నాటి నిజాం పరగణాలో, గద్వాల సంస్థానం ఏలుబడిలో ఉన్న ఆలంపురం గ్రామంలో ఓ వెన్నెల రాత్రుల్లో ఓ సంచార నాటక సమాజం ‘‘సత్య హరిశ్చంద్ర’’ నాటకం ఆడుతున్నది. టిక్కెట్లు కొని ఆ ప్రదర్శన చూడటానికి జనమంతా వచ్చారు. అందరూ కుర్చీలకు అతుక్కుని నాటకం చూస్తున్నారు. అనుభవం కలిగిన నటీనటులు ప్రదర్శిస్తున్న ఈ నాటకానికి వచ్చిన వారంతా తన్మయులై ఉన్నారు. కళాకారులు పాడే పద్యాలకు ఒన్స్మోర్ అంటూ ప్రేక్షకులు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతున్నారు. అది కాటి సీను. స్మశానంలో నిర్జీవంగా పడివున్న ‘కొడుకు శవం దగ్గర’ నాయనా లోహితా…. లేచి ఒక్కసారి ఈ తల్లిని చూడు నాయనా…’ అంటూ చంద్రమతి పాత్ర రోదిస్తున్న దృశ్యాన్ని ప్రేక్షకులు ఊపిరి బిగబట్టుకుని తిలకిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో పోలీసు అమీను కచ్చేరిలో పనిచేసే మొహరీల్ (పోలీసు రైటర్) ఒకడు తప్పతాగి ఉర్దూలో తిడుతూ స్టేజ్ మీదకు వచ్చాడు. చంద్రమతి పాత్రధారిని కాలుతో తన్నుతూ నానా రబస చేస్తున్నాడు. అంతేకాదు కళాకారులను ఉర్దూలో గజల్లు పాడమని హూంకరిస్తున్నాడు. నాటి నిజాం పాలనలో ప్రజలు అస్వతంత్రులై జీవిస్తున్న రోజులవి. పోలీసుల ప్రతాపానికి హద్దు ఉండేది కాదు. నాటక ప్రదర్శనకు అడ్డుపడి రసాభాస చేస్తున్న ఈ పోలీసుకు బుద్ధి చెప్పాలని నూనూగు మీసాల కుర్రాడు ధైర్యాన్ని కూడగట్టుకుని తన మిత్ర బృందంతో స్టేజ్‍పైకి వచ్చి గోల చేస్తున్న మొహరిల్ చెంపను చెళ్ళుమనిపించి అక్కడి నుండి పంపించేశాడు. ఆ తర్వాత నాటక ప్రదర్శన యధావిధిగా సాగింది.
ఐతే ఈ సంఘటన ఆ యువకుడిని నిద్రపోనివ్వలేదు. నాటకానికి అవమానం జరిగిన ఈ గడ్డపై నాటక రంగం తేజోవంతంగా వెలిగేలా కృషి చేయాలని ప్రతినబూనాడు. తన మిత్రులను చేరదీసి ఓ నాటక సంస్థను ప్రారంభించి ఈ ఏటిగడ్డన నాటకరంగానికి తొలివాకిలి తెరిచాడు. ఆయనే గడియారం రామకృష్ణ శర్మ.
గడియారం వారు 1919 మార్చి 6న రాయలసీమలో జన్మించినా తన జీవితకాలమంతా నిలువెల్లా తెలంగాణమై జీవించాడు. శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారమై తెలంగాణలో దక్షిణ కాశిగా ప్రసిద్ధి పొందిన ఆలంపురంను తన కార్యక్షేత్రంగా మలచుకుని నిజాం పాలకుల దుర్మార్గాలను ఎండగట్టిన ధీరుడాయన. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాసానికి విశేషంగా కృషిచేసాడు. సంఘ సంస్కరణల మూల సిద్ధాంతాన్ని స్వయంగా ఆచరించి ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. అష్టాదశ పీఠాల్లో ఒకటైన ఆలంపురం జోగులాంబ ఆలయాన్ని అదేవిధంగా అక్కడే నిర్జీవంగా పడివున్న ప్రాచీన శిల్పాలకు జీవం పోసి పునర్నిర్మించాడు. కాని తొలి రోజుల్లో ఆయన నటుడిగా, నాటకకర్తగా, నిర్వాహకుడిగా తెలంగాణ నాటక రంగంలో తనదైన ముద్రను వేసిన జాడలు కనిపిస్తాయి.
గడియారం వారు 1940లో అలంపురంలో తన మిత్రులతో కలిసి ‘ఆంధ్ర యువజన నాట్య మండలి’ని స్థాపించాడు. ఆ సంస్థకు సురవరం ప్రతాపరెడ్డి తమ్ముడి వరసైన సురవరం రాఘవరెడ్డి అధ్యక్షుడుగా, గడియారం కార్యదర్శిగా ఉంటూ సంస్థ ప్రదర్శించే నాటకాల్లో నటుడిగా, సూత్రదారుడిగా, నిర్వాహకుడిగా ము్య• భూమికను పోషించాడు. ఆ రోజుల్లో లయబ్రహ్మగా ప్రఖ్యాతివహించి 18 వాద్యాల్లో నిపుణుడైన శ్రీనివాసులును సంగీత దర్శకుడిగా నాటక మండలిలో నియమించారు. నటీనటులకు అభినయంలో శిక్షణనిచ్చే బాధ్యతను గడియారం తీసుకుంటే, పద్యగానంలో శ్రీనివాసులు శిక్షణనిచ్చేవారు. ఈ నాటక బృందం తొలిసారిగా ‘‘చింతామణి’’ నాటకాన్ని ప్రదర్శిం చింది. ఇందులో గడియారం బిల్వ మంగళుడిగా, మల్లికార్జున శర్మ భవానీ శంకరుడుగా నటించారు. ఆలంపూర్‍లో ఔత్సాహికులంతా కలిసి నటించిన ఈ తొలి ప్రదర్శన అక్కడి ప్రజలు విశేషంగా వచ్చి చూశారు. ఈ నాటకాన్ని తిలకించిన వారిలో అప్పటి మెజిస్ట్రేట్ వాసుదేవ నాయక్, తహసిల్దార్ కొండపల్లి వాసుదేవరావులు ఉన్నారు. తర్వాత కాలంలో వీరిద్దరూ గడియారం వారు ప్రదర్శించే నాటకాలకు కొండంత అండగా నిలిచారు.
గడియారం రామకృష్ణ నాట్యమండలి సభ్యులందరికి నాటక ప్రదర్శనలో సమభాగస్వామ్యాన్ని కల్పించేవాడు. నటుల సామర్ధ్యాన్ని బట్టి, నాటకంలో ఆయా పాత్రలకు ఎంపికచేయడం, పద్యాలను రాగయుక్తంగా పాడటం, అర్ధవంతమైన అభినయాదుల్లో శిక్షణ వంటి వాటిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు.
నాటకాన్ని ప్రజలకు చేరువ చేసే క్రమంలో అక్కడి ప్రముఖులను ఆహ్వానించి నాటకాల్లో ప్రధాన పాత్రలను వేయించేవారు. తద్వారా ప్రేక్షకులు నాటకాలను ఆదరిస్తారని నమ్మేవారు. ఆంధ్ర యువజన నాట్యమండలి కళాకారులచే సత్య హరీశ్చంద్ర నాటకం గడియారం దర్శకత్వంలో ప్రదర్శించబడింది. టి.చంద్రశేఖర్‍రెడ్డి (తర్వాతి కాలంలో యంఎల్‍ఏ గా పనిచేసారు.) సత్యకీర్తిగా, మల్లిఖార్జున శర్మ నక్షత్రకుడిగా, స్థానిక గాయని వేంకటరామమ్మ చంద్రమతి పాత్రలో నటిస్తే గడియారం రామకృష్ణ శర్మ హరీశ్చంద్రుడిగా నటించారు.
ఆ రోజుల్లో స్త్రీ పాత్రలను పురుషులు ధరించేవారు. అయితే స్త్రీలను కూడా నాటక రంగానికి పరిచయం చేయాలన్న ఆలోచనతో గడియారం ఆలంపూర్‍కు చెందిన గాయనీమణులు వెంట్రామమ్మ, ఆమె సోదరి రత్నమ్మలను ఒప్పించి తమ సంస్థ నాటకాల్లో ప్రధాన స్త్రీ పాత్రలు పోషించేలా ప్రోత్సహించారు. గయో పాఖ్యానం నాటకంలో ‘గడియారం’ కృష్ణుడి పాత్రను ధరించి నటుడిగా గుర్తింపును పొందాడు. ఈ ప్రదర్శన చూడటానికి ఆలంపురం ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు విశేషంగా వచ్చేవారట. ఈ నాటకంలో మల్లికార్జున శర్మ అర్జునుడిగా, వెంకట్రామమ్మ చిత్రాంగదగా, రత్నమ్మ సుభద్రగా, శ్రీనివాసులు గయుడుగా నటించారు.
ఆంధ్ర యువజన నాట్య మండలిలో సంగీత దర్శకుడిగా వున్న శ్రీనివాసులు స్త్రీ పాత్రలవల్లే నాటకం రక్తి కడుతుందని గడి యారంతో వాదించారు. దీనితో విభేదించిన ఆయన స్త్రీ పాత్రలు లేకుండానే నాటకం ప్రదర్శిం చేందుకు పూనుకున్నాడు. ఇది ఆ రోజుల్లో కొత్త ప్రయత్నమే. ‘‘కృష్ణ రాయభారము’’, ‘‘ఖడ్గ నారాయణ’’ నాటకాలను రచయిత వ్రాసిన స్త్రీ పాత్రలను తొలగించి నాటక స్క్రిప్ట్ను మార్పుచేసి ప్రదర్శించారు. అప్పటికే స్త్రీ పాత్రలతో ప్రదర్శించే ఈ నాటకాలు విశేష ఆదరణ పొంది ఉండడంతో గడియారం ఈ నాటకాలను ఏవిధంగా ప్రదర్శిస్తాడో చూద్దామని ప్రేక్షకులు అధిక సంఖ్యలో వచ్చేవారట. గడియారం చాలెంజ్‍గా తీసుకుని ప్రదర్శించిన ఈ నాటక ప్రదర్శనలు కొత్త ఒరవడిని సృష్టించిందనే చెప్పాలి.
గడియారం రామకృష్ణ శర్మ తెలుగు నాటకరంగంలో అప్పటికే ప్రఖ్యాతవహించిన ఋష్యేంద్రమణి, పూర్ణిమ, యశోద వంటి నటీమణులను ఆహ్వానించి తమ నాటక బృందం తరపున రాయిచూరు, గద్వాల, ఆలంపూర్‍లో నాటకాలను ప్రదర్శించారు. ఆయన పద్య నాటకాలతోపాటు సాంఘిక నాటకాలను ప్రదర్శించేందుకు నడుంకట్టాడు. 1938లో డా।।గుళ్ళపల్లి నారాయణ మూర్తి ఆంధ్రజ్యోతి’ నాటకాన్ని వ్రాసారు. నాటి సమకాలీన పరిస్థితులను ప్రతిఫలించేలా ఈ నాటకం సాగుతుంది. కులాంతర వివాహాలు, హరిజనోద్ధరణ, వేశ్యా దురాచారము వంటి అంశాలు ఇతివృత్తమై సాగే ఈ నాటకానికి గడియారం ప్రయోక్తగా ప్రదర్శించారు. 1943 ఫిబ్రవరి 14న ఆలంపూర్ సమీపంలోని లింగనవాయి గ్రామంలో 9వ ఆంధ్రమహాసభలు జరిగాయి. ప్రారంభ సభ ఈ నాటకానికి వేదికైంది. అప్పటికే ఆంధాప్రాంతంలో ప్రాచుర్యం పొందిన ఆంధ్రజ్యోతి నాటకాన్ని గడియారం తెలంగాణ గడ్డపై తొలిసారి ప్రదర్శించారు. ప్రేక్షకుల నుండి ప్రశంసలు రావడంతో మరిన్ని ప్రదర్శనలతో సామాజిక చైతన్యానికి కృషి చేశారు. నాటి నిజాం పాలనలో ప్రసిద్ద లాయర్లుగా గుర్తిపు పొందిన సర్‍తేజ్ బహద్దూర్ సప్రూ, మహ్మద్ ఆలీజిన్నా నారి మన్, సర్కార్ వంటి వారితో పాటు గద్వాల సంస్థానా ధీశులు గడి యారం నాటక ప్రదర్శ నలను తిల కించిన వారిలో ఉన్నారు. గడి యారం రామకృష్ణ శర్మ 1970లో కవిరన్న వ్రాసిన కన్నడ నాటకాన్ని తెలుగులో ‘గధాయుద్ధం’ పేరుతో అనువదించారు.
తెలంగాణ గడ్డపై ప్రతి పక్రియ అవసరమైన ప్రతి సందర్భంలో జనం మధ్య పురుడు పోసుకుంటుంది. ప్రజలను చైతన్య పరుస్తుంది. ఆ క్రమంలోనే నిజాం పాలనలో నాటకానికి అవమానం జరిగిన నడిగడ్డలోని ఆలంపూర్ నేలపై నాటకం మరింత పదునై వ్యాప్తి చెందింది. మనుషులను సంఘటితం చేసింది. వాక్ స్వాతంత్య్రాన్ని తట్టిలేపింది. ఆ పరంపరలో బహుముఖీ నమైన పక్రియల్లో ప్రతిభ కలిగిన గడియారం రామకృష్ణ శర్మ తన జీవన ప్రస్థానంలో నాటకరంగం ఒక భాగమై కనిపిస్తుంది. అంతేకాదు కాల ప్రవాహంలో ఆయన పత్రిక, సాహిత్య, సాంస్కస్కృతిక శాసన పరిశోధనా రంగాలలో విశేష సేవలందించి ప్రతి భావంతుడిగా ఖ్యాతి పొందాడు.
- డా।। జె. విజయ్‍కుమార్జీ,
ఎ: 9848078109