భావితరానికి నూతన సవాళ్ళు విసురుతున్న కృత్రిమ మేధస్సు!!

ఓ ప్రముఖ కథానాయకుడు నటించిన ‘‘రోబో’’ అనే చలనచిత్రం తెలుగునాట మంచి విజయం సాధించింది. అందులో ‘‘చిట్టీ’’ అనే పేరుగల రోబో చేసే విన్యాసాలు, సాహస కృత్యాలు ఒక ఎత్తైతే ప్రేమ, అభిమానం, దుఃఖం లాంటి భావావేశాలను కూడా వ్యక్తం చేయడం సినిమా చూసిన వీక్షకులకు కొత్తగానూ, వింతగానూ, విడ్డూరంగానూ అనిపించింది, కానీ అది సినిమా కాబట్టి, సినిమాలో ఇలాంటి కల్పనాపూరిత, ఊహాత్మక విషయాలకు ప్రాధాన్యం దక్కడం మామూలే కదా అని అందరూ సరిపెట్టుకున్నారు.


సీన్‍ కట్‍ చేస్తే…
అది హైదరాబాద్‍లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‍ సమ్మిట్‍. ఈ సదస్సులో ‘‘సోఫియా’’ అనే రోబో వేదికపై నిలబడి ఉంది. నిర్వాహకులు భారతదేశం గురించి నీవేమనుకుంటున్నావు, ఒక రోబోగా నీకు కూడా విశ్రాంతి కావాలా, సోషల్‍ మీడియాలో నీవు చురుకుగా ఉంటావా, బాలీవుడ్‍, హాలీవుడ్‍ నటులలో నీకు ఇష్టమైన వారు ఎవరు అని అడిగిన ప్రశ్నలకు చాలా చురుకుగా, వేగంగా సమాధానాలిచ్చింది. అంతేకాదు మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా మహిళల హక్కుల గురించి మాట్లాడేందుకు తనకు పౌరసత్వం కూడా అవసరమని నొక్కి వక్కాణించింది (సౌదీ అరేబియా సోఫియాకు పౌరసత్వం ఇచ్చింది). బిట్‍ కాయిన్లలో ఎంత డబ్బుపెట్టుబడి పెట్టావు అన్న ప్రశ్నకు నా వయసు రెండేళ్ళే, నాకు బ్యాంక్‍ అకౌంట్‍ కూడా లేదు. అయినా ఒకరోబో ఎలా పెట్టుబడి పెట్టగలదు అంటూ నిర్వాహకులకే ఎదురు ప్రశ్నవేసింది.
మొదట్లో చర్చించుకున్నట్టు సినిమాలలోనో, లేకపోతే కాల్పనిక సాహిత్యంలోనో మనిషిలాగా ఇతరజీవులు, రోబోలు… ఆలోచించడం, తెలివితేటలు ప్రదర్శించడం మనందరం చూసే ఉంటాం కానీ సోఫియా రూపంలో అది వాస్తవ రూపందాల్చడంతో ఆశ్చర్యపోవడం మానవాళి వంతైంది. ‘‘కృత్రిమ మేధస్సు’’ అనే పరిజ్ఞానం ద్వారానే ఇలాంటి అబ్బురపరిచే విషయాలన్నీ సాకారమౌతున్నాయని శాస్త్రవేత్తలు వివరిస్తుండడంతో, ఈ భూమండలం మీద మానవుని ఉనికి, అతని యొక్క స్థానం, రోబోలు, కంప్యూటర్లు మానవ మేధస్సును అధిగమిస్తే మానవుని మనుగడకేమైనా ప్రమాదమా, అసలు ఈ కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి.. లాంటి విషయాల మీద ఇటీవల జోరుగా చర్చలు జరుగుతున్నాయి….


అసలేమిటీ.. కృత్రిమ మేధస్సు!!
జ్ఞాపకాలను గుర్తుంచుకోవడం, నెమరువేయగలగడం, సమస్యలను పరిష్కరించడం, తార్కిక గణనశక్తి, సాంకేతిక పదాలతో పాటు సాధారణ భాషలను అర్థం చేసుకోవడం, నూతన పరిస్థితులకు అనుగుణంగా ప్రతిస్పందించడం వంటి సామర్థ్యాల సమాహారమే మేధస్సు. అచ్చంగా దీనికి ప్రతిసృష్టే ‘‘కృత్రిమ మేధస్సు’’ అని చెప్పవచ్చు.
కృత్రిమ మేధస్సు పై పరిశోధనల్లో భవిష్యత్‍ తరాలకు మార్గనిర్దేశం చేసిన ‘‘జాన్‍ మెక్‍కార్తీ’’ కృత్రిమ మేధస్సు పితామహుడిగా గుర్తింపు పొందారు. ఈయన నిర్వచించిన ప్రకారం – సైన్స్, ఇంజనీరింగ్‍ కలయికతో రూపుదిద్దుకున్న తెలివైన యంత్రాలు, కంప్యూటర్‍ పోగ్రామ్‍లనే ‘‘కృత్రిమ మేధస్సు’’ అంటారు. ఇప్పటి వరకూ కంప్యూటర్లు వాటికిచ్చిన పోగ్రామ్‍ల ఆధారంగా పనిచేస్తున్నాయి.
స్వతహాగా ఆలోచించి సమస్యలకు పరిష్కారం చూపించగలిగే సామర్థ్యం వాటికి లేదు. ఇకపై కృత్రిమ మేధస్సుతో చాలా సమస్యలకు స్వతహాగా స్పందించి సమాధానాలు ఇవ్వగల, పనులను చక్కదిద్దగల రోబోలు, కంప్యూటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా ఆలోచన, తార్కిక విశ్లేషణ వంటి విషయాల్లో మనిషి మెదడు పనితీరును అధ్యయనం చేసి అదే విధంగా పనిచేసేలా సాఫ్ట్వేర్‍ను శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు.


బహుళ ప్రయోజనాలు –
కృత్రిమ మేధస్సు ద్వారా విభిన్న రంగాల్లో మానవాళికి బోలెడు ప్రయోజనాలు ఒనగూరే అవకాశం ఉంది. వైద్యరంగంలో కృత్రిమ మేధ చాలా మర్పుల్నే తీసుకొస్తోంది. వేలు లేదా లక్షల మంది రోగుల ఆరోగ్య చరిత్రనూ, రోగ లక్షణాల్ని కంప్యూటర్‍కు అందిస్తే.. కృత్రిమ మేధ ఆ లక్షల కొద్దీ పేజీల సమాచారాన్ని సమర్థంగా విశ్లేషిస్తుంది. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఆర్టిఫిషియల్‍ ఇంటలిజెన్స్ ఆధారంగా క్యాన్సర్‍ వ్యాధి ‘‘సోర్స్ కోడ్‍’’ ను కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది. రక్త పరీక్షలూ, మలమూత్ర పరీక్షలూ, ఎక్స్రే, స్కానింగ్‍ తదితర విశ్లేషణలను ఆర్టీఫిషియల్‍ ఇంటలిజెన్స్ సాయంతో కంప్యూటర్లకు అప్పజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘‘సిగ్‍టుపుల్‍’’ అనే సంస్థ ఆ పనిలో ప్రస్తుతం నిమగ్నమైంది. ఆ పరిశోధనలు కనుక ఓ కొలిక్కివస్తే రోగ నిర్థారణ రంగంలో విప్లవాత్మక మార్పులుచోటు చేసుకుంటాయి.
అందుకే కాబోలు ఫ్లిప్‍కార్ట్ వ్యవస్థాపకులు సచిన్‍, బిన్నీ బన్సల్‍ ద్వయం ఈ అంకుర సంస్థలో పెట్టుబడులు పెట్టారు. కృత్రిమ మేధస్సు జెనెటిక్‍ ఇంజనీరింగ్‍ లోనూ ఊహించని మార్పుల్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. జన్యు రహస్యాల్ని కనిపెట్టగలిగితే రోగాల మూలాలు, సృష్టి గుట్టుమట్లు బట్టబయలైపోతాయి. ‘‘జీన్‍ ఎడిటింగ్‍’’ పక్రియ ద్వారా ఇవన్నీ సాకారమయ్యే అవకాశం త్వరలోనే కలగనుంది. అదే జరిగితే మృత్యువునూ మన గుప్పిట్లోకి తీసుకోవచ్చు.
రవాణా రంగంలో కృత్రిమమేధ ద్వారా విప్లవాత్మక పురోగతి చోటు చేసుకోనుంది. సెల్ఫ్ డ్రైవింగ్‍ కార్లు కృత్రిమ మేధ సహాయంతో రోడ్లపై నడుస్తాయి. వీటికి పెట్రోల్‍ కూడా పోయాల్సిన అవసరం ఉండదు. డ్రైవర్ల అవసరం అసలే ఉండదు, వాటంతట అవే నడుపు కుంటాయి. రోడ్లమీద వెళ్తూ వాటంతట అవే ఛార్జింగ్‍ చేసుకుంటాయి. ఇది నిజం కావడానికి ఏళ్ళూ పూళ్ళూ అవసరంలేదు. మరో ఏడాదిలో ఈతరహా స్వయం చోదక కార్లు రోడ్లపైకి రానున్నాయి. ఇప్పటికే చైనాలో సౌరశక్తితో నడిచే ఛార్జింగ్‍ రోడ్లని నిర్మించారు. తద్వారా ఛార్జింగ్‍ స్టేషన్ల అవసరం లేకుండానే ఈ రోడ్లు వాహనాలకు ఛార్జింగ్‍ చేసి పెడతాయి. ఇదే గనుక సాకారమైతే రోడ్డు ప్రమాదాలు కనుమరుగైపోతాయి. ఇంధన ధరలను మోసే భారం ప్రభుత్వాలకు తప్పుతుంది.
బ్యాంకింగ్‍ రంగంలో ముఖ్యంగా భారత బ్యాంకింగ్‍ రంగానికి సంబంధించి సిటీయూనియన్‍ బ్యాంక్‍ తొలిసారి రోబో సేవలను వినియోగంలోకి తెచ్చింది. ‘‘లక్ష్మీ’’గా పిలువబడుతున్న ఈ రోబో ఖాతాదారులకు బ్యాలెన్స్, రుణాలపై వడ్డీరేట్లు, ఇతరత్రా వివరాలు అందిస్తుంది. ఇంగ్లీష్‍లో మాట్లడుతూ 125 రకాల సందేహాలకు సమాధానాలిస్తుంది. ముందే చర్చించుకున్నట్లు సోఫియా అనే హాంకాంగ్‍లో తయారైన రోబోకు సౌదీ అరేబియా ప్రభుత్వం ఏకంగా తమ దేశ పౌరసత్వాన్నే కట్టబెట్టడం గమనార్హం.
పౌరసేవల రంగంలో వినియోగదారుల సేవలకు సంబంధించి వివిధ రకాల కార్పొరేట్‍ సంస్థలు, ఆన్‍లైన్‍ షాపింగ్‍ సంస్థలు కృత్రిమ మేధస్సును వినియోగిస్తున్నాయి. వినియోగదారుల సేవా కేంద్రాలలో మనుషులకు బదులు కంప్యూటర్లే సమాధానాలు ఇస్తున్నాయి. స్వర రూపంలోనే కాకుండా ఛాటింగ్‍ ద్వారా కూడా సేవలందిస్తున్నాయి. చైనాకు చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద ఇ-కామర్స్ దిగ్గజంగా పేరొందిన అలీబాబా గ్రూప్‍, చైనాకే చెందిన టెన్నెసెంట్‍, బైదు లాంటి సంస్థలతో పాటు అమెజాన్‍, గూగుల్‍, ఫేస్‍ బుక్‍ లాంటి అనేక సంస్థలు తమ వినియోగదారులకు సేవలందిం చడంలో ఆర్టిఫిషియల్‍ ఇంటలి జెన్స్ను విరివిగా ఉపయోగిస్తున్నాయి.
యుద్ధ రంగంలో కూడా కృత్రిమ మేథస్సు పరిజ్ఞానం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరైతే కృత్రిమ మేథస్సులో పై చేయి సాధిస్తారో వారే మున్ముందు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయిస్తారని ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‍ పుతిన్‍ అన్న మాటల్లో ఎంత మాత్రం అతిశయోక్తిలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భద్రతపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. లక్షల మంది సైనికులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని రోబోలకు కృత్రిమ మేధస్సును జోడించి యుద్ధ క్షేత్రంలో ప్రవేశపెట్టేందుకు అమెరికా, రష్యా, ఇజ్రాయిల్‍, యూకే, చైనా, దక్షిణ కొరియాలు విస్త•తంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఇటీవల సిరియాలోని హమీమిమ్‍లోని రష్యన్‍ వైమానిక స్థావరంపైన 10 మానవరహిత డ్రోన్లు తెనెటీగల దండు (స్వార్మ్) లా వచ్చిపడి స్థావరంలోని సిబ్బందిపై, యుద్ధ విమానాల పై దాడిచేశాయి. మరో మూడు డ్రోన్లు టార్టస్‍లోని రష్యన్‍ నౌకా స్థావరంపై దాడి చేశాయి. ప్రపంచంలో మొట్ట మొదటి డ్రోన్లదండు దాడిగా దీనిని రక్షణ నిపుణులు అభివర్ణిస్తున్నారు. సిరియన్‍ ప్రతి పక్ష సేనలు వీటిని ప్రయోగించినట్లుగా నిర్ధారించాయి. ఇలా వందలు, వేల డ్రోన్లతో దాడి జరిపించే సాంకేతికతను ‘‘స్వార్మ్ టెక్నాలజీ’’ అంటారు. కృత్రిమ మేథ ఆధారితమైన ఈ సాంకేతిక తను, దాన్ని ఎదుర్కొనే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపైన అగ్రరాజ్యాలు ప్రధానంగా దృష్టిసారించాయి.


వ్యూహాలకు పదునుబెడుతున్న ప్రభుత్వాలు –
కృత్రిమ మేథ వల్ల వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఉత్పాదకత సామర్థ్యం పెరిగి 2030 కల్లా ప్రపంచస్థూల ఉత్పత్తి (జీడిపీ) 14 శాతం పెరుగుతుందని ఒక అంచనా. ఈ పెరుగుదల 15.7 లక్షల కోట్ల డాలర్లకు సమానం. ఇది ప్రస్తుత చైనా జీడీపీ 12 లక్షల కోట్ల డాలర్ల కన్నా చాలా ఎక్కువ. కృత్రిమమేధస్సు రంగంలో అగ్రస్థానానికి చేరుకుంటే ప్రపంచంలో ఆర్థికంగా, సైనికంగా ఉన్నత స్థానానికెదగవచ్చునని అమెరికా, చైనా, రష్యాలు ఉవ్విళ్ళూరు తున్నాయి. చైనా 2017 జులైలో జాతీయ కృత్రిమ మేధా ప్రణాళికను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మన దేశం కూడా కృత్రిమ మేథస్సు పరిశోధనల్లో ఎంత మాత్రం వెనుకబడకూడదని, ఈ ఏడాది బడ్జెట్‍లో సొంత కృత్రిమ మేధోవ్యూహాన్ని ఆవిష్కరించడంతో పరిస్థితిలో మార్పుకనిపిస్తోంది. భారతదేశాన్ని డిజిటల్‍ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది, నాలుగో పారిశ్రామిక విప్లవానికి సిద్ధం చేయాలని ఈ కార్యక్రమం తలపోస్తోంది. ఆర్టిఫిషియల్‍ ఇంటలిజెన్స్ (ఏఐ)లో మౌళిక-పరిశోధన అభివృద్ధిని ప్రోత్స హించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో అగ్రగామిగా ఎదగాలని కూడా భారత్‍ ధ్యేయంగా పెట్టుకుంది. గత సం।। కేంద్ర వాణిజ్యశాఖ నియమించిన ఏఐ కార్యదళం (టాస్క్ ఫోర్స్) సమర్పించిన నివేదిక ఏఐ రంగంలో భారత్‍ ఎదుర్కొంటున్న సవాళ్ళను ఏకరువుపెట్టింది. అవి-బిగ్‍ డేటా కొరత, సమాచార విశ్లేషణకు మౌలిక వసతులు కొరవడడం, ఏఐ వ్యవస్థల నిర్వహణకు చాలినంతమంది సిబ్బంది లేక పోవడం, ఏఐ వ్యవస్థల వినియోగానికి ఖర్చు ఎక్కువకావడం. ఈ సమస్యలను అధిగమించి ఏఐ రంగాన్ని పరుగులు తీయించడానికి కేంద్ర బడ్జెట్‍లో 5 సం।।రాల కాలవ్యవధికి గానూ 1200 కోట్ల మూలనిధిని కేటాయించాలని కార్యదళం సిఫార్సు చేసింది. అదే విధంగా రక్షణశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో నియమించిన మరో కార్యదళం ఇటీవల తన నివేదిక రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‍కు సమర్పించింది. ఇప్పటికే సమాచార సాంకేతికత (ఐటీ)లో తనకున్న బలాన్ని, భారీ ఇంజనీరింగ్‍ బలగాన్నీ వినియోగించి ఏఐలో విజయశిఖరాలకు చేరగలనని భారత్‍ భావిస్తోంది. ఇందుకు ప్రైవేటు రంగాన్నీ కలుపుకొని వెళ్ళాలనీ కార్యదళం నివేదిక సూచించింది. నిజానికి కృత్రిమ మేథలో మన దేశానికి మంచి నేపథ్యం ఉంది. 2015లోనే ఏఐ రంగంలో 643 పరిశోధనా పత్రాలను వెలువరించింది. వాటిలోని అంశా లను ఇతర దేశాల శాస్త్రవేతలు పలుసందర్భాల్లో ప్రస్తావించారు కూడా. ఈ పరిశోధనా పత్రాల్లో అత్య ధికం ఐఐటీలు, ఐఐఎస్‍సీతో పాటు కొన్ని ఇతర విశ్వ విద్యాలయాల నుండి వెలువడ్డాయి. అవి ప్రధా నంగా ఫైనాన్స్, పారిశ్రామిక రంగాలకు అన్వయించే పత్రాలే. విద్యా సంస్థలు, ప్రైవేట్‍ రంగంతో పోలిస్తే ప్రభుత్వ రంగంలో ఏఐ పరిశోధనలు పరిమితమని నిపుణులు భావిస్తున్నారు.


వరమా – శాపమా !!
మనిషికి మనిషితో పోటీ అన్నది నిన్నటి మాట, మనిషికి కృత్రిమ మేధస్సుతోనే పోటీ అన్నది నేటి నిజం. మన విజ్ఞానం నుండి మన ఆలోచనల నుండి పురుడుపోసుకున్న కృత్రిమ మేధస్సు ఇప్పుడు మనిషి ఉనికికే సవాలు విసురుతోంది. కృత్రిమ మేధతో మానవ సామర్థ్యాలు గణనీయంగా పుంజుకుంటాయని, నిత్యజీవనం సులభతర మౌతుందనే అభిప్రాయాలు ఒక వైపు, దీనివల్ల ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయి, సంపన్నులు, పేదల మధ్య తారతమ్యం పెరుగు తుందని, మొత్తంగా మనిషి మనుగడే ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనలు కూడా కొనసాగుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
‘‘కృత్రిమ మేధ అణుబాంబు కంటే ప్రమాదకరం, ఆ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం అంటే… ఇంకాస్త త్వరగా మానవాళి తన వినాశనానికి ముహూర్తం పెట్టుకోవడమే’’ అంటూ హెచ్చరించిన విఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‍ హాకింగ్స్ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఈ ఆందోళనలన్నిటినీ తేలిగ్గా కొట్టి పారేయలేం. కృత్రిమ మేధ ఇప్పటికే ఒకట్రెండు సమస్యలకు కారణం అవుతోంది. దాన్ని సృష్టించే మనిషిలోని పైత్యాలన్నీ టెక్నాలజీలోకి చొరబడుతున్నాయి. ఉద్యోగార్థుల్ని అంచనా వేసే ఓ ఆర్టిఫిషియల్‍ ఇంటలిజెన్స్ సాఫ్ట్వేర్‍లో ఫలానా ప్రాంతానికి చెందిన వారిలోనో, ఫలానా జాతికి చెందిన వారిలోనో నేరస్వభావం ఎక్కువనో, కష్టపడే గుణం శూన్యమనో పోగ్రామ్‍ రూపొందించినట్లయితే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్‍ కార్ల విషయంలోనూ అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సాంకేతిక లోపాలతోనో, ఇంకేదో కారణంతోనో ఆవాహనాలు కల్గించే ప్రాణ, ఆస్తి నష్టాలకు బాధ్యత ఎవరుతీసుకోవాలన్న విషయంలో స్పష్టత లేదు. తమ లోపాల్ని తాము తెలుసుకునే యంత్రాలు వచ్చేదాకా ఇలాంటి ప్రశ్నలకు జవాబు దొరకదు. అందుకు మరికొంత కాలం ఆగక తప్పదు.
ఇకబోతె కృత్రిమ మేధతో రూపొందించిన రోబోలతో నిరుద్యోగం జడలు విప్పుతుందని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే హెచ్చరించింది. కృత్రిమ మేధ, ఆటోమేషన్‍ వల్ల ఇండియాలో 12 విభిన్నరంగాలలోని 54% మంది తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని వరల్డ్ ఎకనామిక్‍ ఫోరం నివేదిక ఇటీవలే హెచ్చరిం చింది. మొత్తం మీద కృత్రిమ మేధస్సు పుణ్యమాని ఇద్దరు చేయవలసిన పనిని ఒక్కరే చేయగలుగుతున్నారు. దీనితో ఉద్యోగాలలో కోత అనివార్య మైంది. అయితే టెక్నాలజీ కాస్త ఆలస్యంగానైనా ఒక రూపంలో జరిగిన నష్టాన్ని మరో రూపంలో పూడ్చేస్తుంది. ఉదా।।కు సెల్ఫ్ డ్రైవింగ్‍ కార్లు సురక్షితంగా నడవాలంటే గ్లోబల్‍ పొజిషనింగ్‍ సిస్టమ్‍ సమర్థంగా పనిచేయాలి. ఆ మేరకు జీపీఎస్‍ నిపుణులకు విరివిగా ఉద్యోగాలు లభ్యమైనట్టే. డ్రైవరును పెట్టు కోవాల్సిన అవసరం లేదంటే, కారు నిర్వహణా వ్యయం భారీగా తగ్గినట్టే. దీంతో కార్లకు గిరాకీ పెరిగే అవకాశం ఉంది. ఆ మేరకు మెకానిక్కులకు ఉపాధి పెరిగినట్టే. ఆటోమొబైల్‍ ఇంజనీర్లకు అవకాశాలు పుష్కలంగా దొరకుతాయి. ఉద్యోగాల విషయంలో కూడా రిసెప్షనిస్టులూ, నర్సులూ, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర పాత కొలువులన్నీ మాయమై ఇంకేవో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని మరి కొంతమంది వాదిస్తున్నారు.


ఏదేమైనా తెలివైన యంత్రాల వరకూ పర్వాలేదు.
తెలివిమీరిన యంత్రాలతోనే రకరకాల సమస్యలన్నీ….!!!
మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు, కృత్రిమ మేధతో పనిచేసే యంత్రాలను నియంత్రించే శక్తి వివేకవంతుడైన మనిషి చేతిలో ఉండాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఎలాంటి యంత్రాలైనా మనకు తెలివైన బానిసలేనన్న విజ్ఞుల మాటలు సత్యదూరం కాదు.

  • పుట్టా పెద్ద ఓబులేసు, ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *