ముప్పై ఏళ్ల నా జర్నలిజం జీవితంలో సగభాగం హైదరాబాద్ నగరంపైనే రిపోర్టింగ్ చేశాను. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆరేళ్లపాటు హైదరాబాద్ రిపోర్టింగ్ బ్యూరో ఛీప్‍గా పనిచేశాను. ఈ సమయంలో హైదరాబాద్ నగర చరిత్రను విభిన్న కోణాల్లో ‘వార్త’ దినపత్రిలో ప్రత్యేక కథనాలుగా మలిచాము. అప్పుడే హైదరాబాద్ చరిత్రపై నాకు మక్కువ పెరిగింది. పుస్తకాలుగా తీసుకురావాలని అనుకున్నాను.
శాసనసభ పరిధిని ఎంచుకోవడానిగల కారణం?
ఇంగ్లీష్, ఉర్దూలలో హైదరాబాద్‍పై వెయ్యికిపైగా పుస్తకాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలుగులో కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా ఎక్కువగా కుతుబ్‍షాషి, అసబ్‍షాషిల పాలన, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారవ్యవహారాలకు సంబంధించి నవలలు, కధలు, వ్యాసాలుగా వచ్చాయి. తెలంగాణ చరిత్ర ధ్వంసంపై ఎక్కువగా పుస్తకాలు వెలువడ్డాయి. శాసనసభ పరిధిని తీసుకోవడం వల్ల అక్కడి ప్రాంతీయత, చరిత్ర రూపురేఖలను విశ్లేషించడానికి అవకాశముంటుంది. అంబర్‍మియా అనే సూఫీ ప్రవక్త పేరు మీద అంబర్‍పేట ఏర్పడింది. ఈ అంబర్‍మియా గురించి ఏ చరిత్ర పుస్తకంలో కూడా లేదు. అంబర్‍పేట మీద పుస్తకం తీసుకురావడం వల్ల అంబర్‍మియా గొప్పతనం, ఈ ప్రాంత విశిష్టత వెలుగులోకి తీసుకురాగలిగాము. అంబర్‍మియా వంటి వ్యక్తులు ఇతరత్రా శాసనసభ పరిధిలో ఎందరో ఉంటారు. అలాంటివారు వెలుగులోకి రావాలని, చరిత్రలో వారికి చోటు కల్పించాలనేది నా ప్రధాన ఆశయం.
ఈ తరహాలో మరిన్ని పుస్తకాలు తీసుకువచ్చే ఆలోచన ఉందా?
తెలంగాణ సమగ్ర చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి శాసనసభ పరిధితో కూడిన పుస్తకాలు రావలసిన అవసరముందని బలంగా విశ్వసిస్తున్నాను. తెలంగాణలోని 119 నియోజకవర్గాలపై చారిత్రాత్మక వాస్తవ కథనాలతో కూడుకున్న పుస్తకాలు రావాలి. ఇవన్నీ ‘ఎన్‍సైక్లోపిడియా’లా ఉండాలి. హైదరాబాద్‍లోని శాసనసభ నియోజకవర్గాలలో వీలైనంత మేరకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నాను. ఆయా నియోజకవర్గాల ప్రతినిధులను కలసి అంబర్‍పేట పుస్తకాన్ని చూపిస్తున్నాను. మంచి ప్రయత్నంగా వారు అభినందిస్తున్నారు.
అంబర్‍పేట పుస్తకం తీసుకురావడంలో ఇబ్బందులు ఏవేనా…
ఈ పుస్తకం ఓ ప్రయోగంగా మొదలుపెట్టాను. చాలా రిలాక్స్గా పనిచేసుకుంటూ పోయాను. కాల పరిమితిని పెట్టుకోకుండా ముందుకుసాగాను. మధ్యలో కొంతకాలం ఓ హెల్త్ టీవీ ఛానల్‍లో పని చేశాను. మరికొంతకాలం ఓ దినపత్రికలో పనిచేశాను. వీటన్నింటినీ వదిలి సీరియస్‍గా పనిచేసుకుంటూ పోయాను. పాతతరం వ్యక్తులను కలుసుకుంటున్నప్పుడల్లా కొత్త విషయాలు తెలిసేవి. ఇవన్నీ క్రోడికరించుకుంటూ ముందుకుసాగాను. రెండు వందల పేజీల పుస్తకం సిద్దమయింది. దీన్ని కమర్షియల్‍గా తీసుకురావాలని, అప్పుడే ప్రజలకు చేరుతుందని భావించాను. ప్రకటనల ద్వారా ఆర్ధికపరిపుష్టి చేకూరింది. నేను అనుకున్న లక్ష్యం నెరవేరింది.
ఈ పుస్తకం ద్వారా మీరు ఆశిస్తున్న ప్రయోజనాలేమిటీ?
చరిత్రను ప్రేమించే నాలాంటి వారు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వీరంతా తమ తమ స్థానిక శాసనసభ పరిధిని ఎంచుకుని ఇలాంటి పుస్తకాలను తీసుకురాగలిగితే సమగ్రమైన తెలంగాణ చరిత్రను ముందుతరాలకు అందించినవాళ్లమవుతాము. చరిత్ర వక్రీకరణకు గురయ్యే అవకాశం కూడా ఉండదు. తెలంగాణ ప్రభుత్వం ముందుకువచ్చి చరిత్రకారులను ప్రోత్సహించాలి. ఈమేరకు తెలంగాణ సాహిత్య అకాడమీ సమగ్రమైన ప్రణాళికను రూపొందించ వలసిన అవసరముంది.
- సచిన్, ఎ : 9030 6262 88