆసక్తి లేదు. ప్రజాసాహిత్యంపైనే ఆయన మొగ్గు. ఈ నిబద్ధత నేటి అవసరం.’’ అని రాచపాళెం చంద్రశేఖర్‍రెడ్డిగారు అన్నట్లు రఘు ప్రజోపయోగ సాహిత్యంవైపే ఉన్నారు. విమర్శకాగ్రేసరులు రాచపాళెం వారికి రఘు వయసు, అనుభవంతో పోల్చుకున్నప్పుడు మొలకలా అనిపించవచ్చుగాక! కాని, నేటి ఆధునిక విమర్శలకు, పరిశోధక విద్యార్థులకు ఔషధమొలక. వీరి ‘సమన్వయ’ చక్కని మార్గసూచి. ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా దీనికి కామిశెట్టి జాతీయ పురస్కారం రావడం మంచి విమర్శకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొనవచ్చు.


గ్రంథం పేరు: ‘సమన్వయ’ (సాహిత్య వ్యాసాలు)
రచయిత: డా।।ఎస్‍.రఘు, పుటలు :168, వెల:150
మనస్వి ప్రచురణలు-2017, ప్రతులకు: డా।।జె.నీరజ
ఇం.నెం.3-10-33, గోఖలేనగర్‍, రామంతాపూర్‍,
హైదరాబాద్‍-13, మరియు ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.
-దాసోజు జ్ఞానేశ్వర్‍, ఎ : 9912138152

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *