ప్రపంచవ్యాప్తంగా 119 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తాగునీటి కొరత సమస్య తీవ్రంగా వుందని స్టాన్‍ఫొర్డ్ యూనివర్సిటీ పరిశోధనలకు సంబంధించిన తాజా అధ్యయనం తెలియజేసింది. ప్రజలకు శుభ్రమైన తాగునీటిని అందించడంలో ఆయా దేశాలు అనేకానేక సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రకృతిసిద్ధమైన నదులు, చెరువులు, సరస్సులు కలుషితం కావడం వల్ల నానాటికీ పరిశుభ్రమైన నీళ్లు దొరికే అవకాశాలు తగ్గిపోతున్నాయి. నీటి సరఫరాకు సంబధించిన విధానాల అమలులో జాప్యం వల్ల సమస్యల తీవ్రత పెరుగుతోంది.
అభివృద్ధి విధానాలకీ, తాగునీటి సరఫరాకీ నడుమ సమ తుల్యం లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. నీటి వనరులు కలుషితం కాకుండా కాపాడుకో వాల్సిన ప్రభుత్వాలు ఈ దిశగా సమగ్ర చర్యలు తీసుకోకపోతే నీటి కొరత మరింత పెరిగే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాగునీటి సమస్య మరింత తీవ్రం కాకముందే జాగ్రత్తలు తీసుకోవాలని వారు చెబుతున్నారు.
తొలుత చెరువులు, నదులు కలుషితం కాకుండా చూసు కోవాలి. ఇప్పటికే కలుషి తమై వుంటే వాటికి గల కారణాల్ని యోచించాలి. ఈ రకమైన ప్రదేశాల్లో నీటిశుద్ధి ప్లాంట్ల వల్ల ఏ మేరకు ప్రయోజనం ఉంటుందో అధ్యయనం చేయాలి. నీటిని శుద్ధి చేసుకుని వాడుకునేందుకు అనువుగా వుంటే వాటిని మరింత కలుషితం కాకుండా కాపాడుకునేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలి.
పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలు నీటిలో కలపడం వల్ల ఏర్పడే కాలుష్యం మరో సమస్య. ఈ సమస్యలకు గల మూలాల్ని గుర్తించాలి. వీటికి ఏ రకమైన పరిష్కారం లభిస్తుందో చూడాలి. కొన్ని రకాల ద్రావకాల వల్ల భూగర్భజలాలు కూడా కలుషిత మవుతాయి. తాగడానికి ఎంతమాత్రం ఉపకరించని స్థితి ఏర్పడు తుంది. బోర్లు వేస్తే నీళ్లు వస్తాయి. కానీ ఆ నీళ్లును తాగడానికి ఉపయోగించలేరు. కొన్నిసార్లు బట్టలు ఉతకడానికి గిన్నెలు కడగ డానికి కూడా ఉపయోగించలేరు. కనుక ఈ రకమైన జలాలు దైనందిన జీవితా నికి ఎంతమాత్రం ఉపకరించవు. అందుకని వీటిని ఏరకంగానూ వాడుకోవడం కుదరదు.
కాలుష్య కారక పరిస్థితులున్నచోట్ల తరుచుగా నీటిని భూమి ఉపరితల జలాల్ని పరీక్షించాలి. ఉపరితల కాలుష్యానికి గల కార ణాలు తెలుసుకోవాలి. మురికినీటి వల్ల ఏర్పడే కలుషితాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి యోచించాలి. మురికి నీరు తీవ్ర స్థాయిలో పొంగిపొర్లే పరిస్థితులు ఏర్పడిన పట్టణాల్లో , నగరాల్లో సమస్య పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రకృతి సిద్ధమైన సరస్సులు, చెరువులు కాలుష్యం కారణంగా దెబ్బ తింటున్నాయి. చేపలు కూడా మనుగడ సాగించలేని రీతిన కాలుష్యం పెరగడం తీవ్రమైన సమస్య. చిలుకా సరస్సు, కొల్లేరు, పులికాట్ సరస్సు వంటివి కాలుష్యం కారణంగా దెబ్బ తింటు న్నాయి. మనదేశంలో ఉన్న అనేక మంచినీటి సరస్సులను కాపాడు కోవాలంటే పర్యావరణంలో పరిస్థితుల్లో మంచి మార్పులు రావాలంటే ప్రభుత్వం చిత్త శుద్ధితో నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి.
కొన్ని రాష్ట్రాల్లో చెరువుల సంఖ్య అధికం. పర్యావరణ కాలుష్యం వల్ల ఆయా చెరువుల్లోని నీళ్లు కలుషితమవుతున్నాయి. కొన్ని పట్టణాల, గ్రామాల తాగునీటి సమస్యని పరిష్కరించగలిగిన చెరువులు ఇవాళ కాలుష్యం బారినపడి కొట్టుమిట్టాడు తున్నాయి. అందువల్ల తీవ్రమైన తాగునీటి సమస్యతో అవస్థపడుతున్నాయి.
నీటి కాలుష్య నివారణకు కట్టుదిట్ట మైన చర్యలు తీసుకోడానికి ముందుగా సమగ్రమైన అధ్యయనాలు జరగాలి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న నదులు, సరస్సులు, చెరువులు పర్యావరణ కాలుష్యానికి ఏ మేరకు అతీతంగా ఉన్నాయో పరిశీలించాలి. సాగునీటికి, తాగు నీటికి ఎంతమేరకు ఉపయోగపడగలవో పరీక్షించాలి. నీటిశుద్ధి ప్లాంట్ల వల్ల ప్రయోజనం ఉంటుందో లేదో చూసుకోవాలి.
ప్రకృతి సిద్ధమైన నీటి వనరుల్ని కాలుష్యం కారణంగా కోల్పోవడం భారీనష్టం. ఈ నష్టాన్ని పూడ్చుకోవడం సాధ్యం కాదు. అందుకని జలవనరుల సంరక్షణలో కచ్చితమైన విధివిధానాలు పాటించాలి. పర్యావరణ సమస్యల్లో తీవ్రమైందిగా నీటికాలుష్యాన్ని పరిగణించాలి. నేటి అవసరాన్ని, భవిష్యత్ తరాల అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలి.
- కట్టా ప్రభాకర్
ఎ : 8106721111