మదర్స్ డే – అమ్మల దినం

గిరి గాడొక్కడే చెత్త కుండీ నానుకొని గుడ్డె పొడుచుకొని కూలబడిండు. వానికెడమ వైపున రెండు గున్న పందులు తోక లూపుకుంటు ఆహారం కోసం అటు ఇటు తిరుగుతున్నై. కుడి వైపున ఒక బక్క కుక్క ముందలి కాళ్ళు చాపి ఒక దానిపై ఒకటి వేసుకొని గదుమ నానించి ఈ ప్రపంచ చింత తనకేమి పట్టనట్లు చూస్తూ పండింది.
ఇంతలో ఒకవ్వ అక్కడికి చెత్త బకిటు తీసుకొని వచ్చి కుండీలో కుమ్మరించింది. దాన్నట్లా కుమ్మరించగానే పంది గున్నలు రెండు నేనంటే నేనని ముందుకు వచ్చి ఆ కుండీలోనికెగరటానికి చుట్టూ తిరగసాగినై. అవ్వ గిరిగాన్ని చూసి ఏందిరా యియ్యాళ ఒక్కడవే కూకున్నావు? మీ వాళ్ళంతా ఎక్కడ పోయిన్రు.
‘‘అవ్వా ఇయ్యాల అమ్మల దినం అల్లంతా తమ అమ్మల దగ్గెర కోయిన్రు’’.
‘‘మరి నువ్వు పోలేదేం?’’
‘‘నాకమ్మ లేదు’’
‘‘ఏమయింది?’’
‘‘చచ్చిపోయింది’’
‘‘మరి అయ్య లేడా!’’
‘‘అయ్య అమ్మ కంటే ముందే పోయిండు. ఇయ్యాల మీ వారంతా అమ్మల దగ్గరకు పోయి ఎం చేస్తార్రా!’’


‘‘అమ్మలంతా ఇయ్యాల స్నానం చేస్తరు. పిల్లల క్కూడ చేపిస్తరు. కొంచెం మంచి బట్టలేసుకుంటరు. అయినంక బిచ్చల పైల కెళ్ళి మిఠాయిలు కొనుక్కొని తింటరు.’’
గిరిగాని దిగులు సూసి అవ్వకేలాగో అని పిచ్చింది. అవ్వంటే ఆమె పూర్తిగా అవ్వగా లేదు. దంతాలు మాత్రం అన్ని రాలిపోయినై. నడుం కొంచెం వంగింది కానీ, నడికట్టు కట్టుకొని తన పని అంతా తానే జేసుకుంటది. తానె వాకిలూడ్సుకుంటది. లంకంత ఇంటిలో ఒక్కతే ఉంటది. బాగున్న కాలంలో గంపెడు బలగంతో సాగిన సంసారం. ఇవ్వాళ సదువులకని కొందరు ఉద్యోగాలకని కొందరు కొడుకుల పెండ్లిండ్లు కాగానే పెండ్లాల నెంటేసుకుని పట్న మెక్కిండ్రు. అందువల్ల ఇంటిలో అవ్వ ఒక్కతే అయింది.
గిరిగాన్ని చూసి ఆమె అట్లయితే నేను నీకు స్తానం పోస్తాను వస్తావురా అన్నది.
వాడు ‘‘ నాకు నువ్వమ్మవా ‘‘ ! అన్నాడు.
‘‘అమ్మే స్తానం పోయాల్నా ! ఇంకొకరు పోయగూడదా! నేను నీకు కాకపోయినా ఒక అమ్మనేరా!’’ అంది. ‘‘అయితే యియ్యాల నువ్‍ నాకు స్తానం బొస్తవా! మరి బువ్వ’’ అమాయకంగా అడిగిండు వాడు. ‘‘బువ్వ కూడ పెడ్తా ! నువ్వోస్తే.’’
‘‘అయితే వస్త! నా చిప్పముంత తెచ్చుకుంట’’ అని లేచిండు. ‘‘ఇయ్యాల కే ముద్దులే! మా యింట్ల ఉన్నవిస్త! ఇంగ నా వెంటరా!’’ గిరిగాడు తనను తాను దులుపుకొని అవ్వ వెనుక నడిచిండు. ఆమె వాన్ని ఇంటి లోపలికి పిలుచుకొని మొదట చక్కగా స్నానం గదికి తీసుకెళ్ళి జాలెట్లో కూంచో బెట్టి శరీరంపై నీళ్ళు చల్లి ఇక నెత్తి పులుమ నారంభించింది.
ఒత్తుగా పెరిగిన వాని నెత్తిని బాగా తడిపింది. మొదటి సారి సబ్బు పెట్టగా వాని నెత్తి నుండి రైలు బొగ్గు వంటి చిక్కటి మసి వెళ్ళింది. రెండవ సారికి జిడ్డుతో కూడిన మురికి వెళ్ళి మూడోసారి తల శుభ్రమయ్యింది. ఆ తర్వాత శరీరం ఇంకా బాగా రుద్ది చేపను రాకినట్లు బాగా రాచి కడగగా వాడు ఆమె అనుకున్నంత నల్లగా లేడు. ఎరుపు మిశ్రమంగా ఉన్నాడు కాని వానికినెత్తి కెవరు పోస్తారు. పై రుద్ది ఎవరు కడుగుతారు? వాడైన తనను కడుక్కుని ఎన్ని దినాలయిందో!
అరగంట సేపు స్నానం చేయించి తడిఒత్తి ఇంట్లోకి తోలుకపోయి పై ఇంకా బాగా తుడిచింది. అప్పుడు వాడచ్చం తని చిన్న మనుమని వోలె ఆమెకు కనిపించిండు.
లోపలికి తీసుకవచ్చి తడుస్తదని పైకి చెక్కుతున్న సింగులన్ని కిందికి లాగి దులుపుకొని గదిలోనికెళ్ళి తన మనుమని బట్టలు ‘‘బొగుస’’ తెచ్చి దాన్ని విప్పి అందులో నుంచి ఒక్కొక్క మడతనే తీస్తూ గిరిగానికి సరిపోయిన ఒక నిక్కరు ఒక ఆఫారం తీసి యిచ్చి ఇవ్వాళ ఇవి వేసుకోరా! అంది. వాడా దుస్తుల నాశ్చర్యంతో తిప్పి తిప్పి తిరుగుమళ్ళ నుంచి మళ్ళ చూసి నిక్కరు తొడుక్కొని ఆఫారం వేసుకున్నాడు. అవి వేసుకునే వరకు వాని ముఖంలో ‘‘జమిందారీ’’ పిల్లవాని కళ వచ్చింది.
అవ్వ ‘‘రేపటి నుండి నీకింకా మంచి దుస్తులు కుట్టిస్తానని’’ చెప్పి దగ్గరకు పిలుచుకొని తల దువ్వి ‘‘ఇంక నూవ్వీ ఇంట్లోనే ఆడుకో! నేను పొయ్యి కాడికి పోతా!’’ నని వంట గదిలోనికి వెళ్ళింది.
రేపటి నుంచి అనే మాట వినేవరకు గిరిగాడు ‘‘అవ్వ ఇంట్లో నేనియ్యాలనే ఉంటాననుకున్నాడు గాని రేపటి నుండి అంటే నేనింక నా జత వాళ్ళను విడిచి ఇక్కడనే ఉండిపోవలెనా! లేక వెళ్ళిపోవలెనా’’ అని మనసు కొంతసేపు ఉయ్యాలలూగింది.
అవ్వ ఆడుకొమ్మన్నది గాని ఒంటరిగా ఆడే ఆటలేవి వానికి రావు. వాడా గదిలోనే ఒంటరిగా కొంతసేపు కూచోని అటు ఇటూ చూసిండు గాని కుండి దగ్గర ఒక కుక్కలాగా తనకేం పట్టకుండా ఉండలేకపోయిండు. వానికి ఎటూ తోచలేదు. చౌరస్తాలో నిలిచి పైసల కోసం పంది గున్నల్లాగా ఇటు అటూ తిరిగిన ప్రాణం. వారిని వీరిని ఆడుకున్న ప్రాణం వట్టిగా ఒక చోట ఎట్లా కూచోగలడు. లేచి అవ్వ దగ్గరకు పొయ్యింట్లో కెల్లిండు.
అవ్వ పొయ్యి మీద ఎదో ఎసరు పెట్టె బీరకాయను తరుగుతున్నది. వాన్ని చూసి ‘ఏందిరా వచ్చి నవ్‍’ అన్నది. వాడు ‘అవ్వా నన్నాడుకొమ్మన్నవు గాని ఒంటరిగా ఆడే ఆటలు నాకేవి రావు’ అన్నాడు. నీకేం ఆటలు రావురా! ఎందుకు రావు. కోతి కొమ్మచ్చి, హరిపురి, చిరుత గిల్లి ఇంకా వస్తయి గాని వానికి మా గుంపంత ఉండాలె. కాని మా వాళ్ళెవరు మమ్ముల్ని ఆడుకొనియ్యరు. బిచ్చం ఎత్తేది పోతదని దానికే తరుము తుంటరు. ఇక్కడ నేమో నేనొక్కడినే గదా! ఎట్లా ఆడుకుంటా!
‘‘అయితే మరేం జేస్తావు.
‘‘చౌరస్తా కెళ్ళి ఆయన్ని ఈయన్నియిన్ని పైసలాడుక్కోతున్నా. రాత్రికి బువ్వకైతవి’’. ‘‘బిడ్డా మన కట్లా అడుక్కోవలసిన అవసరం లేదు. బువ్వకేం లోటు లేదు.’’ ఈ మాట వినేవరకు గిరిగానికేంతోచలేదు. అవ్వ నన్ను కట్టేసే గదా! అని పించింది. ‘‘ఇయ్యాల కెట్లాగో ఉండి తెల్లరగానే మల్లా నా కుండీ కాడికెళ్ళాలె’’ అనుకున్నాడు.
పగలెట్లాగో గడిచింది. సందేళ్ళ పడగానే అవ్వ సందగాసు తీసి దీపం వెలిగించి లైట్లు వేసింది. వాడది చూచి ‘‘అవ్వా లైట్లుండగా దీపమెందుకు ముట్టిచ్చినవే’’ అన్నాడు. ఆమె ‘‘బిడ్డా! దీపమంటే లక్ష్మీ దేవి కనుక దీపం వెలిగించి దండం పెట్టిన మీదనే లైటేసుకోవాలె’’ అన్నది.
చీకటి పడేవరకు అవ్వ మళ్ళీ బువ్వ వండింది. కూర పొద్దటిదే ఉన్నది. కొంచెం సేపైన తర్వాత ఇద్దరు బువ్వతిన్నరు. అవ్వ వానికి కడుపు నిండా పెట్టింది. అంతవరకు గిరిగాడెప్పుడు సగం కడుపుకే గాని ఇట్లా ఒకేసారి కడుపునిండా ఎన్నడు తినలేదు. ఇవ్వాళ వానికి ఎంతో ఇదిగా ఉన్నది కాని రెండో వైపు తెల్లారితే ఏంచేయాలన్న ఆలోచన.


బువ్వ తినంగానే అవ్వ విశాలంగా పక్క పరిచింది. అనంతరం వాన్ని ‘‘గిరీ’’ అని పిలిచి ఇదిగో నీవు ఇక్కడ పండుకో నెత్తి అక్కడ చెయ్యి అని చేతులతో చూపి అట్లా నీవు నాడొక్కలో పండుకుంటే నీకు నాకు ఇద్దరికి ఎచ్చగా ఉంటుంది’’ అన్నది.
అవ్వ అట్లా చెప్పి పక్క మీద కూలబడిందో లేదో గిరిగాడప్పుడే తన అలవాటు ప్రకారం అవ్వ చూపిన చోట ముడుచుకొని ముడిగిండు. వాన్ని చూచి అవ్వ ‘‘అట్లా కాదురా! కాళ్ళు చాపి విశాలంగా పడుకో’’ అన్నది.
అంతవరకు వాడు కాళ్ళు చాపుకొని విశాలంగా ఎన్నడు పండలేదు. ఈ వేళ అమ్మల దినం కాబట్టి అందరూ వాళ్ళ వాళ్ళ అమ్మల దగ్గర కెళ్ళినారు గాని దినదినం వాళ్ళ గుంపంత సుబ్బడు, ఎంకడు, రంగడు మొదలైన వాళ్ళంతా ఒకనాడు బస్టాండ్‍ లో, ఒకనాడు రైలు స్టేషనులో, ఒకనాడు పుట్‍ పాత్‍ మీద పైసలడగటం ఎక్కడ ఎక్కువసేపు గడిస్తే ఆనాడక్కనే ఎదో ఒక చోటు చూసుకొని ముడిగేవారు.
ఆ రాత్రి అవ్వకి గిరిగానికి యిద్దరికి నిశ్చితంగా మంచి నిద్ర పట్టింది. తెల్లవారిన పిమ్మట ఎవరు అనుభవాలు వారు చెప్పుకున్నారు.
అవ్వ కొంచెం చీకటిగానే లేచి బర్రెను పిండింది. బాగా తెల్లవారిన పిమ్మట అవ్వ వానిని పెరట్లోనికి పిలుచుకెళ్ళి చేతిలో ఇంత పండ్లపొడి పోసి దీనితో పండ్లు బాగా తోమి కడుక్కో’’ నేను చాయ చేస్తాను అని వంట గదిలోనికి వెళ్ళింది.
గిరిగాడు పండ్లు రుద్దుకొని కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చినాడు. అవ్వ టీ తయారు చేసింది. రెండు గ్లాసుల్లో తేగా ఇద్దరు ఎదురెదురుగానే కూర్చుని టీ తాగిన్రు.


గిరిగాడెప్పుడు హోటల్‍ టీయే గాని ఇంటి చాయ్‍ ఎరుగడు.. దాన్ని తాగి ఇది ఇంత బాగుంటదా! అనుకున్నాడు. పిమ్మట ఆమె కెదురుగా ఆమెనె చూస్తూ కూచుని పది నిముషాలైన తర్వాత అవ్వా యింక నేను నాతావుకు పోతానని’’ లేచాడు. ‘‘నీతావు అంటే ఎందిరా? ఆ కుండియేనా!’’ అవును.
‘‘ఈ ఇల్లు దాని కంటే బాగా లేదా!’’
‘‘ఇక్కడ నాకెవరు జతగాళ్ళు లేరు నేనొక్కన్నే ఎట్లా ఉండాలె? ఇక్కడ నాకేం పని గూడ లేదు’’ అన్నాడు.
పిల్లతనం మనిషిని ఊరుకోనీయదు. వానికి ఆటనో లేదంటే ఎదైనా పనో ఉండాలె. అది మంచిదో చెడ్డదో!
‘‘అట్లా అడుగు నేను చెప్తాను గాని నన్నోక్కదాన్నే యిడిసి పోతావురా!’’
‘‘అవ్వా నీకేవరు లేదా!’’
‘‘లేకెందుకు బిడ్డా! ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉన్నరు’’.
మరి వారేరి?
‘‘పెండ్లైనా తర్వాత పెండ్లాల నెంటేసుకొని మగ పిల్లలు వారి ఉజ్జోగాలకు ఎల్లిన్రు.. పెద్దోడు పూనా అంట అక్కడికిపోతే సిన్నోడు ఇక్కడ ‘అమరికల’న్నీ సరిగా ఉండవని ‘అమెరికా’ యెల్లిండు.. బిడ్డ మగడు పట్నంలో ఇల్లు గొన్నదని అక్కడి కెళ్లి పోయింది.’’
‘‘అల్లకు కొడుకులు బిడ్డలు లేరా!’’
‘‘లేకేం! అందరికి ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారు. కాని వాళ్ళకు పెద్ద సదువులు కావలె. పిల్లల్ని ఈ ముసలి దాని దగ్గరుంచుతారా! నాకేమో చిన్నప్పటి నుండి పిల్లల్ని పెంచిన అలవాటు. ఇంటిలో ఎవరో ఒక పిల్లగాడు పిల్లనో లేకుంటే తోచదు. పొద్దువోదు.’’
‘‘నాకు అంతే అవ్వా! ఒక్కన్నే ఉంటే పొద్దువోదు’’. ‘‘అట్లా అడుగు పొద్దు వొకపోతే సాళ్లెకెల్లిరా ఇంతసేపు అంటే బడికి పోయిరా!
‘‘నన్ను సదువు కొమ్మంటావా! అది నానుంచి గాదు’’. ‘‘సదువంటే ఎమనుకున్నావురా! అచ్చరాలతో ఆడుకోవడమే! ఒక్కనాడు బడికెళ్లిరా! అది నీకే తెలుస్తుంది అక్కడ నీకు బోలెడు మంది జతైతరు’’ అని చెప్పి అవ్వ వీధి కెళ్ళి ఓ పలకా బలపం కొని తెచ్చింది.
అది తీసుకొని వాన్ని రెక్క పట్టుకొని తోలుకపోతూ ‘‘మొదట నిన్ను వీధి బళ్లో వేస్త! అక్కడ ఓనమాలు కాకుడుతం నేర్చుకొని బాల శిక్ష చదివిన తరువాత తీసుకెళ్లి సర్కారు బడిలో వేస్త’’ అని చెప్తు ఆమె వాన్ని బడిదగ్గరకు తెచ్చింది. అదొక చిన్న హనుమదాలయంలో ఉన్నది.


అవ్వ వాన్ని పంతులు గారి కప్పగిస్తు ‘‘ఇగో పంతులు వీడు నాకింకో మనవడు. వీనికి సదువు బాగా సెప్పాలె. పైసలెన్నైనా ఇస్తా’’ అని వాన్నక్కడ కూచో బెట్టి పలకా బలపం యిచ్చి వెళ్ళిపోయింది. పంతులు వాని పేరడిగి పట్టికలో రాసుకొని వానిని ‘‘ఒరేయ్‍ గిరీ నీ పలకిటుతేరా!’’ అని యిప్పించుకొని దానిపై అఆలు పెట్టిచ్చి ఇక్కడ కూచోని వానిని చదువుకుంట దిద్దు అని ఒక విద్యార్థి పక్కన కూచో బెట్టిండు. వాడు వానిని ‘‘అఆ’’ అంటూ దిద్దసాగిండు.
కొంత సేపటికి బువ్వ వేళయింది పంతులు బడి విడిచి అందర్నీ అన్నం తిని రమ్మన్నాడు. పిల్లలందరు లేచి ఇండ్లకు వెళ్ళి పోయిన్రు.
గిరిగాని అక్షరాలు దిద్దుతుంటే అదో తమాషా అనిపించింది. వాడు బువ్వ తిని పలక తీసుకొని మళ్ళీ వచ్చి ఇగో పంతులు నాకివి వచ్చినవి ‘‘అఆ’’ అంటే ఏమిటి కడుపులో అడ్డగీతలుండే రెండు సందమామలే గదా!’’ అని వానిని పలక వెనుక రాసి సూపిండు.
పంతులు వాని తెలివి కాశ్చర్యపడి అందుకే ‘‘చదువుకు ముదురు సాముకు లేత’’ అన్నారు కాని యిప్పటి వారేమో తమ పిల్లల్ని ముడెండ్ల నుంచే చదువులో మురగ బెడుతున్నారనుకొని వాని పలక తీసుకొని ‘‘ఇఈ’’ లు పెట్టిచ్చినాడు.
గిరిగానికి నాలుగు దినాలకే అచ్చులన్ని వచ్చేసినై అవ్వ ఒకనాడు వాని వెంట వచ్చి ‘‘పంతులు మా పిల్లవాని తెలివెట్లా ఉంది’’ అంది. ‘‘ఆ మన పిల్లవానికేమమ్మా ‘చాకు’లాగున్నాడు. బడి ఈడు దాటింది కాబట్టి నా దగ్గర మూడు నెలలు చదివించు. వీన్ని నేను మొదటి తరగతిలో చేర్పిస్తానన్నాడు.’’ అవ్వ అదివిని త•ప్తిగా వెళ్ళింది.
పంతులు గిరిగాని పిలుచుకొని పలుక మీద ‘‘కఖ’’ పెట్టిచ్చి దాన్ని చేతికిచ్చి వానితో ‘‘ఒరేయ్‍ ఏవైనా తొందరగా వస్తే మళ్ళీ తొందరగా నెమరపోనై కాబట్టి వచ్చినవన్ని దినం ఒకసారి రాసి చూపించాలెనని చెప్పిండు.
గిరిగానికి అన్నిటిలాగే ‘‘కఖా’’లు గూడ ఒక పూటకే వచ్చేసినై. పంతులు పెట్టిచ్చిన వానిని బాగా దిద్దిండు గీత వెడల్పై కకారం తలకట్టు చక్కగా అయింది. కాబట్టి వాడు దాన్ని అట్లాగే రాసి చూపిండు. అది చూసి పంతులు వాన్ని దగ్గరగా పిలుచుకొని ‘‘ఒరేయ్‍ నూవ్వీశ్వరుని బొమ్మ ఎప్పుడైనా చూసినావా’’ అన్నడు. ‘‘ఈస్వరుడు అంటే శివుడా!’’ అని వాడడిగిండు. పంతులు అవునన్నాడు. అది విని వాడు ‘‘చూసిన చూసిన ఆయన్నెత్తి మీద సందమాముంటడు. ఆయన బొమ్మ కుష్ణుడి బొమ్మ, లచ్చిం బొమ్మ ఊదు బత్తి పోట్లాల మీద, మైనపు వత్తుల పూడాల మీద మస్తుగుండై’’ అన్నడు.
అది విని పంతులు ‘‘శివుని నెత్తి మీద సందమావుంటడు గదా! అట్లాగే మన అక్షరాల నెత్తి మీద గూడ సందమామనే ఉంటడురా! దాన్నే మనవారు ‘‘తలకట్టు’’ అంటరు. ఆదిట్లా సక్కటి గిరలాగుండదు మన అక్షరాలన్నీ చంద్ర కళలతోనే ఉంటై అన్నడు.


‘‘అయితే తలకట్టండే కడుపున గీతలేని సిన్న సందమామన్న మాట మరి అది రెండో ‘కా’కు లేదేం’’ అన్నడు. పంతులు వీడు గడుగ్గాయే అనుకొని తలకట్టు కొన్నిటికి మాత్రముండదురా’’ అన్నడు. అచ్చుల వలెనే హల్లులు గూడ వాడు పూటకు రెండు చొప్పున నేరుస్తూ పోయి గుణింతంలోనికి వచ్చిండు. గుణింతలో పంతులు గుడి గుడి దీర్ఘం పెట్టించిండు. గిరి గాడది దిద్దుకుంటు ‘‘ఒయి పంతులు కొమ్ములు దేనికైనా నెత్తి మీదుండాలె. ఈ అచ్చరాలకేమ్‍ నీవు తప్పు పెట్టిచ్చివే’’ అన్నాడు. పంతులది విని వీడు నాకే చదువు నేర్పే అట్లూన్నాడని అనుకోని ‘‘కొమ్ములు నెత్తి మీదుంటే అవి పసులైతవిరా! అందుకే అక్షరాలకు పక్కగా ఉంటై అని చెప్పిండు.
గిరిగాడు తన తావు విడిచి రెండు వారాలయింది. అవ్వా వాన్ని కుండి చాయలకు పోనీయలేదు. తమ ఇంటి చుట్టే తిప్పింది కానీ ‘‘ గుడ్ల పెట్ట’’ లాగవాన్ని ఇంట్లో ఎంత కాలం ఉంచుతుంది.
బైట చెత్తకుండి దగ్గర వాని జత పిల్లలు గిరిగాడు ఈ బజారిడిసి అవతలి బజారుకు పోయిండో లేకుంటే అమ్మల దినం నాడు ‘‘పిన్ని’’ వచ్చి తోలుక పోయిందేమొర! అనుకున్నారు.
ఈ రెండు వారాలలో గిరిగాడు కొంత కళదేరిండు. వానికి కొంచెం సంస్కారం గూడ అచ్చింది. తెల్లారి లేవగానే ముఖం కడుక్కోవటం, స్నానం చేయటం, పద్మాసనం పై కూర్చోవటం, సొంతంగా తినటం అలవాటయింది. అప్పుడు అవ్వ ఒకనాడు వాన్ని సంచి పైసలు ఇచ్చి టమాటలు, వంకాయలు, మెంతి కూర తెమ్మని మార్కెటుకు పంపింది. వాడవి తీసుకొని మార్కెటు గేటు దాటినాడు.
సుబ్బడు వానిని చూచి ఎవరో పెద్ద ఇంటి బాబని పైసలాడుక్కోవటానికతని ఎదురుగా వచ్చి మొకం చూసి క్షణం పాటు తెల్ల బోయిండు.
గిరిగాడు రెండు వారాలలో కొంత నేవళీకల తేరిండు.
తరువాత తేరుకొని ‘‘ఒరే అప్పుడు, కొండడు గంగన్న ఎక్కడున్నార్రా! మన పేరీగాడీడనే ఉన్నాడు. రండిరా! రండి!’’ అని కేకేసెవరకు వారంతా ఎక్కడున్నారో బిలబిలమని ఉరికొచ్చి వాణ్ని చూచి డిల్ల పోయిన్రు.
ఈ రెండు వారాలకే వానికి వారిని తాకితే ఎట్లాగో అనిపిస్తుంది.
వాళ్ళు మళ్ళీ కొంచెం సేపటికి తేరుకోని ‘‘ఏమిరా గిరి ఎక్కడున్న ఈ ఏసమేమిటి మేం నిన్ను పిన్ని దగ్గరికి పోయిండు’’ అనుకున్నం.
అది విని వాడు ‘‘ఒరేయ్‍ మనం కుండి దగ్గరున్నప్పుడు ఒకవ్వ చెత్త బకెటు తెచ్చేది ఎర్కేనా’’.
వారది విని ఎర్కే! ఏర్కే అన్నారు.
అమ్మాల దినం నాడు మీరందరూ అమ్మల దగ్గరికి పోయిన్రు గదా! నేనొక్కడినే ఆడకూకొని ఉండగా అవ్వ కుల్లు చల్లటానికి వచ్చి నన్ను చూసి తోలుక పోయి నెత్తికి పోసి స్తానం చేపించి ఈ దిరస్తు యిచ్చిందిరా’’ అనగా
రంగడు ‘‘నూవ్విపుడాడేం చేస్తున్నావు అడిగిండు’’. ‘సదువుకుంటున్న బడికి పోతున్నావా.’
‘‘అవున్రా ఇప్పుడా సదువుకెప్పుడైతే ఎందిరా బడికి పోతే బలేగా ఉంటుందిరా’’ నేను సదువుకుంటానన్న! కాని మాయమ్మ బడికి పోనీయలేదు. పైసలేవ్వరుడుక్కొస్తరని కొట్టింది.
‘అయితే నువ్వింక మాలోనికి రావన్న మాట అన్నడు’.
అప్పుడు ‘వాడు బువ్వకు మరిగిండురా! యింగ మన దగ్గరికెందు కొస్తడు’ అన్నాడు కొండడు.
‘బువ్వ దేముందిరా! ఇప్పుడు మనం తినటం లేదు అయితే ఇది ఎంగిలి కూడు. కానీ ఏ మారాజైన మాత్రం పెడితే మంచి బువ్వనే దొరుకుతది గదా!’
‘బువ్వ గాదిహె! వాడు పైసలకాశ పడ్డడు’ పుల్లన్న అన్నడు.
‘పైసలిప్పుడు మన దగ్గర మాత్రం లేవుర మనకు బువ్వ రొట్టె రెండూకెనే దోరికె ఇంక పైసలెందుకు’ అన్నడు రంగడు.


‘పైసలెందుకేమిట్రా! పైసలోనే పరమాత్మ ఉంది’.
‘ఇయ్యాల మన దగ్గర పైసల్లేవని కాదు. ఒక్కొక్కరి బొంత యిచ్చుతేనా సామి రంగా! ఎన్ని నోట్లు బైటపడుతవో గుర్తేనా!’ అన్నాడు ఎంకడు.
గిరిగాడు వాళ్ళ మాటలన్ని నిశ్శబ్దంగా విని ఇట్లన్నడు. ‘‘ఒరేయి అన్నలు నాకు బువ్వ గాని పైసలు గాని అక్కరలేదు అవి మనమడుక్కుంటే ఎక్కడైనా దొరుకుతై. మనిషికి తన బలమంతా తన కండ్ల ముందుండాలె ఉంటే ఏది లేకున్నా అన్నీ ఉన్నట్లే, అట్లా లేనపుడు అన్నీ ఉన్నా ఏదీ లేనట్లే.’’
అవ్వ కందరున్నారుగాని ఉజ్జోగాలలో తలా ఒకదిక్కు పోయిన్రు. ఇపుడు మనకు అమ్మ అవసరం లేదు గాని ముసలి తనంలో ఆమెకు మనమవసరం. అందుకే నేనిపుడు అవ్వ దగ్గరికి పోతుండ’’ అని అరిచాడు. కూరగాయల సంచి తీసుకొని నడిచిండు.
అమ్మల దినం అంటే మనకు అమ్మ కావలిసిన దినం కాదు. అమ్మకు మనం కావలలిసిన దినం అనిపించింది వానికి.


-డా. కపిలవాయి లింగమూర్తి
87907 2777

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *