మాటల వంతెనొకటి నిర్మించుకుందాం రా!

మరణం కన్నా బాధాకరమైన మౌనాన్ని
యుద్ధం కన్నా భయంకరమైన నిశ్శబ్ధాన్ని
ఎన్నేళ్ళిలా భుజాల మీద మోస్తాం?
సంధికి నాంది పలుకుదాం రా!

ఒకరి వెనుక వేరొకరు చేరి
గోతులు తవ్వుకొని నవ్వుకోవడం
ఒకరి బలహీనతల మీద
మరొకరు సింహాసనం వేసుక్కూర్చోవడం
ఎన్నాళ్ళిలా నాటకాన్ని రక్తికట్టిస్తాం?
హృదయ వేదిక మీద ఎదురెదురుగా
కూర్చొని చర్చించుకుందాం రా!

దారి పొడుగునా
విమర్శల ముళ్ళ పొదలు
ఎదురుపడితే ప్రేమగా పలకరించుకోలేని
అగాధపు దారులు
అపార్ధాల అపనమ్మకాల
ఎగసిపడే అగ్నికీలలు
ఎంతకాలమని అదే దారిలో నడుస్తాం?
మాటల వంతెనొకటి నిర్మించుకుందాం రా!

  • సాంబమూర్తి లండ
    ఎ : 9642732008

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *