చరిత్రలో వెలుగు చూడని చీకటి కోణాలు

(గత సంచిక తరువాయి)
నాసిర్‍జంగ్‍ హత్యకు గురైన తర్వాత ఫ్రెంచ్‍ కంపెనీ వారు ఏడునెలలుగా నాసిర్‍జంగ్‍ ఖైదులో ఉన్న ముజఫ్ఫర్‍ జంగ్‍ (?-1751)ని విడుదల చేసి రాజుగా ప్రకటిస్తారు. దీంతో ముజఫ్ఫర్‍ జంగ్‍ తనకు అండగా నిలిచిన ఫ్రెంచ్‍ కంపెనీకి జింజి, తిరువత్తి తదితర ప్రదేశాలను జాగీర్లుగా దారాదత్తం చేసిండు. నిజాం తర్వాత అంతటి బలవంతుడు మరొక్కరు లేకుండా ఏడు వైల సైన్యాన్ని కలిగి ఉండేందుకు డూప్లెక్స్కు అనుమతినిచ్చాడు. నజరానాలు కూడా సమర్పించుకున్నడు. అంతేకాదు మచిలీపట్నంను కూడా డూప్లెక్స్కు జాగీరుగా ఇచ్చిండు. రాజమండ్రి, శ్రీకాకులం, నరసాపురం తదితర ప్రాంతాలపై ఆధిపత్యాన్ని ఫ్రెంచ్‍ వారికి అప్పగిచ్చిండు. దాదాపు తీరప్రాంతమంతా ఫ్రెంచ్‍వారి అజమాయిషీలోకి వచ్చింది. అలాగే డూప్లెక్స్కు జఫర్‍ జంగ్‍ అనే బిరుదుని కూడా ప్రకటించాడు. ఈ మొత్తం యుద్ధాన్ని ఇంకా చెప్పాలంటే కుట్రను పకడ్బందీగా అమలు చేసి నాసిర్‍జంగ్‍ని హత్య చేయించిన ఫ్రెంచ్‍ సైన్యాధికారి లా.డి. ఆటిల్‍ని ఘనంగా సన్మానించిండు. నజరానాలు సమర్పించుకున్నాడు. నాసిర్‍జంగ్‍ని చంపిన కర్నూలు నవాబు హిమ్మత్‍ బహదూర్‍ ఖాన్‍కు రుస్తమ్‍ జంగ్‍ అనే బిరుదుతో పాటు రాయచూర్‍, ఆదోని ప్రాంతాలను జాగీరుగా ఇచ్చాడు. అండగా నిలిచిన కడప నవాబు అబ్దుల్‍ నబీ ఖాన్‍కు గండికోట, గుత్తి జాగీర్లను ఇచ్చిండు. నాసిర్‍జంగ్‍ ఖజానాలోంచి సైనికులకు బకాయిలను చెల్లించిండు.


ఈ దశలో ముజఫ్ఫర్‍జంగ్‍ సైన్యం దుందుడుకుగా వ్యవహరిస్తూ కడప ప్రాంతంలోని గ్రామాలను లూటీ చేసిండ్రు. దోసుకుండ్రు. ఇది కడప నవాబు నబీఖాన్‍కు కోపమొచ్చింది. దానితోపాటుగా ఊహించిన లేదా ఆశించిన మొత్తంలో ఖజానాలో వాటా దక్కలేదనే అభిప్రాయముతో నవాబులున్నారు. ముందుగా అనుకున్న లేదా ఒప్పందం కుదిరిగిన దానికి భిన్నంగా ఖజానాలోంచి అతి తక్కువ మొత్తం సొమ్ము మాత్రమే తమ వాటాగా రావడంతో నవాబులు కుమిలి పోయిండ్రు.

మరోవైపు ముజఫ్ఫర్‍ జంగ్‍, అతని మిత్రుడు కర్నాటిక్‍ నవాబు చాందాసాహెబ్‍ చాలా వారాలు పాండిచ్చేరిలోనే ఉండి విజయోత్సవాలు జరుపుకున్నారు. (ఈ చాందా సాహెబ్‍ తర్వాత కొద్ది రోజులకే మరాఠాలతో అర్కాట్‍లో జరిగిన యుద్ధంలో 12 జూన్‍, 1752నాడు హతుడయిండు. రాబర్ట్ క్లైవ్‍ చేతిలో ఈతని సైన్యం ఓటమి పాలయింది) పాండిచ్చేరిలో ముజఫ్ఫర్‍జంగ్‍కు బ్రహ్మాండమైన స్వాగతం లభించింది. అంతేకాదు అక్కడి చర్చ్ల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దక్కించుకున్న సొమ్ము పంపకాల్లో తేడాలు రావడంతో ఐక్యత దెబ్బతిన్నది. మిత్రుల మధ్యన ఖురాన్‍ మీద ప్రమాణం చేసి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నాసిర్‍జంగ్‍ ఖజానాలోని వజ్రవైఢూర్యాలన్నీ ముజఫ్ఫర్‍జంగ్‍కు దక్కాలి. అట్లాగే అందులోని నగదును నవాబులకు పంచాలి. వీటిని పంచడంతో పాటు కొన్ని కొత్త ప్రాంతాలను కూడా నవాబులకు దారాదత్తం చేయాలని డూప్లెక్స్ సమక్షంలోనే ఒప్పందం జరిగింది. ముజఫ్ఫర్‍ జంగ్‍ పాండిచ్చేరి నుంచి హైదరాబాదుకు బయలుదేరే ముందు ఇంగ్లీష్‍ కంపెనీకి ఒక లేఖను రాసిండు. ఈ గొడవలు జరుగుతున్న సమయంలోనే రాసిన ఈ లేఖలో బ్రిటీష్‍ వారు స్వాధీనం చేసుకున్న దేవి-కొట్ట తదితర పోర్టులను తిరిగి అసఫ్జాహీలకు ఇచ్చేయాలని అందులో పేర్కొన్నాడు. మరోవైపు ఫ్రెంచ్‍ వారు తమ టంకశాలలో ముద్రించే పగోడాలు మచిలీపట్నం, గోలకొండల్లో కూడా చెల్లుబాటు అవుతాయని ఫర్మానా జారి చేసిండు. పర్షియన్‍ రాజు తన తాత నిజాముల్‍ముల్క్కు నజరానాగా ఇరాన్‍ రాజులు సమర్పించిన ఏనుగు, గుఱ్ఱాలను కూడా డూప్లెక్స్కు సమర్పించుకున్నాడు. అలాగే రాజులు వేసుకునే గౌనులాంటి వస్త్రాన్ని కూడా బహుమతిగా ఇచ్చిండు. ఒకే పల్లకీలో ఊరేగిండ్రు.


ముజఫ్ఫర్‍ జంగ్‍కు తన సైన్యంపై కన్నా డూప్లెక్స్ నేతృత్వంలోని యూరోపియన్‍ సహిత పటాలంపైనే ఎక్కువ నమ్మకం. అందుకు అనుగుణంగానే తాను హైదరాబాద్‍ చేరుకునే వరకు రక్షణ ఇవ్వాలని డూప్లెక్స్ని కోరిండు. మొదట ఈ అంతర్గత వ్యవహారాల్లో కల్పించుకోవాలో లేదో అనే అంశంపై డూప్లెక్స్ తర్జన భర్జన పడ్డాడు. జనవరి ఐదున రక్షణ ఇచ్చేందుకు సిద్ధమయిండు. అలాగే ప్రివోస్ట్ డి లాటచ్‍, బుస్సిలలో ఎవరిని అందుకు వినియోగించాలి అనే అంశంపై తీవ్రంగా ఆలోచించిండు. చివరికి ఆ బాధ్యతలను బుస్సీకి అప్పగించిండ్రు. బుస్సీ 300ల మంది యూరోపియన్‍ సైనికులు, రెండువేల మంది స్థానిక సైనికులతో ముజఫ్ఫర్‍కు రక్షణగా నిలిచిండు. పాండిచ్చేరి నుంచి ముజఫ్ఫర్‍ బయలుదేరిన మూడురోజుల తర్వాత అంటే జనవరి 15నాడు బుస్సీ తన పటాలాన్ని సంసిద్ధం చేసుకొని బయలుదేరిండు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ కొట్లాటకు దిగొద్దని బుస్సీ ముందుగానే ముజఫ్ఫర్‍ని హెచ్చరించిండు. బుస్సీ సలహాను బేఖాతరు చేస్తూ ముందుకు వెళ్ళిండు. ముజఫ్ఫర్‍ హైదరాబాద్‍కు వస్తూ మధ్యలో కడప జిల్లా లక్కిరెడ్డి పల్లెలో తన సైన్యంతో మకాం వేసిండు. ఈ దశలో నవాబులు-నిజామ్‍ల మధ్యన ఏదో కుట్ర జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న బుస్సీ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు నమ్మక స్తుడైన అగి అబ్దుల్లాను వినియోగించాడు. ఈతను అప్పటికే క్రిస్టియన్‍ మతం స్వీకరించిండు. ఫ్రెంచ్‍ వారికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అగి అబ్దుల్లా దౌత్యంతో కర్నూలు, కడప నవాబులు మెత్తబడ్డారు. ముజఫర్‍ జంగ్‍తో సయోధ్యకు సమ్మతిని వ్యక్తం జేసిండ్రు. అయితే తాను రాజు నన్నే ఎదిరిస్తారా? ఎంత ధైర్యం అని వారిపై దాడికి దిగిండు. ఇందుకు ప్రతిగాకడప నవాబు (నబీఅలీఖాన్‍?) కుట్ర పూరితంగా బల్లెం విసిరి ముజఫ్ఫర్‍ని హతమార్చిండ్రు. ఇదంతా డూప్లెక్స్ అతని మంత్రాంగం పన్నిన పన్నాగమే! ఈ కుట్రను అమలు చేయడంలో పేష్కార్‍గా పనిచేస్తున్న రామదాసు పండిట్‍ కీలక పాత్ర పోషించిండు. తర్వాతి కాలంలో అతనికి ఉన్నత పదవి లభిస్తుందనే ఆశ చూపించి ఈ దురాగతానికి తెరదీసిండ్రు. దీనికి ప్రణాళిక వేసింది డూప్లెక్స్, అతని అనుచర వర్గం. ఈ దశలో ముజఫ్ఫర్‍ జంగ్‍ కుమారుడు చిన్నవాడు (ఏడెనిమిదేళ్ళు) కావడంతో ఫ్రెంచ్‍ సైన్యాధికారి బుస్సీ మిగతా వారిని ఒప్పించి క్యాంప్‍లోనే ఉన్నటువంటి నిజాముల్‍ ముల్క్ మూడో కుమారుడు సలాబత్‍ జంగ్‍ని రాజుగా ప్రతిష్టింప జేస్తాడు. ఈతను తన మేనల్లుడు ఫ్రెంచ్‍ వారికి ఇచ్చిన అన్ని సదుపాయాలను కొనసాగించాడు. సలాబత్‍ అధికారంలోకి రాగానే తన పెద్దన్న ఘాజియుద్దీన్‍తో యుద్ధానికి తలబడ్డాడు. అంతేకాదు హతు డయిన ముజఫ్ఫర్‍ జంగ్‍ కుమారుడి పేరిట అదోని, రాయచోటి, కర్నూలు, కడప, బీజాపూర్‍ తదితర ప్రదేశాలకు అధిపతిగా ప్రకటించాడు.


ఘాజియుద్దీన్‍ (1709- 1752) తాత పేరు కూడా ఘాజియుద్దేనే. దాంతో ఇతన్ని రెండో ఘాజియుద్దీన్‍గా పిలుస్తారు. ఇతని అసలుపేరు మీర్‍ మొహమ్మద్‍ పనా. (కేంబ్రిడ్జి హిస్టరీ ఆఫ్‍ ఇండియా-ఎడ్వర్డ్ జేమ్స్ రాప్‍సన్‍, తర్‍ వొలెస్‍లే హేగ్‍). తండ్రి నిజాముల్‍ ముల్క్-1 ప్రతినిధిగా ఈయన దిల్లీ దర్బారులోనే ఉన్నాడు. నిజాముల్‍ ముల్క్-1 చనిపోయిన సమయంలో ఇదే పోస్టులో కొనసాగుతున్నాడు. దీంతో ఈయన ఆ సయమయంలో దక్కన్‍లో లేక పోవడంతో అధికారానికి దూరమయిండు. మొఘల్‍ రాజు అహ్మద్‍ షా బహదూర్‍ దగ్గర సర్వ సైన్యాధికారి హోదాలో పనిచేసిన ఘాజియుద్దిన్‍ రాజు దగ్గర తనకు గల పరపతిని ఉపయోగించి దక్కన్‍ సుబేదార్‍గా నియమితులైనట్లుగా ఫర్మానాను సంపాదించిండు. ఆ ఫర్మానాను తీసుకొని ఔరంగాబాద్‍కు వచ్చి 1752లో మరాఠా పీష్వా బాలాజీరావు సహాయంతో రాజ్యాధికారం కోసం ప్రయత్నించిండు. ఇదే కాలంలో పూణెలో రాణి తారాబాయి తిరుగుబాటు చేసింది. ఈ తిరుగుబాటను అణచడం కోసం పీష్వా శాంతి ఒప్పందానికి అనివార్యంగా ఒప్పుకున్నాడు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు బుస్సీ నేతృత్వంలోని సైన్యం 18 జూన్‍ 1752 నాడు ఔరంగాబాద్‍కు చేరుకుంది. (బుస్సీ ఇన్‍ ది దక్కన్‍). అహ్మద్‍నగర్‍ కేంద్రంగా జరిగిన పోరాటాల్లో బుస్సీ చాకచక్యంగా యుద్ధం చేసిండు. అయితే సలాబత్‍ జంగ్‍ దగ్గర దివాన్‍గా ఉన్న లష్కర్‍జంగ్‍కు ఘాజియుద్దిన్‍ పట్ల సానుభూతి ఉన్నప్పటికీ ప్రభుత్వ బాధ్యతల్లో ఎలాంటి లోటు రానీయలేదు. తాను లోపాయకారిగా మరాఠాలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఘాజియుద్దీన్‍ని అధికారంలోకి రాకుండా చేసిండు. ఈ ఒప్పందంతో తపతి-గోదావరి నది మధ్య ప్రాంతాన్ని చాలా వరకు పీష్వాలకు అప్పగించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఘాజియుద్దీన్‍ తన తమ్ముండ్లకు బయపడి కొన్నాళ్ళు సన్యాసిగా బతికిండు. ఆ తర్వాత బ్రిటీష్‍వారితో చేతులు కలిపిండు. వారికి యుద్ధంలో సహకరించిండు. అయినా అతని గత చరిత్రను తెలుసుకొని బ్రిటీష్‍ వారు కూడా ఆయన్ని దూరముంచారు. చివరికి ఘాజియుద్దీన్‍ ఔరంగాబాద్‍లో ఉన్న సమయంలో ఒక సాంస్కృతిక కార్యక్రమంలో హాజరుకావాల్సిందిగా ఆహ్వానం అందింది. ఆ కార్యక్రమంలో నిజామ్‍ అలీ (ఇతను కూడా మొదటి నిజామ్‍ కుమారుల్లో ఒకడు) తల్లి కుట్ర పూరితంగా భోజనంలో విషం పెట్టి ఘాజియుద్దీన్‍ని 12సెప్టెంబర్‍ 1752 నాడు చంపించింది.


ఘాజియుద్దీన్‍ మరణంతో సలాబత్‍జంగ్‍ (1718-1763)కు పోటీ తప్పింది. తర్వాత పదేండ్ల పాటు తానే అధికారాన్ని చలాయించిండు. అయితే నిజామ్‍ రాజుగా గాకుండా సుబేదార్‍గా మాత్రమే! ఘాజియుద్దీన్‍కు డిప్యూటిగా ఉన్నటువంటి సలాబత్‍ జంగ్‍ మొదట నాసిర్‍జంగ్‍ తన క్యాంప్‍లో, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముజఫ్ఫర్‍ జంగ్‍ ఇద్దరూ సలబాత్‍ జంగ్‍ని ఖైదులోనే ఉంచారు. ముజఫ్ఫర్‍ హత్య తర్వాత ఫ్రెంచ్‍ వారు పూనుకొని ఈయణ్ణి రాజుగా ప్రకటిస్తారు. సలాబత్‍ జంగ్‍ తనను సింహాసనంపై కూర్చుండబెట్టిన ఫ్రెంచ్‍ వారి ఇష్టాఇష్టాల మేరకు నడుచుకున్నాడు. మొదట డూప్లెక్స్ ఆ తర్వాత బుస్సీ నేతృత్వంలోని ఫ్రెంచ్‍ వారికి ఉత్తర సర్కారు (కళింగాంధ్ర) ప్రాంతాన్ని అప్పగించిండు. వారి సలహా, సూచనల మేరకే పాలన సాగింది. అయితే 1756లో యూరప్‍లో ఫ్రెంచ్‍-బ్రిటీష్‍ వారి మధ్య గొడవలు జరగడంతో వాటి ప్రభావం ఇండియాలో కూడా ప్రతిఫలించింది. అప్పటి వరకు ఉత్తర సర్కారు జిల్లాల్లో అధికారం నెరపిన ఫ్రెంచ్‍ వారు మచిలీపట్నంని కూడా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ దశలో అంటే 1757లో బ్రిటీష్‍వారు కలకత్తా నుంచి ఫోర్డ్ నేతృత్వంలో మచిలీపట్నంని మళ్ళీ తమ స్వాధీనంలోకి తీసుకొచ్చుకునేందుకు గాను ఒక బెటాలియన్‍ని పంపిస్తారు. ఈ బెటాలియన్‍ని ఎదుర్కొనేందుకు సలాబత్‍ జంగ్‍ సన్నద్ధమయిండు. కానీ ఫ్రెంచ్‍ వారు వెనక్కి తగ్గిండ్రు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న సలాబత్‍ భవిష్యత్‍లో ఫ్రెంచ్‍ వారికి కొత్తగా ఎలాంటి జాగీర్లు ఇచ్చేది లేదని ప్రకటించాడు. ఇదే సమయంలో తన తమ్ముడు రాజధానిలో తిరుగు బాటుకు ప్రయత్నాలు చేస్తుండడంతో మచిలీపట్నంను బ్రిటీష్‍వారికి అప్పగించేందుకు ఒప్పందాలు చేసుకొని హైదరాబాద్‍ కొచ్చిండు. కొత్తగా నియమితులైన దివాన్‍ షానవాజ్‍ ఖాన్‍ సలహా మేరకు తన తమ్మలు నిజాం అలీ, బసాలత్‍ జంగ్‍లను వరుసగా బేరార్‍, బీజాపూర్‍ పరగణాలకు సుబేదార్లుగా నియమిస్తాడు. అంటే తమ్ములతోని ఈయన సఖ్యతను కోరుకున్నాడు. అయితే కొద్ది రోజుల్లోనే వారిని దౌలతాబాద్‍ కోటలో ఖైదు చేస్తాడు. వారు తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నందుకే అట్లా చేస్తున్నానని చెప్పుకున్నాడు. (తరువాయి వచ్చే సంచికలో)


-సంగిశెట్టి శ్రీనివాస్‍, ఎ : 9849220321

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *