కరోనాను కట్టడి చేద్దాం


ఒక్కో శతాబ్దంలో ఒక్కో అంటువ్యాధి మానవాళిని వేధించింది. మిగితా అంటువ్యాధులతో పోలిస్తే కరోనా వైరస్‍ ప్రభావం ముందెన్నడూ ఊహించనిది. సినిమాల్లో, నవలాసాహిత్యంలో ఈ రకమైన వైరస్‍ ప్రస్తావనలు ఉన్నప్పటికీ, అవి నిజమయ్యే అవకాశం ఉందని ఏ దేశ ప్రభుత్వం కూడా ఊహించలేకపోయింది. అందుకే దాదాపుగా అన్ని దేశాల్లోనూ ఈ వైరస్‍ను కట్టడి చేసే చర్యలు తీసుకోవడంలో కొంత అయోమయం నెలకొంది.


ఈ వైరస్‍ ధాటికి మొదట యూరప్‍, ఆ తరువాత అమెరికా అతలాకుతలమైపోయాయి. ఆగ్నేయాసియాలోనూ దీని ప్రభావం అధికంగానే ఉంది. దక్షిణాసియాలో మాత్రం ఇప్పటివరకైతే పరిస్థితి అదుపులోనే ఉంది. కాకపోతే ఏ క్షణంలోనైనా వైరస్‍ విశ్వరూపం ప్రదర్శించవచ్చనే అనుమానాలు ఉన్నాయి.
చైనా, దక్షిణ కొరియా, తైవాన్‍ లాంటి కొన్ని దేశాలు మినహాయిస్తే ఇతర దేశాలేవీ కూడా కరోనాను సమర్థంగా కట్టడి చేయలేకపోయాయి. భారత్‍ సైతం ఈ విషయంలో తగినంత కృషి చేస్తుంది.


ఒక మహమ్మారి వ్యాపించే సందర్భంలో దాన్ని ఎలా కట్టడి చేయాలనే విషయంలో సాధారణంగా ప్రతి దేశం కూడా ముందు నుంచే ఓ ప్రణాళికతో ఉంటుంది. కాకపోతే కరోనాను కట్టడి చేసే వ్యూహం మిగితా వైరస్‍లతో పోలిస్తే భిన్నమైంది.


కరోనా కట్టడికి ప్రభుత్వాలకీ, ప్రజలకీ ఏకీభావంతో కూడిన నిబద్ధత, సంసిద్ధత ముఖ్యం. ప్రభుత్వ ఆదేశాలను, చర్యలను చైతన్యంతో అర్థం చేసుకుని చిత్తశుద్ధితో స్వీయ క్రమశిక్షణను పాటించిన దేశాలు కరోనాని కట్టడి చేయడంలో సఫలీకృతమవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందేమోనన్న భయంతో అమెరికా చివరి క్షణం దాకా కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేసింది.


మొత్తం మీద కరోనా యావత్‍ ప్రపంచానికి ఎన్నో అంశాల్లో మరెన్నో పాఠాలు నేర్పింది. తక్షణ ప్రభావం కలిగే అంశాలపైనే మానవాళి స్పందిస్తుందనే విషయం మరోసారి స్పష్టమైంది. పర్యావరణం, శీతోష్ణస్థితి మార్పులు లాంటి అంశాలపై దశాబ్దాలుగా ఉద్యమకారులు ఎన్ని సూచనలు చేసినా ప్రభుత్వాలు వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాంటిది కరోనా నేపథ్యంలో ఒక్కసారిగా వాహనాల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. దీనితో కాలుష్యస్థాయిలు పడిపోయాయి. అడవి జంతువులకు స్వేచ్ఛ అంటే ఏమిటో తెలిసింది. రాత్రివేళ నింగిలో చుక్కలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు పెరిగాయి. ప్రజలు, ప్రభుత్వాలు తలుచుకుంటే ఏమేం చేయవచ్చో అర్థమైంది. అంతే కాదు… ఒక ఉత్పాతాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలంటే ఏం చేయాలో అర్థమైంది. వివిధ రకాల కష్టాలు ఎలా ఉంటాయో నవతరానికి అర్థమైంది. ప్రపంచరాజకీయాల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
‘బతికుంటే బలుసాకి తిని బతుకొచ్చు. పోయిన ప్రాణాలు తేగలమా’ అన్న కేసీఆర్‍ మాట తోటి మానవాళిపట్ల ఉన్న మానవీయ బాధ్యతకు, ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలకు ప్రేరణగా నిలిచింది. ఈ విపత్కర స్థితిలో ఫెడరల్‍ స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం హర్షనీయం.


ఇవన్నీ సరే…. మనిషి ఆలోచనల్లో సానుకూల మార్పు రానిది మాత్రం ఇలాంటి ఉత్పాతాలను ఎదుర్కోలేము. ఇలాంటివి మరెన్నో చూడాల్సి రావొచ్చు. అలాంటి వాటికి సైతం ఇప్పటి నుంచే శాస్త్రీయమైన పరిశోధనలను, కార్యాచరణలను సిద్ధం చేసుకోవాలి.


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *