తెలంగాణ చెరువు తీరు – అలుగు దుంకి పారు దేశపతి శ్రీనివాస్‍ పదాల జోరు


తాత తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పాట.
మేనమామల సాలున్న పాట.
కన్నతల్లి ఒడిలో ఊయలూగిన పాట.
పోతన పద్యరత్నాలను పొదువుకున్న పాట.
దాశరథి ఉద్యమగీతాలతో రాగమెత్తిన పాట.
నాగేటిసాల్లల్ల మొలకలెత్తిన పాట.
ప్రజాకవుల పదాలకు ప్రాణంపోసిన పాట.
తెలంగాణ జనజీవితాన్ని కైగట్టిన పాట.
తెలంగాణ సాహిత్యవైభవాన్ని చాటిచెప్పిన పాట.
తెలంగాణ ఉద్యమరథసారథి వెన్నంటి నడిసిన రణ
గీతమీ పాట.
మాట – పాటల మంత్రమీ పాట.
కోట్లాది ప్రజల హృదయ తంత్రమీ పాట.
పోటెత్తిన జనప్రవాహాన్ని అలుగు ఊయలలూపిన పాట.
ఆత్మగల్ల పాట.
ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసిన పాట.
అది దేశపతి శ్రీనివాస్‍ పాట.


పదాల అలుగుదుంకి ప్రవ హించిన ప్రజాకవి గాయకుడు దేశపతి శ్రీనివాస్‍ గురించి నేటి మన ‘అలుగెల్లిన పాట’లో…
మెదక్‍జిల్లా సిద్దిపేటకు చెందిన ప్రముఖ కవిపండితుడు దేశపతి గోపాలకృష్ణ. వీళ్ళ పూర్వీకులది గజ్వేల్‍ సమీపంలోని మునిగడప అయినప్పటికి గోపాలకృష్ణ సిద్దిపేటలోనే స్థిరపడ్డడు. దేశపతి గోపాలకృష్ణ – బాలసరస్వతి దంపతులకు కలిగిన ఇద్దరు సంతానంలో బిడ్డ లలిత, కొడుకు శ్రీనివాస్‍. వీరిలో శ్రీనివాస్‍ 1970 జులై 1న జన్మించిండు. దేశపతి గోపాలకృష్ణ రాసిన ‘మధుశ్రీ’ ఖండకావ్యం ఎంతో ప్రసిద్ధి చెందింది. తెలుగు, ఉర్దూ సాహిత్యంలో మంచి పట్టు సంపాదించిన తండ్రి ఒకవైపు, నిత్యం పాటలు, పద్యాలతో ఇంటిని సంగీతసాగరంలో ముంచే తల్లి ఒకవైపు ఉండడంతో శ్రీనివాస్‍కు చిన్నప్పటి నుంచే సంగీతం, సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగింది.

శ్రీనివాస్‍ మేనమామలు, తాతలు అందరు మంచి సంస్కృతపండితులు. తల్లి బాలసరస్వతి పూజా సమయంలో ‘‘మందార మకరంద మాధుర్యములు దేలు’’ వంటి పోతన పద్యాలు, కీర్తనలు భక్తితో ఆలపించేది. ‘గజేంద్రమోక్షం, రుక్మిణీపారాయణం’ వంటివి లయబద్ధంగ చదివి వినిపిస్తుండేది. దీంతో శ్రీనివాస్‍కు చిన్నప్పుడే పద్యాలు పాడడం అలవాటైంది. పాఠశాల స్థాయిలో ఎన్నో బహుమతులు సాధించిండు.


తల్లి సాహిత్యాభిలాష శ్రీనివాస్‍ వ్యక్తిత్వంలోను, జీవితంలోను అంతులేని ప్రభావాన్ని చూపింది. ఒకసారి స్కూల్‍డే కార్యక్రమానికి అతిధిగా వచ్చిన కేసీఆర్‍, ఎక్కువ బహుమతులు పొందిన శ్రీనివాస్‍ను చూసి చిరునవ్వుతో ప్రశంసించిన ఆ మాటల స్ఫూర్తితో పాటు, ప్రసిద్ద చిత్రకారుడు కాపు రాజయ్య బొమ్మల ప్రభావం శ్రీనివాస్‍ మీద ఎంతగానో ఉంటది. అదేవిధంగ వేముగంటి నరసింహాచార్యులు ఇంట్లో గల ప్రసిద్ధ కవుల ఫోటోలు, ఆయన పద్యాలు శ్రీనివాస్‍ని సాహిత్యం వైపుకు ప్రేరేపించినయి. ముఖ్యంగ ఇంటిముందున్న శ్రీరాముని గుడిలో నిత్యం జరిగే ‘హరికథా గానాలు, భజనకీర్తనలు ఆయనను అమితంగా ఆకర్శించి, అనుకరించే టట్టు చేసినయ్‍. తాళానికి తగ్గట్టుగా పాడడం, అభినయించడం అలవాటైంది. ఏకపాత్రాభి నయాలు చేసి అందరిచేత శభాష్‍ అనిపించుకుంటడు.


దేశపతి శ్రీనివాస్‍ ప్రాథమిక విద్యాభ్యాసం మొదలు డిగ్రీ వరకు సిద్ధిపేట లోనే చదువుకుండు. డిగ్రీ చేసే సమయంలోనే ఆయనకు సాహిత్యంతో పాటు, సామాజిక దృష్టి ఏర్పడింది. 1988లో మంజీర రచయితల సంఘంలో సభ్యుడు కావడం వల్ల ప్రముఖ కవి నందిని సిధారెడ్డితో పాటు ఇతర కవులు, ఉద్యమకారులతో సాన్నిహిత్యం పెరిగింది. నాటక ప్రదర్శనలు, పద్యాలు, పాటలు పాడడంలోను శ్రీనివాస్‍ పేరు సిద్ధిపేటంత మార్మోగింది. 1991 ప్రాంతంలో సంగారెడ్డిలో నిర్వహించిన తెలంగాణ స్థాయి నాటకపోటీలలో పాల్గొని ఉత్తమ హాస్యనటుడి అవార్డును సాధించిండు. ఆ తర్వాత ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్‍ చనిపోయినపుడు సిద్ధిపేటలో ‘గోగ్రహణం’ నాటికను ప్రదర్శించి ఆ కుటుంబానికి ఐదువేల ఆర్థికసాయాన్ని అందజేసిండ్రు. అదే సమయంలో వెల్లువెత్తిన సారా వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలికిండు. కవిత్వం, పాటలు, నాటికలతో సామాజిక చైతన్యం కోసం ఉద్యమించిండు. ఇందులో భాగంగానే ‘‘గెలిచితీరాలి’’ అనే నాటికను సిధారెడ్డితో కలిసి రూపాందించి, అనేకచోట్ల ప్రదర్శించిండ్రు.


డిగ్రీ పూర్తి చేసిన దేశపతి శ్రీనివాస్‍ ‘కాంప్రిహెన్సివ్‍ కాలేజ్‍ ఆఫ్‍ ఎడ్యుకేషన్‍’’లో భాషాపండిట్‍గా ట్రైనింగ్‍ చేసిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ తీసుకుండు. అనతికాలంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. చిన్నకోడూరులో తెలుగు ఉపాధ్యాయుడిగా చేరిండు. మార్కుల కోసం కాకుండ మార్పుకోసం పాఠాలు బోధించిండు. పద్యాలు వినసొంపుగా పాడి పిల్లల్ని ఆకట్టుకుండు. అప్పటికప్పుడు ఆశువుగా పాటలు కైగట్టి తరగతిగదిలో కళాకారుడిగా హావభావ ప్రదర్శనలతో విద్యార్థులచేత పాడించిన పాట
‘‘అందచందాలతో అలరారు పట్నము
సిద్దిపేట సుట్టుముట్టు పల్లెల్లోన
సిరులొలుకు సింగారము మా ఊరు
సిన్నకోడూరు గ్రామము
అందాల గోనెపల్లి ఘనమైన పోద్దాటి తాళ్ళతల్లి’’ అంటూ అన్ని గ్రామాలను, వ్యక్తుల విశిష్టతలను తనపా•లో చేర్చి పిల్లలకు నేర్పించడంతో వాళ్ళు ఆనందంగా పాడుకునేది. పాటలో ఊరు పేరును విన్న విద్యార్థులు చెప్పలేని ఆనందంతో పొంగిపోయేది. ఊరు గొప్పతనాన్ని పాడుకుంటూ మురిసిపోయేది. దేశపతి శ్రీనివాస్‍ 1991లో సునీతను వివాహం చేసుకుండు. దేశపతి శ్రీనివాస్‍ – సునీత దంపతులకు సాహితి అనే కూతురు, బాలార్క అనే కొడుకు ఉన్నారు. దేశపతి శ్రీనివాస్‍ 1992లో ‘‘రూపాయి పారుతున్న దేహం’’ కవిత ఆంధప్రభ ఆదివారం సంచికలో ప్రచురించబడింది. భూమ్మీద డబ్బు మనుషులు తప్ప, మానవ విలువలు మంటగలిసిపోతున్నయనే కోణంలో వినూత్నంగ రాసిన ఈ కవిత ఎందరినో ఆలోచింప జేసింది. సాహితీ విమర్శకుల ప్రశంశలు పొందింది. ఇట్ల దేశపతి శ్రీనివాస్‍ రాసిన కవితలు ఆయా పత్రికల్లోను, ఇతర కవితా సంకలనాలలోను ప్రచురించ బడినవి. ఆ తర్వాత 1994లో దేశపతి శ్రీనివాస్‍ ‘బంధీకాని కవిత’లో
‘‘మా శిరస్సుల్ని తెగవేద్దామని కత్తినెత్తావు నువ్వు
మా చూపుల జీవనదులు తాకి
కత్తికి కూడ శిరస్సు మొలుస్తున్నది
బలిచక్రవర్తి తల భూమిని చీల్చుకొని పునరుద్భవిస్తున్నది
ఇనుప పాదం పాతాళానికి పూడుకుపోవటం స్పష్టంగా కనపడుతోందా’’ అంటూ జైళ్ళో ఖైదీలు నిరాహార దీక్షలకు మద్దతుగా తన ధిక్కారస్వరాన్ని వినిపిస్తడు.

మంచి గుర్తింపు పొందిన ఈ కవిత దేశపతి శ్రీనివాస్‍ను కవిగా నిలబెట్టింది. ఇదే కవితను ఎన్‍. వేణుగోపాల్‍ ఆంగ్లంలోకి అనువదించిండు. మంజీర రచయితల్లో ఒకడైన దేశపతి శ్రీనివాస్‍ ఆలోచన విప్లవాత్మకమైంది. ఆయన పనిచేసే పాఠశాల విద్యార్థుల పేదరికాన్ని చూసి తల్లడిల్లిండు. తెలంగాణలో ఇన్ని కుటుంబాలు ఇంత దుర్భర పరిస్థితులలో బతకడానికి కారణం ఎవరనే ప్రశ్న తొలిచివేసింది. సమైక్యపాలకుల వివక్షపూరిత విధానమే దీనంతటికి కారణమని గ్రహిస్తడు. మంజీర రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడం మొదలుపెడతడు. ఉపాధ్యాయ వృత్తి నుంచి తెలంగాణ ఉద్యమం వైపుకు అడుగులు వేసిండు. 1996 నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి పాటై ప్రవహించిండు. తనదైన శైలిలో పదాలల్లి సభలను రక్తి కట్టించిండు. ఈ క్రమంలో దాశరథి రాసిన ‘‘ఆ చల్లని సముద్ర గర్భం దాసిన బడబాణలమెంతో… అనే పాట దేశపతిని వెంటాడింది. ముఖ్యంగా పాట చివరి చరణం
‘‘అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదురకనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో..’’ వంటి పదాలు దేశపతికి కంటిమీద కునుకులేకుండ చేసినయి. దాశరథి కలగన్న సమాజాన్ని కనీసం ఊహించ గలమా అనే ప్రశ్న పదేపదే వేధించింది. సాహిత్యసభలలో మాటల నడుమ ఈ పాటందుకొని సభను ఒక్కసారిగ అంతులేని ఉద్వేగానికి గురిచేస్తడు. తనకున్న వాక్పటిమతో గేయచాతుర్యంతో శ్రోతల గుండెల్ని గాయపరుస్తడు.


‘‘మూగబోయిన కోటితమ్ముల గళాల పాట పలికించె కవితా జవమ్ము గూర్చి / నా కలానికి బలమిచ్చి నడుపునట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ అన్న దాశరథి పదాలతో దేశపతి గళగర్జన చేస్తడు. దిక్కులు పిక్కటిల్లి సభాప్రాంగణాలు దద్దరిల్లేది. ‘‘కదనాన విప్లవ కాహళిని పూరించి / కమ్మ తెనుగున తేట కావ్యాలు రచియించే/ పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు దీర్చెరా’’ అంటూ తెలంగాణ సాహిత్య ఘనతను తొవ్విపోస్తడు. రావెళ్ళ పాటలోని పౌరుషానికి కొత్త మెరుపులద్దుతడు. సుద్దాల అశోకతేజ రాసిన ‘‘పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది / పనినొక సంస్కృతి జేసిన ఘనత కష్టజీవిది’’ అన్న పాటను అనేకసార్లు పాడి శ్రమ సంస్కృతిని గానం చేసిండు. అందెశ్రీ ‘‘తలమీద సుట్టబట్ట ఆ పైన పండ్లతట్ట’’ అనే పాట, గోరటి వెంకన్న ‘‘పల్లెకన్నీరు, మందెంట బోతండె యలమంద’ వంటి పాటలు పాడి తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేసిండు. ఇదే క్రమంలో తాను పాటలు రాసిండు. వచన కవిత్వంతోను చురకలు అంటించిండు. ప్రజాకవుల కవిత్వాన్ని, పాటలను ప్రచారంలోకి తెచ్చిండు. భాషకు, బతుక్కు ఉన్న సంబంధాన్ని కొత్తతరానికి అందించే అద్భుతమైన పాత్రను నిర్వర్తించిండు.
సభలు, సమావేశాలు, పాటలతో మార్మోగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని చూసి వెన్నులో ఒణుకుపుట్టిన వలసపాలకులు ఉద్యమాన్ని అణిచివేసే కుట్రలు చేసిండ్రు. హక్కులకోసం కొట్లాడేవాళ్ళను అంతం చేసిండ్రు. ఈ క్రమంలోనే దేశపతి శ్రీనివాస్‍ ‘‘పాలమూరు మట్టిబిడ్డ పురుషోత్తము / పౌరహక్కుల పోరుకు ప్రాణం పురుషోత్తము’’ అంటూ రాసిన పాట ఒక సంచలనాన్ని సృష్టించింది. పాట పల్లెపల్లెన ప్రతిధ్వనించింది. ఆజం అలీని స్మరిస్తూ ‘‘గూటిలోన కూసె ఓ గువ్వ పిట్ట / మా అన్న ఆజాము జాడ తెలిసిందా’’ అంటూ వేదనాభరితస్వరంతో పాడుతడు. బెల్లి లలితను చూసి తల్లఢిల్లిన దేశపతి ‘‘కత్తిమీది నెత్తురు చుక్క / ముల్లు మీది వానచుక్క’’ అంటూ ధీర వనితల పౌరుషాన్ని గానం చేస్తడు. మొక్కవోని దీక్షతో ఒక్కో అడుగు ముందుకే పయనించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాటలు ఒక దుమారం రేపినయి. తెలంగాణ ఆకాంక్షను బలోపేతం చేసినయి. గద్దర్‍, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, అందెశ్రీ, నందిని సిధారెడ్డి వంటి కవులు తమ పాటలతో పోరాట విత్తనాలు వెదజల్లిండ్రు. అమరులను స్మరిస్తూ నందిని సిధారెడ్డి రాసిన ‘అమరులకు జోహార్‍’ పాట గాని, ‘నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ’ పాట గాని దేశపతి శ్రీనివాస్‍ గొంతులో ఝంఝా మారుతమై పల్లెపల్లెను చుట్టుకొచ్చింది. దీనికితోడు వరవర రావు, కే.శ్రీనివాస్‍, హరగోపాల్‍ వంటి వాళ్ళ ప్రసంగాలు వినడంతో పాటు వాళ్ళతో కలిసి నడిసే అవకాశం దొరికింది. దీంతో దేశపతి తన పదునెక్కిన మాటలతో వలసపాలకులను చీల్చి చెండాడిండు. వీరితో పాటు ప్రొఫెసర్‍ జయశంకర్‍ సార్‍, ప్రొఫెసర్‍ కోదండరాం, సిధారెడ్డిలతో కలిసి సుదూర తీరాలు కలిసి నడవడంతో దేశపతి వక్తగా మరింత రాటు దేలిండు. దేశపతి శ్రీనివాస్‍ కట్టలు తెగిన భావావేశంతో స్వయంగా ఎన్నో పాటలు రాసిండు. వట్టికోట ఆళ్వారు స్వామి మీద దేశపతి
‘‘వందనాలు ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారు
పలుకుతోంది తెలంగాణ పిడికిలెత్తి జోహారు
కన్నతల్లి కడుపులోన కల ఏదో కన్నావు
ఉద్యమాల ఉగ్గుబువ్వ చిన్ననాడే తిన్నావు
బతుకుపోరులోన జనం వెతల హొరు విన్నావు’’ అంటూ గానం చేస్తడు. తెలంగాణ ఉద్యమం దేశపతిని తనలోకి తనను తొంగి చూసుకునేటట్టు చేసింది. బువ్వ, గంజి, గట్క వంటి ఎన్నో పదాలను వాడుకలోకి తెచ్చిండ్రు. తెలంగాణ సోయిని కలిగించిండ్రు. ఈ దశలోనే కేసీఆర్‍ టి.ఆర్‍.ఎస్‍. పార్టీని స్థాపించడంతో ఉద్యమానికి వెయ్యి ఏనుగుల బలమొచ్చింది. ఆ తర్వాత ఏర్పడిన ‘తెలంగాణ రచయితల వేదిక’, ‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ ఏర్పాటులోను దేశపతి శ్రీనివాస్‍ కీలకభూమికను పోషించిండు. తెలంగాణ అగ్రనాయకులు, ఉద్యమకారులందరితోను కలిసి పనిచేసిండు. నటుడిగా, కవిగా, గాయకుడిగా, ఉపన్యాసకుడిగా అనేక రూపాలలో తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిండు. హరికథాగానం చేసినట్టు తెలంగాణ గోస అందరికి అర్థమయ్యే పదాలతో
ఉపన్యసిస్తడు. తన పాటలు ప్రసంగాలతో దేశపతి శ్రీనివాస్‍ క్రమంగా కేసీఆర్‍కు దగ్గరైండు. దేశపతి, కేసీఆర్‍తో చర్చిస్తూ రాసిన పాటలు అనేకం ఉన్నయి. ప్రజాకవుల పాటలను చాలావరకు కేసీఆర్‍ దగ్గరుండి సరిచూసుకుంటడు. ఈ క్రమంలోనే చాలా పాటల్లో అనేక మార్పులు చేర్పులు చేస్తరు. ఎక్కడ విషయం చెడకుండ చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగ చెప్పుకొస్తడు. కేసీఆర్‍తో కలిసి దేశపతి శ్రీనివాస్‍ చరణాలకు చరణాలు తిరిగి రాసిన పాటలు అనేకం ఉన్నాయి.


రసమయి బాలకిషన్‍ రూపొందించిన ‘‘పల్లెనీకు వంద నాలమ్మ’’ పాటల సీడిలో దేశపతి శ్రీనివాస్‍ కులవృత్తుల మీద ‘‘వందనాలు వంద నాలు వందనాలమ్మ
పల్లెపూచిన తోట పూలకు వందనాలమ్మా’’
అంటూ రాసిన పాట ఎంతో ప్రజాదరణ పొందింది. తెలంగాణ రాష్ట్రసాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని అసువులుబాస్తున్న అమరులను తల్చుకొని కన్నీటి పర్యంత మైతడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హృదయవిదారకంగ చనిపోయిన వేణు గోపాల్‍రెడ్డిని గురించి దేశపతి శ్రీనివాస్‍
‘‘ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాల్‍రెడ్డి / ఉడికిందా నీ నెత్తురు వేణుగోపాల్‍ రెడ్డి’’ అంటూ వీరులత్యాగాన్ని గానం చేస్తడు. ఈ పాటతో మొత్తం విద్యార్థి లోకాన్ని ఏకం చేస్తడు. ఆత్మహత్యలు పరిష్కారం కాదనే సందేశాన్నిస్తడు. అంతిమయాత్రలో అక్షరనివాళులు అర్పిస్తడు. అమరుల త్యాగాలను కీర్తిస్తడు. ఇట్ల ప్రతి సందర్భంలోను తెలంగాణ ప్రజల బాధలు, కన్నీళ్ళను అక్షరీకరించి అరుదైన పాటగా మలుస్తడు. ఉద్యమకవిగా, గాయకుడిగా అత్యంత ప్రజాదరణ పొందిన దేశపతి అంత ఈ మట్టి గొప్పతనమని అంటడు. తెలంగాణ అంటెనే ఒక సామూహిక గాన సంస్కృతి గల విశిష్టమైన ప్రాంతమని, అందుకే ఇక్కడ పాట ప్రవహిస్తుందని అంటడు. నిజానికి బలమైన జానపద ముద్ర కలిగిన ఇక్కడి ప్రతిమాటలోను పాటే ధ్వనిస్తది. ప్రతిమనిషికి పదాలతో సంలీనం చెందే తాదాత్మ్యక గుణం ఉంటది. విప్లవాల పురిటిగడ్డ పౌరుషాన్ని, వీరత్వాన్ని గానం చేస్తడు. ఈ నేల గొప్పతనాన్ని ఆవిష్కరించి, సమైక్యపాలకుల వివక్షపూరిత విధానాన్ని ఎండగడుతూ దేశపతి శ్రీనివాస్‍ గంటల తరబడి ప్రసంగిస్తడు. అప్పటి కప్పుడు ఆశువుగా పాడి, లక్షలాదిమందిని ఉర్రూత లూగించిన ఘనత దేశపతి శ్రీనివాస్‍ది. సుదీర్ఘ తెలంగాణ
ఉద్యమంలో హింసకు తావు లేకుండ శాంతియుతమార్గంలో పయణించే నేర్పును కలిగించింది పాట. తాను స్వయంగా పాటలు రాయడంతో పాటు ఇతర కవుల పాటలను అర్థవంతంగాను, సందర్భాను సారంగాను సంధిస్తడు.


ముల్కీఉద్యమం మొదలు తెలంగాణ సిద్దాంతాన్ని భుజాని కెత్తుకొని అలుపులేకుండ తిరిగిన పోరాట బాటసారి ప్రొఫెసర్‍ జయశంకర్‍ సార్‍. ఒక్కమాటలో చెప్పాలంటే జయశంకర్‍ సార్‍ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు. అంతగా పరితపించి, నిత్యం తెలంగాణను స్వప్నించిన మహనీయుడు ప్రొఫెసర్‍ జయశంకర్‍ సార్‍ను తల్చుకుంటూ దేశపతి శ్రీనివాస్‍
‘‘తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు
అలుగు దుంకి పారు పదునైన మాట జోరు’’ రాసిన ఈ పాట జయశంకర్‍ సార్‍ ఆత్మను ఆవిష్కరించినట్టుంటది. స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరమిదని, సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయణమని, చెరవీడే సమయం చేరువలో ఉందనే ధీమాని వ్యక్తం చేస్తడు. అతిసాధారణ పదాలలో బరువైన భావాన్ని పలికిస్తడు.


కొంతకాలం మంజీర రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన దేశపతి శ్రీనివాస్‍ 2014లో ‘తెలంగాణ వికాస సమితి’ని ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టిండు. ‘‘కవిదృశ్యం’’ పేరిట కొందరి కవుల కవిత్వ పఠనాన్ని చిత్రీకరించి, రికార్డు చేసిండు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో తనదైన పాత్ర పోషించిండు. దేశపతి శ్రీనివాస్‍ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఓ.ఎస్‍.డిగా పనిచేస్తున్నాడు. అనంతరం అమెరికాలో ‘టాటా’ వారి సభలకు హాజరై ప్రభుత్వ విధానాన్ని, సంక్షేమ పథకాల అమలుతీరును వివరించి తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని చాటిచెప్పుతడు. దేశపతి శ్రీనివాస్‍ ‘‘తెలంగాణ సాహిత్య చరిత్ర’’ను అనేక పాటల సమాహారంగ అల్లుకుపోతడు. ‘‘జయజయోస్తు తెలంగాణ’’ పేరుతో పుస్తకంగ ప్రచురించిండు. పద్దెనిమిది పాటలతో కూడిన ఈ కథాగేయాలను కళాకృష్ణ గొప్ప నృత్యరూపకంగ తయారు చేసిండు.


‘‘అదిగదిగో అక్షర ఝటాఝూటి దేశీయ పదగతుల దివ్య కవితార్భటి
పద్యమై గద్యమై విశ్వేషువేజ్యమై ఏలలై కోలలై పరమేశు లీలలై
ఎగిసింది ఎగిసింది కావ్యరసగంగ పాల్కురికి సోమన్న హృదయముప్పొంగ’’ అంటూ సొగసైన దేశీ కవిత్వాన్ని గురించి కోలాట పాటందుకుంటడు. జానుతెనుగు పద్యాల జాడ చూపిస్తడు. అక్షరాల విల్లంబులను సంధించిన ద్విపదను పాడి దిగంతాలను తట్టి లేపుతడు. పామర చరితకు మించి పావనమైనదేముందని అంటడు.
మహాకవుల పరంపరగా కొనసాగుతున్న సాహిత్యవనంలో విహరిస్తడు.


‘‘తొలితెలుగు కవయిత్రి కుప్పాంబిక / ఆమె గోనబుద్దారెడ్డి ప్రియపుత్రిక’’ అంటూ లయబద్దంగ పాటందుకుంటడు.
‘‘తెలంగాణను మేల్కొలిపిన తొలి వేకువ వికాసం / సాహితీ గగనాన స్వాభిమాన ప్రకాశం సురవరం సురవరం ఆధునిక యుగస్వరం / సురవరం ప్రతాపరెడ్డి సారస్వత గిరిశిఖరం’’ అంటూ మరెవ్వరు సురవరం గురించి చెప్పినా ఒక అక్షరం తక్కువే అయితది. అంత బలమైన పదాలతో సురవరాన్ని బంధించిన దేశపతి నిజంగా సరస్వతీపుత్రుడే. మామూలు కవులకు సాధ్యం కాని భాషాపాండిత్యం దేశపతి సొంతం. ‘‘అన్యాయాన్నె దిరిస్తే నాగొడవకు ముక్తి ప్రాప్తి’’ అన్న కాళోజీ గురించి దేశపతి శ్రీనివాస్‍ తనదైన శైలిలో ‘‘అక్షరాలు పోటెత్తె ప్రజాహృదయ ఘోష / కాళోజీ కవిత పలికె కన్నీటి భాష’’ అంటూ కాళోజీలోని మానవీయకోణాన్ని పట్టుకుంటడు. ఆ మహాకవి కలగన్న సమాజం అవతరించాలని ఆకాంక్షిస్తడు. ‘‘మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించే కవితా జవమ్మునన్‍’’ అన్న దాశరథిని గురించి ‘‘జ్యోతనివే దాశరథి కవితామృత వార్నిధి / బడుగుజీవి కళ్ళలోని బడబాగ్నుల ప్రతినిధి’’ అంటడు. బడుగు బలహీనుల పక్షం వహించిన దాశరథి కవితామృత ధారల్ని మనకు అందిస్తడు.


బండి యాదగిరి వేసిన బాట ఆగిపోదు సుద్దాల హనుమంతు పాట మూగబోదు’’ అంటూ శాసనం చేస్తడు. తెలుగు సినీ వినీలాకాశంలో ధృవతారగా నిలిసిన తెలంగాణ ముద్దుబిడ్డ డా. సి. నారాయణరెడ్డిని గురించి దేశపతి శ్రీనివాస్‍ అద్భుతంగ రాస్తడు. తెలుగుకు జ్ఞానపీఠాన్ని అందించిన మహాకవిని గురించి
‘‘సినారె మన సినారె / వెండితెరను వెలిగించిన పల్లె మట్టిపాట పగలే వెన్నెల కురిసిన పరిమళాల పూదోట’’ అంటూ మొత్తం సినారె సినీసాహిత్యాన్ని ఒక్కమాటలో చెప్పుతడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగ దేశపతి శ్రీనివాస్‍ సాహొరే అంటూ రాసిన


‘‘నేల పులకరించె ఆ నింగి పరవశించె సంబురాల తెలంగాణ సింగిడోలె మెరిసె
వానజల్లు కురిసె బీడుభూమి తడిసె పంటచేల గట్లమీద పాలపిట్టెలెగిసే’’ అంటూ ముఖ్యమంత్రి కలువకుంట్ల చంద్రశేఖర్‍ రావు పాలనలో పరవశిస్తున్న తెలంగాణ పల్లెను కండ్లార చూసుకొని పొంగిపోతడు. పదాలపూలు బేర్చి బతుకమ్మ పండుగై, పాటల సింగిడై నడిసిపోతడు. మానవీయ సమాజం కోసం తన మాట పాటల యాత్ర నిరంతరం కొనసాగుతూనే ఉంటదని ప్రకటించిన దేశపతి శ్రీనివాస్‍కు పాటాభివందనాలు.


అంబటి వేకువ,
ఎ: 94927 55448

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *