జయహోనోములా!

బహుభాషావేత్తగా, నడయాడే విజ్ఞాసర్వస్వంగా, సుప్రసిద్ధులైన డా।। నోముల సత్యనారాయణ గారు భౌతికంగా దూరమైనారు. నల్లగొండ కొండగుర్తుగా, సాహితీ శిఖరంగా ఎదిగిన నోముల సాహితీనోముపంట. వారి మరణానంతరం నల్లగొండలో రెండుచోట్ల రెండుసార్లు వారి సంస్మరణ సభలను నిర్వహించి నల్లగొండ సాహితీ మిత్రులు వారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. జయమిత్ర సాహితీ సంస్థ నిర్వాహకులు ప్రముఖ కవి వేణు సంకోజు గారి అధ్యక్షతన రెడ్‍క్రాస్‍ భవనంలో 31-12-2018నాడు జరిగిన సంస్మరణ సభలో నల్లగొండ ప్రాంతానికి చెందిన కవులు, రచయితలు పాల్గొని వారికి నివాళి అర్పించడం జరిగింది. అదే విధంగా 4-01-2019 శుక్రవారం నాడు జరిగిన సంస్మరణ సభలో రాష్ట్రం నలుమూలలనుండి పలువురు కవులు, పరిశోధకులు, సాహితీవేత్తలు పాల్గొని వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ప్రముఖ కవి కాళోజీ పురస్కార గ్రహీత డా।। అమ్మంగి వేణుగోపాల్‍ మాట్లాడుతూ నిఖార్సైన మానవతావాదిగా, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడే వ్యక్తిత్వం వున్న మనిషిగా నోముల వారిని కొనియాడుతూ వారితో తనకున్న సుదీర్ఘకాల అనుబంధాన్ని గుర్తుచేసు కున్నారు. ప్రముఖ సినీ దర్శకులు బి. నర్సింగరావు మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా విద్యార్థుల సమగ్ర జ్ఞాన, వ్యక్తిత్వ వికా సాలకు ఏ విధంగా తనదైన కీలక పాత్ర పోషించారో, అదే విధంగా భాషావేత్తగా, సాహితీ వేత్తగా, సామాజిక వికాసానికి ఎంతో తోడ్పడ్డారని అన్నారు.


తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు పరిశోధకులు డా।। జయధీర్‍ తిరుమల్‍రావు మాట్లాడుతూ భాషాపరంగా, సాహితీపరంగా, వారి సలహాలు తీసుకోని వ్యక్తులుగాని, సంస్థలుగాని ఉండవంటే అతిశయోక్తికాదు. ఆయన సాహిత్యం మొత్తం తెలుగు సమాజానికి చేరవలసిన అవసరం వుందని అన్నారు. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డా।। కుర్రా జితేంద్రబాబు మాట్లాడుతూ ఎదుటివారిలో ఏ మాత్రం ప్రతిభవున్నా వారిని ప్రశంసిస్తూనే లోపాలను మాత్రం సున్నితంగా సూచించే తత్వం వారిది అని అన్నారు. ప్రముఖ కవి వేణు సంకోజు మాట్లాడుతూ పట్టుదలతో చదువుకొని ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషా సాహిత్యాలలో అమోఘమైన పాండిత్యాన్ని సంపాదించుకొని నల్లగొండ ఐకాన్‍గా నోముల చిరస్థాయిగా నిలిచిపోతారని, జయమిత్ర సాహితీ సంస్థద్వారా అనేక కార్యక్రమాల్ని వారితో కలసి నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రముఖ రచయిత వేముల ఎల్లయ్య మాట్లాడుతూ కుల, మత భావనలు లేకుండా అందరినీ సమదృష్టితో చూచి ఎవరినీ నొప్పించకుండా జీవించిన అసలైన సామ్యవాది అని, వారి ఆశయాలను ముందుకు తీసుకు పోవడమే వారికిచ్చే ఘనమైన నివాళియని అన్నారు. ప్రముఖ కవి డా।। బెల్లి యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, రచయితలు గింజల నర్సింహారెడ్డి, మేరెడ్డి యాదగిరిరెడ్డి, స్కైబాబా, డా।। కృష్ణకౌండిన్య, డా।। పగడాల నాగేందర్‍, పున్నఅంజయ్య, డా।। పురుషోత్తమాచార్యులు, డా।। కనకాచారి, దున్న యాదగిరి, తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి అధ్యక్షులు డా।। గంటా జలంధర్‍రెడ్డి, ప్రపంచ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కన్వీనర్‍ యం.వి. గోనారెడ్డి ఇంకా పలువురు అధ్యాపకులు, సాహితీ మిత్రులు, బంధువులు పాల్గొని వారికి ఘన నివాళి అర్పిం చడం జరిగింది.


ఇదీ నోముల వారి జీవనప్రస్థానం:
ఆగష్టు 10, 1940న నోముల శీనమ్మ-మల్లయ్య దంపతులకు ఎనిమిదవ సంతా నంగా జన్మించారు. వారికి ఏడుగురు అక్కలు. వారి పద కొండవ ఏటనే తండ్రి మర ణించడంతో పిల్లల సంరక్షణా బాధ్యతంతా తల్లిపై పడింది. హెచ్‍.యస్‍.సి వరకు ఖమ్మం లో (1956), పి.యు.సి వరంగల్‍లో (1957) పూర్తిచేశారు. పి.యు.సిలో వారి సహాధ్యాయులు ప్రముఖ కవి వరవరరావు. పి.యు.సి అనంతరం ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసి 1959లో ఖమ్మంలో ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించారు. బదిలీపై నల్లగొండకు విచ్చేసి 1962లో ఇంగ్లీషు ప్రధానాంశంగా డిగ్రీని, 1964లో బి.ఇడి.ని పూర్తిచేశారు. అలీఘర్‍ విశ్వవిద్యాలయం నుండి 1968లో యం.ఎ.ఇంగ్లీషు పట్టాపొందారు. రామగిరి, పానగల్లు, మాన్యంచల్క పాఠశాలల్లో ఉపాధ్యా యులుగా పనిచేసి 1970లో జూనియర్‍ లెక్చరర్‍గా పదోన్నతిని పొంది నాగా ర్జునసాగర్‍లో కొంతకాలం పనిచేసి తిరిగి బదిలీపై నల్లగొండ ప్రభుత్వ జూని యర్‍ కళాశాలకు వచ్చారు. 1977లో డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా పదోన్నతి పొంది 1998 ఆగష్టులో ఉద్యోగ విరమణ పొందేవరకు సుమారు 21 సంవత్సరాలు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పనిచేసి ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఆదర్శ ఉపాధ్యాయులు.


నోముల వారు విద్యార్థుల పట్ల ఎనలేని ప్రేమను చూపేవారు. తల్లిదండ్రుల తరువాత అంతగా ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రేమించగలిగినప్పుడే అతడు ఆదర్శ ఉపాధ్యాయుడు కాగలడని వారన్న మాటలు ఎందరికో స్ఫూర్తిదాయకం. ‘భారతీయ, ఆంగ్ల నవలల్లో నైతికత-ముల్క్రాజ్‍ ఆనంద్‍, ఆర్‍.కె. నారాయణ్‍, అరుణ్‍జోషి సందర్భంలో’ అను అంశంపై డా।। జగన్మోహనాచారి పర్యవేక్షణలో పరిశోధనచేసి కాకతీయ విశ్వవిద్యాలయంనుండి 1987లో పిహెచ్‍.డి. పట్టా పొందారు. స్వయం అధ్యయనంతో ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషా సాహిత్యాలలో అమోఘమైన పాండిత్యాన్ని సంపాదించారు. ప్రెంచ్‍, కన్నడం, మారాఠి భాషలనుకూడా నేర్చుకున్నారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషలలో మాత్రం లోతైన పాండిత్యంగలిగి ఏ భాషనుండి ఏ భాషలోకైనా అనువాదం చేయగల నైపుణ్యాన్ని సంపాదించారు. 1970 తర్వాత లక్ష్మీపతి, సత్యం అను కలంపేర్లతో కొన్ని సాహిత్యవ్యాసాలను రాశారు. వాటిని ఉద్యోగ విరమణ సందర్భంలో ‘సామ్యవాద వాస్తవికత-మరికొన్ని వ్యాసాలు’ అను పేరుతో వారి మిత్రులందరు కలసి ఒక పుస్తకంగా ప్రచురించారు. ఈ పుస్తకంలోని వ్యాసాలు శ్రీశ్రీ రాజకీయ దృక్పథం, చితి-చింత, తీర్పు, సామ్యవాద వాస్తవికత, అంతర్జ్వాల, రాజు మహిషి-ఒక పరిశీలన, కోర్టుల మాయ, సాహిత్యవిమర్శలో వ్యక్తిత్వ అధిగమనం, ప్రేమ్‍చంద్‍హోరాహోరి, కృష్ణశాస్త్రిపై ప్రభావాలు-ఒక టిప్పణి మొదలగునవి. వారి వ్యాసాలన్నికూడా వారియొక్క సాహితీ వివే చనకు విస్తృత అధ్యయ నానికి అద్దంపడుతాయి.


టాప్‍చెంగ్‍ చైనా భాషలో రాసిన ఆంగ్లానువాదం నవల ఆధారంగా ‘నా కుటుంబం’ పేరుతో తెలుగులోనికి అనువాదం చేశారు. ‘మరో కొత్తవంతెన’ అను తెలుగు, ఉర్దూ కవితాసంకలనం కోసం ఏడు తెలుగు కవితలను ఉర్దూలోనికి అనువదించారు. సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి డిగ్రీకి సంబంధించిన చరిత్ర పాఠ్యపుస్తకం కోసం రెండు అధ్యాయాలను తెలుగు నుండి ఉర్దూలోనికి అనువదించారు. ప్రజాసాహితీ వారి మఖ్దూం ప్రత్యేక సంచికకోసం 2003 అక్టోబరులో మఖ్దూం మొహియుద్దీన్‍ వ్యక్తిత్వం-కవిత్వం అను వ్యాసం రాశారు. ప్రముఖ కవి పెన్నా శివరామకృష్ణ రాసిన సల్లాపం అను గజల్‍సంపుటికి విస్తృతమైన పీఠిక రాశారు. అదే విధంగా వివిధ రచయితలు రచించిన పలు పుస్తకాలను గూర్చి పలు వేదికలమీద విశ్లేషణాత్మకంగా ఉపన్యాసాలు ఇచ్చారు. యువ కవులల్లో, రచయితల్లో ఏ మాత్రం ప్రతిభ కనిపించినా వారిని ప్రోత్సహించేవారు. సామ్యవాద దృక్పథంతో కూడిన భావజాలానికి అతీతంగా ప్రతిభను గుర్తించేవారు. సంప్రదాయవాదియైన విశ్వనాథ సత్యనారాయణ గారి దృక్పథం తనకు ఆమోదయోగ్యం కాకపోయినా ‘ఆయనలాగా పలుసాహిత్య పక్రియలు చేపట్టి అన్నింటిలోకూడా ఉత్తమస్థాయి రచనలు చేయగలిగినవారు ప్రపంచ సాహిత్యంలోనే ఎక్కడా కనిపించరు’ అని అనడంలో వారికి ఉన్న సాహితీ దృక్పథం ఏమిటో అర్ధమవుతుంది.


వామపక్ష భావజాలం వైపు మొగ్గు చూపినా స్త్రీ, దళిత, బహుజన, మైనార్టీ, ప్రాంతీయ అస్తిత్వవాదాలను గూర్చి సానుకూలంగా వ్యాఖ్యా నించేవారు. ఒక ప్రజాస్వామిక ధోరణి వారిలో వుండేది. కావున అన్ని పక్షాలవారికి కూడా సన్నిహితులు కాగలిగారు. 1964 నుండి 1970 మధ్య కాలంలో నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‍ అర్ధ శాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేస్తున్నప్పుడు వారు రచించిన అంపశయ్య నవల రాత ప్రతిని చదివిన కొద్ది మందిలో నోముల వారు ఒకరు. ‘ఆ నవల తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానం పొందుతుంది’ అని ఆనాడే ప్రశంసించారు. కొంపెల్లి వెంకట్‍గౌడ్‍, దివాకరుని కృష్ణమోహన శర్మ గార్ల సంపాదకత్వంలో నోముల గారిని సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసి ‘నోముల సార్‍-అన్‍టోల్డ్ లెసన్స్’ అను పుస్తకాన్ని 2010లో ప్రచురించారు. ఈ పుస్తకం నోముల వారి వ్యక్తిత్వానికి దర్పణం పడుతుంది.
ఇలా ఒక ఆదర్శ ఉపాధ్యా యుడుగా, బహుభాషావేత్తగా, సాహితీవేత్తగా తన జీవన ప్రస్థానాన్ని కొనసాగించి డిసెంబర్‍ 26, 2018న భౌతికంగా మననుండి దూరమైనా, వారి నిండైన వ్యక్తిత్వం, మెండైన సాహిత్యం శాశ్వతంగా నిలిచియుండి భావితరాలకు మరింత స్ఫూర్తిని అందిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.


డాక్టర్‍ తండు కృష్ణ కౌండిన్య , ఎ : 9704731346

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *