తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ సాహిత్య ప్రియుడు : రాష్ట్ర గవర్నర్‍ తమిళిసై సౌందర్‍రాజన్‍

  • భాగ్యనగర సిగలో కొలువైన పుస్తకాల భాండాగారం
  • 33వ హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍ను ప్రారంభించిన గవర్నర్‍

ఒక మంచి ఆలోచన వెయ్యి పనులు చేయిస్తుంది. ఒక మంచి పుస్తకం.. లక్షసార్లు ఆలోచింపజేస్తుంది. మంచి విజ్ఞాన సమాజం ప్రపంచానికి దిక్సూచిలా నిలుస్తుంది. వీటన్నింటినీ మార్చేది మంచి పుస్తకమే. పుస్తకాలే మన స్నేహితులు, మన ప్రేమికులు, మన బంధువులు. ఆధునిక భారతదేశ ఆవిష్కరణ కోసం పుస్తకాలు కీలక భూమిక పోషిస్తాయి.


330 స్టాళ్లు.. 320 మంది పబ్లిషర్స్..60 లక్షలకుపైగా పుస్తకాలు.. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, కన్నడం, ఉర్దూ, ఇంగ్లీష్‍ భాషల్లో పుస్తకాలు. పిల్లల కథల పుస్తకాలు, పెద్దల పుస్తకాలు, సాహిత్యం, పోటీ పరీక్షలు.. ఇలా విభిన్న రకాల విజ్ఞాన భాండాగారం కళాభారతిలో కొలువుదీరింది. హైదరాబాద్‍లోని ఎన్టీఆర్‍ స్టేడియంలో 33వ జాతీయ పుస్తక మహోత్సవం డిసెంబర్‍ 23న ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, కోల్‍కతా, రాజస్థాన్‍ బుక్‍ఫెయిర్‍లకు ఏమాత్రం తీసిపోని విధంగా హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍ను ఐదోసారి నిర్వహించటం తెలంగాణకే గర్వకారణం.

తెలంగాణ ఉద్యమం..భారత స్వాతంత్య్రం పోరాటం స్థాయిలో జరిగింది :
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‍ తమిళిసై సౌందర్‍రాజన్‍ హైదరాబాద్‍ 33వ బుక్‍ ఫెయిర్‍ను అధికారికంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్‍ తమిళిసై సౌందర్‍రాజన్‍ డిసెంబర్‍ 23న ఎన్టీఆర్‍ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‍ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం..భారత స్వాతంత్య్రం పోరాటం స్థాయిలో జరిగిందని అన్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తి భావి తరాలకు చెప్పాలని, అందుకోసం చిన్నకథలు, ఆకర్షణీయమైన బొమ్మల రూపంలో పుస్తకాలను రూపొందించాలని సూచించారు. పుస్తకాలను నిత్యం చదవడం వల్ల విజ్ఞానం పెరుగుతుందని, నేటి యువత పుస్తకాలతో స్నేహం చేయాలన్నారు. భాగ్యనగరాన్ని పుస్తకాల నగరంగా తీర్చిదిద్దుతామని, ఈ మహాక్రతువులో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తాను చిన్నప్పటి నుండి పుస్తక ప్రేమికురాలినని, నిత్యం రాత్రి పడుకునే సమయంలో గంటపాటు పుస్తకాలు చదువుతానన్నారు. సీఎం కేసీఆర్‍ మంచి పుస్తకాల చదువరి అని కీర్తించారు.


రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‍కుమార్‍ మాట్లాడుతూ టెక్నాలజీ ఎంత వచ్చినా పుస్తకాలను భర్తీ చేయలేవన్నారు. నేటి యువత పుస్తకాలను బాగా చదివి మంచి జ్ఞానం పెంచుకోవాలన్నారు.

టీఎస్‍పీఎస్సీ చైర్మన్‍ ప్రొఫెసర్‍ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ అక్షరం వ్యాప్తివల్లే తెలంగాణ ఉద్యమం బలోపేతమైందని చెప్పారు.

రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‍గౌడ్‍ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‍ ఎన్నో పుస్తకాలు చదివారని, అందుకే గాంధీమార్గంలో ఉద్యమం నడిపినట్లు చెప్పారు.


అక్షర ఝురి అక్షయసిరి – పీవీ ప్రసంగాలు.. పుస్తకాలు గవర్నర్‍ ఆవిష్కరణ..
కల్వకోట వెంకట్‍ సంతోష్‍ బాబు రచించిన పీవీ చెప్పిన ముచ్చట్లు, అక్షర ఝురి అక్షయసిరి -పీవీ ప్రసంగాలు పుస్తకాలను గవర్నర్‍ తమిళిసై ఆవిష్కరించారు. బుక్‍ ఫెయిర్‍లో కొన్ని స్టాళ్లను సందర్శించిన గవర్నర్‍ తెలంగాణ, సంస్కృతి, చరిత్ర, సాహిత్యానికి సంబంధించిన ప్రముఖ పుస్తకాలు చదవాలనుకుంటున్నట్లు చెప్పారు.


పిల్లల కోసం బాలమేళా..

పిల్లల్లో సాహిత్యాభిరుచి పెంపొందించడం కోసం బుక్‍ఫెయిర్‍లో ఈసారి కొత్తగా బాలమేళా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించి, వారిలో సృజనాత్మకత పెంపొందించడం, సాహిత్యంపై మమకారం పెంపొందించడమే ధ్యేయంగా ఈ బాలమేళను ఏర్పాటు చేశారు. ఇందులో మిమిక్రీ, ఫ్యాన్సీ డ్రస్‍, వన్‍ మినిట్‍, తెలుగు, చిత్రలేఖనం, గ్రూప్‍ డ్యాన్స్ పోటీలను నిర్వహిస్తున్నారు. అలాగే పిల్లలకు కవి సమ్మేళనం, వ్యాస రచన పోటీలు, పాటల పోటీలు ఆకర్షణీయంగా ఉన్నాయి.


జ్ఞాన సమాజం కోసమే బాలమేళ : ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య

మహాత్మాగాంధీ జీవితం, స్వాతంత్య్ర పోరాటం గురించి పిల్లలందరూ తెలుసుకోవాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పేర్కొన్నారు. పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసి పిల్లల బంగారు భవిష్యత్‍కు బాటలు వేయాలన్నారు. పుస్తక ప్రదర్శనలో బాలల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం అన్నారు. జాతీయ పుస్తక ప్రదర్శనలో భాగంగా నోముల సత్యనారాయణ వేదికపై డిసెంబర్‍ 24న ‘బాలమేళ’ కార్యక్రమాన్ని చుక్కా రామయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీపై వెలువడిన పలు రచనల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య రచించిన మొదటి పాఠం పుస్తకంను ఫోరం ఫర్‍ బెటర్‍ హైదరాబాద్‍ వ్యవస్థాపకులు మణికొండ వేదకుమార్‍, ‘సాధకులు – బోధకులు’ పుస్తకంను బీసీ గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు ఆవిష్కరించారు. బుక్‍ ఫెయిర్‍ అధ్యక్షులు జూలూరీ గౌరీశంకర్‍, కార్యదర్శి కోయ చంద్ర మోహన్‍ పాల్గొన్నారు.


యువ సాహితీ సమాలోచన చర్చాగోష్టి :
ప్రస్తుత సాంకేతిక యుగంలో ఫేస్‍బుక్‍, వాట్సప్‍ల్లో కవిత్వం విస్తృతంగా వస్తోందని కవి, రచయిత జూలూరీ గౌరీశంకర్‍ అన్నారు. స్మార్ట్పోన్లకే యువత పరిమితమైతే సాహిత్యం నేర్చుకోలేరన్నారు. డిసెంబర్‍ 24న బుక్‍ ఫెయిర్‍లో నోముల సత్యనారాయణ వేదికపై యువ సాహితీ సమాలోచన చర్చాగోష్టి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జూలూరీ గౌరీశంకర్‍ మాట్లాడుతూ కవి సంగమం పేరుతో వర్తమాన, యువ కవులను ప్రోత్సహిస్తున్న యాకువ్‍ కృషి అమోఘం అన్నారు. సభలో విప్లవశ్రీ, నస్రీన్‍ఖాన్‍, కడలి, గడ్డం మోహన్‍రావు, వెల్దండి శ్రీధర్‍, తండ హరీష్‍, తగుళ్ల గోపాల్‍, నరేష్‍కుమార్‍ సూఫీ, లక్ష్మీనరసింహం తమ సాహిత్య అనుభవాలను వెల్లడించారు.


సదాలక్ష్మీ పొలిటికల్‍ రెబల్‍ ఆంగ్ల పుస్తకావిష్కరణ :
ప్రత్యేక తెలంగాణ 1969 ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మాజీ మంత్రి సదాలక్ష్మీ జీవిత స్ఫూర్తిని ప్రజల దగ్గరకు తీసుకెళ్లాల్సిన అవసర ఉందని మాజీ మంత్రి, ఏపీ శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్‍ అన్నారు. సదాలక్ష్మీ స్ఫూర్తితో తానూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపినట్లు వివరించారు. డిసెంబర్‍ 24న బుక్‍ ఫెయిర్‍లోని రాఘవచారి వేదికపై విశ్రాంత ఆచార్యులు వైబీ.సత్యనారాయణ రచించిన ‘సదాలక్ష్మీ – పొలిటికల్‍ రెబల్‍’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం డొక్కా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సదాలక్ష్మీ పేరును సువర్ణక్షరాలతో లిఖించవచ్చన్నారు. సామాజిక విశ్లేషకులు డా.కొల్లూరి చిరంజీవి, రచయిత అంబటి, సరేంద్రరాజు, యువసాహిత్య పురస్కార గ్రహీత పసునూరి రవీందర్‍, రచయిత్రి గోగు శ్యామల, విశ్రాంత ఆచార్యుడు కంచె ఐలయ్య, ఆలూరు సుధాకర్‍, మున్సిపల్‍ ఉద్యోగుల సంఘం నాయకులు తిప్పర్తి యాదయ్య పాల్గొన్నారు.


పుస్తకాలకు ఆధరణ తగ్గలేదు : మాజీ స్పీకర్‍ మధుసూదనాచారి
ప్రస్తుత సాంకేతిక యుగంలో కూడా పుస్తకాలకు ఎలాంటి ఆదరణ తగ్గలేదని మాజీ స్పీకర్‍ మధుసూదనాచారి అన్నారు. సెల్‍పోన్లు, ఇంటర్నెట్‍ల వాడకం పెరిగినా ఇంకా పుస్తకాలను చదివే వారి సంఖ్య పెరగడం ఆనందదాయకం అన్నారు. బుక్‍ ఫెయిర్‍లో భాగంగా డిసెంబర్‍ 24న నోముల సత్యనారాయణ వేదికపై జరిగిన ఇన్‍ఫినిటిజమ్‍ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం వల్ల మానవులు నిత్య నూతనంగా ఉంటారని, మంచి జ్ఞానం సంపాదిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‍ గడ్డం శ్రీనివాస్‍ యాదవ్‍, బుక్‍ ఫెయిర్‍ నిర్వాహకులు పాల్గొన్నారు.


మూసీనది మాట్లాడితే పుస్తకావిష్కరణ :
కవిని ఆలూరి రచించిన మూసీ నది మాట్లాడితే పుస్తకాన్ని హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍లోని రాఘవాచారి వేదికపై అంబేద్కర్‍ నగర్‍ ప్రాంతానికి చెందిన లచ్చుమమ్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కవి యాకుబ్‍, సీనియర్‍ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ఎస్‍.డేవిడ్‍, డా.తర్జని, జర్నలిస్ట్ క్రాంతి పాల్గొన్నారు.


బాలమేళలో చిత్రలేఖనం.. బహుమతులు ప్రదానం :
పుస్తక ప్రదర్శనలో భాగంగా డిసెంబర్‍ 26న బాలమేళలో భాగంగా చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, క్రిస్మస్‍ పండుగ నేపథ్యం, పుస్తక పఠనాసక్తి తదితర అంశాలపై బొమ్మలు గీయాల్సిందిగా పిల్లలకు సూచించారు. విజేతలకు శాసనమండలి సభ్యులు భానుప్రసాద్‍ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేశారు. పోటీలో పాల్గొన్న పిల్లలందరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.


‘పరిపూర్ణతకు పదిమెట్లు’ పుస్తకావిష్కరణ :
తథాగతుడు బోధించిన ‘దశపారమితలు’కు బొర్రా గోవర్దన్‍ తెలుగు అనువాదం ‘పరిపూర్ణతకు పదిమెట్లు’ పుస్తకాన్ని హైదరాబాద్‍ బుక్‍ఫెయిర్‍లో విశ్రాంత ఐపీఎస్‍ అధికారి ఆంజనేయరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో శీలం ప్రభాకర్‍, లియాఖత్‍ అలీబోధి, రాధాకృష్ణ పాల్గొన్నారు.


మహాకవులను స్మరించుకోవడం గర్వకారణం : ఆయాచితం శ్రీధర్‍
కీర్తిశేషులైన మహాకవులను స్మరించుకోవడం గర్వకారణం అని గ్రంథాలయ సంస్థ చైర్మన్‍ ఆయాచితం శ్రీధర్‍ అన్నారు. బుక్‍ఫెయిర్‍లో నోముల సత్యనారాయణ వేదికపై జరిగిన సాహీతీవేత్తల నివాళి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కె.ఆనందాచారి, కాంచనపల్లి, జె.చెన్నయ్య, వెలుదండ నిత్యానందరావు, బండారు విజయ, నాగసూరి వేణుగోపాల్‍, గాయకుడు జయరాజ్‍ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి సీహెచ్‍.ఆంజనేయులు రచించిన ఆశల గాలి పటాలు, కీర్తిశేషులు, రచయిత కావూరి పాపయ్యశాస్త్రీ రచించిన కోటి రత్నాల వీణ, ఆదోజగత్‍ సహోదరులు పుస్తకాలను ఆవిష్కరించారు.


భారతీయ రచయిత్రుల పుస్తకావిష్కరణ :
హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍లోని సి.రాఘవాచారి వేదికపై డిసెంబర్‍ 25న కవయిత్రి శారద శివపురపు రచన భారతీయ రచయిత్రులు పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కొండవీటి సత్యవతి, కవయిత్రి శిలాలోలిత, గాయని విజయలక్ష్మీ, ఎం.నారాయణస్వామి, వహెద్‍ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీలలో జ్ఞానం ఎంతో దాగి ఉందని, దాన్ని బయటి ప్రపంచానికి అందించాలన్నారు.


రెంటాల గోపాలకృష్ణ శతజయంతి సభ :

తెలుగు సాహిత్యానికి విశిష్టసేవలు చేసిన మహా గొప్ప రచయిత రెంటాల గోపాలకృష్ణ అని సరస్వతీ సమ్మాన్‍ పురస్కార గ్రహీత, ప్రసిద్ధ కవి కె.శివారెడ్డి అన్నారు. తెలుగు పబ్లిషర్స్ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‍ స్టేడియంలో బుక్‍ఫెయిర్‍, రాఘవాచారి వేదికపై అక్షర తపస్వి రెంటాల గోపాలకృష్ణ శతజయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కె.శివారెడ్డి హాజరై.. అద్భుత ప్రతిభాశాలి రెంటాల అన్నారు. తన 75 ఏళ్ల జీవిత ప్రస్థానంలో రెండు వందలకుపైగా పుస్తకాలు రచించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ఎస్వీ.సత్యనారాయణ పాల్గొన్నారు.


నిర్భయ నుంచి దిశ వరకు సాహితీ ప్రస్థానం చర్చ :
నోముల సత్యనారాయణ వేదికపై సాహిత్య సమాలోచన కార్యక్రమంలో భాగంగా నిర్భయ నుంచి దిశ వరకు సాహితీ ప్రస్థానంపై చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంధానకర్త అయినంపూడి శ్రీలక్ష్మీ, మమత రఘువీర్‍, రాజీవ, బండారు విజయ, శాంతి, ప్రబోధ, కుపిలి పద్మ, మహెజబీన్‍ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయినంపూడి లక్ష్మీ మాట్లాడుతూ ప్రస్తుతం అనేక రకాల సాహిత్యం వచ్చిందని, అదే తరుణంలో అనేక చట్టాలు కూడా వచ్చినట్లు చెప్పారు. దేశ రాజధానిలో జరిగిన నిర్భయ సంఘటన ఒక సంచలనమైతే, తెలంగాణ రాష్ట్ర రాజధానిలో జరిగిన దిశ సంఘటన మరో సంచలనం అన్నారు.


మతలబ్‍ కవితా సంపుటి ఆవిష్కరణ :
వరంగల్‍కు చెందిన మారేడుకొండ బ్రహ్మచారి నిధి కలం పేరుతో రాసిన మతలబ్‍ కవితా సంపుటిని హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍లో సొసైటీ అధ్యక్షులు జూలూరీ గౌరీశంకర్‍ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చంద్రమోహన్‍, కవి యాకుబ్‍, కవయిత్రి శిలాలోలిత, జుగాష్‍విలి, భండారు విజయ, యలవర్తి రాజేంద్ర ప్రసాద్‍, నూతక్కి రాఘవేంద్రరావు, సీనియర్‍ జర్నలిస్ట్ రెంటాల జయదేవ పాల్గొన్నారు.


సాఫ్ట్స్కిల్స్ పుస్తకావిష్కరణ :
ఉన్న స్థితి నుంచి భద్రమైన జీవన స్థితికి, అక్కడి నుంచి అత్యున్నత స్థితికి ఎదగడానికి మృదువైన నైపుణ్యాలు ఎంతో అవసరం అని బీసీ కమిషన్‍ సీనియర్‍ సభ్యులు డాక్టర్‍ వకుళాభరణం అన్నారు. బుక్‍ఫెయిర్‍లో భాగంగా సి.రాఘవాచారి వేదికపై స్టాఫ్‍ స్కిల్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, పి.ఎం.కె.గాంధీ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.


బొటానికల్‍ జూ అండ్‍ సైన్స్ కార్నర్‍ పుస్తకావిష్కరణ :

డిసెంబర్‍ 27న సి.రాఘవా చారి వేదికలో డాక్టర్‍ కందేపి రాణీ ప్రసాద్‍ రచనలు బొటానికల్‍ జూ అండ్‍ సైన్స్ కార్నర్‍ పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రొఫెసర్‍ ఆదినారాయణ, సీ.ఎ.ప్రసాద్‍, వి.ఆర్‍.శర్మ, వెంకటరమణ, పత్తిపాక మోహన్‍ పాల్గొన్నారు.


మూన్‍లైట్‍ ఆఫ్‍ ది నూన్‍ పుస్తకావిష్కరణ :
రాఘవాచారి వేదికపై కుమారి శ్రేష్ట రచించిన మూన్‍ లైట్‍ ఆఫ్‍ ది నూన్‍ పుస్తకాన్ని తెలంగాణ ప్రెస్‍ అకాడమీ చైర్మన్‍ అల్లం నారాయణ, గౌరీశంకర్‍ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు కవులు పాల్గొన్నారు.


ధనికొండ సమగ్ర సాహిత్యంలోని ఏడు సంపుటాలు ఆవిష్కరణ :
డిసెంబర్‍ 27న బుక్‍ఫెయిర్‍లోని నోముల సత్యనారాయణ వేదికలో ధనికొండ హనుమంతరావు శతజయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ధనికొండ సమగ్ర సాహిత్యంలోని ఏడు సంపుటాలు ఆవిష్కరణ చేశారు. ముఖ్య అతిథిగా ప్రసిద్ధ కవి కె.శివారెడ్డి హాజరై.. మాట్లాడుతూ ధనికొండ హనుమంతరావు శతజయంతి సభ జరుపుకోవడం అభినందనీయం అన్నారు. ధనికొండ క్రమశిక్షణను నేటితరం తప్పకుండా నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి దేవీప్రియ, వేమూరి సత్యం, తనికెళ్ళ భరణి, సుధ గోపరాజు, ఆంధ్రజ్యోతి ఎడిటర్‍ డా.కె.శ్రీనివాస్‍ పాల్గొన్నారు.


మహాభారతం – మన చరిత్రే గ్రంథావిష్కరణ :
కల్లూరి భాస్కరం రచన మహాభారతం – మన చరిత్రే గ్రంథావిష్కరణ సి.రాఘవాచారి వేదికపై జరిగింది. డాక్టర్‍ విజయభారతి, కల్లూరి భాస్కరం, గీతా రామస్వామి, వాడ్రేవు చిన వీరభద్రుడు, పి.రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కవిత్వంలో బాల్యం పుస్తకావిష్కరణ :
బుక్‍ ఫెయిర్‍లో డిసెంబర్‍ 27న నోముల సత్యనారాయణ వేదికపై డా.ఏనుగు నరసింహారెడ్డి రచించిన కవిత్వంలో బాల్యం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రేవరేజెస్‍, కార్పొరేషన్‍ చైర్మన్‍ దేవీప్రసాద్‍, సీనియర్‍ జర్నలిస్ట్ రాందాస్‍, మోహన్‍కృష్ణ పాల్గొన్నారు.


డిస్మాంటలింగ్‍ జమ్మూ-కశ్మీరు పుస్తకావిష్కరణ :
బుక్‍ఫెయిర్‍లో భాగంగా డిసెంబర్‍ 27న సి.రాఘవాచారి వేదికపై డిస్మాంటలింగ్‍ జమ్మూ-కశ్మీరు పుస్తకావిష్కరణ సభ జరిగింది. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీరు సమస్యను అర్థం చేసుకోవడానికి డిస్మాం టలింగ్‍ జమ్ము అండ్‍ కాశ్మీరు ఒక కరదీపికలా నిలుస్తుంద న్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‍ జర్నలిస్టు ఎస్‍.వినయ్‍ కుమార్‍, రచయిత కందిమళ్ల ప్రతాప్‍రెడ్డి, నెల్లూరి నరసింహా రావు, డీజీ.నరసింహారావు పాల్గొన్నారు.


ప్రస్తుత సమాజానికి గాంధీ బోధనలు అత్యవసరం :
గాంధీ మనవరాలు తారా భట్టాచార్య

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు మహాత్ముని బోధనలు ఎంతో ఉపకరిస్తాయని గాంధీ మనవరాలు తారా భట్టాచార్య అన్నారు. డిసెంబర్‍ 28న బుక్‍ ఫెయిర్‍లో గాంధీ గ్లోబల్‍ ఫ్యామిలీ నిర్వహించిన గాంధీ ఆలోచన – ఆచరణ కార్యక్రమంలో భట్టాచార్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య కసిరెడ్డి వెంకట్‍రెడ్డి రచించిన గాంధీతాత శతకం, దామోదరచారి సంకలనంలో వెలువడిన గాంధీపై వరల్డ్ పొయెట్రీ, సుబ్బారెడ్డి రచన గాంధీజీ ఐడియా అండ్‍ రియాలిటీ పుస్తకాలను తారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ పుస్తకస్టాల్‍ను సందర్శించారు.


మనిషి జీవన ప్రస్థానం రాస్తే పెద్ద గ్రంథం : ప్రముఖ దర్శకులు బి.నరసింగరావు
మనిషి జీవన ప్రస్థానం రాస్తే ఒక పెద్ద గ్రంథమవుతుందని, మనిషి ప్రతి అడుగులో తనను తాను మలుచుకుంటూనే ఉంటారని ప్రముఖ దర్శకులు బి.నరసింగరావు అన్నారు. సాహిత్య సమాలోచనలో భాగంగా తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన ‘సినిమా – కళాత్మకత – వాస్తవికత’ అనే అంశంపై జరిగిన చర్చలో బి.నర్సింగరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మన జీవన ప్రస్థానమే సినిమాగా కళాత్మకంగా దర్శకులు తెరమీదకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. సినిమాలు అనేవీ ప్రజా కోణంలో తీసినవని, అవే చరితల్రో నిలబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‍ అకాడమీ చైర్మన్‍ అల్లం నారాయణ, కెపీ అశోక్‍కుమార్‍, హెచ్‍.రమేష్‍బాబు, వెంకట్‍ సిధారెడ్డి, బుక్‍ ఫెయిర్‍ అధ్యక్షులు జూలూరీ గౌరీశంకర్‍, కార్యదర్శి చంద్రమోహన్‍, అనంతోజు మోహన్‍కృష్ణ, ఖయ్యూం పాష పాల్గొన్నారు.


బాలమేళలో వ్యాసరచన పోటీలు :

బాలమేళ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్‍ 28న రాఘవాచారి వేదికపై బాలలకు వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించారు. చొక్కాపు వెంకటరమణ, వీఆర్‍శర్మ, సీఏ ప్రసాద్‍ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దాదాపు నలబై మంది చిన్నారులు పాల్గొన్నారు. పిల్లలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.


స్వైరవిహారం కవితా సంపుటి ఆవిష్కరణ :
హైదరాబాద్‍ పుస్తక ప్రదర్శనలో డిసెంబర్‍ 29న రాఘవాచారి వేదికపై జువ్వాడి దేవీ ప్రసాద్‍ రచించిన స్వైరవిహారం కవితా సంపుటిని ప్రముఖ దర్శకులు బి.నరసింగరావు, తెలంగాణ ప్రెస్‍ అకాడమీ చైర్మన్‍ అల్లం నారాయణ, ప్రజాకవి కాళోజీ పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు వచనంలో వెలువడిన తొలి యాత్రా కవిత్వం స్వైరవిహారం అన్నారు. సభకు ప్రొ।। ఎస్‍. రఘు అధ్యక్షత వహించారు.


వేలితపాట (తీగపాట) పుస్తకావిష్కరణ :
తెలంగాణ గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‍ రాజ్‍గోండులపై బ్రిటీషు మానవవేత్త మైకల్‍యార్క్ రెండు వ్యాసాల తెలుగు అనువాదం వేలితపాట (తీగపాట) పుస్తకాన్ని ప్రముఖ చరిత్ర పరిశోధకులు వకుళాభరణం రామకృష్ణ నోముల సత్యనారాయణ వేదికపై ఆవిష్కరించారు. కార్యక్రమంలో అనువాదకురాలు లలిత, గిరిజన సాంస్కృతిక పరిశోధన సంస్థ డైరెక్టర్‍ సర్వేశ్వర్‍రెడ్డి, ఆచార్యులు వాగేష్‍, రచయిత దావనపల్లి సత్యనారాయణ, ఆకాశవాణి ప్రొడ్యూసర్‍ సుమనప్పతి రెడ్డి పాల్గొన్నారు.


పేదల విముక్తి శాస్త్రం :
నోబెల్‍ విజేత అభిజిత్‍ బెనర్జీ ఆంగ్ల రచనను అక్కెనపల్లి పున్నయ్య పేదల విముక్తి శాస్త్రం పేరిట తెలుగులో అనువదించారు.ఈ పుస్తకాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‍ ప్రొ.పాపిరెడ్డి, వైస్‍ చైర్మన్‍ ప్రొ.లింబాద్రి, ఓ.నర్సింహారెడ్డి, రామానందతీర్థ సంస్థ సంచాలకులు నాగభూషణం, డా.ఎస్‍.రఘు, బుక్‍ ఫెయిర్‍ అధ్యక్షులు గౌరీశంకర్‍ పాల్గొన్నారు.


కొత్త పంట పుస్తకం :
డాక్టర్‍ అంకం రచించిన కొత్త పంట పుస్తకాన్ని బుక్‍ఫెయిర్‍లో బీసీ కమిషన్‍ సభ్యులు డా.వకుళాభరణం కృష్ణమోహన్‍, జ్వాల నర్సింహారావు, బుక్‍ఫెయిర్‍ నిర్వాహకులు ఆవిష్కరించారు.


చైతన్యకెరటం :
చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో చైతన్య కెరటం, మహిళలేని చరిత్ర లేదు పుస్తకాలు, 2020 క్యాలెండర్‍ ఆవిష్కరించారు. పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‍ వి.సంధ్య, భండారు విజయ పాల్గొన్నారు.


విశ్వం..జీవం..మానవుడు :

పీబీ చారి రచించిన విశ్వం..జీవం..మానవుడు పుస్తకాన్ని సీపీఎం పొలిట్‍బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా సైన్స్ ఉద్యమ నాయకులు రమేష్‍, యాదగిరిరావు, రచయిత పీబీ.చారి పాల్గొన్నారు.


60 మంది రచయితలతో 22వ బాలచెలిమి ముచ్చట్లు :
హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍లోని నోముల సత్యనారాయణ వేదికలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్‍ 30న బాల చెలిమి 22వ ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా ‘బాలమేళలో బాలసాహిత్యకారుల సమ్మేళనం’ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరీశంకర్‍, బాల సాహిత్యవేత్తలు అమ్మంగి వేణుగోపాల్‍ మాట్లాడుతూ 60 మంది బాలసాహిత్య రచయితలు సదస్సుకు రావడం గర్వకారణం అని, 60 వేల బాలసాహిత్య పుస్తకాలను సాహితీవేత్తలు రాయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍ మాట్లాడుతూ సాహిత్యంపై ప్రేమతో ఎంత కష్టమనిపించినా గత 22 నెలల నుండి బాలచెలిమి ముచ్చట్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 60 మంది కథా రచయితలు, సాహితీవేత్తలు, కవులు తమ అనుభవాలను వేదిక ద్వారా పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రచయితలందరికీ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్‍ బుక్‍ ట్రస్ట్ చైర్మన్‍ పత్తిపాక మోహన్‍, బుక్‍ ఫెయిర్‍ కార్యదర్శి కోయ చంద్రమోహన్‍, గరిపల్లి అశోక్‍, వడ్డెపల్లి కృష్ణ, వీఆర్‍.శర్మ,డా.పరుశురాం, సునంద, సుతారపు వెంకటనారాయణ,డా.ఎస్‍.రఘు, దాసర వెంకటరమణ, సి.ఎ.ప్రసాద్‍, చొక్కాపు వెంకటరమణ, కూరెళ్ళ శ్రీనివాస్‍, మంచి పుస్తకం సురేష్‍, పి.గిరిజ, శాంతకుమారి, ఎండ్ల లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.


భారత రాజ్యాంగానికి భరోసా ఇచ్చేది యువకులే : ఏపీ ప్రభుత్వ సలహాదారులు కె.రామచంద్రమూర్తి

భారత రాజ్యాంగానికి భరోసా ఇచ్చేది నేటి యువకులే అని ఏపీ ప్రభుత్వ సలహాదారులు కె.రామచంద్రమూర్తి అన్నారు. హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍లోని సి.రాఘవచారి వేదికపై డా.ఎన్‍.భాస్కర్‍రావు రాసిన ‘సిటిజన్‍ యాక్టివిజమ్‍ ఇన్‍ ఇండియా’ పుస్తకావిష్కరణ సభ డిసెంబర్‍ 31న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ప్రభుత్వ సలహాదారులు కె.రామచంద్రమూర్తి హాజరై మాట్లాడుతూ దేశ యువకులు రాజ్యాంగాన్ని తమ భుజస్కందాలపై మోస్తున్నారని కొనియాడారు. 2019లో రాజ్యాంగం ఊరేగింపు జరుపుకోవాలని ఈ పుస్తకం అభిలషిస్తుందని, పౌరహక్కుల రాజ్యాంగ దశాబ్దంగా నిర్మించుకోవాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎఫ్‍బీహెచ్‍ చైర్మన్‍ ఎం.వేదకుమార్‍ మాట్లాడుతూ సిటిజన్‍ యాక్టివిజమ్‍ పుస్తకంలో నిరసనచేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని వివరించినట్లు చెప్పారు. డా.భాస్కర్‍రావు రెండు దేశాల యూనివర్సిటీల నుండి మాస్‍ కమ్యూనికేషన్‍లో పీహెచ్‍డీ చేసిన తొలి తెలుగు బిడ్డ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బుక్‍ ఫెయిర్‍ అధ్యక్షులు జూలూరీ గౌరీశంకర్‍, రచయిత డా।। నాగసూరి వేణుగోపాల్‍ పుస్తకాన్ని పరిచయం చేశారు. రచయిత కటికనేని విమల, చీఫ్‍ పబ్లిక్‍ రిలేషన్‍ ఆఫీసర్‍ జ్వాల నరసింహారావు విశిష్ట అతిథిగా, యాక్టివిజమ్‍ పుస్తక రచయిత డా.ఎన్‍.భాస్కర్‍రావు, ఫోరం ఫర్‍ బెటర్‍ హైదరాబాద్‍ జనరల్‍ సెక్రటరీ శోభాసింగ్‍ తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్‍ 23, 2019న ప్రారంభమైన హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍ జనవరి 1, 2020న ఘనంగా ముగిసింది. పది రోజులపాటు కొనసాగిన పుస్తకాల పండుగ ఎన్నో కొత్త పుస్తకాల ఆవిష్కరణలకు వేదికైంది. గతంకంటే భిన్నంగా ఈసారి బుక్‍ ఫెయిర్‍కు విశేష స్పందన లభించింది. చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే 80 ఏళ్లకుపైబడిన వారు సైతం పుస్తకాల భాండాగారం వీక్షించడానికి పొటెత్తారు. ఈసారి భారీగానే పుస్తకాలు అమ్ముడయ్యాయి.


విలువైన కవి సమ్మళనం
31వ తేదీ సాయంత్రం 6 గంటలకు నోముల సత్యనారాయణ వేదికపై ప్రముఖ కవి నాళేశ్వరం శంకరం అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది. ప్రెస్‍ అకాడమీ అధ్యక్షులు అల్లం నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏ ఉద్యమాలకైనా కవిత్వం గొప్ప ప్రేరణగా ఉందని, ఉంటుందని తెలంగాణ ఉద్యమంలో కవులు నిర్వహించిన పాత్ర అద్భుతమని అన్నారు. ఈ సమ్మేళనంలో ప్రముఖ కవులు అమ్మంగి వేణుగోపాల్‍, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి, కవి సంగమం కవి యాకుబ్‍, ఒద్దిరాజు ప్రవీణ్‍కుమార్‍, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, సిహెచ్‍.ఉషారాణి, జూపాక సూభద్ర, శిలాలోలిత, కంచనపల్లి, సిద్ధార్ద, జగన్‍రెడ్డి, బాణాల శ్రీనివాస్‍రావు, శ్రీరామోజు హరగోపాల్‍, వఝల శివకుమార్‍, పరమాత్మ, స్కైబాబ్‍, సంపత్‍, తంగిరాల చక్రవర్తి, అనంతోజు మోహనకృష్ణ, సుతారపు వెంకటనారాయణ తదితర 30 మందికిపైగా కవులు తమ కవితల్ని వినిపించారు. జూలూరు గౌరీశంకర్‍ కవులను సత్కరించారు. అన్ని కవితలు వస్తురీత్యా, శైలి రీత్యా బలమైన కవితలని ప్రేక్షకులు చర్చించుకోవడం విశేషం.


– జుగాష్‍ విలి
ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *