చిత్రలేఖ స్టూడియో మరో వినూత్న ముందడుగు

డిసెంబర్‍ ఇరవై సాయంత్రం చారిత్రక సాలార్జంగ్‍ మ్యూజియం ఒక సాహిత్య సంబరానికి వేదిక అయ్యింది. కిక్కిరిసిన లెక్చర్‍ హాల్‍లో ఉభయ రాష్ట్రాలలో ఉన్న కవులు,కళాకారులు, మేథావులు మాత్రమే కాకుండా ఇంకా అనేక సుదూర ప్రాంతాల నుండి ఆ సభను సంపదత్వం చేసారు. ఇది వాస్తవానికి ఒక వినూత్న ఒరవడి, వందేళ్ళ తెలుగు ఆధునిక వచన కవితా ప్రపంచం ఒక కవి నాలుగు దశాబ్దాల కవితా ప్రపంచాన్ని ఒక దగ్గర కూర్చి ఒక పుస్తకంగా వేయడం ఇది మొదలు కాదు చివర కాదు కానీ ఆ కవి ఒక మారుమూల పల్లెటూరి పీర్ల సావిడి దుమ్ములో అక్షర విన్యాసం చేసాడు. కవిగా, పాత్రికేయుడుగా, అనువాదకుడిగా, కథారచయితగా, విమర్శకుడిగా అన్నిటికన్నా ముఖ్యంగా అమెరికాలోని ప్రసిద్ద పెన్సిల్వేనియా విశ్వవి ద్యాలయం లోని దక్షిణా సియా భాషా సంస్కృతులను తెలంగాణ మట్టి వాసనలను విశ్వవేదికల మీద దండోరా వేస్తున్న ఒరవడిని ఒక ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసి నాలుగు దశాబ్దాల కవితా సాహిత్య పరిశోధనా నడకను దృశ్యమానం చేసిన ప్రయత్నం నిజంగా మొదటిది. ఆ గౌరవం పొందిన కవి అఫ్సర్‍ అయితే ఆ పనిని వినూత్నమైన పద్దతిలో నిర్వహించినది చిత్ర లేఖ స్టూడియో సాహిత్య లోకానికి ఒక మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది.


తెలంగాణలో పరిచయం అక్కరలేని స్వరం అఫ్సర్‍. ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టిన అఫ్సర్‍ తన బాల్య యవ్వనాలను నాటి, నేటి అగశ్రేణి కవి మేథావుల మధ్య గడిపాడు. జాతీయోద్యమ స్ఫూర్తి తో రాసిన అభ్యుదయ కవుల మొదలు విప్లవ, అస్తిత్వ, ఆధునిక అత్యాధునికత మేథో మేళవింపు అఫ్సర్‍ జీవితం . ఇంటర్‍ మీడియట్‍ కాలంలోనే ఇల్లస్త్రేటేడ్‍ వీక్లీ లాంటి ఆంగ్ల పత్రికల లో కవిత్వం రాసిన అఫ్సర్‍ ఇప్పటి వరకు నాలుగు కవితా సంకలనాలు, ఒక కథా సంకలనం, రెండు విమర్శన, మరో రెండు పరిశోధనా గ్రంధాలను, వందలాది కవితా సంకలనాలకు ముందుమాటలు, సమీక్షలు విమర్శననూ ఏకకాలంలో నిర్వహించిన అఫ్సర్‍ రక్తస్పర్శ కవితా సంకలనం ద్వారా తన దైన కవితా ఒరవడిని నిలబెట్టుకున్నాడు.


రెండున్నర దశాబ్దాల కింద ప్రారంభం అయిన చిత్రలేఖ స్టూడియో తెలంగాణ ఫిలిం ఐకాన్‍ నర్సింగరావు, అజిత్‍ నాగ్‍ తన సృజనాత్మక అన్వయింపుల తో దృశ్య శ్రవణ మాధ్యమాల లో అటు ప్రభుత్వ, కార్పోరేట్‍ అవసరాలకు తగిన షార్ట్, యాడ్‍ ఫిలింలో తమదైన ముద్రవేసుకున్న చిత్రలేఖ మలివిడత తెలంగాణ పోరాట అమరుల కళల సాకారం దృశ్య మానం చేసిన ‘పొత్తిళ్ళల్లోంచి’ తెలంగాణలో అదృశ్యం అవుతున్న ‘బొమ్మలోళ్ళ’ గురించి, తెలంగాణ కవితా గానం, ఆర్ట్ఏతెలంగాణ, సమ్మక్క సారలమ్మ మీద రూపొందించిన డాక్యుమెంటరీ రూప కల్పన లో తెలంగాణ సకల కళా బ్రతుకు చిత్రాలకు సజీవ రూపం పోస్తున్న చిత్రలేఖ అఫ్సర్‍ నాలుగు దశాబ్దాల కవితా యానాన్ని ‘‘అప్పటి నుండి ఇప్పటి దాకా’ ఇటీవల మన ముందుకు తెచ్చారు. ఈ క్రమంలో భాగంగా అఫ్సర్‍ జీవితం మీద ఒక సంక్షిప్తంగా లఘుచిత్రం, తన జీవితం లో భాగం అయిన పాత్రికేయ, అధ్యాపన,పరిశోధన ప్రతిఫలించే ఒక ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు ఆలోచన చిత్రలేఖ చేసి ఒక నూతన ఒరవడిని ప్రారంభించింది.


సాయంత్రం ఐదు గంటలకు ఈ కవితా ఉత్సవం మొదట ప్రముఖ కవి, విమర్శకులు చరిత్ర కారులు ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్‍ చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. చాయాచిత్ర ప్రదర్శన అనంతరం సౌత్‍ బ్లాక్‍ లెక్చర్‍ హాల్‍ లో అఫ్సర్‍ జీవితం లో చింతకాని నుండి పెన్సిల్వేనియా దాగా నడిచిన జీవన గమనం చిత్ర ప్రదర్శన జరిగింది. తదనంతరం జరిగిన పుస్తకావిష్కరణ సభకు బి సి కమిషన్‍ సభ్యులు జూలూరి గౌరీ శంకర్‍ అధ్యక్షత వహించారు. రెండు గంటల పాటు ఉద్వేగభరితంగా సాగిన సభలో అధ్యక్షతో పన్యాసం చేసిన గౌరీ శంకర్‍ మాట్లాడుతూ అఫ్సర్‍ జీవితం అంటే ‘‘ఎన్నెన్ని ప్రయాణాలు,ఎన్నెన్ని దూరాలు, ఎన్నెన్ని వాదాలు, ఎన్నెన్ని నాదాలు వీటన్నిటి నుంచి వచ్చినటు వంటి తెలంగాణ సమాజం ప్రతిగమనం లో అఫ్సర్‍ సాహిత్య ఒరవడి ఉంది. క్లుప్తంగా చెప్పుకుంటే అఫ్సర్‍ కవిత్వం చదవడం అంటే తెలంగాణ సమాజం తనను తాను అద్దం లో చూసుకోవడం వంటిది అంటూ, తెలంగాణ నాలుగు దశాబ్దాల రెండు తరాలకు ప్రతీక గా ఈ సభ జరుగుతుంది అని అన్నాడు. ఈ సభలో సరస్వతీ సమ్మాన్‍ అవార్డు గ్రహీత కె శివారెడ్డి మాట్లాడుతూ ‘‘అనేక సంక్షోభాలను చవి చూసిన ఈ సమాజం వలస అనివార్యం అయిన ఈ పోస్ట్ మోడరన్‍ అమెరికా కేంద్రీకృతమై మైన పెట్టుబడి దారీ సమాజ సంక్షుభిత కాలంలో కూడా కవులు,కవిత్వం ఇంకా బ్రతికి ఉంది దానికి కారణం కవులు కళా కారులు తమ ఉనికి గురించి, అస్తిత్వం గురించి, మన లోపలి సామూహిక వేదన గురించి, అటువంటి వేదన సదరు కవి అస్తిత్వం నుంచి వచ్చింది కాబట్టి ఈ నాటికీ అఫ్సర్‍ కవిత్వానికి ప్రాసంగికత ఉంది అని అన్నాడు. ఈ సభలో మరొక ప్రముఖ వక్త తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‍ నందిని సిద్దారెడ్డి పుస్తక ఆవిష్కరణ చేసి తొలి ప్రతిని అఫ్సర్‍ వారసుడు అనిందుకు ఇచ్చి మాట్లాడుతూ, బ్రతుకు ఒక వాంఛ చావులాగనే చావు ఒక గడ్డి పోచ బ్రతుకు లాగానే’’ అనగల స్ఫూర్తి అఫ్సర్‍ కవిత్వం వ్యక్తిత్వంలో ఉంది అంటూ అఫ్సర్‍ తెలంగాణ మట్టి గోసను, అస్తిత్వ వేదనను తన కవిత్వంలో నింపాడు అన్నాడు.


‘‘ఆంధ్రజ్యోతి సంపాదకుడు తెలంగాణ చరిత్రకారుడు కె. శ్రీనివాస్‍ మాట్లాడుతూ ‘ఉనికికి సంభందించి తపన పడవలసిన లేదా భయపడవలసిన ఆవేదన చెందవలసిన అవసరం సామాజికం గానే వచ్చినప్పుడు, ఆత్మాశ్రయమైన ఆవేదనకు ఆస్కారం ఇచ్చే సామాజిక పరిణామాలు జరిగినప్పుడు రెండిటికీ వేరువేరు కవిత్వాలు ఉండవు, కాబట్టి ఆ రెండిటి మధ్య ఉన్న కృత్రిమ మైన సరిహద్దును అఫ్సర్‍ కవిత్వం చాలా ప్రభావ వంతంగా చాలా భావుకతతో చెరిపేసింది అని చెప్పవచ్చు.’’ అని అన్నాడు.


ఈ సభలో మరొక వక్త తెలంగాణ ప్రెస్‍ అకాడమి చైర్మన్‍ అల్లం నారాయణ
మాట్లాడుతూ ‘‘నాలుగు దశాబ్దాల కింద ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్టస్ కళాశాలలో చదువుకుంటున్న కాలాన సర్వేశ్వర దయాళ్‍ సక్సేనా అమరత్వం గురించి రాసిన అఫ్సర్‍ ‘మృత్యువు అంతిమంగా నిన్ను ముద్దాడింది’ అనే కవిత నాడు తన గదిలో గోడమీద అంటించ బడిన కాలం నుండి ఆయన కవిత్వంతో పరిచయం ఉంది, ఒక రకమైన భిన్నమైన ప్రపంచంలోకి తనను తీసుకొని పోయింది అంటూ నాలుగు దశాబ్దాల స్నేహాన్ని ఈ సంద ర్భంగా గుర్తుకు తెచ్చుకున్నాడు. మనిషి ఉనికి అస్తిత్వం, రాజ్యం విశృంఖలత్వం పెరిగిన ఈ సంక్షుభిత కాలంలో బలంగా ముందుకు వచ్చిన కవిత్వం తన ప్రాసంగికతను పెంచుకుంటున్న కాలంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం కనుక అఫ్సర్‍ కవిత్వం ఆలోచనలు ఈ కాలానికి అవసరం అన్నాడు.


నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నప్పటికీ కవిత్వం ఒక సమగ్ర సంకలనంగా ఉండాలి అనేది అఫ్సర్‍, నరసింగ రావుల కోరిక. సాహిత్య సర్వస్వం అనే భావన అఫ్సర్‍ కు నచ్చనప్పటికీ ఇప్పటి వరకూ వచ్చిన కవితా సంకలనాలు ఒక దగ్గర ఉండాలి అనే కోరిక చిత్రలేఖ ద్వారా తీరింది. ‘పుస్తకాల పేజీలు అసహనంగా కదులుతున్న వేళ, మనసు పుటల్లో అశాంతి, కరుణించదు నిద్ర, విరిగి ముక్కలై పోతున్న కల లాంటి వాస్తవం, నడిరాత్రి ఊహలు నడిచొచ్చి చీకటి వొంటిపై కలం వేళ్ళతో రాస్తుంటాయి. ఈ సమాజంలో భావానికీ, అక్షరానికీ, అనుభూతికీ, రూపానికీ, మాటకీ, చేతకీ, మనిషికీ, మనిషికీ దూరం అపారం అయిన కాలాన కవిత్వం మాత్రమే స్వాంతన’ అంటూ అఫ్సర్‍ తన ప్రసంగాన్ని ముగించాడు. చివరగా చిత్రలేఖ స్టూడియో బాధ్యులు అజిత్‍ నాగ్‍ మాట్లాడుతూ ఇంతకాలం చిత్రలేఖ దృశ్య శ్రవణ మాధ్యమాలకే పరిమితం అయ్యింది. ఇక నుండి తెలంగాణ చరిత్రను సంస్కృతిని ఇనుమడింప చేసే ప్రజా సాహిత్యాన్ని ముద్రించి భావి తరాలకు అందించే లక్ష్యంగా చిత్రలేఖ ముందుకు సాగుతుంది అంటూ, సభను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక నిజమైన పాత్రికేయునికీ, పరిశోధకునికీ, అధ్యాపకునికీ ముఖ్యంగా జీవితం అంతా సాహిత్యాన్ని పలవరించిన అఫ్సర్‍కు చిత్రలేఖ ద్వారా లభించిన అపూర్వ సత్కారం అది మనందరికీ జరిగిన సత్కారం.

https://youtu.be/EeWAFrEvE1s- Afsar
https://youtu.be/bZVqF5QxGSU- Gouri
https://youtu.be/Naks5zOoxtI- Shiva REDDY
https://youtu.be/W-7qCt1v6cQ- Nandini SIdha REDDY
https://youtu.be/dZaiuGpK_GE- Allam Narayana
https://youtu.be/WPOgPzkuais- K.Srinivas



– డా.గుఱ్ఱం సీతారాములు, ఎ :9951661001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *