‘రంగుల లోకంలో పల్లెల సోయగం’ గ్రామీణ జీవన ప్రతిరూపాలు ఆగాచార్య చిత్రాలు

అభిరుచిని దృష్టిలో పెట్టుకుని వాస్తవిక అంశాలను స్వీకరించి అందుకు అనుగుణమైన వాతావరణ కల్పనతో మైమరపించే చిత్రాలను గీయడంలో సిద్ధహస్తులు ఆగాచార్య. గ్రామీణ జీవనంలోని కళారూపాలు, వృత్తులు, ఆత్మీయానుబంధాలు, సంస్కృతీ సంప్రదాయాలకు లోగిళ్ళుగా ఆయన చిత్రాలు కనిపిస్తాయి. చిత్రరచన అంటే ఇలా ఉండాలి అని తన చిత్రాలను అందుకు నిజరూపాలుగా మలచిన చిత్రకళా మాంత్రికుడు ఆగాచార్య. పల్లె అందాలను తన చిత్రాలకు ముడిసరకుగా మార్చుకుని అపురూప రూపాత్మకతలను చిత్రకళా రంగానికి ఆయన అందించారు. పల్లెపడుచుల అందాలనేకాదు వారి మదిలోని భావాల్ని రమ్యమైన వర్ణచిత్రాలుగా ఆయన మలిచారు. పల్లెపడుచుల కట్టు,బొట్టు, సంప్రదాయం, జీవనశైలిని చాటిచెప్పేందుకు ‘‘రస్టిక్‍టేల్స్’ అంటూ సోలో ప్రదర్శన ప్రారంభించి హైదరాబాదు జూబ్లీహిల్స్లోని బియాండ్‍ కాఫీలో 51 వినూత్న చిత్రాలతో చితప్రపంచాన్ని సమ్మోహనపరిచారు.బెలూన్‍ సిరీస్‍తో చిత్రాలను రచించి ప్రదర్శించిన అరుదైన చిత్రకారుడు ఆగాచార్య.

  • 1948లో కరీంనగర్‍లో జన్మించిన ఆగాచార్య మైసూరులోని కర్నాటక స్టేట్‍ ఓపెన్‍ యూనివర్సిటీ నుండి ఎంఎఫ్‍ఏ పూర్తి చేసి 35 సంవత్సరాలపాటు ప్రభుత్వ విద్యా సంస్థలలో చిత్రకళో పాధ్యాయునిగా సేవలందించారు.
  • 1000కి పైగా సాహిత్య పుస్తకాలు, మేగజైన్‍లకు ముఖచిత్రాలు వేశారు. 1975 నుండి 2000 మధ్యకాలంలో ఆయన చిత్రాలు పలు పత్రికలు, మ్యాగజైన్‍లలో ప్రచురితమయ్యాయి. హైదరాబాదులో నివాసముంటూ చిత్రకళారంగంలో ఎంతో కృషిని కొనసాగిస్తున్నారు.
  • 1978 నుండి 2015 వరకు జరిగిన పలు చిత్రకళా ప్రదర్శనలలో పాల్గొని చిత్రాలను ప్రదర్శించి పేరొందారు.
  • త్రివేండ్రం నేషనల్‍ ఇంటిగ్రేషన్‍ క్యాంప్‍, ఆర్ట్ ఎట్‍ ది రేట్‍ ఆఫ్‍ తెలంగాణ, గ్లోరియస్‍ తెలంగాణ ఆర్ట్ క్యాంప్‍, మిత్రాస్‍ ఆర్ట్ క్యాంప్‍లలో పాల్గొన్నారు.
  • 2011, 2012లలో బియాండ్‍ కాఫీ సోలో షోలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.
  • 2013, 2014లలో మ్యూజ్‍ ఆర్ట్ గ్యాలరీ, గ్యాలరీ స్పేస్‍ హైదరాబాదులో జరిగిన ప్రదర్శనలకు హాజరయ్యారు.


2011లో చిత్రమయి స్టేట్‍ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాదులో జరిగిన గ్రూప్‍ షోతోపాటు 2018 వరకు రెయిన్‍బో ఆర్ట్ గ్యాలరీ హైదరాబాదు, గ్రూప్‍షొ ఇంటర్నేషనల్‍ ఆర్ట్ ఎక్స్పో-2 పోయెక్లీ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాదు, ఆర్టిస్ట్ గ్రూప్‍ షో స్టుడియో సైనా పూనే, ఇండియన్‍ ఆర్ట్ ఫెస్టివల్‍ న్యూఢిల్లి, ఇండియన్‍ ఆర్ట్ ఫెస్టివల్‍ ముంబాయి, ఆర్ట్ ఎట్‍ దిరేట్‍ ఆఫ్‍ తెలంగాణా కళామేళా పీపుల్స్ ప్లాజా హైదరాబాదు, జహంగీర్‍ ఆర్ట్ గ్యాలరీ ముంబాయి, స్టేట్‍ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాదు, ఆలిండియా ఆర్ట్ కాంపిటీషన్‍ స్టేట్‍ గ్యాలరీ ఆఫ్‍ ఆర్ట్, రంగ్రెజ్‍ గ్రూప్‍ ఆర్ట్ ఎగ్జిబిషన్‍ కోల్‍కత్తా గ్రూప్‍షోలకు ఆగాచార్య హాజరై తాను రూపొందించిన చిత్రాలతో ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. తైవాన్‍లో జరిగిన గెట్‍ ఆర్ట్ మ్యుజియం అంతర్జాతీయ ప్రదర్శనలో కూడా ఆగాచార్య పాల్గొన్నారు.

  • తన చిత్రకళారంగ కృషికి పలు అవార్డులను ఆగాచార్య అందుకున్నారు.
  • 1989లో జిల్లాస్థాయి ఉత్తమ చిత్రకళా ఉపాధ్యాయ పురస్కారాన్ని పొందారు.
  • 2017లో హైదరాబాదు ఆర్ట్ సొసైటీ అవార్డు
  • 2018లో కోనసీమ చిత్రకళా పరిషత్‍ ఆధ్వర్యంలో భారత చిత్రకళారత్న అవార్డును అందుకున్నారు.


నిత్య విద్యార్థిలా చిత్రకళారంగంలో నేర్చుకునేందుకు ఇష్టపడతారు ఆగాచార్య. ఎప్పటికప్పుడు తెలుసుకుంటేనే పరిపూర్ణత లభిస్తుందని ఆయన చెబుతారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కెసీఆర్‍కు బతుకమ్మ పెయింటింగ్‍ను ఆగాచార్య అందజేసి ప్రశంసలు పొందారు. ఆగాచార్య హైదరాబాదు బంజారాహిల్స్లో ఏర్పాటుచేసిన రస్టిక్‍టేల్‍ ప్రదర్శనను అప్పటి కరీంనగర్‍ కలెక్టర్‍ దంపతులు స్మితా సబర్వాల్‍, అకున్‍ సబర్వాల్‍ సందర్శించి ప్రశంసించారు. ‘ఎక్స్ప్రెషన్స్ ఆఫ్‍ కలర్స్’ అద్భుతమని వారు కొనియాడారు. పలువురు జాతీయ నాయకుల చిత్రాలను కూడా వేసిన ఆగాచార్య ప్రశంసలందుకున్నారు. గ్రామీణ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎదిగిన చిత్రకారుడుగా ఆగాచార్యకు అరుదైన గుర్తింపు దక్కింది. సంస్కృతి, సమకాలీనత, మానవీయత, జీవనశైలుల కలయికగా ఆగాచార్య చిత్రరంగ కృషి కొనసాగింది. తన చిత్రాలతో ఏదో కొత్తదనాన్ని అందించాలని తపనపడే ఆగాచార్య కళాత్మక కృషి చిరస్థాయిగా గుర్తుండిపోతుంది.
ఆగాచార్య
ఎ : 99494 32144

  • సృజన్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *