‘‘సంగీత సాహిత్య విద్యా, వినోద, కళా సంగమం 32వ జాతీయ హైదరాబాద్‍ పుస్తక ప్రదర్శన – 2018’’

1986వ సంవత్సరంలో కేవలం 30 పుస్తక విక్రయశాలలతో సిటీ సెంట్రల్‍ లైబ్రేరీలో (చిక్కడపల్లి) ఏర్పాటైన తొలి హైదరాబాద్‍ బుక్‍ఫెయిర్‍, 2018 నాటికి అంటే 32 సంవత్సరాల అనంతరం జాతీయ పుస్తక ప్రదర్శన స్థాయికి ఎదిగింది. దేశంలోనే ఢిల్లీ తర్వాత ద్వితీయ స్థాయి ప్రదర్శనగా నిలిచింది. అద్వితీయమైన ఈ 32వ జాతీయ పుస్తక ప్రదర్శనను భారత ఉపరాష్ట్రపతి డా।। ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా డిసెంబర్‍ 15 శనివారం సాయంత్రం 5గం।। ప్రారంభ మైంది. తెలంగాణ గర్వించదగ్గ పద్యకవి స్వర్గీయ కపిలవాయి లింగమూర్తి పేరును ఈ పుస్తక ప్రాంగణానికి పెట్టారు. అలాగే ప్రధాన సాహిత్య వేదికకు సంఘ సంస్కర్తయైన సంగం లక్ష్మీబాయి పేరు పెట్టారు. ఈ జాతీయ పుస్తక ప్రదర్శనలో దాదాపు 330 స్టాల్స్, 2 ప్రధాన సాహిత్య వేదికలు ఏర్పాటు చేశారు.


నేటి విద్యా విధానంలో పునాదిగా నిలిచే అక్షరం కోసం తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రత్యేకంగా చేసిన పలకలు అక్షరభ్యాస్‍ పేరిట చక్కటి కిట్స్తో నల్ల మల్లారెడ్డి సంస్థలు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాలు పలువుర్ని ఆకర్షించింది. అభ్యుదయ, ప్రగతిశీల వామపక్ష భావజాల సాహిత్యాన్ని ప్రాచీ, ప్రతిభ, విశాలాంధ్ర, మైత్రీ బుక్‍హౌస్‍, అరుణతార, లెఫ్ట్వర్డ్, వీక్షణం, నడుస్తున్న తెలంగాణ, నవచేతన పబ్లిషింగ్‍హౌస్‍, నవతెలంగాణ పబ్లిషింగ్‍హౌస్‍, టీఆర్‍సీ తదితర స్టాల్స్లో ఎంతో విలువైన మంచి సైద్థాంతిక పుస్తకాలు లభ్యమైనాయి. మనసుకు సంగీతంతో వివిధ రాగాలతో ఉల్లాసపరిచే లైట్‍ క్లాసికల్‍ మ్యూజిక్‍ స్టాల్స్ మ్యూజిక్‍ సీడీలు, డివీడిలు లభ్యమై సంగీత ప్రియుల్ని అలరించాయి. చౌకాంబ సాంస్కృతిక స్టాల్‍లో చరకు సంహిత, భారత భాగవత రామాయణ ఉపనిషత్‍, జోతిష్య, మంత్ర తంత్ర, వాస్తు గ్రంథాలు లభ్యమైనాయి. అలాగే ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, కలకత్తా, చెన్నై లాంటి మహాపట్టణాల నుండి ఆంగ్లం, హింది, కన్నడ, తమిళ బుక్‍సెల్లర్స్ వారి వారి స్టాల్స్లో పెద్ద డిస్కౌంట్‍తో విలువైన పుస్తకాలు, నవల్సు, జీ.కె, డిక్షనరీలు, ఎన్‍సైక్లోపీడియాలు, చరిత్ర సంబంధ పుస్తకాలు, సైన్స్ సంబంధ పుస్తకాలు అందించాయి. అలాగే కవులు రచయితల రచనల కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద స్టాల్‍ ఏర్పాటు చేశారు. పుస్తకాలు అమ్మకాలే కాకుండా వీక్షక శ్రోతలకు చక్కటి విద్యా, వినోదం, సాహిత్యం, సంస్కృతి, భాషా వికాసం లాంటి అంశాలకు దోహద పడే పలు కార్యక్రమాలు పాఠకుల మెదళ్ళకు పదునెక్కించే పలు సెమినార్లు నిర్వహకులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఈ బుక్‍ఫెయిర్‍ ప్రధాన ప్రాంగణంలో భాష సదస్సు, సాహిత్యంలో మహిళలు అంశంపై సదస్సు, తెలంగాణ ఉద్యమపాట, బాల సాహిత్య వేత్తల పరిచయాలు, పలు గ్రంథావిష్కరణలు, జానపద కళారూపాలు, సాహిత్యంలో వివిధ పక్రియలు మొదలైన అంశాలతో పలు సాహిత్య సాంస్కృతిక ప్రదర్శనలతో భాషా సాంస్కృతిక శాఖ వారి సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠక శ్రోతల్ని సందర్శకుల్ని అలరించాయి.

కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహిత పద్మశ్రీ డా।। కొలకలూరి ఇనాక్‍ గారికి హైదరాబాద్‍ బుక్‍ఫెయిర్‍ పక్షాన ఘనంగా సత్కరించారు. డిసెంబర్‍ 22వ తేదీన అశోక్‍నగర్‍ సెంటర్‍ నుండి బుక్‍వాక్‍ (పుస్తకప్రియుల పాదయాత్ర)ను ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె. శ్రీనివాస్‍ గారు ప్రారంభించారు. ఈ పాదయాత్రలో బుక్‍ఫెయిర్‍ అధ్యక్ష కార్యదర్శులైన జూలూరు గౌరీశంకర్‍, కోయ చంద్రమోహన్‍, బిసి కమీషన్‍ ఛైర్మన్‍ బి.ఎస్‍. రాములు, తెలుగు విశ్వవిద్యా లయం వైస్‍ ఛాన్సలర్‍ డా।। ఎస్‍.వి. సత్య నారాయణ, ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె. శ్రీనివాస్‍, అంబేద్కర్‍ యూనివర్శిటీ వైస్‍ ఛాన్సలర్‍ డా।। సీతారాం, ట్రాన్స్కో ఎండి ప్రభాకరరావు, బి.సి కమీషన్‍ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్‍, ఆంజనేయులు, జె.డి లక్ష్మీనారాయణ, టూరిజం శాఖ సంచాలకులు బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, నందిని సిధారెడ్డి, బుక్‍ఫెయిర్‍ కోశాధికారి పి. రాజేశ్వరరావు, సభ్యులు శోభన్‍బాబు తదితరులు పాల్గొన్నారు.


ఆధునిక సాహిత్యంలో ‘‘బహుజని’’ పాత్ర అంశపై జూపాక సుభద్ర అధ్యక్షతన మహిళా సదస్సులో డా।। తిరునగరి దేవకి దేవి డా।। గంధం విజయలక్షీ, డా।। షాజహానా, డా।। కొండపల్లి నీహారిని, డా।। బండారు సుజాత, కొమ్ము రజిత, దాసోజు లలిత, గోగు శ్యామల, సమ్మెట లలిత, డా।। నెల్లుట్ల రమాదేవి తదితరులు మాట్లాడారు. ఈ సభకు ముఖ్య అతిధిగా బుక్‍ఫెయిర్‍ అధ్యక్షులు గౌరీశంకర్‍ పాల్గొన్నారు. ఈ వేదికపై ప్రముఖ సినీనటుడు ప్రకాష్‍రాజ్‍ స్వీయ రచన ‘‘దోసిటిచినుకులు’’ గ్రంథావిష్కరసభ జరిగింది. వల్లభనేని అశ్వనికుమార్‍, డా।। సీతారాం, డా।। ఓలేటి పార్వతీశం, తనికెళ్ళ భరణి, తదితరులు పాల్గొన్న ఈ సభలో తొలి ప్రతిని బాలలైన కోయా అమన్‍ (హైదరాబాద్‍) హర్షనేత్ర (విజయవాడ)లకు అందించారు. ఈ పుస్తక ప్రదర్శనలో ఎక్కువమంది పాఠకుల్ని అలరించిన ప్రముఖ స్టాల్స్లో కేంబ్రీడ్జ్ యూనివర్శిటీ ప్రెస్‍, హార్పర్‍ కొలిన్స్, సేజ్‍ పబ్లికేషన్స్, హెట్చట్‍, షైమన్‍ షెల్డన్‍, ప్యాన్‍ మ్యాక్‍ మిలాన్‍, మిలాంద్‍ ప్రకాశన్‍, లెఫ్ట్వర్డ్, జైకో పబ్లికేషన్స్ లాంటి బుక్‍షాప్‍ల్లో వున్న ఆంగ్ల హిందీ పుస్తకాలు పాఠకుల్ని విశేషంగా ఆకర్షించాయి. తెలం గాణ సాహిత్య అకాడమీ వారి సౌజ న్యంతో కందుకూరి శ్రీరాములు ఆధ్వర్యాన కవి సమ్మేళనం జరిగింది.


బాలవికాస్‍ పేరిట 15 సంవత్సరాలలోపు బాలబాలికల కోసం బాలసాహిత్య వేత్త ప్రముఖ కథా రచయిత అయిన జాతశ్రీ పేరిట ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఈ బుక్‍ఫెయిర్‍కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ తమ సంపూర్ణ సహకారం అందించాయి. బాల వికాస్‍ వేదికపై ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7గం।।ల వరకు పలు సంగీత, సాహిత్య, నృత్య కార్యక్రమాలతో పాటు చిత్రలేఖనం, స్టోరీ టెల్లింగ్‍, సోలో, గ్రూప్‍ డాన్సులు, క్విజ్‍ కార్యక్రమాలు, ఏకపాత్రాభినయాలు, బాల దర్శకుల వర్క్షాపు లాంటి ఎన్నో బాలల కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ బాలసాహిత్యవేత్తలైన డా।। చొక్కాపు వెంకటరమణ, డా।। వి.ఆర్‍. శర్మ, శాంతారావు, సి.ఎ ప్రసాద్‍, సమీర్‍, అనంతోజ్‍ మోహనకృష్ణ లాంటివారు ఈ బాల వికాస్‍ కార్యక్రమాల్ని సమన్వయం చేశారు. పెథాయ్‍ పెనుతుఫాను గాలుల్ని చిన్నపాటి వర్షాల్ని లెక్కచేయకుండా చలిగాలుల మధ్య అమ్మ ఒడిలా చదువుల తల్లి గుడిలా తెలంగాణ కళాభారతి ప్రాంగణం (ఎన్‍టిఆర్‍ స్టేడియం, దోమల గూడ) ప్రతి రోజూ సగటున లక్షలాది మంది పుస్తక ప్రియులతో కిటకిట లాడింది.


సురక్ష పోలీస్‍ శాఖ, తెలంగాణ సాహి త్య అకాడమి, భాషా సాంస్కృతిక శాఖ, నేష నల్‍ బుక్‍ ట్రస్ట్, కేంద్ర పబ్లికేషన్స్ డివిజన్‍ వారి స్టాల్స్. వివిధ తెలుగు దిన పత్రికల ఆంగ్ల దినపత్రికల స్టాల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుస్తక స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

బాల వికాస్‍ కార్యక్రమాల్లో స్లేట్‍ స్కూల్‍, సెంట్‍ పాన్సిస్‍, సెంట్స్ జాన్సన్‍ గ్రామర్‍ స్కూల్‍, సిస్టిర్‍ నివేదిత, హెయిర్‍ మోడల్‍ స్కూల్‍, గుడ్‍ బిగినింగ్‍, ఆక్స్ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍, సెంట్‍ పాయిస్‍, ప్రభుత్వ పాఠశాలల (ఎపి లోని స్కూల్స్) విద్యార్థిని విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న ప్రముఖుల్లో తెలంగాణ గ్రంథాలయ పరిషత్‍ చైర్మన్‍ అయాచితం శ్రీధర్‍, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, టూరిజం శాఖ సంచాలకులు బుర్రా వెంకటేశం, టిఎస్‍పిఎస్‍సి ఛైర్మన్‍ డా।। ఘంటా చక్రపాణి, ప్రముఖ సినీ దర్శకుడు బి. నర్సింగరావు, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్‍, మాజీ ఎమ్‍ఎల్‍సీ చుక్కారామయ్య, గద్దర్‍, సుద్దాల అశోక్‍తేజ, గోరేటి వెంకన్న, అందెశ్రీ, నందిని సిధారెడ్డి, ప్రముఖ విద్యావేత్త యం. వేదకుమార్‍, యలమర్తి రాజేందప్రసాద్‍, పసునూరి రవీందర్‍, పాశం యాదగిరి, ఎస్‍. వీరయ్య (ఎడిటర్‍ నవతెలంగాణ), అంబటి వెంకన్న, సంగిశెట్టి శ్రీనివాస్‍, కవి యాకూబ్‍, కాకి మాథవరావు (ఐఎఎస్‍) వసంత కన్నాభిరన్‍, శిఖామణి, డా।। కోయి కోటేశ్వరరావు, ఎమెస్కో విజయ్‍కుమార్‍, జి లక్ష్మీ నర్సయ్య, పరుచూరి వెంకటేశ్వరరావు, తమ్మారెడ్డి భరద్వాజ, కంచె ఐలయ్య, కెపి అశోక్‍కుమార్‍, హెచ్‍ రమేష్‍ బాబు తదితర సాహితీ సాం స్కృతిక పాత్రికేయ పెద్దలు ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొన్నారు. ముగింపు రోజున హైదరాబాద్‍ మేయర్‍ బొంతు రామ్మో హన్‍, శాసనసభ్యులు ముఠాగోపాల్‍, దేశపతి శ్రీనివాస్‍, హైదరాబాద్‍ బుక్‍ఫెయిర్‍ అధ్యక్ష కార్యదర్శులు జూలూరు గౌరీశంకర్‍, కోయచంద్రమోహన్‍, కోశాధికారి పి. రాజేశ్వరరావు, బుక్‍ఫెయిర్‍ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు ఈ 11 రోజుల్లో పదిలక్షల మంది పైగా ప్రజలు పాల్గొన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శనగా హైదరాబాద్‍ జాతీయ పుస్తక మహోత్సవం జరిగింది.


తంగిరాల చక్రవర్తి,
ఎ : 9393804472

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *