పాటమ్మను విడువక ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పదాలకొండ దేవరకొండ బిక్షపతి పాట


కూలినాలి చేసుకొని బతికే కష్టజీవుల కుటుంబంలో ఉద్భవించిన పాట. ప్రజా కవుల అడుగుజాడల్లో పయనించిన పాట. కడుపుల పేగులు మాడినా, కాలికి బలపం కట్టుకొని పల్లవించిన పాట. నిర్బంధాల్ని, జైలుగోడల్ని లెక్కచేయని పాట. ఉద్యమానికి ఊపిరూదిన పోరుపాట. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ధూంధాం చేసిన పాట. తెలంగాణ గుండెల్లో మోగిన పాట. గుండెల్ని పిండిన పాట. అది పాటమ్మ బిడ్డ భిక్షపతి పాట. తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ప్రజాకవి, గాయకుడు దేవరకొండ బిక్షపతి గురించి నేటి మన అలుగెల్లిన పాటలో..


మహబూబ్‍బాద్‍ జిల్లాలోని బయ్యారంలో కూలినాలి చేసుకుంటూ బతికే దేవరకొండ వెంకన్న-సత్తెమ్మ దంపతులకు రెండవ సంతానంగా 1976-78 ప్రాంతంలో జన్మించిన భిక్షపతి స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం మొదలు పెట్టి హాస్టల్లలో ఉండి హైస్కూల్‍లో చేరినప్పటికీ పేదరికం కారణంగా పెద్ద చదువులు చదివే అవకాశం లేకుండా పోయింది. పెద్దగా చదివించక పోయినప్పటికీ చుట్టూ ఉన్న అడవి వాళ్ళకు అన్నీ నేర్పించింది. చిన్నప్పటి నుంచి అన్నల మాటలు, పాటలు విన్న భిక్షపతి సమాజాన్ని అవగాహన చేసుకుండు.


‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా’’ అనే పాట పాడుకుంటూ బయ్యారం వచ్చిన జయరాజు, నాగన్నలను చూసి పాట వైపు ఆకర్శితుడయ్యిండు. భూస్వాముల, పెత్తందారుల గుండెల్లో గుబులు పుట్టించిన ఈ పాటే బిక్షపతిలో సాహిత్య బీజాలను నాటింది. అన్నలు పాడే పాటల్లోని సారాన్ని పట్టుకుండు. గద్దర్‍, గోరటి వెంకన్న, అందెశ్రీ, జయరాజుల పాటలను రోజుల తరబడి విని కాలం గడిపిండు. పదాలను పొందిచ్చి పాటలల్లిండు. పల్లెతల్లిని మరువలేనని బిక్షపతి రాసుకున్న ఒక పాట చివరలో
‘‘కళాకారులను కన్నతల్లి ఖమ్మం జిల్లా/ విప్లవాల పోరుగడ్డ ఇల్లందు
పక్కనే మా ఊరు బయ్యారం / ఒక్కతే అక్కడెట్ల ఉన్నదో
ఒక్కసారి మా ఊరికి పోయిరావాలెరా’’
అంటూ బయ్యారాన్ని తల్సుకుంటడు. ఊరు పట్ల తనకున్న అవ్యాజమైన ప్రేమను ప్రకటిస్తడు. విప్లవోద్యమాన్ని కలగంటడు. ఎప్పటికీ విప్లవమే జయిస్తదని అంటడు. క్రమంగా ప్రజా
ఉద్యమానికి చేరువై విప్లవోద్యమ భావజాలంతో పాటలు రాసిండు. జయరాజుతో పెరిగిన సాన్నిహిత్యంతో బిక్షపతి పాట మరింత పదునుదేలింది.
‘‘అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా.. నాన్నా నీకు దండమే..
నవమాసాలు నన్ను మోసినవమ్మా పురిటినొప్పుల బాధ పడ్డావమ్మా
పేగు తెంచుకు నన్ను కన్నావమ్మా పేరు పెట్టకముందే వేరు చేయాకమ్మా
నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓయమ్మా నన్ను దూరం జేయబోకమ్మా..’’ అంటూ బిడ్డల్ని అమ్ముకునే తెలంగాణ దుస్థితిని అక్షరీకరిస్తడు. పదాలతో కన్నీరు బెట్టిస్తడు. సాధారణ వాడుక పదాలతో సులభశైలితో రాసిన ఈ పాట బిక్షపతిలోని ఆర్తిని, సామాజిక చైతన్యాన్ని బయటి ప్రపంచానికి పరిచయం చేసింది. మరో పాటలో స్వతంత్ర దేశంలోని అసమానతలను కడిగి పారేస్తడు. కుల మతాల హెచ్చు తగ్గులను గురించి జ్ఞానాన్ని పెంచుతడు. రాజ్యాంగబద్ధంగ ప్రజలకు దక్కవలసిన హక్కులను సాధించు కోవడం కోసం పోరాటమే శరణ్యమని పల్లెలను చైతన్య పరుస్తడు. ‘‘ఊరు ఊరు కదులుతుందిరా హక్కులకై / ఒక్కటిగా పల్లె పల్లె పయనమాయెరా’’ అంటూ తరతరాలుగా గోసబడుతున్న పల్లెల్ని కదిలిస్తడు. అనాదిగా భూములు అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నయని, కుల మతాల కుమ్ములాటల్లోనే దళిత బహుజనుల బతుకులు తెల్లారిపోతున్నయని గొంతెత్తి గానం చేస్తడు. విప్లవోద్యమంతో మొదలైన దేవరకొండ బిక్షపతి పాటల ప్రస్థానం ఎన్నో నిర్బంధాలను చవిచూసింది. రాజ్యహింసను భరించింది.


‘‘కొడుకా నా ముద్దు కొడుకా కొడుకా నా చిన్ని కొడుకా
ఎక్కడా బోతివిరా నేనొక్కదాన్నయితినిరా
అన్నల్లో కలిసిపోయే కొడుకు అదృష్టమందరికి రాదు
అన్యాయాన్నెదిరించినట్టి నాటి అమరుల బాటల నడువు
అమరుడు పెద్దన్న బందూకు అందుకోని ముందుకురుకు
నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా పట్టు కొడుకా’’ అంటూ పాట చివరలో రాసిన పదాలు చూస్తే బిక్షపతి తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఎంత బలంగా నమ్మిండో అర్థమైతది. అన్నల పోరాటానికి అమ్మల తోడ్పాటు ఎట్లుంటదో అక్షరీకరిస్తడు.
‘‘ఓ వెలిగే వెన్నేలమ్మ చల్లాని జాబిలమ్మా / తెల్లాని మల్లేలమ్మ విరబూసిన జాజీకొమ్మ
నా కొడుకు యాడన్న కనిపించిండా/ నేననుకొని నీ ఒడిలో నిదరోయిండా’’ అంటూ గుండెల్ని పిండుతడు. కన్నపేగును కదిలిస్తడు. బిక్షపతి పాల్వంచకు చెందిన ప్రేమ్‍జిత్తును పెండ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిండు. బిక్షపతి తాను రాసిన ఒక ఆరు పాటలను తీసుకొని ‘గుండెల్లో పాట’గా రూపొందించి, గద్దర్‍తో ఆవిష్కరించిండు. గద్దర్‍ ముందుమాటతో వచ్చిన ఈ పాటల సి.డి. అత్యంత ప్రజాదరణ పొందింది. నిజానికి బిక్షపతి రాసిన ఎన్నో పాటలకు ప్రాణం పోసిన అశ్వని ఆయన మేనకోడలే. అశ్వని గొంతులో పాట అలలు అలలైతది. మనకు తెలువకుండనే హృదయం ద్రవిస్తది.
‘‘నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా
ఎన్నడు మరిచిపోనమ్మో నా పాటమ్మా
ప్రతి మదిలోన మొదలుతుంటవో పాటమ్మా
నా ఎదలోన పదిలంగుటవో పాటమ్మా’’ అంటూ పాటెమ్మటే తిరుగతడు. అసహాయులకు ఆయుధమై, ఉద్యమ చైతన్యాన్ని రగిలిస్తడు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రాణప్రదమై నిలిచింది. నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఏ పిలుపునిచ్చినా పాటే ముందు వరుసలో నిలబడ్డది. ఆ పాటలను మారుమూల తీపుకొని పోయే కళాకారుల జీవన చిత్రాన్ని కైగట్టిన బిక్షపతి పాట పాడని కళాకారుడు లేడు.
పాట గొప్పతనాన్ని, కళాకారుల త్యాగాన్ని, బైరాగి తత్వాన్ని గానం చేస్తడు. ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న కాలంలో ఎన్నో పాటల్ని అప్పటికప్పుడు అశువుగా కైగట్టిన సందర్భాలు ఉన్నయి.
‘‘పల్లెతల్లిని మరిచిపోయి ఉండలేకపోతిరన్నా / నేనెక్కడున్నా నా పల్లె నల్లగుండాలిరన్నా
పాడిపంటలు సల్లగుండాలని యాడిదికోపాలి / ఆడిబిడ్డల పిలిసి ఊరువాడ వనభోజనం బోనీకె
డప్పు నారాయణతో సాటింపు వేసేది’’ ఈ పాటలో కులవృత్తులు అడుగంటిపోతున్న వైనాన్ని, పల్లెల్లోని ఆత్మీయతలను వరుసబెట్టి చెప్పుకొస్తడు. బిక్షపతి ఏనాడు పాటను అమ్ముకోలేదు. బతికినంత కాలం పాటనే నమ్ముకొని, నీతి నియమాలకు కట్టుబడి నైతికంగ బతికిండు. సమైక్యపాలకుల నుంచి అనేక అవకాశాలు వచ్చినప్పటికి అడ్డగోలు పాటలు రాసి సంపాదించింది లేదు. ఉద్యమానికి ఊతమిచ్చి పాటను బతికించడమే పనిగా పెట్టుకున్నడు తప్ప ఉద్యమానికి తల పెట్టలేదు. ఇంటికింత తిన్నడు, లేనినాడు పస్తులున్నడు. ప్రజలమధ్యనే జీవించిండు. గుండెల్లో పాటతో పాటమ్మ తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నడు. పల్లెపల్లెకు వ్యాపించి, తెలంగాణ ద్రోహుల మీద దుమ్మెత్తిపోస్తడు.


రాష్ట్రం కోసం వేలాదిగా అసువులు బాస్తున్న అమరవీరులను గద్దెను ధిక్కరిస్తడు. దీనంగా అర్థిస్తడు. శాపనార్థాలతో శాసిస్తడు. ఇట్ల అనేక విధాలుగా తెలంగాణ చైతన్యాన్ని, అమాయకత్వాన్ని, త్యాగాన్ని గానం చేసిన బిక్షపతి పాట
‘‘తెలంగాణ వల్లేలల్ల లొల్లి లేసెరా / వలసవాదులకు ఒల్లు జల్లుమనేరా
సస్తెనే ఇస్తనంటే చెప్పవమ్మ సోనియమ్మ / ఒరిగిన వీరులకన్న ఎక్కువేమి గాదమ్మా
ఎంతమందిమి జస్తె ఇస్తవో లెక్కజెప్పు / మా ఉసురు దగిలి నాశనమయ్యిపోతవో…’’ అంటూ ఆనాడు నల్లగొండ జిల్లా తిప్పర్తి సభలో పాడినప్పుడు హరీశ్‍రావు కంట కన్నీరు బెట్టిండు. పాట కవులు, కళాకారుల పదునైన పదాలను చూసి పొంగిపోయిండు. పాటలే ప్రజా ఉద్యమాన్ని సజీవం చేస్తున్నయని తన మాటల్లో చెప్పిండు. బిక్షపతి పాటల్లోని పదునైన భావాన్ని గుర్తుచేసిండు. ఇట్ల ఎందరో ప్రముఖుల్ని, పామరుల్ని మెప్పించి ఒప్పించిన పదాలే బిక్షపతి పాటలు. సందర్భానుసారం ఎన్నో విలువైన పాటల్ని అందించిన ప్రజాకవి, గాయకుడు రాష్ట్ర ఆవిర్భావంతో కేసీఆర్‍ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ సాంస్కృతిక సారథిలో సభ్యుడై ఉద్యోగాన్ని సాధించిండు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. అనతికాలంలో భిక్షపతి అనారోగ్యానికి గురయ్యిండు. ఎట్లాంటి సందర్భంలో రాసుకుండో తెలువదు గాని, బిక్షపతి రాసుకున్న
‘‘ఉద్యోగం చేస్తానంటివిరో బిచ్చయ్య / ముద్దుగ నను జూస్తానంటివిరో బిచ్చయ్య
ఉద్యోగం ఏమో గాని బిచ్చయ్య / మద్దెల నన్నాగం జెయ్యకురో..’’ పాటే నిజమైంది. జీవితం సగంలో ఆగమైంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా 2015 సెప్టెంబర్‍ 3న పాటమ్మ బిక్షపతి చనిపోయిండు. కొడుకు మీద బెంగతో గుండెలు పగిలేలా ఏడ్చిన బిక్షపతి తండ్రి కూడ దినాల రోజునే సెప్టెంబర్‍ 11న కుప్పకూలి పోయిండు.

ఒకేసారి తండ్రి కొడుకులు మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యింది. భర్తను పోగొట్టుకున్న భార్య, కొడుకును పోగొట్టుకున్న తల్లి, తండ్రి లేని పిల్లలు అన్నట్లు బిక్షపతి కుటుంబం చిన్నాభిన్నమైంది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‍ రసమయి బాలకిషన్‍ చొరవతో సారథి కళాకారులు రెండు లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందజేసిండ్రు. ఇది కొంత వరకు ఉపశమనం కలిగించినప్పటికి పాటమ్మ బిక్షపతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం భిక్షపతి కొడుకు రచన్‍కుమార్‍ 10వ తరగతి, బిడ్డ దివిజ 7వ తరగతి చదువుతున్నరు. వీళ్ళకు ఓ దారి చూపించి, ఆ కుటుంబానికి తగిన ప్రభుత్వ తోడ్పాడు కావాలని తల్లి సత్తెమ్మ వేడుకుంటున్నది. పాటను కన్న ఆ తల్లి ఆవేదన తీరాలని కోరుకుందాం.


-అంబటి వేకువ,
ఎ: 94927 55448

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *