సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వం, శిల్పం

‘మా గ్లూకోజ్‍ బాటిల్‍ బద్దలాయె’ అనే కవితా పాదం ద్వారా లక్ష్యార్థం అవగతమైతది. తద్వారా కవి, ఆయన కాలం, ఆ కవి మీద పనిచేసిన ప్రభావాలు తెలుస్తె, అలా కవి ఆ వస్తువును ఎంపిక చేసుకోవడానికి కారణాలతో పాటు, ఆ వస్తువు తీసుకున్న రూపం అర్థమవుతుంది. ఈ రూపం రావడానికి కారణమైన శిల్పం తెలుస్తుంది. శిల్పంలో భాగమైన భాష, ఆ భాషకే లేదా జాతికే పరిమితమైన జాతీయాలు, పదబంధాలు, సాంస్కృతిక ప్రతిఫలనాలు తెలిసొస్తాయి. కవి జాగరూకతతో వేసిన ఎత్తుగడ, సంకేతాలు, అలంకారాలు అవగతమవుతాయి.
ఇక్కడ గ్లూకోజ్‍ బాటిల్‍ ఏమిటి? ఇది రూపకమా, ఉపమా అన్న శాస్త్ర చర్చ కాస్త పక్కకు పెడితే ఆ గ్లూకోజ్‍ బాటిల్‍ ఇప్పుడు
‘గుత్తెదార్లకు ఉత్త వేలం కుప్ప
నగరాలకు తరలించే పైసల కుప్ప’
అనడం ద్వారా తాను ధ్వంసమైన వాగు ఉనికి గురించి మాట్లాడుతున్నాడని అర్థమవుతుంది. ప్రపంచీకరణ మాయాజాలం ఎన్ని రూపాలెత్తుతుందో కవికి తెలుసు. దాని అలజడికి ఇసకకు రెక్కలొచ్చాయి. భూగర్భ జలాలు పాతాళానికి జారుకున్నాయి. వాగులో తుప్పలు కూడా మొలవని దైన్యాన్ని పాఠకులకు స్ఫురణ తేవడం ఆయన లక్ష్యం. వాగు ఒక గ్లూకోజ్‍ బాటిల్‍గా బలాన్నిచ్చిన ఊర్లు ‘కాష్టాల గడ్డలైనాయని’ చెప్పడం ద్వారా పాఠకుడిలో బలమైన ముద్ర వేయడం కవి ఉద్దేశ్యం. వాచ్యంగా చెప్పిన వాక్యాలతో పాటు సౌందర్య కోణంలో మొదలు పెట్టి వాగు విధ్వంసాన్ని ఎండగట్టే లక్ష్యం వైపు లాక్కురావడంలో ఆయన చూపిన చతురత పాఠకుడిని అబ్బురపరుస్తుంది.
‘రాజకన్యల చనుదోయి మధ్య
ముత్యాల జాలువోలె
రెండు బోళ్ళ మధ్యనుంచి సక్కదనంగ
పారేది మా వాగు
ప్రేమికుడు చేతులు చాస్తే
పెదవుల మీద తడి వూరినట్టు
పిల్లలు పెదవులు సాపితే
బాలింత ఎద పొంగినట్లు
కాకులు రాళ్ళేయకుంటనే అందివచ్చినట్టు’
అంటూ ప్రేమికుల నుండి, రాచకన్యల నుండి తన కవితా పాదాలను వాగొడ్డుకు నడిపిస్తాడు. అంతలో వాచ్యం ఎంతో అక్కర పడి
‘రోడ్లు నీళ్ళకి పర్యాయపదం కాదు
కంప్యూటర్లు నీళ్ళకి పర్యాయపదం కాదు
ఫ్లైఓవర్లూ, కార్ల రేసులూ నీళ్ళకి పర్యాయపదం కానేకావు
నీళ్ళకు నీళ్ళే పర్యాయపదం
మా వాగు మాకు కావాలె’
అని కుండ బద్దలు కొట్టే ప్రవచనం చెప్తడు. ధ్వంసమైన వాగు చిత్రాన్ని పాఠకుల మనోఫలకం మీద ముద్రిస్తాడు. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ‘గుత్తెదార్లకు వేలం కుప్ప, నగరాలకు తరలించే పైసల కుప్ప’అనే అంత్యప్రాసపడింది. అయితే ఈ కవి అంత్యప్రాసలకు, ఇతర శబ్దాలంకారాలకు వ్యతిరేకి. అయినా ఈ అంత్యప్రాస పడిందంటే అది భావావేశంలో అలవోకగా వచ్చిపడ్డ ప్రాస. గ్లూకోజ్‍ బాటిల్‍ను ధ్వంసమైన వాగుకు సంకేతం చేయడం తెలుగు కవిత్వంలో కొత్త. నూతనత్వం సుంకిరెడ్డికి తెలిసిన రసవిద్య. ఆ రస విద్య ఒకనాడు పరిణతి పొందింది కాదు. ఆయన శిల్పం అలవోకగా వచ్చిందికాదు.


సుంకిరెడ్డి నారాయణరెడ్డి విద్యార్థిగానే చలనశీలి. ప్రజా సాహిత్యంతో, వామపక్ష భావజాలంలో స్ఫూర్తి పొందిన వ్యక్తి. యూనివర్సిటీ మిత్రులతోకలిసి ‘ఈ తరం యుద్ధ కవిత’ కృషి ప్రారంభమయింది. 1986 నుండి 1991 వరకు విపశ్యన బులిటెన్‍లు తీయడం, వాటిని ‘సముద్రాలతో సంఘర్షణతో’ సంకలనంగా తీసుకురావడం ఆయన కవిత్వ గమనంలో మజిలీలు. ‘బహువచనం’ సుంకిరెడ్డి కృషితో వచ్చిన దళిత సంకలనం. తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్రను ‘ముంగిలి’గా, సామాజిక చరిత్రను ‘తెలంగాణ చరిత్ర’గా రాసి ఆయన సాహిత్య, సామాజిక నిబద్ధతను చాటుకొని తెలంగాణ సారస్వతాన్ని సుసంపన్నం చేసాడు. ఇవి కాకుండా తెలంగాణ సాహిత్య చరిత్ర, సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వ్యాసాలు ఆయన కృషికి అద్దం పడతాయి. ఇతర కవులతో కలిసి రాసిన విపశ్యన, నల్లవలస కవిత్వం తెలంగాణలో ఒక ఖచ్చితమైన, చారిత్రక పాత్రను పోషించాయి. విపశ్యన సంకలనాలు/ బులిటెన్‍లు అరసం- విరసం మధ్యకాలంలో కవిత్వ స్థబ్దతను ఛేదించడానికి జరిగిన ప్రయత్నాలలో దిగంబర, తిరగబడు, చేతనావర్త కవులతో పోల్చదగ్గది. ఈ కోణంలో చూసినప్పుడు సుంకిరెడ్డి వ్యక్తిగత కవిత్వం మీద శ్రద్ధపెట్టాలన్న ‘వ్యూహం’ లేని ఉద్యమకారుడిగా కనిపిస్తాడు. అటు వామపక్ష ఉద్యమాలకు, అస్తిత్వ ఉద్యమాలకు ఆలంబనగా ఉండి శ్రమ చేయడంలో మునిగి, చరిత్ర, సాహిత్య పరిశోధకుడిగా తెలంగాణ సమాజం విస్మరించలేని సేవ చేసాడు. వ్యక్తిగతంగా మూడు సంకలనాలను ప్రచురించాడు. అవి ‘తోవ ఎక్కడ’, ‘దాలి’, ‘తావు’. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, స్త్రీ, దళిత, మైనారిటీవాద ఉద్యమాలతోపాటు, ఇతర వామపక్ష ఉద్యమాలతో ఆయన కలిసి నడిచిన తీరు, తెలంగాణ సాధనలో ఆయన చేసిన కృషి ఈ మూడు కవితా సంకలనాలలో అర్థం చేసుకోవచ్చు. ‘దాలి’ దీర్ఘకవిత, తోవ ఎక్కడ, తావు సంకలనాల ద్వారా సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవితా శిల్పాన్ని అంచనా వేయవచ్చు.


తెలంగాణ ఉద్యమంలో భాగంగానే సుంకిరెడ్డి తెలంగాణ చరిత్రను, తెలంగాణ సాహిత్య చరిత్రను రాసారు. ఒక ‘తోవ ఎక్కడ?’ తప్ప దాలి, తావు తెలంగాణ ఉద్యమ కవిత్వమే. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో భాగంగా కొత్తగా కవిత్వం రాయడం, పాతకవులను వెలికి తీయడం జరిగింది. ఈ క్రమంలో పాల్కురికిని తొలి తెలుగు కవిగా నిరూపించడమూ జరిగింది. TS Eliot అన్నట్లు’Only those who will risk going too, far can possibly find out how far one can go’.
విపశ్యన, నల్లవలస ఇతర కవులతో కలిసి రాసినవి. అందులో ఏ కవితా వాక్యాలు ఎవరివో గుర్తించి, చెప్పడమూ కష్టమే. విపశ్యన అన్ని బులిటెన్‍లూ కలిపితే రాశి అవుతుంది కాని నల్లవలస రాశిలో చిన్నది. ఆ దృష్ట్యా తోవ ఎక్కడ. దాలి, తావులు శిల్పం అంచనా వేయడానికి సరియైన సంకలనాలు. తోవ ఎక్కడ సంకలనంలోని కవితలు వివిధ సామాజిక అంశాలపై రాయబడ్డప్పటికీ కొనసాగుతున్న ప్రజాపోరాటాలలో సింహభాగం ప్రజలను కలుపుకుపోవడంలో విఫలమైన ప్రజా ఉద్యమాల తర్వాత దశలోని అస్పష్టతను వ్యక్తీకరించింది. దానికి ముందుమాట రాసిన అసుర ‘కవిత్వం సరే, తోవ ఎక్కడో సుంకిరెడ్డి చెప్పాలె’ అని వేసిన ప్రశ్న సాహిత్య ప్రియులకు బాగా గుర్తుంది. ప్రశ్న వేసినవారు ఇతిమిద్ధంగా సమాధానం చెప్పితీరడం సాధ్యమయే పనికాదు. ఇది సుంకిరెడ్డికి కూడా వర్తిస్తుంది. మలిదశ తెలంగాణ ఉద్యమం తీవ్రం కాకముందు క్రాంత దర్శి అయిన కవి రాసింది దాలి. ఇందులో రైతుల సమస్యను కవితాత్మకంగా వ్యక్తీకరించడం జరిగింది. ఉద్యమం తీవ్రమైన కాలంలో, రాష్ట్రం సిద్ధించాక వచ్చిన కవితలతో కూడుకున్నది తావు. ఈ సంకలనాల ఆధారంగా సుంకిరెడ్డిది measured language of emotions అనిపిస్తది. Robert Frost చెప్పినట్లు సుంకిరెడ్డి కవిత్వం emotion has found its thought and the thought has found wordsఅనిపిస్తుంది. దశాబ్దాలుగా అలవాటు పడిన రెండున్నర జిల్లాల భాష నుండి బయటపడడానికి ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది.
ఏ కవిత్వంలోనైనా ప్రధాన అంశాలు వస్తురూపాలే. ఏం చెప్పాడన్నది వస్తువైతే ఎలా చెప్పాడన్నది రూపం లేదా శిల్పం. Technique, Art, Style శిల్పానికి సమానార్థకాలు. ఒక్క మాటలో చెప్పాలంటే వస్తువు అభివ్యక్తమయ్యే రూపాన్ని శిల్పం అనవచ్చు. అలంకారాలు ప్రతీకలు, భాషలో ప్రయోగాలు, శైలీ సంవిధానం శిల్పంలో భాగం. పాఠకుడికి తెలిసిన విషయాన్నే భాష ఆధారంగా పక్రియ వాహికగా పాఠకుడి ముందుకు తీసుకురావడమే సాహిత్య శిల్పం. పాఠకుడు ఊహించిన వస్తువును, ఊహించని విధంగా చిత్రించడమే శిల్ప సామర్థ్యం. సుంకిరెడ్డి కవిత్వ శిల్ప సామర్థ్యాన్ని పదచిత్రాలు, భావ చిత్రాలు, సంవాదశైలి, వ్యంగ్యం, సౌందర్యాత్మక శైలి, సంకేతాలు, సంక్షిప్తి, భాషా వైశిష్ట్యం అనే శీర్షికల కింద పరిశీలించవచ్చు.


పదచిత్రాలు, భావ
చిత్రాలు
ఆధునిక కవిత్వ అభివ్యక్తికి కొత్త పరికరాలు అవసరమైనాయి. ప్రాచీన అలంకారాలు సంపూర్ణంగా వచన కవిత్వంలో ఇమిడే అవకాశం తగ్గిపోయింది. ఆధునిక వచనం సూటిగా విస్తరిస్తున్నప్పుడు కర్త,కర్మ, క్రియ ఉండి తీరవలసిన వాక్యాలు లుప్తమైనట్లే కవిత్వంలో ఉపమ, రూపక, ఉత్ప్రేక్షాదులు తగ్గిపోయి పదచిత్రాలు, భావ చిత్రాలు విస్తరించాయి. సుంకిరెడ్డి కవిత్వంలో పదచిత్రాలు భావచిత్రాలు అలవోకగా పడతాయి.
కవి చెప్పదలచిన విషయం యొక్క బహిర్‍రూపం భౌతికం కాకుండా దాన్ని కవి చూపినప్పుడు, అనుభవించినప్పుడు కవి పొందిన దార్శనిక అనుభూతిని వర్ణిస్తూ పాఠకుడి కంటికి బొమ్మకట్టేట్లుగా చిత్రితం కావడానికి ఉపయోగపడుతున్న అభివ్యక్తి విధానమే భావచిత్రం. కవి పొందిన అనుభూతికి కలిగించిన దృశ్య రూపమే భావచిత్రం అంటాడు చేకూరి రామారావు. మాటలతో బొమ్మలు కట్టించడమే అంటాడు టి.గౌరీశంకర్‍. ‘హననద్రవం’ లోని ఇమేజ్‍లు చూడండి.
‘ఒక్కలమే అయిపోయి బుగులుబుగులుగా
ఉన్నప్పుడు
లోపలొక జాతర తీస్తది’
‘పద్యం పడవ మీద ముంపు హృదయాల్ని
ఎక్కించుకురానా’
‘నిజమే
నిప్పును దూదిలోకి దింపినట్లు’
మందు కొట్టడాన్ని ఆక్షేపించిన ఒక మిత్రుడికి చెబుతున్న జవాబులాంటి కవిత హననద్రవం. ఆశ్చర్యకరంగా కవి మందును ఒక హనన ద్రవంగానే భావిస్తూ చెప్పినప్పటికీ దాన్ని ‘నాలుక నత్తికి మాట’ అని విడిన ప్రేయసికి పర్యాయపదం’ అని, ‘వాడిన మొగ్గకు వరదగూడు’ అని ‘నెత్తిన మూటకు నిలువరింత’ అని మనోహరమైన పద చిత్రాలు వేస్తాడు. నత్తి ఉండే నాలుకకు మాటలు వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మన మనసులో ఒక ఊహమొదలైంది. వీడిన ప్రేయసి కలిసినప్పటి ఉద్వేగం మన స్ఫురణకు వస్తుంది. మొగ్గవాడే దశలో వర్షసూచన ఎలాంటి రిలీఫ్‍ ఇస్తుంది? నెత్తిన మూట మోసీమోసీ కాసేపు ఆగితే ఎలా ఉంటుంది. అది చెప్పడం చాలా కష్టం. వాటిని ఆరంభించి మన ఊహకు వదిలివేస్తాడు కవి. అలా వదిలివేయడంలోనే కవి శిల్పం దాగి ఉంది. అలాగే దాన్ని పదచిత్రాల సమూహం ఒక చోట చేరి భావవిస్తృతితో పాఠకుడి మీద దీర్ఘ ముద్రవేసేవి భావచిత్రాలు. పైన ఉదహరించిన మూడు పాదాలు అలాంటి దీర్ఘముద్రను మచ్చుతునకలు ఒక్కరమే అయిపోయి బుగులు బుగులుగా ఉన్నప్పుడు లోపలొక జాతర తీస్తదట! మందు ‘పద్యం పడవ మీద ముంపు హృదయాల్ని ఎక్కించుకు వస్తా’ నంటాడు అదే కవితలో మరొకచోట. ముంపు, పడవ, ఎక్కించుకు రావడంలోని లింక్‍ను హృదయం అనే ప్రీతిపాత్రమైన కవితా వస్తువుకు ముడిపెట్టడంతో భావచిత్రం కావలసినంతగా ఉద్దీపించింది. ‘నిప్పును దూదిలోకి దింపడం’ మరో మనోహరమైన భావచిత్రం.
‘కళ్ళనిండా ఒల్లు’ అంటాడు టచ్‍ స్క్రీన్‍ ఫోన్‍ వికారాల గురించి చెబుతూ. వివరణ అక్కరలేని పదచిత్రమిది. జయశంకర్‍ను స్మరిస్తూ ‘దశాబ్దాల శబ్దం, కనురెప్పలు మూతపడొద్దు’ అనడం ద్వారా జయశంకర్‍ మరణించినా ఆయన తెలంగాణ ఆకాంక్షలు మరిచి పోవద్దన్న సూచన ఉంది.
‘అవిద్య’ కవితలో ఒక కూతురును కార్పొరేట్‍ విద్య కోసం హాస్టల్‍లో వదిలివేసి పోతున్న తండ్రిని ఉద్దేశించి కూతురు చేసిన వ్యాఖ్య సుంకిరెడ్డి కవిత్వ వ్యక్తీకరణ కళకు పరాకాష్టగా చెప్పవచ్చు.
‘నా రెప్పల టపటపల్లో
మన ఇంటి వృత్తం చూళ్ళేదా నువ్వు
నీరులా నా వెంటవచ్చి
రాయైవెళ్ళలేదా’
ఇంకాస్త ముందుకెళ్ళాక ఇదే కవితలో కూతురు తనను తాను ‘గాలి తీయబడ్డ బంతి’ గా సంభావించుకోవడం కళ్ళకు నీళ్ళు తెప్పిస్తుంది.
‘ఎగిరే బంతిని గాలి తీసినవ్‍
ఎక్కడెగర మంటావు
నీకల తాకే దాకా
ఇటు చూడవా’
‘దాలి’లో ఇలాంటి ఉదాహరణలు అనేకం కనిపిస్తాయి.
‘హంసవై వొస్తె చెలిమె మావోడు’
‘మొండెం రెక్కలు అతుక్కొనే ఉంటయ్‍
కుండలు పటీల్మంటయ్‍’
సుంకిరెడ్డి నారాయణరెడ్డి లోతైన ఆలోచనకు, ధ్వనాత్మకమైన వ్యక్తీకరణకు ‘తోవ ఎక్కడ’లో చాలా ఉదాహరణలు కనిపిస్తయి.
‘స్పందనలో అపస్వరాలున్నాయేమో
గుండెను విప్పిచూద్దామా’
అంటాడొక చోట
‘ఓటిపోయిన దేహ భాండం’ అనడం ద్వారా ఒక మంచి భావచిత్రం పాఠకుల మనసులో గూడు కట్టిస్తాడు. ‘వందపాదాల నృత్యం’ అంటాడొక చోట.


సంవాద శైలి, వ్యంగ్యం
సుంకిరెడ్డి కవిత్వంలో ఎంతలోతైన భావాలుంటాయో అంతే స్థాయిలో సంవాదశైలి కనిపిస్తుంది. ఇది ఉద్యమ కవిత్వ లక్షణం కూడా. చెరబండరాజు, వరవరరావు లాంటి విప్లవ కవులతో పాటు దళిత స్త్రీవాద కవుల్లో ఈ ధోరణి హెచ్చు. దళిత, మైనారిటీ వాదాల బలమైన మద్దతుదారుడైన ఈ కవి తెలంగాణ ఉద్యమకారుడు కూడా. అంతకుముందు వామపక్ష ఉద్యమవాది. అయితే వామపక్ష ఉద్యమాలు నేల విడిచి సాము చేస్తున్న దశను చూసాడీ కవి. అందుకు నిస్సంకోచంగానే ఉద్యమ గమనాన్ని నిశితంగా ప్రశ్నిస్తాడు. సూటి ప్రశ్నలుగా మొదలైన వాక్యాల్లో కూడా అంతిమ పాదంలో మెరుపు ఉంటుంది.
‘రథాన్ని వదిలి అశ్వం పరుగెత్తడం
నీ పోరాటం
ఒంటరిగా పరుగెత్తడం ఆపి
పరికించి చూడు గమ్యం మారిపోయింది
నీదారి ఇరుకైపోయింది
దాటివచ్చిన యోజనాల్ని లెక్కించు
తిరిగిన చోటే తిరగడమైంది’ (డైమెన్షన్స్, తోవ ఎక్కడ)
రైతుపక్షపాతి కాకుండా ఏ కవీ కవిత్వం రాయడు. సుంకిరెడ్డి దాలి తెలంగాణ వ్యవసాయంలోని దైన్యాన్ని చర్చకు పెట్టింది. అడుగడుగునా ప్రశ్నలు సంధిస్తడు. కొన్ని సీమాంధ్రులకు తగుల్తయి. కొన్ని మన పాలకులకు తగుల్తయి. అనేక చోట్ల పీఠభూమి స్థితిగతుల మీద, వాటి హేతువుల మీద సంవాదం చేస్తడు.
‘పానాలు దీసే పత్తొచ్చె
పత్తెంట పురొగొచ్చె
పురుగెంట బేపారొచ్చె
ఊర్లకు పురుగుముట్టె
నానేల నేలోతిగున్నదా
నువ్వడుగుబెట్టిన యాల’ (దాలి)
అని అన్యాపదేశంగా సీమాంధ్ర వలస వాదాన్ని స్ఫురణకు దెస్తడు. ఆ వలస వాదానిది బతుకుదెరువు బాధకాదని స్పష్టంగానే చెబుతూ తెలంగాణలో స్థిరపడిన ఇతర ప్రాంతీయుల ప్రస్తావన తెస్తడు.
‘కన్నడిగులొచ్చిండ్రు
మరాఠాలొచ్చిండ్రు
మార్వాడాలొచ్చిండ్రు
పల్లుమీన పలుబెటిండ్రా
సాయిమాను కింద సర్దుకున్రు
ఇసుంటరమ్మంటె
పాపమని నీడిస్తె
చెట్టునాదంటివి’ (దాలి)
సంవాదం చాలావరకు సూటిగానే ఉంటది. కానీ కొన్నిచోట్ల వ్యంగ్యం జోడించబడ్డప్పుడు అది శక్తివంతమవుతుంది. ప్రముఖకవి కె.శివారెడ్డిని ఉద్దేశించి రాసినప్పుడు.
‘పెదవి విరవాలో
వికసించాలో
కనులు కళకళలాడాలో
భృకుటి ముడిపడాలో
కటువుగా విరచాలో
కరుణతో కలత చెందాలో’
తెలియడం లేదని వ్యంగ్యంగా చెబుతాడు. ప్రపంచీకరణ మాయాజాలన్ని ఎండగడుతూ
‘మా రూపాయిని చింపి
నీడాలర్‍కు అతికించుకున్నవు! చాలదా?
నీ కోల్గేట్‍తోనే మాకు సూర్యోదయం
నీ స్క్రీన్‍ మీడియాతోనే మాకు నిశాచరత్వం’
లాంటి వాక్యాల వేగాన్ని చూసినప్పుడు Words worth చెప్పినట్లు‘all good poetry is the spontaneous over flow of power ful feelings’ అన్నవాక్యం సుంకిరెడ్డికి కూడా సరిపోతుందనిపిస్తుంది.


సౌందర్యాత్మక శైలి
ఇదే సంవాదకవి ఒక మౌనమునిలా ఆలోచించి రాస్తడు.
‘నీరైన మీలో
ఏరాయి గుభిల్లున పడుతుందోనని నేను…’
‘గోడకు వేలాడదీసిన సముద్రంలో
కెరటాలుండవు’
‘నదిని చీల్చుకుంటూ దాటుతం
యెనక్కి చూస్తే ఏమీ ఎరగనట్టే నది’
‘ఆ బాహువుల్ని చాచి
ఆత్మ తగిలే దాకా కౌగిలించగలవా?
నిర్మించగలవా?’
ఒక చిత్రాన్ని గీయడానికి ఒక్కో విభాగాన్ని చిత్రకారుడు ఒక్కొక్క రంగుతో తీర్చిదిద్దునట్లు తనకిష్టమైన భావాలతో హృదయాల్ని కదిలించే విధంగా వర్ణించాడు.


సంకేతాలు:
కవిత్వానికి సామాగ్రి ఉంటుంది. ప్రాచీన కాలంలో అర్ధ, శబ్దాలంకారాలు ప్రాతిపదికగా కవిత్వముండేది. వచన ప్రయోగం జరగలేదు. అప్రయత్నంగా వచ్చే అలంకారాలు ఆభరణాలే. వర్తమాన కవిత్వంలో శబ్దాలంకారం దాదాపు నిషిద్ధం. అర్ధాలంకారాల స్థానే సంకేత పదాల ద్వారా లక్ష్యార్థాన్ని సాధిస్తున్నాడు కవి.
‘మేం గర్విస్తున్నదీ
మీరు దుఃఖిస్తున్నదీ
ఆధిపత్యం కూలుతున్నందుకే’
ఇక్కడ విగ్రహాలు కూలడము అనే వాస్తవాన్ని ఆధిపత్యం కూలడంగా సంకేతపరుస్తున్నాడు కవి.
‘నీ పేరు ఉచ్ఛరించనివాడికి
ఈ నగరం ముల్కీపత్రం ఇవ్వడంటున్న’
అనడం ద్వారా కులీ కుతుబ్‍షా పేరు ఉచ్ఛరించని వాడు ఇక్కడి చీ••ఱఙవ కాజాలడని సంకేతంతో చెబుతున్నాడు.
‘రాత్రేగా
తను పోస్టర్లతో కనిపించింది
తెల్లారేసరికి
తనే పోస్టరయినాడు
రాత్రేగా
ఆ ముఖం కాపిష్క కాంతిలో నిండుగా నవ్వింది
తెల్లారేసరికి
మా కండ్లనుండి బొట్లుబొట్లుగా రాలుతున్నడు’ ఇంకొకచోట.
కంఠం కంచును కోల్పోతే త్రివర్ణ జెండా మీద అనడం ద్వారా కంచును గంభీరతకు సంకేతిస్తాడు.


సంక్షిప్తి
ఆధునిక కవులంతా సంక్షిప్తికి ప్రయత్నించిన వారే. టెక్నిక్‍ మీద ఏమాత్రం అవగాహన ఉన్నవారైనా సంక్షిప్తికి ప్రయత్నిస్తారు. అయితే ఎంత సంక్షిప్తంగా వ్యక్తీకరించి విజయం సాధిస్తారన్నది వాళ్ళ శక్తిని బట్టి ఉంటుంది. ఈ అర్హతలో నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి అగ్రగణ్యులు.. ఆశారాజు, శిఖామణి, ఎండ్లూరి సుధాకర్‍లు బలమైన కవిత్వం మీద దృష్టిపెట్టిన వారు. వారి శిల్పం విలక్షణమే. సంక్షిప్తి వారి మౌళిక లక్షణం కాదు. సంక్షిప్తికి సుంకిరెడ్డి పెట్టింది పేరు. ఆయన సంకలనాల పేర్లే అతి సంక్షిప్తం. తోవ ఎక్కడ, దాలి, తావు! సుదీర్ఘంగా చెప్పగలిగే విషయాన్ని చాలా తక్కువ మాటల్లో చెప్తాడు..
‘ఎటు చూసినా సూర్యుళ్ళే
కానయితే ఎటు పాదం మోపినా చీకటే’
అనడం ద్వారా బహు సంఖ్యాకులైన ఉద్యమకారులున్నా
ఉద్యమమే బలంగాలేదని దెప్పిపొడుస్తాడు తోవ ఎక్కడలో సుదీర్ఘంగా వ్యాఖ్యానించదగిన అవకాశమున్న కవిత ఇది. అలాగే
‘కొమ్మ విరిస్తేనే బతుకమ్మ’
అంటాడొక చోట. మార్పు జరుగుతున్నప్పుడు కొంత విధ్వంసం జరుగుతుందనే అర్థంలో విస్త•తమైన భావాన్ని తక్కువ మాటలతో చెప్పాడు.


భాషావైశిష్ట్యం
సుంకిరెడ్డి తెలంగాణ వాది. రాష్ట్రం ఏర్పాటు కోసం తపించిండు. చేయగలిగిన పనులన్నీ చేసిండు. అయితే తెలంగాణ భాషలోనే రాస్తారని కంకణం కట్టుకోలేదు. దాని సాధక బాధకాలు ఆయనకు తెలుసు. రెండున్నర జిల్లాల భాష సమసి పోవాలంటే మొదట తెలంగాణ పదబంధాలు, నుడికారాలు రికార్డు చేయాలి, వాడుకంలోకి తేవాలి, చిన్న చూపును తొలగించుకోవాలె, నిజానికి చాలా మంది విద్యావంతులు ప్రామాణిక భాష మన మీద రుద్దబడిన తర్వాత పుట్టినవారే, సుంకిరెడ్డి కూడా. అయితే ఆరు దశాబ్దాలు దాటినా సీమాంధ్రుల క్రియా రూపాలు మన క్రియా రూపాల్ని తుడిచి వేయలేక పోయినవి. అవి కవులు వాచ్యంగా వాడినట్లే రాతలోనూ వాడుతున్నారు. సుంకిరెడ్డి కవిత్వంలో క్రియా పదాలు తెలంగాణ తనంలో ఎట్లున్నయో చూడండి.
పక్షులు గిరికీలు కొడుతున్నయి
పచ్చెంట పావురం బాయె
బయటికొస్తున్న
శిశిర వృక్షమోలిగ
మరోదారి ఎప్పుడూ ఉంటది
కనురెప్పలు మూతపడొద్దు
ఈ రోడ్డు తెచ్చిండ్రు
ఎగిరిపోయిండ్రనుకున్న
నీడపట్టున మీరు కౌటిల్యులయింది
ఈ భూమి బుగ్గై పోవాలని సాపిస్తున్న
గాయం అలుగుబోసింది
పేజీలు చినిగి పోతవి
పచ్చగానే ఉంటది
బరి బాతలైపోతివి
తెలంగాణ నుడికారాలు, పదబంధాలు మలిదశ ఉద్యమ కాలంలో కవిత్వంలోకి ఎక్కినై. సుంకిరెడ్డి కవిత్వం పరిశీలిస్తే ఈ విషయం స్పష్టపడుతది. మలిదశ ఉద్యమం కంటే ముందు వచ్చిన ‘తోవ ఎక్కడ’లో భాషాస్పృహ లేదు. దాలి వచ్చేటప్పటికి వస్తువుతో పాటు మన భాషనే వాడాలన్న ఖచ్చితమైన స్పృహ కనిపిస్తుంది. పదబంధాలు, క్రియలు మాత్రమే కాకుండా గ్రామ్యం కూడా దాలిలో బాగా వాడబడింది చూడిండి
‘యీరునికెళ్ళిన విల్లు యిరగంగో
యీరగోలు కొసలు నన్నుదాకంగో
పీర్ల దట్టిమెరుపు నన్ను మెరవంగో
శివలుంగ లింగ ఓ శంభులింగ
పొలిమేర మీదంగ పొలిజల్లి పోంగ
బలిముద్ద బట్టుకొని ఉరికిరా తండ్రీ
పాడియావుల మంద మలుపుకారాంగ
నెత్తీనబోసుకొని యెంటరా తల్లీ’
ఇవేగాకుండా ఆపతి బడుతున్నది, బరిబాతలైతివి, గుండెబగులకు తల్లీ, చీకటిని గెదుముకుంట, కుక్కగొలుసులు. దమ్మనగ్రోవి, కలమెలిగినట్టు, తంతెలు తంతెలుగా లాంటి పదబంధాలు గమనించదగ్గవి.
పెంజెరనాకిన పెయివయ్యిపోతవి
వెయ్యేళ్ళున్నా వేరుదప్పదు
ఆరబ్బోని ఒంటివై పోతవి
లాంటి నుండికారాలు ఈయన కవిత్వంలో అడుగడుగునా కనిపించడం విశేషం.
జిర్ర, గెదుముకుంట, వెన్నెల బేరలు, బడీకలు, బొక్కలపోగు లాంటి తెలంగాణ నేటివ్‍ పదాలు తరచుగా అప్రయత్నంగా దొర్లినట్లు గమనించవచ్చు. భాషతో తెలంగాణ మౌలికతను తీసుకురావడం సుంకిరెడ్డి కవిత్వ తత్త్వం.
సుంకిరెడ్డి కవిత్వం మొత్తంగా ఆవేశ ప్రధానమయిందా, ఆలోచనాత్మకమయిందా అంటే ఒక పదంలో జవాబు దొరకదు. ప్రాచీన భారతీయ ఆలంకారికులు చెప్పినట్లు భావయిత్రి వ్యాపారానికి, కారయిత్రి వ్యాపారానికి మధ్య సుంకిరెడ్డి భావయిత్రిలోని రమణీయతను కోల్పోకుండా జాగ్రత్తపడ్డాడు. ఆ జాగరూకతతో వచ్చిన అద్భుతమైన కవిత అవిద్య. వస్తువును బట్టి ఆవేశము, చింతనాత్మకత కలిగిన కవిత సుంకిరెడ్డి గారిది.
భాష, నడక వస్త్వాశ్రయమన్న సంగతి ఈ కవికి బాగా తెలుసు. అందువల్లనే మూడు కవితా సంకలనాలు విభిన్నమైన శైలిలో నడిచాయి. కాలవ్యవధి, సమాజంలోని మార్పులు కూడా ఈ కవి మూడు సంకలనాలలో వైవిధ్యపూరితమైన శైలికి కారణం. దాలి తెలంగాణ భాషనూ, ఉద్వేగపూరితమైన వస్తువును కలిగి
ఉండటం దాని సూటిదనానికి కారణం. తోవ ఎక్కడ, తావు కవితలన్నీ వచన కవితలే ఐనప్పటికీ కాలంలోని వ్యవధానం వల్ల ఈ రెండింటి శైలి మారింది. తోవ ఎక్కడతో పోల్చినప్పుడు తావులో సంక్షిప్తి పెరిగింది. భాషలో సారళ్యం హెచ్చింది, నిబద్ధత చెక్కుచెదర లేదు. ఈ వ్యాసంలో కొన్ని ఉదాహరణలు దాలి నుంచి ఇవ్వబడ్డవి మాత్రా నియమం ఉన్నట్లు అనిపించినా అది కాకతాళీయం. సుంకిరెడ్డిది సిసలైన వచన కవిత్వం.

ఏనుగు నర్సింహారెడ్డి,
ఎ : 8978869183

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *