గ్రామ గ్రామానికి కమీషన్, సదా బాధితుల పక్షం
చైర్మన్ స్ఫూర్తితో వ్యవస్థలో నూతన ఉత్తేజం
తెలంగాణ వ్యాప్తంగా విస్తృత పర్యటనలు
చైర్మన్ చొరవతో బాధితులకు తక్షణ పరిహారం
సత్ఫలితాలిస్తున్న నూతన ప్రణాళికలు
దళిత వర్గాల్లో చైతన్యం, కమిషన్ పై పెరిగిన నమ్మకం
దళిత వర్గాలను చైతన్య పరుస్తూ, నమ్మకం కల్గిస్తూ, భరోసా నింపుతూ కమీషన్ ఏర్పాటు.
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి, ఆయా వర్గాల సమస్యల పరిష్కారం కొరకు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చైర్మన్‍గా, సుంకపాక దేవయ్య, చిల్కమర్రి నరసింహ, యం. రామ్ భల్ నాయక్, బొయిళ్ల విద్యాసాగర్, శ్రీమతి కుశ్రం నీలాదేవి సభ్యులుగా తెలంగాణ రాష్ట్ర పప్రధమ ఎస్సీ ఎస్టీ కమీషన్‍ను తేది. 02/01/2018 న ఏర్పాటుచేసినారు. 2003 తొమ్మిదవ చట్టాన్ని పునరుద్ధరించి తెలంగాణ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 4 (షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ) ద్వారా 05/03/2018 తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల తెగల కమీషన్ ఏర్పాటు చేయబడింది.
ఈ కమీషన్ పౌర హక్కుల రక్షణ చట్టం 1955 మరియు ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టం 1989 నిబంధనలు అనుసరించి రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీల యొక్క సామాజిక భద్రత, రక్షణ ముఖ్య లక్ష్యాలుగా పనిచేస్తుంది.
కమీషన్ కార్యకలాపాలు – ఉద్దేశాలు:
సివిల్ కోర్టుకు సరిసమానమైన అధికారాలు కల్గిన ఈ కమిషన్ ఏర్పడిన నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూ పలు కార్యక్రమాలు చేప్పట్టినది, వాటిలో ముఖ్యంగా
- పోలీస్ & రెవిన్యూ అధికారుల అవగాహనా సదస్సులు
- పౌరహక్కుల దినోత్సవ నిర్వహణ
- ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో డీవీఎంసీ మీటింగ్ నిర్వహణ
- బస్తీ, తాండ, గ్రామ సందర్శన, సమస్యలపై ఆరా
- సాంఘిక సంక్షేమ వసతిగృహ సందర్శన, విద్యార్థుల స్థితి గతులపై విచారణ
గౌరవ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ సారథ్యంలో ఏర్పాటు చేయబడిన తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ ఎస్టీ కమీషన్ ఏర్పడిన నాటి నుండి నిరంతరం దళిత వర్గాల పక్షాన నిలుస్తూ, వారి సమస్యలు తీర్చుటకు, వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చూస్తూ, నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ, పలు వినూత్నకార్యక్రమాల ద్వారా, వ్యవస్థలోనూ, ప్రజలలోనూ, ముఖ్యంగా దళిత వర్గాల్లో ఆత్మస్థైర్యం నింపుతూ సాగిన 6నెలల ప్రస్థానంలో చైర్మన్ ముందుండి నడిపిస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురై, నిర్వీర్యమైన వ్యవస్థలో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపటంలో సఫలీకృతులైన చైర్మన్, అధికారుల సంపూర్ణ సహకారంతో తాము రూపొందించిన కార్యక్రమాలను విజయవంతంగా అమలుపర్చగల్గుతున్నారు.
చట్టాలపై అవగాహన సదస్సులు :
ఉన్నతాధికారులకు చట్టాలపై అవగాహన కల్పించుట తమ విద్యుక్త ధర్మంగా భావించిన కమీషన్, ఆ మేరకు పలు జిల్లాలలో రెవెన్యూ మరియు పోలీస్ ఉన్నతాధికారుల అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. సామాన్య ప్రజలకు చట్టాలపై అవగాహన ఉండాలని, దళిత వర్గాలకు మాత్రమే కాక దళితేతరులకు అవగాహన కల్పించటం ద్వారా అట్రాసిటీల నిర్మూలన చేయవచ్చని ఉద్దేశించి, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరటమైనది.
పౌరహక్కుల దినం:
పీసీఆర్ & పీఓఏ చట్టాలలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించుట ముఖ్యమైనదిగా గుర్తించి, రాష్ట్రంలోని అన్ని జిల్లాలో, జిల్లాలోనీ అన్నిమండలాల్లో ప్రతీ నెలా 30/ఫిబ్రవరి 28వ తేదీన విధిగా పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీచేయటమైనది. తమ తమ ప్రదేశంలో అంటరానితనం నిర్మూలించబడినదని చాటిచెప్పే సుదినమే పౌరహక్కుల దినం. ఇంతటి ప్రాముఖ్యత కల్గిన రోజును మండలస్థాయిలోని 18 ప్రభుత్వ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కలిసి ఒకగ్రామంలో, గ్రామచావిళ్లలో నిర్వహించడంవల్ల, అంటరానితనం రూపుమాపగలమనీ, దళిత మరియు అణగారిన వర్గాలకు భరోసా కలిగిస్తుందని కమీషన్ విశ్వసిస్తోంది.
డీవీఎంసీ కమిటీలు:
ప్రతి జిల్లాలో, జిల్లా నిఘా వ్యవహారాల మరియూ పర్యవేక్షణ సమితి ఏర్పాటు చేయాలని కమీషన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసించి. ప్రతీ 3 నెలలకు ఒకసారి ఈ సమితి సమీక్ష నిర్వహించి, జిల్లాలోని దళిత, అణగారిన వర్గాల సమస్యలపై చర్చించి పరిష్కారమార్గాలను చూపటానికి ఉద్దేశించిన ఈ సమావేశాల్లో, మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు భాగస్వామ్యులుగా చేసేందుకు చొరవ చూపిన కమీషన్, ఆమేరకు చర్యలు చేపట్టింది. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే సమస్యల సత్వర పరిష్కారం జరుగుతుందని, ప్రజలకు వ్యవస్థపైనా కమీషన్ పైన నమ్మకం కలుగుతుందని నమ్మిన చైర్మన్ ఆ దిశగా అధికారులకు సూచనలు జారీచేశారు. జిల్లాస్థాయిలోనేకాక మండలస్థాయిలోనూ ఇటువంటి కమిటీలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
డీవీఎంసీ సమీక్ష సమావేశాలు:
కమీషన్ ఆదేశాల మేరకు స్పందించిన జిల్లాయంత్రాంగం క్రమంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, దళిత వర్గాల సమస్యల పరిష్కారానికి కృషిచేయడంపై కమిషన్ జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలియజేస్తుంది. ఇప్పటి వరకు 21 జిల్లాలలో ఈ సమావేశాలు నిర్వహించడమేకాక, ఈ కార్యక్రమాల్లో మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొనటానికి చొరవతీసుకొని, ప్రజాసమస్యలు, ముఖ్యంగా అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేయటంపై కమీషన్ సంతోషం వ్యక్తం చేసింది. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తుంది.
బస్తీ, గూడెం, తండాల సందర్శన:
కామారెడ్డిజిల్లా, గాంధారి ప్రాంతంలోని కర్మన్ గడ్డ తండా, హైదరాబాద్‍లోని పురానాపూల్ బస్తీ, ఆదిలాబాద్ జిల్లాలో ఝరిపూనగూడ, జనగాం జిల్లాలో లింగాల ఘనపూర్ మరియూ రఘునాధపల్లి మండలాల్లోని పిట్టలోనిగుడెంలు, మొదలైనవి సందర్శించి నివాసితుల స్థితిగతులు, సమస్యలు విచారించి తెల్సుకొని, సత్వరమే సమస్యలు పరిష్కరించవలసిందిగా అధికారులను కమిషన్ ఆదేశించింది.
సాంఘిక సంక్షేమ వసతి గృహాల సందర్శన:
గద్వాల్, మొయినాబాద్, నల్గొండ, ఆదిలాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, గద్వాల్ రంగారెడ్డి తదితర జిల్లాలలో సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గ•హాలు సందర్శించి బాలుర విద్యా, వసతి సదుపాయాలపై విచారించి, వారిని ఉత్సాహపరచి, వృద్ధిలోనికి రావాలని కమీషన్ ఆకాంక్షించింది.

సత్ఫలితాలిచ్చిన వినూత్న పధకాలు
చట్టాలపై అవగాహన సదస్సులు:
సమైక్య రాష్ట్రంలో నామమాత్రం జరిగే అవగాహనా సదస్సులు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత కమిషన్ ఆధ్వర్యంలో గద్వాల జిల్లా, రాచకొండ పోలీస్ కమీషనరేట్, నల్గొండ, సిద్దిపేట, నాగర్ కర్నూల్, మెదక్ పోలీస్ కమీషనరేట్, సంగారెడ్డి తదితర జిల్లాలలో పోలీస్ మరియూ రెవెన్యూ అధికారుల అవగాహనా సదస్సులు మొత్తం 16 నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ నిర్వహించాలని లక్ష్యంగా కమీషన్ ముందుకుపోతుంది.
పౌరహక్కులదినం నిర్వహణ:
పౌరహక్కులదినంపై అవగాహనే సరిగాలేని సమైక్యరాష్ట్రంలో, పౌరహక్కులదినం నిర్వహణ నామమాత్రంగా 8% – 10% జరుగుతుండగా, తెలంగాణ రాష్ట్రంలో డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ చైర్మన్ గా ఏర్పడ్డ ప్రస్తుత కమీషన్ ఆధ్వర్యంలో దాదాపు 80% అనగా 585 మండలాలకు గానూ 467 మండలాలలో పౌరహక్కులదినం నిర్వహణ జరుగుతుంది.
డీవీఎంసీ సమీక్షా సమావేశాల నిర్వహణ:
కమీషన్ ఏర్పడ్డ 6నెలల కాలంలోనే 21 జిల్లాలలో సమీక్షా సమావేశాలు నిర్వహించేలా చర్యలు చేపట్టి, స్వయంగా వాటిలో పాల్గొని కమీషన్ బాధిత పక్షాన నిలుస్తుంది.
బాధిత కుటుంబ సందర్శన:
రామగుండం ప్రేమహత్య, ఇల్లంతుకుంట జంటహత్యలు, ఆదర్శనగర్-హైదరాబాద్ లోని ఆదర్శ నగర్ దళిత మైనరు బాలిక అత్యాచారం, మీర్‍పేట్ మండలం లో మైనరు బాలిక అనుమానాస్పద హత్య మొదలగు కేసులలో బాధిత కుటుంబాలను పరామర్శించి తక్షణ పరిహారం మొదటి విడత క్రింద మొత్తం 25 లక్షలరూపాయలు కుటుంబ సభ్యులకు అందజేయటం జరిగింది, ఇంకా పలు ప్రభుత్వ పథకాలు అర్హత మేరకు అందిచేలా చూస్తామని వారికి కమీషన్ హామీ ఇంచింది.
కేసుల పరిష్కారం:
తెలంగాణలో పప్రథమంగా ఏర్పడ్డ ప్రస్తుత కమీషన్ చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా, 6000 పెండింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు గాను, 90% పరిష్కరించబడి, 25 కోట్లరూపాయలు పరిహారం విడుదలైనది. నాగర్ కర్నూలు జిల్లాలో దాదాపు పాతిక సంవత్సరాలు అపరిష్కృతంగా ఉన్న దళిత భూమి కేసు ప్రస్తుత రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చొరవతో పరిష్కారం అయిందని బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నక్కల కులస్తుల సమస్యలను పరిష్కరించటానికి నడుం బిగించిన కమీషన్ జిల్లాలోని లింగాల ఘనపూర్, రఘునాథపల్లి మండలాల్లోని పిట్టలోని గూడెం లో రెండు రోజులు పర్యటన జరిపి, వారి ఆవాసాల మధ్య బస చేసి, వారి సమస్యలు తెలుసుకోవడానికి శ్రద్ధ చూపింది. వారి సమస్యలను ప్రత్యక్షంగా చూసిన కమీషన్, తక్షణమే కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి, పరిష్కారం అందించగలిగింది.
అన్యాయంగా విధులనుండి తొలగించబడిన వరంగల్ జిల్లా, కమలాపూర్ గ్రామ పంచాయితి కారోబార్ మార రంజిత్ కుమార్, ఈమెయిల్ ద్వారా పంపిన వినతికి స్పందించిన కమీషన్ సంబంధిత ఉన్నతాదికారులను ఆదేశించగా, అతని పునర్నియామకం జరిగింది.
కమీషన్ చొరవతో స్పందించిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేనివిధంగా SC, ST లకు ప్రభుత్వ కాంట్రాక్టు లలో 21% రిజర్వేషన్ అమలు చేస్తోంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు – అమలు
దళితుల సమగ్రాభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన, ‘‘కల్యాణలక్ష్మీ, 3 ఎకరాలభూమీ, కేజీ నుండి పీజీ ఉచిత విద్యా, అంబేద్కర్ ఓవర్సె స్కాలర్షిప్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు’’ మొదలైన సంక్షేమ పథకాలపై దళిత వర్గాలకు అవగాహన కల్పించి ఆ పథకాల ఫలాలు వారికి అందేలా చూడాలని కమీషన్ అధికారులకు పిలుపునిచ్చింది.
రాష్ట్రాభివృద్ధిలో మాత్రమేకాక దళిత సంక్షేమం లోనూ దేశంలోనే అగ్రగామిగా నిలచిన తెలంగాణ ప్రభుత్వం, దళితులకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పన వంటి చారిత్రాత్మక నిర్ణయాన్నిచేసి, 70 సంవత్సరాల డా. బి.ఆర్. అంబేద్కర్ కలను సాకారం చేసిన మొదటి ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో నిలిచారని కొనియాడింది

దళిత వర్గాల అభ్యున్నతికై కమీషన్ కార్యాచరణ
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువ అయ్యే విధంగా ఆన్‍లైన్లో కంప్లయింట్లు స్వీకరించుటకు వెబ్‍సైట్‍ను ఏర్పాటు చేయడం
- అత్యవసర పరిస్థితులలో కమీషన్ ఆశ్రయించుట కొరకు టోల్‍ఫ్రీ ఫోన్ నంబరును ఏర్పాటుచేయడం
- దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు చేపట్టవలసిన చర్యలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు మొదలైనవాటిపై మరింత అధ్యయనం చేయుటకు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు
- లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు ద్వారా ప్రజలకు కమిషన్ కార్యకలాపాలపై, పీసీఆర్ మరియు పీఓఏ చట్టాలపై మరింత అవగాహన కల్పించుట
- దళిత సాహిత్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల పత్రాలు, ప్రభుత్వ అధికారపత్రాలు, బడ్జెటరీ పత్రాలు మొదలైనవి భద్రపరచుటకు లైబ్రరీ ఏర్పాటు
- రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్‍లలోనూ, తహసిల్దార్, RDO, SP, CP కలెక్టర్ కార్యాలయాలన్నింటిలో SCSTఅట్ట్రాసిటి చట్టాల వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయటం ద్వారా ఆయా వర్గాలను చైతన్యం కల్గించుట.
ఇటువంటి సృజనాత్మకమైన కార్యక్రమాలు మరిన్నిచేపట్టి, దళిత వర్గాలకు మరింత చేరువ అవ్వాలని, వారి సమస్యలు సత్వరం పరిష్కరించి వారికీ సమాజంలో భద్రత, ఆత్మగౌరవం పెంచాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు వారికి అందేలా చేసి వారి సామాజిక, ఆర్ధికాభివృద్ధికి తోడ్పడాలని కమీషన్ సంకల్పించింది.
-తిరునగరి శ్రీనివాస్,
ఎ : 9441464764