బాల సాహిత్యం – నా అనుభవాలు – సూచనలు

ప్రపంచ తెలుగు మహాసభల్లో బాల సాహిత్యానికి ఒక రోజు, బాలలకు మరో రోజు ప్రత్యేకంగా కేటాయించడం ఒక కొత్త దిశకు నాంది అని చెప్పవచ్చు. ఆ ఉత్సాహమే మళ్లీ ఈ బాలచెలిమి. పిల్లల సినిమా, అంతర్జాతీయ చలన చిత్రోత్సవం మొదలుకొని తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రిసోర్స్ సెంటర్‍ ద్వారా ప్రతి శనివారం ఒక సమావేశం చొప్పున చర్చా కార్యక్రమాలు నిర్వహించిన ఎం.వేదకుమార్‍ ఈ పత్రికకు సంపాదకుడు కావడం శుభ సూచకం. ఆగిపోయిన బాలచెలిమి మళ్లీ వస్తోందన్న సంతోషం. బాల చెలిమి, బాల చెలిమి ముచ్చట్లు, సదస్సులు, చర్చలు మళ్లీ తెలుగునాట అందులోనూ హైదరాబాద్‍లో తిరిగి ప్రారంభం కావడం బాల మిత్రులకు ఆనందం కలిగించే విషయమే.


గతంలో చందమామతో పాటు ఎన్నో పత్రికలు వచ్చాయి, పోయాయి.. ఈ నేపథ్యంలో బాల చెలిమి గురించి ప్రత్యేకించి మాట్లాటడానికి ప్రతి నెల రెండోవారం నిర్వహించే బాల చెలిమి ముచ్చట్లులో భాగంగా ‘‘ బాల సాహిత్యం – నా అనుభవాలు – సూచనలు’’ అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆక్స్ ఫర్డ్ గ్రామర్‍ స్కూల్లో ‘‘బాలచెలిమి ముచ్చట్లు’’ 9 వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రెస్‍ అకాడమీ చైర్మన్‍ అల్లం నారాయణ, ప్రముఖ రచయిత డాక్టర్‍ నాళేశ్వరం శంకరం, ఘనపురం దేవేందర్‍, స్ఫూర్తి డైరెక్టర్‍ పద్మిని రంగరాజన్‍, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍ ఎం.వేదకుమార్‍, ప్రతినిధులు రఘు, శ్రీనివాస్‍, వేలాద్రి, రాజ్‍కుమార్‍, జ్యోతి, రజిత, వాసవి, షేక్‍ మౌసిన్‍. కె.ప్రభాకర్‍, కో-ఆర్డినేటర్‍తో పాటు తదితరులు పాల్గొన్నారు.


ఎం.వేదకుమార్‍ – చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ :
బాల సాహిత్యం గురించి పిల్లలకు ఎలా తెలపాలి..? ఈ బాలలకు ప్రపంచాన్ని ఎలా చూపించాలి…? పిల్లల మనస్సులోని మాటలను బయటకు ఎలా తెలియజేయాలి…? పిల్లలకు గతంలో వచ్చిన కథల పుస్తకాలు కావచ్చు, పిల్లల సినిమాలు కావచ్చు, బాలల సాహిత్యాలు కావచ్చు… ఇట్లా అన్నింటినీ పరిశీలిస్తూ… పిల్లల కోసం ఈ బాల చెలిమిని తీసుకొని రావడం జరిగింది. అనేక మంది ఉపాధ్యాయులు, రచయితలు, కవులు, విశ్లేషకులు, అనుభవ వ్యక్తులను ఒకచోట ఏర్పాటు చేసుకుని పిల్లల కోసం ఈ వేదికను ఏర్పాటు చేయడం జరుగుతోంది… పెద్దవాళ్ల అనుభవాలు, సూచనలు, సలహాలను తెలుసుకుంటూ.. వాళ్ల బాల్యంలో నిర్వహించిన ఆటపాటలు, కథలు, రచనలను పిల్లలకు తెలియజేయడం ఈ తొమ్మిదవ బాల చెలిమి ముచ్చట్లు నేపథ్యంలో ‘‘బాల సాహిత్యం – నా అనుభవాలు – సూచనలు’’ నిర్వహించడం సంతోషం..
గ్రామాల్లో ఉన్న పిల్లలకు చదువు రాకున్నా వాళ్లకు కోళ్లలాటలు, కబడ్డీలు, బొమ్మలాటాలు ఇట్లాంటివి వాళ్ల తాతల నుంచి నేర్చుకొనేవారు.. అట్లాగే చదువుకున్న పిల్లలు కూడా ఒక వంద పేజీల కథలు కూడా వాళ్లు చూడకుండా చెప్పగలరు.. ఇలాంటి పిల్లలు మన రాష్ట్రాలలో దేశాలలో ఉన్నారు.. అయితే ఇంకా రాబోయే తరాల పిల్లలకు ఎట్లా చేర్చపడాలి అనే ఆలోచనతో ఈ బాల చెలిమి ముచ్చట్లును నిర్వహించడం జరుగుతోంది.


అల్లం నారాయణ – తెలంగాణ రాష్ట్ర ప్రెస్‍ అకాడమి చైర్మన్‍ :
పిల్లల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం, పిల్లల కోసం బాల చెలిమి, బాలల కోసం ఇలాంటి ముచ్చట్లు చెప్పుకోవడం ఒక మంచి పనిగా భావిస్తున్నాను. నిజానికి విప్లవాత్మకంగా గడిచిన మాకు పిల్లలతో ఎట్లా సంభాషించాలో తెలియదు. ఉపాధ్యాయులు అయితే తప్ప లేక టీచర్లు అయితే తప్ప మాలాంటి వాళ్లకు తెలియదు.. ప్రతి మనిషి జీవితంలో బాల్యంలో పడ్డ ప్రభావాలు, చిన్నప్పుడు చదివిన చదువులు వాటి ప్రభావం మాములు కాదు.. నిజానికి మా కుటుంబంలో ముగ్గురం రచయితలుగా ఉన్నాం.. మా పెద్దన్న అల్లం రాజయ్య మంచి కథకుడు. మా చిన్నన్న మంచి పాటగాడు, కవి. నేను కూడా కవిత్వం రాశాను, జర్నలిస్టుగా ఉన్నాను. వీటన్నింటికి మాకు మూల కారణం మేము చదివిన మంథనిలో ఒక లైబ్రరీ ఉండేది. మేము ఒక ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్లేవాళ్లం. కాబట్టి ప్రతిరోజు లైబ్రరీ కోసం అయినా రోజు వెళ్ళేవాళ్లం. ఇప్పటికీ మాకు గుర్తు భాష మీద కానీ, చదువు మీద కానీ, సాహిత్యం మీద కానీ చివరకు జీవితం మీద కానీ ఆ లైబ్రరీలో చదివిన పుస్తకాలు వల్ల ఏర్పడిన ఆసక్తే ముగ్గురుని ఇంతదూరం తీసుకొచ్చింది.


ఇది చెప్పితే గంభీరంగా ఉంటుంది కానీ, చందమామ అనే పత్రిక ఉండేది. ఇప్పుడు మీరు చూసి ఉండరు.. బాలమిత్ర అనే ఇంకొక పత్రిక వచ్చింది.. పేదరాసిపెద్దమ్మ అనే పత్రిక ఉండేది. ఇవన్నీ కూడా ఒక మనుషులల్లో ఉండే ఒక ఆలోచనా విధానమే పత్రికల్లో ఉండేవి. మనుషుల మనసులోని ఆలోచనలను బయటకు తీయటమే రచన. లోపల ఏమి అనుకుంటున్నారు.. బయటకు ఏమి అనుకుంటున్నారు.. బయటకు కనబడేది.. లోపల ఆలోచింపజేసేది.. మనిషి గొప్పతనం లేదా జీవన విధానానికి మనిషి భిన్నం. అంటే జంతువుల కన్నా ఇతర జీవరాశులు కన్నా మనం ఎందుకు భిన్నం అంటే.. మనకు ఒక మెదడు
ఉండడం.. మెదడు నిరంతరం ఆలోచించడం.. ఈ ఆలోచనా క్రమం అనేది ఉన్నందునే ఈ ఆలోచనా క్రమాన్ని ఒక క్రమంలో పెట్టి దానిని అందరితో పంచుకోవడమే రచన. దీనిని మరింత బాగా చెప్పడమే క్రియాశీల రచనలు… ఇవన్నీ కావాలంటే మీకు బాల్యంలోనే కేవలం స్కూల్‍ పుస్తకాలు లేదా రగడించడం, రుబ్బడం, చెప్పిందే చెప్పడడం, తెలుగు తప్ప మిగతా పుస్తకాలపై ఆసక్తి ఉండదు… సాంఘిక శాస్త్రంలో మనిషికి సంబంధించి నాలుగు ముచ్చట్లు ఉంటాయి.. లెక్కలు పరమ దరిద్రంగా ఉంటాయి.. సైన్స్ ఇంక మనకు అర్థం కాదు… ఇందులో మనకు దగ్గరగా ఉండేది సాంఘిక శాస్త్రం. రెండవది జీవశాస్త్రం.. మిగతావి అన్ని మనకు సంబంధించినవి కావు కానీ, బయట బతకాలి అంటే అన్నీ చదవాలి… అని తెలుసుకోవాలి… ప్రైవేటు స్కూల్స్ కానీ, కాలేజీలల్లో చదివే పిల్లలకి సాహిత్యం గురించి తెలియదు.. ఎందుకంటే వాళ్లను మార్కులపై దృష్టి పెట్టె బాయిలర్‍ కోళ్లుగా తీర్చిదిద్దుతుంటారు.. ఇంకా బాల చెలిమి, సాహిత్యం, కవితలు ఎలా తెలుస్తాయి.
ఈ తొమ్మిదవ ముచ్చట్లకు నేను రావడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది బాలలకు సంబంధించిన ప్రపంచం కాదు… స్త్రీలకు సంబంధించిన ప్రపంచం కాదు… రైతులకు సంబంధించిన ప్రపంచం కాదు… ఎందుకంటే స్త్రీలను, రైతులను, వృద్ధులను, పిల్లలను ఎవరు పట్టించుకొనేవాళ్లు కాదు.. ముఖ్యంగా పిల్లల గురించి మాట్లాడేవాళ్లు లేకుండాపోయారు. యంత్ర సంపాదన రావడంతో పిల్లలను యంత్రాలుగా మార్చిపారేశారు. పిల్లలకు అన్నం పెట్టాలంటే ఫోన్‍ ఇచ్చే పరిస్ధితి ఇప్పుడు ఉంది.. అప్పట్లో లాలి పాటలు పాడుతూంటే పిల్లలు అన్నం తినేవాళ్లు.. కానీ, ఇప్పుడు సెల్‍ఫోన్‍లో ఆ పాట పెట్టి అన్నం పెడుతున్నారు. అంటే యాంత్రిక ప్రపంచం పెరిగే సమయంలో మీరే యంత్రాంగం క్రమంలో ఉన్నార..


మనిషికి సంబంధించిన అనేకమైన ఆలోచనలు, ప్రభావాలు, ఉద్వేగాలు ఎట్లా ఉంటాయి.. ఇవి ఎట్లా ఉంటాయి అనేది చెప్పేదే సాహిత్యం.. ఊర్లో ఎవరైనా చనిపోతే వారికి సంబంధించిన కుటుంబం ఏడుస్తూ రోదిస్తుంటారు.. ఎలా అంటే చనిపోయిన వ్యక్తిని తలుచు కుంటూ రాగాలు తీస్తుంటారు… ఈ ఏడుపులో కూడా ఏదో విషయం చెప్పడం… చనిపోయినవాళ్ల గురించి గొప్పలు చెప్పడం కావచ్చు… ఇలాంటి అని కూడా మనిషికి సంబంధించిన విషయాలను చెప్పడం… ఈ చెప్పడమే సాహిత్యం. నేను నమస్తే తెలంగాణ పేపర్‍ లో ఎడిటర్‍గా పనిచేశాను.. అయితే, తెలుగు చెప్పే స్కూల్‍ టీచర్‍ సాహిత్యం, అభిలాష, ఆలోచన ఉన్న పిల్లలను ఎంకరేజ్‍ చేస్తే 7,8 వ తరగతి చదువుతున్న 30 మంది పిల్లలు కవిత్వాలు పంపారు. ఈ కవితల్ని ఒక పేజీ నిండా వేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలు రాసింది ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది కాబట్టి… అందుకు పిల్లల్లో సాహిత్యంపై అవగాహన కల్పించాలి.. అప్పుడు బాల్యంలోని పిల్లలకు సాహిత్యంపై పట్టు ఏర్పడి దీనిపై అవగాహన పెంచుకుంటారు. పిల్లల బుర్రలో చెడు తక్కువ ఉంటుంది.. కనుక ఆలోచించే ధోరణి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. వయస్సు పెరుగుతుంటే చాలా ప్రభావాలు పెరుగుతుంటాయి. కానీ, పిల్లల్లో ఈ ప్రభావాలు ఉండవు. కానీ, పిల్లలు తెలుసుకోవాల్సిన ఒక లోకం ఉంటుంది.. మనిషిలోని ఊహలను పెంచడమే రచన… ఊహ నుంచి ఒక కొత్త కల్పన చేయడమే రచన… వీటన్నింటికి సంబంధించిన మీరు నేర్పడం లేదా ఇలాంటి చర్చలు జరపడం గొప్ప విషయం.. ఒకటి మాత్రం చెప్పగలను… నేను ఎం.బి.ఏ కూడా గవర్నమెంట్‍ కాలేజీలోనే చదువుకున్నాను.. ఎన్నడూ ప్రైవేట్‍ జోలికి పోలేదు. మనిషి ఏదైనా తెలుసుకోవాలంటే ముందుగా భాష తెలుసుకోవాలి… అది తెలుగు భాష కావచ్చు… ఇంగ్లీష్‍ భాష కావచ్చు… ఏ భాష నేర్చుకోవాలన్నా చదవాలి.. పుస్తకాలు చదవాలి.. మనలో ఉన్న ఆలోచనలను ఒక క్రమంలో పెట్టాలన్నా చదవాలి… ఇట్లా చదివి పిల్లలు మంచి రచయితలుగా, గొప్ప వ్యక్తులుగా మారతారని భావిస్తున్నాను.


ఘనపురం దేవేందర్‍ – రచయిత :
చిన్నారుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వేదకుమార్‍ గారు నాకు పులిలాగే కనిపిస్తున్నారు. ఎందుకంటే పిల్లల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి పులి లాంటి పెద్దలు కావాలి.. అందుకే ఆయన పులిలాగే కనిసిస్తున్నారు. ఇప్పుడు ఉన్న బిజీ తరుణంలో పెద్దలు కూడా చిన్నారులతో ఆడుతుంటే అది ఎంతో బాగుంటుంంది కదా.. ఎప్పుడూ ఒత్తిడితో పరుగులు తీస్తున్న ఈ జనం రోజులో ఒకసారైనా పిల్లలతో సరదాగా గడపటం చాలా మంచిది. పిల్లలను గనుక మనం ప్రేమగా చూస్తే… దేవుడికి పూజ చేసినట్లే అని ఓ మహానుభావుడు అన్నారు. గతంలో ఒకసారి నేను ‘‘ పిల్లలకు మీసాలు ఉండవు.. దేవుడికి మీసాలు ఉండవు ఎందుకు…? అనే ప్రశ్న వేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలు దేవుడితో సమానం కాబట్టి.
పిల్లల కోసం ఈ బాల చెలిమి చాలా అద్భుతంగా కొనసాగుతూ.. తొమ్మిదవ సెషన్‍కు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలో (1985 -86) ఎండాకాలం సెలవుల్లో నుమాయిష్‍ (ఎగ్జిబిషన్‍) కు స్నేహితులతో కలిసి వెళ్లినప్పుడు అక్కడ కొందరు కవులు కవితలు చెపుతున్నారు. నేను కూడా ఓ కవిత రాయాలి అనిపించి.. అక్కడ ఉన్న ఓ కవిని అడిగాను.. వెంటనే ఆ కవి ఓ పుస్తకం ఇచ్చి రాయమనడంతో.. వెంటనే ఆలోచించకుండా చకచకా రాసి ఇచ్చాను. అది చదివిన కవులు ఒక పూల దండ వేసి, చప్పట్లతో ముంచేశారు. అప్పుడు నేను రాసింది ఏంటంటే… ‘నిమాయిషికి పోయినాము అంటే చూసుడు ఎక్కువ… కొనడం తక్కువ… పెద్ద పాపడ మాత్రం తినడం పక్కా.. బొంబాయి మిఠాయి సప్పరించడం పక్కా… చిన్నదైనా, పెద్దదైనా ఏదైనా బొమ్మను కొనియ్యమంటే.. రేట్లు ఎక్కువ అనే అమ్మనాన్నలను అడగడం మానేసి.. అడిగినట్లే అనుకుని ఎగ్జిబిషన్‍ మొత్తం చూస్తున్నాను.. వాటిని కొనలేకపోయినా ఇంటికెళ్లి నిద్రపోయాక కలలో వాటిని కొనుక్కున్నట్లు, వాటితో ఆడుకున్నట్లు అనుకుంటుంటే ఎంత గమ్మత్తు అనిపిస్తుంది.. అది ఎంత మజాగా ఉంటుంది’’ అని రాయడం జరిగింది. అప్పటినుంచి నేను తొమ్మిదవ తరగతిలో కవితలు రాయగలను అంటే.. అప్పటినుంచి ఈ కవులను కలవడం, పరిచయాలు ఏర్పరుచుకోవడంతో చాలా నేర్చుకోవడం జరిగింది. నేను ఇంటర్మీడియట్‍ ఫెయిల్‍ అయ్యాను.. తర్వాత ఓ ప్రైవేట్‍ స్కూల్‍లో లెక్కల టీచర్‍గా జాయిన్‍ అయ్యాను. అయితే, పిల్లలు నాతో సరిగా మాట్లాడేవాళ్లు కాదు.. ఎందుకంటే లెక్కల టీచర్‍ అంటే భయం అంటా.. ఇది తెలుసుకున్న నేనే.. ఏమి చేయాలని ఆలోచించినప్పుడు.. వాళ్లకు రోజుకో కథ చెప్పేవాన్ని. అయితే పిల్లలను ఎప్పుడు ఏ లెక్క చెప్పినానో తెలియదు… కానీ, ఏ కథ నాడు ఏ లెక్క చెప్పానో వెంటనే చెప్పేవారు. అప్పుడు పిల్లల మనసు అర్థమైంది ‘‘ పిల్లలకు ఏదైతే ఆసక్తి ఉందో.. దానికి ఏదైనా జోడించి చెప్పితే వాళ్లు నేర్చుకుంటారు’’. ఇట్లా ప్రారంభించిన నేను 1989 నుంచి ఇప్పటివరకు చాలా కథలు రాయడం జరిగింది. పిల్లలకు ఆలోచన వచ్చిందంటే మరో ఆలోచనకు పోకుండా వెంటనే పెన్ను తీసుకుని పేపర్‍పై రాయాలి. పిల్లలు పాటలు కూడా బాగా ఇష్టపడతారు. అవకాశం ఇచ్చి రాయమంటే మహాభారతం, రామాయణం లాంటివెన్నో అద్భుతంగా రాయగలుతారు. తెలంగాణలో చదువురాని తల్లులు కూడా చాలా గొప్పగా మాట్లాడుతారు. వాళ్ల పాటల్లో అద్భుతమైన అలంకరణలు ఉంటాయి. నేను తొమ్మిదవ తరగతిలో రాసిన కథలకు చాలా మంచిపేరు వచ్చింది. కానీ నేను అక్కడ చదివినాను చూడండి అప్పటినుంచి మంచి పేరు వచ్చింది. ఆరోజు నేను రాసినది ఏదైనా అందరికీ చెప్పడం జరగడంతోనే మంచి పేరు వచ్చింది. మీరు రాసిన కథలు, కవితలు, మంచిమాటలు కావచ్చు చక్కగా అందరికీ చెప్పాలి… అందరికీ చెప్పితేనే దాని విలువకూడా బాగా ఉంటుంది.


బాల సాహిత్యానికి సంబంధించి 23 జిల్లాల సాహిత్యాన్ని గురించి సేకరింపచేసే టీంలో నన్ను కూడా పెట్టుకోవడం చాలా సంతోషం. మూడు నెలలు హైదరాబాద్‍లో ఉండి 23 జిల్లాల బాల సాహిత్యాన్ని సేకరించడం జరిగింది. అందులో తప్పులు లేకుండా చేయడం, అవసరమైన బొమ్మలను వేయించి దాదాపు 400 పుస్తకాలను తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకాలు అన్నీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని గవర్నమెంట్‍ స్కూల్స్లో ఉన్నాయి. ఇవన్నీ ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే పిల్లలు రాసిన పుస్తకాలే. పిల్లలు రాసిన అన్ని పుస్తకాలను చదివినప్పుడు ఈ పిల్లలకు ఇంత అద్భుతమైన మేధస్సు ఉందా.. అని అనిపించేది. కానీ ఇప్పుడు ఉన్న పిల్లలకు కూడా ఇట్లాంటి బాల చెలిమి కార్యక్రమాలు మిగిలిన జిల్లాల్లో కూడా జరగాల్సిన అవసరం ఉంది. మనకు తెలియని విషయాలు కూడా పిల్లల నుంచి మనకు వస్తుంటాయి. బాలసాహిత్యం అనేది ఇంకా తెలంగాణలో విడివిడిగా రావాల్సి ఉంది. తెలంగాణ సామెతలు వచ్చేటట్టుగా కథలు రాయడం, పిల్లలకు అనుగుణంగా కథలు రాయాల్సి ఉంది. పిల్లలకు కథలు అంటే చాలా ఇష్టం. కథలు చెప్పితే వినడం, చెప్పడం జరుగుతుంది. కాబట్టి కథ సాహిత్యం పిల్లలకు సంబంధించి ఇంకా ఎంతవచ్చిన అది తక్కువే.


డాక్టర్‍ నాళేశ్వరం శంకరం – ప్రముఖ రచయిత :
బాల సాహిత్యం ఇప్పుడు పుట్టలేదు..అది ఎప్పుడో పుట్టింది. మహా భారతం, భాగవతం, రామాయణంలోనూ బాల సాహిత్యం ఉంది. పురాణ సాహిత్యంలో బాల సాహిత్యం ఉంది. చిన్న పిల్లలకు ఎంత గొప్ప విజ్ఞానం ఉంటుందో మనకు తెలుగు సాహిత్యంలో తెచ్చారు. అయితే, వాళ్లందరూ భక్తి కథలుకే అంకిత మయ్యారు. ఇప్పుడు మనం సమాజాన్ని నిర్ణయించుకునే పిల్లల కథలకి బాల సాహిత్యం సాగే సందర్భంలో మనం ఉన్నాం. నా హృదయం పిల్లలకే అంకితమని ప్రపంచ ప్రసిద్ధమైన ఒక కథా రచయిత ఒక గ్రంథం రాశారు… కానీ, ఈనాడు పిల్లల హృదయం ప్రపంచానికే అంకితమైన ఒక సందర్భంలో మనం ఉన్నాం. మన ఇల్లు ఉంది అమ్మ, నాన్నలకే మన హృదయం అంకితం. వాళ్లు చెప్పినట్లే వినాలి.. అయితే, ఇలాంటి కాలంలో మగ, ఆడ పిల్లలను సమానంగా చూసుకునే ఇల్లు ఉందా అంటే లేదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఆడ పిల్లలను ఒక రకంగా, మగ పిల్లలను మరో రకంగా చూస్తున్నారు.. అందుకే మనం చేయాల్సిన మొదటిపని సమానంగా చూడాలి.ఇంట్లో ఆడపిల్లకు ఎందుకు చీపురకట్ట ఇచ్చి ఊడవమని చెప్పాలి…? మగ బిడ్డ ఊడిస్తే తప్పేంటి…? ఇంటిని ఊడ్చే పిల్ల రాబోయే కాలంలో దేశాన్ని ఊడ్చడానికి సిద్ధమౌవుతుంది. పైకి చూస్తే ఇల్ల్లు ఊడ్చుతుంది అనుకుంటున్నారు కానీ, భవిష్యత్‍లో ఈ దేశాన్ని చీపుర కట్ట ద్వారా ఊడ్చే శక్తి తల్లి ద్వారా వస్తుంది. అంతే కాదు బట్టలు ఉతకటం, అంట్లు తోమటం ఇలాంటి పనులు చేస్తు ఉంటారు.. దేశానికి పట్టిన పీడని కూడా బట్టలు ఉతికినట్లు ఉతికి, అంట్లు తోమినట్టు తోమేస్తారు. అపరిశుభ్రంగా ఉన్న సమాజాన్ని కూడా ఇలా చేయాలని మన మనసుల్లో పెరుగుతూ ఉంటుంది. ఆ పెరగడానికే ఈ బాల సాహిత్యం. ఈ బాల సాహిత్యం వెనుక ఉన్న రహస్యం మాములు రహస్యం కాదు.. నేను బాల సాహిత్యంలోకి రావడానికి మా టీచర్‍ నే కారణం. నేను నాల్గవ తరగతిలో చేరినాను.. ఆరవ తరగతిలో మానేసాను. నాకు స్కూల్‍తో సంబంధం లేదు. నేను ఆటలకు కూడా దూరమైనవాడిని.. కానీ, నాకు లైబ్రరి లక్షణాలు ఉండేటివి. అందరికి కూడా లైబ్రరి ఉండాలి.. గ్రంథాలయం మన అమ్మతో సమానం. లైబ్రరి అనేది మనతో పలకదు.. కానీ, అమ్మ కన్న ఎక్కువుగా మనం ప్రేమించేది గ్రంథాలయమే. మా స్కూల్‍లో ఉన్న లైబ్రరిలో ఓ పుస్తకాన్ని చదివేటప్పుడు అందులో ఒక కథ నాకు బాగా నచ్చింది. ఆ కథ నన్ను సాహిత్యకారుడిగా మార్చింది. ‘‘ఆ కథలో ఒక నానమ్మ
ఉంటుంది. ఒక పిల్లగాడు ఉంటాడు.. వాళ్లు చాలా పేదవాళ్లు.. గుడిసెలో జీవించేవారు. అన్నం కూడా దొరకదు. రోజూ రొట్టెలు చేసుకుంటూ అవే తినేవాళ్లు.. రోజు రొట్టెలు చేసే సమయంలో ఆమె చేతివేళ్లు కాయలు కాస్తుండేవి.. అవి చూసిన పిల్లగాడు నానమ్మను అడగడంతో.. ఆమె ఏమిచేయాలి రా.. రోజూ రొట్టెలు చేతితో చేయడంతో ఇలా కాయలు కాస్తున్నాయి రా.. అని చెప్పింది. నా కోసం నానమ్మ ఇంత కష్టపడుతుందే అనే భావన పిల్లగాడి మనసులో కలుగుతుంది. ఒకరోజు ఆ ఊర్లో జాతర జరుగుతున్న సమయంలో నానమ్మ నాకు రెండు నాణేలు ఇవ్వవా అని అడుగుతాడు.. జాతరలో తన స్నేహితులు కళ్ల అద్దాలు కొంటారు.. అయితే ఈ పిల్లగాడు రెండు నాణేలతో సర:తాలు కొని నానమ్మకు గిప్ట్గా ఇస్తాడు.. ఆ నానమ్మ పిల్లగాడుని పట్టుకుని ముద్దు పెట్టుకుంటుంది’’. ఈ కథ అయిపోతుంది. ఈ కథ భారతదేశంలో అతిపెద్ద ప్రసిద్ధమైన ప్రేమ్‍చంద్‍ రాసిన కథ.


ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు ఉన్నాయి కానీ, పిల్లకంటూ ఉద్యమం లేదు.. ఆ ఉద్యమాన్ని నడిపించే వ్యక్తే వేదకుమార్‍గారు. ఇది మాములు ఉద్యమం కాదు. ఉన్న ఆస్తులు అన్నీ అమ్ముకునే ఉద్యమం. ఈ ఉద్యమం పిల్లలకే అంకితం. నా హృదయం పిల్లలకే అంటూ బాల చెలిమిని ప్రారంభించారు. కనుక పిల్లల్లో ఒక మొక్క లాగా పెరిగేటటువంటి ఒక స్వభావాన్ని తీసుకొస్తున్నారు. నేను కూడా ఒక కవితను రాసుకున్నాను. ‘‘రేపటి అమ్మనాన్నల బాల్యం’’ అని, ఇప్పటి అమ్మనాన్నలు ఎట్లా ఉంటారో.. మనం కూడా అట్లనే తయారు అవుతాము. సమాజంలో అందరి సమస్యలు కనిపిస్తున్నాయి… కానీ, పిల్లల కన్నీళ్లు కనిపించడం లేదు. పిల్లలు కన్నీళ్లు ఎలాంటివి అంటే చెరువుల్లో చేపలకు ఉన్న కన్నీళ్లులాంటివి. ఈ దుఃఖాన్ని తొలగించడానికే ఇలాంటి బాల చెలిమి, బాలసాహిత్యం లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను.


పద్మిని రంగరాజన్‍ – స్ఫూర్తి డైరెక్టర్‍ :
నేను ఈ కళకు రావడానికి కారణం మా నాన్న గారే.. తను నాటక రంగంలో ఉండి హరికథలు, ప్రవచనాలు చెప్పేవారు. అయితే, నాన్న చెప్పిన కథలను మళ్లీ నన్ను అడిగేవారు.. ఏ కథ చెప్పాను.. ఏ ప్రవచనం చెప్పాను అని.. అందుకు నాకు ఇష్టం లేకపోయినా అని విని చెప్పేదాని.. ఆ తర్వాత కూడా నేను ఎక్కువ మాట్లాడుతానని వేరేవేరే కళల్లో (డ్యాన్స్ లాంటివి) చేర్పించేవారు.. ఆ తర్వాత నేను ట్యూషన్‍ చెప్పేదాన్ని.. ఈ ట్యూషన్‍ కు వచ్చే పిల్లలతో సరదాగా ఉండేదాన్ని.. చివరకు నేను చదివిందే చేప్పేదాన్ని.. మళ్లీ పిల్లలకు కథలు చెప్పడం, పిల్లలతో ఆడుకోవడం, బొమ్మల కళలు వచ్చేశాయి. ఆ తర్వాత నాకు బాబు పుట్టినప్పుడు నేను దూరంగా ఉండేదాన్ని.. దీనిని గమనించిన మా నాన్న నాకు కొన్ని సూక్తులు చెప్పారు.. బాబుతో ఎక్కువగా టైం కేటాయించు. బాబుకు కథలు చెప్పు, పాటలు నేర్పు అని చెప్పారు.. అట్లా చేసినప్పుడు ఎక్కువగా పక్కింటి పిల్లలు వచ్చేవారు.. మా బాబు వచ్చేవాడు కాదు.. అయినా సరే నేను ఆ పిల్లలకు కథలు, పాటలు చేప్పేదాన్ని.
ఒకసారి పిల్లలను టీచర్‍ ఓ ప్రశ్న అడుగుతున్నాడు.. ఆ ప్రశ్న మేక ధర 50 రూపాయలు.. మూడు మేకల ధర ఎంత అని అడిగారు.. అందరూ వెంటనే 150 రూపాయలు అని చెప్పారు.. కానీ, ఓ బాలుడు మాత్రం ఏమీ చెప్పలేదు…. వెంటనే ఆ బాలుడిని బయటకు పంపించారు. నేను ఆ బాలుడిని అడిగినాను జవాబు అదే కదా అని.. వెంటనే ఆ బాలుడు కాదు మేడమ్‍ కిలో మటనే 300 రూపాయలు ఉంది.. మేక 50 రూపాయలు ఏంటి మేడమ్‍ అని అన్నాడు.. వెంటనే నేను షాక్‍ అయ్యాను.. ఆ బాలుడు చెప్పింది నిజమే కదా అని.. అప్పుడు తెలిసింది పెద్దవాళ్ల ఆలోచనకు పిల్లలు ఆలోచించాలి అనుకునేది తప్పు… పిల్లలు ఎట్లా ఆలోచింపజేస్తారో మనం దిగిపోవాలని.. నేను ఆదిలాబాద్‍లో గిరిజన పిల్లలతో పనిచేశాను.. వాళ్లు కొంచెం ధైర్యంగా ఉంటారు. ఒక గిరిజన పిల్లగాడు వచ్చి నాతో మాట్లాడాడు. మేం అడవికి వేటకు వెళతాం.. అడవిలోని పందులను, కుందేళ్ళను వేటాడి తెచ్చుకుంటామని చాలా ఉత్సాహంగా చెప్పడంతో.. వెంటనే మా పిల్లవాడు కూడా ఈ సారి మీరు వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్లండి అని అన్నాడు.. వెంటనే నాకు ఆశ్చర్యం వేసింది.. మా పిల్లగాడికి పిల్లి అంటే భయం.. అలాంటిది అడవికి వేటకు వెళతాను అన్నాడే అని.. ఇది పిల్లలకు ధైర్యం ఇచ్చే అంశం. బాలలతో సంభాషించి వారికి విషయాన్ని సులభంగా అందిచగల్గడం ఎంతో అవసరమన్నారు. రచయితలు బాలల అభిరుచులను గమనించి తమ రచనలను అందించాలన్నారు.


చిన్నప్పుడు ఉన్న ఉత్సహం, ఉల్లాసం 7వ తరగతి లేక 8వ తరగతికి వచ్చే వయస్సుకు కొంచెం తేడా వచ్చేస్తుంది.. వాళ్లు పెద్దవాళ్లను చూసి, మనలాంటివాళ్లను చూసి అట్లా అయిపోతున్నారో, లేక మన ఒత్తిడితో అట్లా అయిపోతున్నారో నాకు తెలియదుకానీ, పిల్లలు చిన్నప్పుడు ఉన్న విధానం కొంచెం వయస్సుకు వచ్చే సరికి తేడా వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లలకు ఆలోచనా విధానం కల్పిస్తే వాళ్లు కూడా తప్పకుండా బాగా చదువుతారు, బాగా రాస్తారు..ఇలాంటి వాళ్ల కోసం ఏదైనా ఒక పత్రిక, లేక ఏదైన సదస్సును ఏర్పాటు చేసి పిల్లలకు అందజేస్తే మార్పు రావచ్చని ఓ సందర్భంలో వేదకుమార్‍ గారితో చర్చించడం జరిగింది. ఇప్పుడు ఇలా పిల్లల కోసం బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. పిల్లలకు ఏమి కావాలి, వాళ్లు ఏమి అనుకుంటున్నారు.. వాళ్లకు ఎలాంటి కథలు చెప్పాలి, వాళ్లలోని మేథస్సును ఎలా పెంచాలి, తదితర అంశాలపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం, చర్చించడం, అలాగే పిల్లలకు తెలపడం చాలా సంతోషంగా ఉంది.


డాక్టర్‍.ఎస్‍.రఘు :
ఈ తొమ్మిదవ బాలచెలిమి ముచ్చట్లులో నేను దాదాపు అన్ని బాలచెలిమి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. నిజానికి చెలిమి అనేది చెలమ… అంటే మన అంతరంగంలో ఉండేటట్టు ఉండే జ్ఞాపకాల అలలు.. జ్ఞాపకాల ద్వారా ఆగనటువంటి బాల సాహిత్య ముచ్చట్లు ఇవి… ఈ ముచ్చట్లు అనేవి భవిష్యత్‍లో ఒక తరాన్ని నిర్మించుకునే టటువంటి ముచ్చట్లు ఇవి.. ఒక విలువైనటువంటి సాహిత్యాన్ని ఎదగడానికి నిర్మించేటటువంటి ముచ్చట్లు ఇవి… పిల్లలు పాఠశాలలోని టీచర్లుతో ఉన్న అనుబంధం లేక తెలుగు టీచర్‍తో ఉన్న అనుబంధం పెంచుకోవటం ద్వారా మంచి రచయితలుగా వస్తారు.. ఇప్పుడు కావాల్సింది పెద్దలు చెప్పే మాటలు అప్పటి అనుభవాలను పంచుకుంటూ నేటి తరానికి, రాబోయే తరానికి అందించాలి అంటే ఇలాంటి వేదికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఒక తాత మనవడిని ఆడించాలి అంటే తాత మనవడిగా మారిపోవాలి.. అప్పుడే ఆ మనవడు బాగా ఆటలాడగలడు… కాబట్టి పిల్లలకు అవగాహన, ఆలోచన కలిగించే ఇలాంటి బాలచెలిమి ముచ్చట్లు కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం.


ఈ కార్యక్రమానికి ముందు డైరెక్టర్‍ గోపి దేశాయ్‍ దర్శకత్వం వహించిన ‘‘ముజ్‍సే దోస్తీ కరేగే’’ హిందీ షార్ట్ ఫిల్మ్ను ప్రదర్శించారు. సన్నిహిత ఉమెన్‍ – గర్ల్ సొసైటీ పాఠశాల విద్యార్థులు పాల్గొని సందడి చేశారు. అనంతరం నిర్వహించిన ముచ్చట్లులో విద్యార్థులు,
ఉపాధ్యాయులు, బాల సాహితీ అభిమానులు, తదితరలు పాల్గొన్నారు.


-ఆర్‍. పురుషోత్తం నాయుడు,
ఎ : 9573041226

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *