1948 హైద్రాబాద్‍ పోలీస్‍ యాక్షన్‍


(గత సంచిక తరువాయి)


వెంకటమ్మ స్వగతం:

1942లో నేను పుట్టిన. పుట్టింది పెరిగింది అంతా పాతనగరం హైద్రాబాద్‍లనే. నాకప్పుడు ఆరు సంవత్సరాలు ఉండొచ్చు. యూఖుత్‍పురా దగ్గర ఉండే రయిన్‍బజార్ల గాంధీ విగ్రహం వెనుక సందులో మసీదుకు ఎదురుంగ ఉండేవాళ్లం. ఆ రోజు మా ఇంటి ముందు వాకిట్ల చిన్న పిల్లలకు జిలేబీలు పంచిండ్రు. నేను కూడ సంబరంగ తియ్యటి జిలేబీలు తిన్న. మా అమ్మమ్మ నన్ను వెంబడి పెట్టుకుని అవతలి బస్తీలకు తీసుకపోయి మూడు రంగుల జండాలను చూపెట్టింది. అంతా హడావుడి పండుగ వాతావరణం. లౌడ్‍ స్పీకర్లల్ల దేశభక్తి గీతాలు వస్తున్నయి. స్వాతంత్య్రం వచ్చింది అన్న మాటలు నా చెవులల్ల బడ్డయి. అయితే అది రెండవ స్వాతంత్య్ర దినం, పోలీస్‍ యాక్షన్‍ జర్గిన తర్వాత 15-8-49 అని నాకు చాలా కాలానికి తెల్సింది. నిజానికి హైద్రాబాద్‍ స్టేట్‍ ప్రజలకు అది మొదటి స్వాతంత్య్ర దినం క్రిందనే లెక్క.
సరే ఇప్పుడు నేను నిజాం పరిపాలన చివరి సంవత్సరాలలో జరిగిన రజాకార్‍ల దినాలు, 1948 సెప్టెంబర్‍లో జరిగిన పోలీస్‍ యాక్షన్‍ సంగతులు, అవి మా కుటుంబంపై, ముఖ్యంగా నా బాల్యంపై వాటి ప్రభావం గురించి వివరిస్త. ఒక పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆ గాలివానకు ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి రెమ్మా ఎట్లా చలించి చెదిరి పోతయో అట్లనే మామూలు వ్యక్తుల జీవితాలు కూడా రజాకార్‍ మరియు పోలీస్‍ యాక్షన్‍ దినాలకు వాటి తాకిడికి చెల్లా చెదరై కష్టాలకు కన్నీళ్లకు గురయినాయి. అట్ల ఎంత మంది జీవితాలు, ఎన్ని కుటుంబాలు తలక్రిందులయినాయో? వాళ్లు హిందువులైతేనేం? ముస్లింలైతేనేం?


మా బాపు పేరు జియ్యరుస్వామి ఆయనకు బీదర్‍ దగ్గరల టీచర్‍ ఉద్యోగం. నా బాల్యం అక్కడే గడించింది. కాని రజాకార్ల గడ్‍బడ్‍లు ప్రారంభమయ్యేసరికి మా బాపు అమ్మను పిల్లలందర్ని, హైద్రాబాద్‍ల అమ్మమ్మ ఇంట్ల వదలిపెట్టిండు. నెలకో, రెండు నెలలకో ఒకసారి వచ్చిపోయేది. అవతల రజాకార్ల భయం, ఇంట్ల మా మధ్య ఎడబాటు. మా అందరి జీవితాలు అల్లకల్లోలం అయినాయి. అమ్మ-బాపులకే కాదు, మా చిన్న పిల్లల జీవితాలలో కూడా సుఖశాంతులు దెబ్బతిన్నాయి. అమ్మతోపాటు, మా అక్క, నేను, ఒక తమ్ముడు. పెరట్లో రెండు గదుల రేకుల షెడ్లో మేం ఉండేవాళ్లం. మా వంట మాదే. మా తిండి మాదే.


ప్రతిరోజు నేను మా బాపును తలచుకొని ఆయన కోసం బెంగతో ఏడ్చేదాన్ని. మా ఎడబాటుకు, దుఃఖానికి, మూలకారణాలు నాకు తెలియవు కదా! రాత్రిళ్లు బాపు కావాలని నేను ఏడుస్తుంటే అక్క అమ్మలాగ వోదార్చేది. అప్పుడు అమ్మ ఉస్మానియా దవఖానాలో ప్రసవం కోసం ఉంది. నిండు గర్భిణి. అప్పుడు బాపు మాత్రమే కాక అమ్మ కూడా దూరంగా ఉంది. నా మోకాళ్లకన్నీ గజ్జిపుండ్లు అయినవి. క్రిందపడి అవి పగిలి రక్తం, చీము కార్తుంటే ఓదార్చేవారు లేక బాపూ బాపూ అని ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చిన. అమ్మ డెలివరీ కోసం హాస్పిటల్‍లో ఉంది. అక్క ఇంటికీ దవఖానకు కాలినడకన పొద్దు మాపు టిఫిన్‍ క్యారియర్‍ పట్టుకుని చెక్కర్లు కొట్టేది. రిక్షాలెక్కటం పెద్ద విలాసం, పైస గల్లోల్లపని. ఇక ఇంట్ల మా తమ్మునికి పెద్ద జ్వరం. వాడిపేరు రమణ. డాక్టర్లు, మందులు ఏమిలేవు. అవుతల బజార్లల్ల బస్తీలల్ల హిందు-ముస్లింల కొట్లాటలు. రజాకార్ల దౌర్జన్యాలు, నేను తమ్ముని మంచం పక్కనే వాణ్ణి చూస్తూ కూర్చునేదాన్ని. నాల్గురోజుల జ్వరం తర్వాత వాడికి పోలియో ఎఫెక్ట్ అయ్యి ఒక కాలుచచ్చు పడిపోయింది. అమ్మ పొత్తిళ్లల్లో ఆడపిల్లను పెట్టుకుని ఇంట్లకు రాంగనే కొడుకు కాలు కుంటి కాలయ్యిందని తెల్సి గుండెపగిలి పెద్దగ ఏడ్చింది. ఆ కాలం అట్ల ఆటుపోట్లకు, అలల తాకిడికి గురికాకపోతే, మా వ్యక్తిగత జీవితాలల్ల అటువంటి విషాదాలు జరగక పోయేటివి కాదా?
పోలీస్‍ యాక్షన్‍ దినాలు సెప్టెంబర్‍ నెలకదా! అప్పుడు పెద్ద ఎత్తున వర్షాలు, చలి. ఆ వర్షం ముసురు చప్పుడుకు మా రేకుల షెడ్డు పెద్దగా శబ్దంచేసేది, ఇల్లంతా కారేది. రాత్రిళ్లు నిద్రకరువు. తమ్ముడు కాలు వ్రేలాడేసుకుని మంచంలోనే ఉండేవాడు, అట్ల మా ఇంట్ల పేదరికంతోపాటు పాటు అవిటితనం కూడా తోడయ్యింది. కాలుకు నాటు వైద్యం చేయించింది అమ్మ. రోజుల తరబడి వాడికి చప్పిడి మెతుకులు, కారం పత్యం. వేడి పప్పన్నం కోసం రోజూ ఏడిచేవాడు. అదే నెలల వినాయక చవితి పండగ వచ్చింది. అమ్మమ్మ ఇంట్ల పాశం (పాయసం) సువాసనలు. దానికోసం వాడు సుదీర్ఘంగా ఏడుపు. అమ్మ బాలింత. చెల్లె పాలకోసం ఏడుపు. నేను బాపు కావాలని ఏడుపు. తమ్ముడు అవిటి వానిగనే కుంటుకుంటు రెండు మూడేండ్లు బ్రతికి, చివరికి ట్రాన్సిల్స్ రోగంతో చచ్చిపోయిండు. అప్పుడు వానికి ఆరేండ్లు.

నిండ ఏడేండ్లు దాటకుండనే నూరేండ్లు నిండినయ్‍. ఈ విషాదాల కన్నీటికి మూల కారణాలు ఆనాటి సామాజిక పరిస్థితులే అని నేను బలంగా నమ్ముతున్నాను.
ఒకరోజు… అమ్మ తన జీవితం మీద విసుగొచ్చి చచ్చి పోవాలని నిర్ణయించుకుంది. బయట రాజాకార్‍ల గొడవలు పతాకస్థాయికి చేరుకున్నాయి, ఎన్నో రోజుల నుండి బాపు సంగతులు ఏమి తెలియలేదు. గొడవలల్ల ఆయనను చంపేసి ఉండొచ్చని అందరూ అనుకున్నరు. అమ్మ కూడ అట్లనే అనుకున్నది. మా అక్కకు అప్పటికే పెండ్లయిపోయింది. కాని ఇంకా కాపురానికి పోలేదు. ఇంకా మిగిలింది కుంటి తమ్ముడు, పసిగుడ్డు చెల్లె మరియు నేను. మా ముగ్గుర్ని చంపి తను కూడా చావాలనుకుని నిర్ణయం చేసుకున్నది. తమ్ముడు రోగంతో మంచంలనే ఉన్నాడు. వాడు ఎక్కువ రోజులు ఆ కుంటికాలుతో రకరకాల రోగాలతో బ్రతకడని వాన్ని మంచంలనే వొదిలేసి చెల్లెను సంకలో వేసుకుని నా చెయ్యిపట్టుకుని కర్మాన్‍ఘాట్‍ బావిల పడాలని రయిన్‍ బజార్‍ నుండి బయలుదేరింది. ఆ ఉదయం పూట చెట్లు చెలకల్ల నుండి నడుచుకుంటూ పోతుంటే మాకు తెల్సిన బంధువు మరియు స్కూల్‍ టీచర్‍ అయిన సిమ్మయ్యకు మేం ఎదురుపడినం. ఆయన సైకిల్‍ మీద డ్యూటీకి పోతున్నట్లుంది. మా ఇంటి సంగతులన్నీ ఆయనకు బాగా తెల్సు. అనుమానంతోనే ‘‘ఎటుపోతున్నవ్‍ అక్క’’ అని పలకరిస్తే ‘‘మందులకు’’ అని అమ్మ ముక్తసరిగ •వాబు చెప్పింది. ఆయన అనుమానం నిజమయ్యింది. ‘‘మందులకైతే ఇట్ల ఎట్ల… ఇదేం తొవ్వ… ఇంటికి నడువ్‍, మందులు తర్వాత నేను తెచ్చిస్త’’ అని కోప్పడి బలవంతంగ ఇంటికి పట్టుకొచ్చి ఇంట్ల వొదిలిపెట్టిండు. లేకపోతే మా ముగ్గురి జీవితాలు ఆ రోజు అంతం అయ్యేవి. ఆ సిమ్మయ్యసార్‍ అట్ల పుణ్యం కట్టుకుండు. అట్ల ఆ గడ్‍బడ్‍లల్ల ఎందరి జీవితాలు అల్లకల్లోల మయినయో? ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నరో ఎవరికి తెలుసు? మా జీవితాలు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
మా మామ ఆగస్వామి కూడా స్కూల్‍ టీచర్‍ కనుక అన్ని సంగతులు ఆయనకు తెలుస్తుండేవి. రాత్రిపూట సిగరెట్‍ తాక్కుంట నిద్రపోకుండ, బెంచిమీదనే కూచోని, ఏదో దీర్ఘాలోచన చేస్తుండే వాడట. అమ్మ రాత్రిపూట ‘‘ఏందన్నా అట్ల కూచున్నవ్‍, నిద్ర పోలేదా? అని అమ్మ అడిగితే ‘‘ఏం లేదమ్మా నిద్రపట్టలేదు’’ అని దిగులుగ జవాబు ఇచ్చేటోడట. ఆ రోజులల్ల మా ఇండ్ల ముందుకు ప్రొద్దుటి పూట, మాదన్నపేట, సయిదాబాద్‍ల నుండి ఎరుకల ఆడవాళ్లు వచ్చి మాంసం అమ్మేటోళ్లు. గంపలల్ల వాట్ని పట్టుకొచ్చేది. వాళ్లు రవికెలు వేసుకోక పోయేది. వాల్ల నల్లటి శరీరాలు ప్రొద్దుటపూట లేత ఎండలో మెరిసి పోవటం నేను బాగా గమనించేది. మా మామ వాళ్లతో ‘‘రేపట్నించి మీరు రాకండి. పరిస్థితులు బాగలేవు, ఇట్ల తిరగకుండ్రి’’ అని హెచ్చరించటం నాకు బాగా జ్ఞాపకముంది. ఆయన అన్న తర్వాత రెండు రోజులకు పోలీస్‍ యాక్షన్‍ మొదలయ్యింది. యూనియన్‍ సైన్యాలు హైద్రాబాద్‍పై దాడి చేయబోతున్నాయని పుకార్లు మొదలయినాయి. నిజాం సర్కార్‍ ప్రతిరోజు రాత్రిపూట నగరంల బ్లాక్‍ అవుట్‍ చేసేది. నగరం అంతా చీకటి. కరెంట్‍ బంద్‍. యూనియన్‍ సైన్యాలు రాత్రిపూట హైద్రాబాద్‍పై దాడి చేస్తాయన్న భయంతో, ఈ బ్లాక్‍ అవుట్‍ అమలు అయ్యేది. బ్లాక్‍ అవుట్‍కు ముందు ఆకాశంలో ఎర్రలైట్‍ కాంతి వెలిగి పెద్దగా సైరన్‍ మోగేది, ఆ సిగ్నల్స్తో ఇండ్లల్ల కూడా దీపాలు ఆర్పటం కరెంట్‍ తీసేయటం చేయాలి. మా ఇంట్లో అందరు కూడా ఇంటి డాబా మీదికెక్కి విమానాలు వస్తున్నయా అని వాటిలైట్ల కాంతుల కోసం వెదికేవాళ్లం, విమానాలు వచ్చి మమ్ముల్ని రక్షిస్తాయని ఎదురి చూసేటోళ్లం.


సరే పరిస్థితులన్నీ అట్ల ఉద్రిక్తంగ, ఆందోళనగ ఉన్నప్పుడే బక్రీదు పండుగ సమీపించింది. ఆ పండుగకు కొన్ని రోజుల ముందు రజాకార్ల సమావేశంల దాని నాయకుడు కాసిం రస్వీ ప్రసంగిస్తూ ‘‘ఈసారీ బక్రీద్‍కు ఖుర్బానీగ గొర్రెల్ని కాదు, హిందువుల తలల్ని ఇవ్వాలని’’ రెచ్చగొట్టే ఉపన్యాసం ఇచ్చిండు. కాని హిందువుల అదృష్టం కొద్ది ఆ బక్రీద్‍ పండుగకన్న ముందే పోలీస్‍ యాక్షన్‍ జరిగి, హిందువులు రక్షింపబడ్డరు.
అయితే అతని ప్రకటన వినంగానే హిందువుల గుండెలల్ల రైళ్లు పరిగెత్తినవి. ముఖ్యంగ హైద్రాబాద్‍ పట్నంల ఇక ఎట్లనన్న చావుతప్పదని, దగ్గరి కొస్తున్నదని హిందువులు తాగటం, తినటం, విందులు చేసుకోవటం మొదలు పెట్టిండ్రు. మా మామ కూడా అన్ని కోపాలు తాపాలు మరిచిపోయి ఇంట్ల పెద్ద దావతు ఏర్పాటు చేసిండు. పూరీలు, గారెలు, కోడిమాంసం, కల్లు, సారా అన్ని ఏర్పాట్లు చేసిండు. అందరికి దగ్గరుండి తృప్తిగ తినిపించిండు. అయితే ఆడోళ్లకు, పిల్లలకు ఈ అనుకోని సంబరాలేమిటో అర్థం కాలే. ఇప్పుడు పండుగలు ఏమీ లేవుకదా అని అడిగితే ‘‘మీకెందుకు తినరాదుండ్రి’’ అని మెత్తగ కోపడ్డడు. కాని అసలు సంగతి చెప్పలే. మేము బెదురుతమని, భయపడతమని. పోలీసు యాక్షన్‍ అయినంక తెల్లారి అసలు సంగతి చెప్పి ‘‘మనం బ్రతికి పోయినం. ఈ మిలిట్రీ రాకపోతే బక్రీద్‍ పండుగకు గొర్రెల్ని కోసినట్టు మనందర్నీ కోసేది’’ అని సంతోషం ఆపుకోలేక అందర్ని కావలించుకుని ఏడ్చిండు.
సైన్యం వచ్చినంక ఇక ఆ సంబరాలు ఏమని వర్ణించను. పట్నంలనే కాదు, పల్లెపల్లెనా హిందువులు సైన్యానికి స్వాగతాలు పలికిండ్రు. హారతులు ఇచ్చిండ్రు. ఎక్కడ చూసిన గాంధీకీ జై, నెహ్రూకీ జై, భారత్‍ మాతాకీ జై నినాదాలు. ప్రతి గల్లీ మలుపుల, చౌరస్తాలల్ల, ఇండ్లమీద మూడు రంగుల జండాలు రెపరెపలాడినయ్‍. ఎవరు ఇద్దరు కల్సుకున్నా జై హింద్‍ అని పలకరింపులు.
అవి చవితి పండుగ రోజులు అని ఇంతకు ముందే చెప్పిన కదా! పోలీస్‍ యాక్షన్‍ ముందు మేం ఆడపిల్లలం మా ఇంటి ముందు వీధిల సాయంత్రం పూట వాకిలి అలికి, ముగ్గులు పెట్టి, వాటి నడుమ పెండతో చేసిన గొబ్బెమ్మలు అమర్చి గౌరీపూజ చేస్తుంటే ఆ గల్లీల ఉండే తురకపోరలు వచ్చి వాటిని కాళ్లతో తన్ని కిస్స కిస్స నవ్వేవారు. రాజ్జెం వాళ్లది. హుకుమత్‍ వాళ్లది అని మేం నోర్మూసుకుని, గుడ్లనిండ నీళ్లు నిండుతుంటే ఇంటి లోపలికి వచ్చేటోళ్లం. కాని పోలీస్‍ యాక్షన్‍ అయినంక తెల్లారి సాయంత్రం మేం ఆడపిల్లలం చాలా స్వేచ్ఛగా, సంతోషంగా గొబ్బెమ్మల పూజ చేసుకున్నం. ఆ సంతోష సందర్భంల నాకు మా ఇంటి ముందు రోడ్డు మీద ఆశ్చర్యం కల్గించే దృశ్యం కానవచ్చింది.


ముందు మిలట్రీవాళ్లు మార్చ్ఫాస్ట్ చేస్తుంటే, వెనక మిలిటరీ ట్రక్కులు నెమ్మదిగ నడుస్తున్నయ్‍. ప్రతి ట్రక్కుకు పూల దండలు, గాంధీ నెహ్రు బొమ్మలు. ఆ మిలిట్రీ డ్రెస్సులు, టక్క టక్క బూట్ల చప్పుడు, వారి నెత్తుల మీద చిప్పటోపీలు చూడటం నాకు జీవితంల మొదటిసారి. ఆ దృశ్యాలు నా మనస్సుల నాటుకపోయినవి. ‘‘లిబరేషన్‍ ఆర్మీ’’ అన్న పదం నాకు అప్పుడు తెలువదు కదా!
ఇక ఆ తెల్లారి ఉదయం పది పదకొండు గంటలకు నేను ఇంటి ముంగిట అరుగు మీద ఆడుకుంటున్న. ఎందుకో తల ఎత్తి చూసేసరికి గల్లీ ప్రారంభల, మసీదు పక్కనుండి వస్తున్న బాపు కనబడ్డడు. బాగా మాసి దుమ్ము పట్టిన ధోవతి, కోటు మీద కండువా, చేతిల బట్టల సంచీ, చెదిరిన జుట్టూ… ఇదీ ఆయన వాలకం. ఉత్త చేతులతోటి మా ముందుకు రావొద్దని ఆ సంచీల ఒక సేరు పుట్నాల పప్పు తీసుకొని వొచ్చిండు. నేను సంతోషం పట్టలేక బాపూ బాపూ అని అరుచుకుంట ఎదురుంగ ఉరికి ఆయన కాళ్లని గట్టిగా కావలించుకున్న. బాపు నవ్వుకుంట నన్ను ఎత్తుకొని ఇంట్ల కాలు బెట్టిండో లేదో పెంకులు ఎగిరిపోయేటట్లు ‘‘అమ్మా బాపు వొచ్చిండు’’ అని గట్టిగ ఒర్లిన. అందరు పరిగెత్తుకొచ్చిండ్రు. బాపును కావలించుకుని అందరు ఏడ్చిండ్రు. బాపు కూడా ఏడ్చిండు.


ఆ తర్వాత పోలీస్‍ యాక్షన్‍ కంప్లీట్‍ అయ్యి గడ్‍బడ్‍లన్నీ సర్దుమణిగినంక బాపు మమ్మలందర్నీ తీసుకుని తను పనిచేసే ఊరు కవేలీకి తీసుకపోయిండు. నాంపల్లి స్టేషన్ల రైలెక్కినం. మా స్వంత ఇంటికి మేం పోతున్నం అన్న సంతోషం మా అందరి ముఖాలల్ల వెలిగి పోయింది. నాకు ఆ ఊరు బాగా తెల్సిన ఊరే కదా! రైలుల కిటికీ పక్కన కూర్చుని బాపుతో విడవకుండ ముచ్చట్లు చెప్పిన. నీతోటి నేను కూడా రేపట్నించి బడికొస్త అని చెప్పిన. ఆ బడిల నా దోస్తులు నరేందర్‍ రెడ్డి, శివారెడ్డిలు బాగున్నారా? వాళ్లు కలుస్తరా? అని అడిగిన బుచ్చిరెడ్డి తాత ఎట్లున్నడు, మన చప్రాసి మామూ ఎట్లున్నడు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిన. నేను ఎన్ని ప్రశ్నలు వేసినా మా బాపు కసురుకోకుండ, విసుక్కోకుండా ఓపికగ అరటిపండు వొలిచి నోట్లె పెట్టినట్టు జవాబులు చెప్పెటోడు. ఆయన నన్ను ముందే సైకలాజికల్‍గ ప్రిపేర్‍ చేయించాలనుకున్నట్టుంది. చాలా నెమ్మదిగ నాకు సమ్‍ జాయించిండు. చప్రాసీ మామూ లేడమ్మా, ఆయన వేరే స్కూలుకు తబాదలా అయ్యిండు. అది చాలా దూరం మనకు ఇక కనబడడు. మన బడి కూడా మునుపటిలాగ ఉండదు. దాన్ని శుభ్రం చేసుకోవాలి. లేదా కొత్త స్థలంల కొత్త బడి పెట్టుకుందాం అన్నడు.
ఆ తెల్లారి సాపాటు చేసి బాపు చిటికెన వేలు పట్టుకుని బడికి పోయ్యే సరికి నా గుండె గుబిల్లుమంది. ఇంకెక్కడి స్కూలు అంతా కాలి పోయింది. కూలిపోయింది. మసిబారిన మొండిగోడలు నిలబడి ఉన్నయ్‍. నా నోట్లె మాట కరువయ్యింది. దుఃఖం పొంగుకొచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకున్న బాపు నన్ను దగ్గరికి తీసుకుని ఈపు నిమిరిండు.


ఒక సంవత్సరం అక్కడున్నమో లేదో బాపుకు హైద్రాబాద్‍కు తబాదలా అయ్యింది. అలియాబాద్‍ స్కూల్‍కు మారిండు. నేను శంశీర్‍గంజ్‍లోని శారదా గర్లస్ స్కూల్‍లో అడ్మిషన్‍ తీసుకున్న. ఏదేమైతే నేం! ఆ కల్లోల కాలం నా ఆరేండ్ల తమ్ముడు రమణను బలి తీసుకుంది.


పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *