మనసు పరిపరి విధాల పయణిస్తది. ఆశ, నిరాశల వెంట పరిగెడతది. అనేక విధాలుగా సంఘర్షిస్తది. ఆలోచనాలోచనల్లోంచి అక్షరమై ఉభికి వస్తది. పదమై పల్లవిస్తది. పాటై ప్రజల నాలికల మీద నర్తిస్తది. అట్లా తన రాగంతో రాయి రప్పల్ని కరిగించిన పాట ఇది. శేను శెలకలను ముద్దాడి, వాగు వంకల్ల తిరిగి చెరువు అలల మీద తేలియాడిన పాట. నాన్నను కలవరించిన పాట. ఆదివాసి, దళిత, గిరిజన, బహుజన చైతన్యమీ పాట. తెలంగాణ ప్రజా ఉద్యమానికి ఊపిరైన పాట. పల్లె పల్లెని కదిలించి కదనరంగంలో నిలబడ్డ పాట. విభిన్నమైన ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన పాట.
ఉప్పు, పప్పు, డప్పు, చెప్పు, రాయి, జోలపాట, కలం, కాగితం, కాకి, కోయిల వంటి ఎన్నింటినో తన అక్షరాలలో పొదుగుకున్న పాట. కాకి గూడును ఆక్రమించుకున్న కోయిలను నిందించే కన్నీటి పాట. మనిషిని నిలువునా ద్రవింపజేసే పాట. అదే తత్వజ్ఞానమెరిగిన యోచన పాట. యోచన పాటల నిండా పోరాటానికి పురుడుబోసె ప్రాకృతిక త్యాగం ఉంటది. మన కండ్లముందు కనపడే ప్రతిదీ యోచన పాటల్లో అలవోకగా వొదిగిపోతది. గురితప్పని వేటగాని విల్లంబైతది. తన వేదనకు కాకి ప్రతీకైతది. వలసబోయిన పల్లె దుఃఖాన్ని కైగట్టి, తెలంగాణ ఆకాంక్షను రగిలించి పాటే ప్రాణంగ బతుకుతున్న అక్షరశిల్పి కవి, గాయకుడు యోచన గురించి నేటి మన ‘అలుగెల్లిన పాట’ లో…
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని మాదన్నపేట గ్రామానికి ఎంతో గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్నది. అక్కన్న మాదన్నలు పాలించినటువంటి ప్రాంతంగా మంచి గుర్తింపు ఉన్నది. మాదన్నపేట ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్నది. గొట్టిముక్కుల బ్రహ్మచారి – అనసూర్య దంపతులు మాదన్నపేట గ్రామానికి చెందినవారే. వీరికి నలుగురు సంతానం. వరుసగా రమాదేవి, రజిత, మల్లయాచారి, పూర్ణాచారి. మల్లయాచారి అక్టోబర్ 20, 1976లో జన్మించిండు. తండ్రి బ్రహ్మచారి మంచి గాయకుడు. పౌరాణిక, జానపద పాటలతో పాటు ఘంటసాల పాటల్ని అత్యంత అద్భుతంగ పాడేటోడు. తల్లి అనసూర్య కష్టపడి మిషిని కుట్టుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిసింది. మల్లయాచారి తన ప్రాథమిక ఉన్నత విద్యను నర్సంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే పూర్తి చేసిండు. మల్లయాచారి తాను ఎనిమిది, తొమ్మిదో తరగతి చదివే క్రమంలోనే పాటలు రాయాలన్న సంకల్పం కలిగింది.‘‘సుట్టూ నాలుగు దిక్కులు నట్టా నడిసంద్రాన / ఏ దిక్కూన ఉన్నావయ్యా చిన్న బద్రూ’’ అంటూ బద్రూ అనే అమరుని మీద రాసిన పాటతో మొదలైన మల్లయాచారి క్రమంగా కమ్యునిస్టు భావాలకు ఆకర్శితుడయ్యిండు. విద్యార్థి దశలోనే జైలు జీవితాన్ని అనుభవించిండు. పోలీసుల నిర్భంధాన్ని ఎదుర్కున్నడు. మారు పేర్లతో పాటలు రాసిండు. ప్రజా ఉద్యమాలలో భాగస్వామి అయ్యిండు. అట్లా తనలో పుట్టిన అంతులేని ఆలోచనల ప్రతిరూపమే యోచన. బరువైన భావాలతో, పదునైన పదాలతో పాటను కైగట్టి ఆర్థ్రంగ ఆలపించే గాయకుడు యోచన.
‘‘తడిసిన పొయిరాళ్ళ మధ్య తల్లడిల్లే మంటజూసి పొగను ఆప పొయిల గొట్టం ఊపిరాడక దగ్గుతుంది’’ అనడంలోనే యోచనలోని కవితాశక్తి ఏందో ఎవరికైనా అర్థమైతది.
ఆదివాసిల హక్కుల కొరకు’’ అంటూ చెట్టు, పుట్టల మీద, రాయి రప్పల మీద, గుండు గుట్టల మీద హక్కులు ఆదివాసీలకే దక్కాలని అంటడు. గొంతెత్తి నినదిస్తడు.
మరొక పాటలో ‘‘భూమిపై మానవజాతికి బువ్వపెట్టే అవ్వ రైతు’’ అంటూ పల్లెలు ఛిద్రమైన విధానాన్ని చూసి, పాటై పల్లవిస్తడు. పోరాటమే శరణ్యమని చాటింపు వేస్తడు. ‘‘డప్పునోయమ్మా నేను దరువునోయమ్మా / కడుపులోన పేగు కదిలి ఉరుముతున్న బరువునోయమ్మా’’ అంటూ యోచన తత్వజ్ఞానంతో పదాలల్లుతడు. జీవితంలోని ఒడిదుడుకులను తడిమి పట్టుకుంటడు.
‘‘పుడితినీ పల్లెతల్లి కూలి శెమట సుక్కనై పురుడుబోసుకుంటి ప్రజల నోటి వెంట పాటనై’’ అంటూ అమ్మపాటైతడు. తల్లి జోలపాటైతడు. దుఃఖానికి మూలం కనుక్కుంటడు. దళిత, బహుజన కులాల చైతన్యం కోసం పరితపిస్తడు. అనేక వృత్తి కులాలను గురించి తన పాటల్లో పాదుగొలుపుతడు. జానపదాలను మరిచిపోతున్న సమాజానికి కనువిప్పు కలిగిస్తడు.
‘‘చిన్ననాటి జ్ఞాపకాలు చెరిగిపోనివి
ఎంత యాది జేసుకున్న తీరిపోనివి
మరుపురానివి ఎంత మధురమైనవి
గుర్తుకొస్తె గుండెనిండి పొంగుతున్నవి’’ అంటూ యోచన గత స్మృతులను తల్సుకుంటడు. మనిషికి బాధలాచ్చినపుడు ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటే మనసు కుదుట పడతదని అంటడు. ‘‘మా పల్లె ఒక మల్లెతోట విరజిమ్మెను ప్రతి పూట / తల్లి పాలకన్నా చల్లని పల్లె తల్లిని జూడరమ్మా పల్లెతల్లిని జూడరమ్మా’’ అంటూ పల్లెని తల్సుకొని పరవశిస్తడు.
‘‘మచ్చలేని మల్లెపువ్వులాంటి ఓ తెల్లని కాగితమా / ఒంటినిండ పచ్చబొట్లు బొడిసీన ఓర్చిన జీవితమా’’ అంటూ అద్భుతమైన పాట రాసిండు. ఉత్త కాగితమే అనుకుంటం. చెత్త కాగితం అనుకుంటం. కాని యోచన జ్ఞానం వేరు. కాగితం ఎట్లెట్ల తిరుగుతదో ఎన్ని రూపాలెత్తుతదో చెప్పిన తీరు వర్ణించడానికి మాటలు చాలవు. అదేవిధంగ మనిషి పుట్టుకకు, మానవ మనుగడకు సంబంధించి యోచన రాసిన పాట ‘‘ప్రకృతి ప్రసాదము జీవరాసి జననం – వందల వేల ఏండ్ల పరిణామ క్రమం’’ అంటూ ఎంతో నిగూఢమైన అర్థాలతో మనిషిని ఆలోచింపజేస్తది. తనలోని మానవత్వాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తది. ఇదే భావనతో కూడిన మరో పాటలో యోచన జీవన తత్వాన్ని విచారిస్తడు.
‘‘ఏది నీ సొంతమనుకోకురా దేనికీ బానిసై పోకురా’’ అంటూ యోచన తత్వజ్ఞానంతో, తాత్విక పునాదితో రాసిన ఈ పాటలో ఆస్తుపాస్తులేవైనా అనుభవించుటకే గాని అవి మన వెంట తీసుకుని వెళ్ళలేమనే సత్యాన్ని మరోసారి గుండెకు హత్తుకునేలా గానం చేస్తడు.
‘‘కాళ్ళకున్న మువ్వలే మూగబోయెనిప్పుడు సంకనున్న డప్పుగొడితె ఏగనంది సప్పుడు గొట్టి ముక్కులా బ్రహ్మచారి గొంతు మూగబోయెననీ కంటనీరు దీసింది గోసి గొంగడి’’ అంటూ పాటల బాటసారి, ఉద్యమాల గొంతుక బ్రహ్మచారి వంటూ మధుర గాయకుడు తన తండ్రి గొట్టిముక్కుల బ్రహ్మచారిని తల్సుకుంటూ యోచన రాసిన పాట కడుపుల పేగుల్ని కదిలిస్తది. బ్రహ్మచారి పాటకు రాళ్ళు కూడ కరిగిపోతయని అంటడు. ‘‘నువ్వు ఆలపిస్తే ఆకసాన సిల్లు బడతది- నీ పల్లవింటే నింగినుంచి జల్లు బడతది- నువ్వు తాళమేస్తే కాలమే పులకరిస్తది’’ అంటూ పాటల కోయిలను తల్సుకొని కాకై మొత్తుకుంటడు. కన్నతండ్రిని తల్సుకొని కాదు కాదు ఓ గొప్ప కళాకారున్ని మదినిండ నింపుకొని కన్నీరు మున్నీరైతడు యోచన. ‘‘అంటరానిదానివంటె ఈ లోకం కంటనీరెందుకె కాకెమ్మా’’ అంటూ సూత్రీకరణ చేస్తడు. దళితజాతి ఔన్నత్యాన్ని, త్యాగనిరతిని గానం చేస్తడు. మనం నిత్యం కూరల్లో ఉపయోగించే ఉప్పు మీద యోచన రాసిన పాట చాలా గమ్మత్తుగా ఉంటది. ‘‘లోకమందరితోని గొప్పగా మొప్పు పొందీనవమ్మా ఉప్పు’’ దిష్టి దీసి పొయిలబోస్తే కయ్యానికి కాలుదువ్వి ఉరుకుతవని అంటడు యోచన. అతని ఆలోచన అనంతం. ఎడతెగని ఆకాశం. ‘‘రాయివే గాదు రత్నానివోయమ్మా అపురూపాల అవతారమెత్తీన శిలవమ్మా / దైవానికే నువ్వు మారు పేరోయమ్మా నువ్వు లేకుంటే మనిషికి మనుగడే లేదమ్మా’’ అంటూ రాయి మీద అద్భుతమైన పదాలను చెక్కుతడు.
‘‘అమ్మనురా కొడుకా అమ్మనురా కమ్మిన చీకటి బొమ్మనురా ఏడిండ్ల పిల్లి కూనైతిరా…. మీ ఇండ్లు నెలవంతు దిరిగొస్తిరా…’’ బిడ్డలు పుడుతుంటే కలలెన్నో కన్న కన్నతల్లి కడుపార బిడ్డల్ని కని కంటికి రెప్పోలే కాపాడుకుంటదనే కాలజ్ఞాన తత్వాన్ని ఎర్కజేస్తడు.
‘‘ఏమిచ్చి తీర్చగలను నాన్న నీ రుణము నీవిచ్చినదే కదా నేననే ఈ తనువు నాలోని అణువణువు నడిపించే ఆయువు నీవు ఎలా తీర్చగలను నీ రుణమెలా తీర్చగలను’’ అంటూ నాన్న మీద ప్రేమతో రాసిన ఈ పాట యోచన గుండెలోతుల్లోని ప్రేమను పట్టిస్తది. తండ్రి పట్ల తనకున్న భావనను ప్రతి పదంలోను ప్రతిబింభింపజేస్తది. అదేవిధంగ యోచన ఆయా వ్యక్తుల మీద రాసిన పాటల్లో గూడ ఎంతో విలువైన సాహిత్యాన్ని పొందు పరుస్తడు. ‘‘వెలంపల్లి మీద వెన్నెలా చీకటయ్యింది దళితా పల్లెల / ముసిముసి నవ్వుల అందెల మువ్వలా గోరెంక గుంపులా పలకరింపులా’’ అంటూ మిట్టపల్లి నర్సయ్య మీద ఆలపించిన స్మృతి గీతం ఎంతో ఆర్థ్రంగ, చైతన్యవంతగా ఉంటది. ఆ వ్యక్తుల జీవితం కండ్ల ముందు కనపడేలా చేస్తడు. యోచన కవిత్వీకరించిన పదాలతో ఆ వ్యక్తుల జీవితం మరింత కళాత్మకంగ కనిపిస్తది. యోచన విలేఖర్ల మీద రాసిన పాటలో ‘‘నిప్పుల కుంపటి మీద నీవు నడుస్తవని’’ బలమైన ప్రతీకలతో పాటల్లుతడు. ఇట్ల తండ్రి వారసత్వ ప్రభావంతో పాటల ప్రపంచంలోకి అడుగుపెట్టిన యోచన అనేక వొడిదుడు కులను ఎదుర్కొన్నడు. నర్సంపేట దగ్గరలోని మహేశ్వరం గ్రామానికి చెందిన కల్వలచర్ల బ్రహ్మచారి – సరోజన దంపతుల బిడ్డ సరస్వతిని ఫిబ్రవరి 4, 1999న వివాహం చేసుకుండు. యోచన-సరస్వతి దంపతులకు ఒక బిడ్డ వెన్నెలవర్షిణి, కొడుకు స్పార్టకస్ ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళు పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. అత్యంత పేదరికాన్ని అనుభవించిన యోచన ఆ పరిస్థితులకు దూరంగ తన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలనే దృఢసంకల్పంతో ఉన్నాడు. జ్యోతిభాఫూలే, అంబేద్కర్‍ల స్ఫూర్తితో దళిత, బహుజన, సామాజిక శ్రేయస్సును కాంక్షించే యోచన ‘‘జ్యోతిరావు ఫూలే నువు కన్న కలలే అంటరాని జాతికందినక్షరాలే’’ అంటూ పూలే సాహసోపేతమైన జీవితాన్ని అక్షరీకరిస్తడు. అట్టడుగు సమాజ వికాసం కోసం ఫూలే ఎన్నో అవమానాలు భరించి, ఆ వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిండనే సందేశాన్ని అందిస్తడు. ఇవే కాంకుడ మహిళా సమస్యల పరిష్కారం కోసం, బ్రూణహత్యలను నిరసిస్తూ ఎన్నో పాటలు రాసిండు. మనిషితనం, మానవత్వంతో పాటు ముఖ్యంగా అమ్మతనాన్ని గురించి అద్భుతమైన పాటలు రాసిండు. ‘‘గుడుంబ ఏరులై పారుతున్నది – మా తాళిబొట్టు మీద కత్తి నూరుతున్నది’’ అంటూ అడ్డమైన సార తాగి ఆగమైన తల్లుల ముఖాలను చూసి తల్లఢిల్లుతడు. గుడుంబ రక్కసి మీద దాడి చేస్తడు. సామాజిక, చైతన్యం కోసం ఎన్నో పాటలు రాసిన యోచన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గొంతెత్తిండు. సమైక్యపాలకుల వివక్షపూరిత విధానాల వల్లనే తెలంగాణలో కరువు తాండవం చేస్తుందని నమ్మిండు. అట్ల సోమ రామ్మూర్తి ఆధ్వర్యంలో నర్సంపేటలో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభకు హాజరైన యోచన ఆ స్ఫూర్తితోనే పాటలు రాసిండు.
‘‘రాలేదు స్వాతంత్య్రము తెలంగాణది అర్ధస్వాతంత్య్రము’’ అంటూ తన కలాన్ని తెలంగాణ ఉద్యమం వైపుకు మరల్చిండు. తనలోని ఆవేదనకు అక్షర రూపాన్నిచ్చిండు. తెలంగాణ రాష్ట్ర సాధనే మహావిప్లవంగ భావించి అనేక పాటలు రాసిండు. మొదట తెలంగాణ ధీనస్థితిని తన పాటల్లో చెప్పుకొచ్చిండు.
సమైక్య పాలనలో ఆగమైన తెలంగాణ పల్లెల్ని గానం చేస్తడు. అర్ధాకలితో బతుకులు ఎల్లదీసే కుటుంబాలను తన పాటల్లో పదచిత్రాలుగా మలుచుకుంటడు. సంసారం కూడా భారమైందని చెప్పే సందర్భంలో ‘‘ఏంజేద్దునో.. ఎంతకని జేద్దునో’’ అంటూ సంసారం కన్నా సంచారమే మేలని రాసిన యోచన పాట ఎంతో ఆలోచంపి జేస్తది.
‘‘మా పల్లే గోసా బడుతుందో… గోసల గోడెల్లబోస్తుందో బతుకుల పోరెల్లబోస్తుందో’’ అంటడు యోచన. ఇంతకు మించిన తెలంగాణ జీవన ముఖచిత్రం ఇంకేం ఉంటది. ఏ విమర్శకులు విడమరిచి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ పాటని. తెలంగాణలో పుట్టడమే పోరాట జెండను ఎత్తుకోవడం అంటడు. అదేవిధంగ ‘‘వేలమందిలో ఒకరు పుడతారయ్యా మీలాంటోల్లు / జాతికే ప్రాణాలను అంకితం చేసేటోల్లు’’ అంటూ ఒక్కొరొక్కరుగా నేలరాలిన తెలంగాణ అమరవీరులను తల్చుకుంటూ యోచన రాసిన పాట పల్లెపల్లెనా మార్మోగింది. తెలంగాణ సిద్దాంతకర్త, రాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశకంర్ సార్ మీద యోచన ‘‘పూసెను ఓ అగ్గిపువ్వు ఓరుగల్లు మీద వీరులను గన్నా త్యాగాల తోటలోన /ఎగిసే మూల మూల అది దశాబ్ధాల జ్వాల జయశంకరు ఆశయాల తెలంగాణ హేల’’ రాసిన పాట వలసపాలకుల చేతిలో గోసపడ్డ తెలంగాణ దఃఖాన్ని వలపోస్తడు. జయశంకర్ సార్ ఆశయాలబాటలో పయణించాలనే దృక్పథాన్ని కలుగజేస్తడు. యోచన జయశంర్ సార్ మీద రాసిన మరో పాటలో ‘‘తెలంగాణ రాష్ట్ర స్వప్నమా సిద్ధాంతాల వీరఖడ్గమా/జాతిపిత జయశంకరా జయహో జయహో…’’ అంటూ జయశంకర్ సార్‍ని కీర్తస్తడు. తెలంగాణ ఉద్యమజ్వాలను రగిలిస్తడు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఎనకకు తీసుకున్నదనే కోపంతో తెలంగాణ అట్టుడికి పోయింది. కవులు, కళాకారులు సోనియా గాంధీని, కేందప్రభుత్వాన్ని నిందిస్తూ తీవ్రపదజాలంతో పాటలల్లిన సందర్భం ఉన్నది. అట్లాంటి సమయంలోనే యోచన కూడ ‘‘ఓ ఇటలీ దొరసానీ మా తెలంగాణకు పురుడుబోసే తల్లీ మంత్రసానీ / అమ్మ ఓ సోనియమ్మా ఆడినమాట దప్పినవమ్మా’’ అంటూ తెలంగాణ ఉద్యమ తీవ్రతను పట్టించుకోని సోనియాను దుమ్మెత్తి పోస్తడు. పోరా టాలు, దీక్షలు, అమరుల త్యాగాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక ప్రజా సంక్షేమపథకాలు వెలువడడంతో పాటు చెరువుల పునరుద్ధరణ మీద యోచన రాసిన పాట. ‘‘నిండిన చెరువు అలల చూసి ఉప్పొంగి కళ్ళల్ల ఆశలు /కురిసిన వాన సినుకులు పులకించెను సేను శెలకలు’’ అంటూ ఊరచెరువు లేని దుఃఖాన్ని తల్సుకుంటూనే చెరువు నింతే కలిగే ఆనందాన్ని కండ్లల్ల నింపుకొని ఎగిసిపడే అలలను తన పదాల్లోకి ఒంపుకుంటడు. చెరువుంటె శేతానముంటదని అంటడు. అనేక విప్లవ, సామాజిక గీతాలు రాసిన యోచన ‘‘పసిరిక, జమిడిక- తెలంగాణ ఉద్యమ పాటలు, డప్పుదరువు, గంగడోలు, ఆదివాసిపోరు, విద్యార్థి ఉద్యమం, జయహో జయశంకర, తెలంగాణ అగ్గిపూలు’’ వంటి ఆడియో సి.డి.లతో పాటు కులవృత్తుల మీద కూడ ఎన్నో పాటల్ని విడుదల చేసిండు. ‘అనంతగీతం’ పాటల సంకలనం మరియు ‘పాలపిందెలు’ అనే ఆడియో సి.డి.ని కూడ విడుదల చేసిండు. రాష్ట్ర ఆకాంక్ష సిద్ధించడంతోని ఇయ్యాల మన రాష్ట్రంలో మనం సంతోషంగ, ఏ బాదరబంధీ లేకుండ బతుకుతున్నమనే ఆనందాన్ని వ్యక్తం చేస్తడు. తన పాట నిరంతరం కొనసాగే పక్రియని, విప్లవోద్యమం ఎప్పుడూ రగులుతూనే ఉంటదని, అది ఆరిపోయేది జ్వాల కాదని ప్రజలపక్షాన నిలబడే సిద్దాంతమే అదని అంటడు యోచన. ఎన్నో అద్భుతమైన పాటల్ని మనకు అందించిన యోచన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం…
యోచన,
సెల్: 9948485276
–అంబటి వేకువ
ఎ: 94927 55448