దేశంలో విలువైన విద్యా విధానం రావాలి : చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍


క్లాస్‍రూమ్‍కే విద్య పరిమితం కాకూడదు..

దేశాభివృద్ధికి నాణ్యమైన విద్య ఎంతో అవసరమని, మంచి విద్యా విధానంతోనే సమాజంలో గుణాత్మకమైన మార్పు వస్తుందని చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍, బాలచెలిమి సంపాదకులు మణికొండ వేదకుమార్‍ పేర్కొన్నారు. బాలచెలిమి పిల్లల వికాస పత్రిక ఆధ్వర్యంలో బాలచెలిమి ప్రచురించిన హైదరాబాద్‍ బడి పిల్లల కథలు ఆవిష్కరణ సభ సీతాఫల్‍మండిలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో జరిగింది. సీహెచ్‍.మల్లేశం అధ్యక్షత వహించిన ఈ సభలో ముఖ్య అతిథిగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍, విశిష్ట అతిథిగా ఎన్‍బీటీ చైర్మన్‍ పత్తిపాక మోహన్‍, శ్యామల్‍రాజ్‍, కేంద్ర బాలసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ పాల్గొన్నారు.


క్లాస్‍రూమ్‍కే విద్య పరిమితం కావద్దు: చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍
క్లాస్‍రూమ్‍కే విద్య పరిమితం కాకూడదని మణికొండ వేదకుమార్‍ పేర్కొన్నారు. పరీక్ష విధానంలో ప్రశ్నలకు జవాబులు రాయడం, మార్కులు తెచ్చు కోవడం తర్వాత ఎంసెట్‍కు వెళ్లడమే ఎక్కువగా జరుగుతుందన్నారు. అందరూ ఇంజినీరింగ్‍, డాక్టర్లే అయితే చదువు ఎవరు చెప్పాలన్నారు. ఎంసెట్‍లకే పరిమితమైన విద్యా విధానం నుండి మనం బయట పడాల్సిన అవసరం ఉందన్నారు. తమ చిన్నతనంలో లైబ్రరీకి వెళ్లి చదువుకున్నామని, ఆ కాలంలో పాఠశాల నుండి ఇంటికి రాగానే ఆటలు బాగా ఆడుకున్నట్లు తెలిపారు. ఇతర పిల్లలతో మాట్లాడుకునే పద్ధతి క్రమంగా తగ్గిపోయిందన్నారు. పిల్లలను మిషన్‍లుగా తయారు చేసి సమాజానికి పంపిస్తే వాళ్లు సమాజంలో ఎలా జీవిస్తారన్నారు. చిన్నప్పటి నుండే సమాజంతో కలిసి జీవించడం అనేది చాలా ముఖ్యం అన్నారు. పోటీ ప్రపంచంలో పిల్లలను ఆడిపించే సమయం కూడా తల్లిదండ్రులకు లేదన్నారు.


ఇంటర్‍నేషనల్‍ ఫిల్మ్ ఫెస్టివల్‍లో తాను 15 దేశాలు తిరిగానని, ఆయా దేశాల్లో ఎన్నో అద్భుతమైన పుస్తకాలను ప్రభుత్వమే ప్రచురించి అందజేసినట్లు తెలిపారు. అన్ని రకాల పిల్లల పుస్తకాలతో చిల్డ్రన్స్ బుక్‍ ఫెయిర్‍ నిర్వహించేలా ప్రయత్నాలు చేద్దామన్నారు. పిల్లలకు ఆటలు ఆడుకునే అలవాటు ఉన్నట్లయితే పుస్తకాలు చదివే అలవాటు కూడా ఉంటుందన్నారు. కజకిస్తాన్‍లో ఎలాంటి మనుషులు ఉంటారు, అమెరికాలో ఎలాంటి పద్ధతులు ఉంటాయి అనేది పుస్తకం చదివి తెలుసుకోవచ్చన్నారు. చక్కని పుస్తకాలు చదవడం ద్వారా ప్రపంచం లోని చాలా విషయాలు తెలుసుకోచవ్చన్నారు. పుస్తకం కుగ్రామానికి వెళ్లవలసిన అవసరం ఉందన్నారు. పఠనంపై భారతదేశం దృష్టి సారించి చక్కని పుస్తకాలను పిల్లలకు అందించాలన్నారు. ఇతర పుస్తకాలు చదవకుండా పాఠ్యాంశాల మీదనే ఆధారపడ్డ పిల్లలు భవిష్యత్‍లో ఏవైనా ఇబ్బందులు వస్తే తట్టుకోలేని పరిస్థితి వస్తుందన్నారు. అలాంటి వాళ్లు ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడే ఉంటారన్నారు. ఇతర విష యాలన్నీ అధ్యయనం చేసినవాళ్లకు మంచి క్రియేటివ్‍ టాలెంట్‍ వస్తుందని, వాళ్లు ఎలాంటి ఒత్తిడిని అయినా తట్టుకొని విజయం సాధిస్తారన్నారు. బాల్యంలో పిల్లాడి హృదయాన్ని అర్థం చేసుకొని రచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అటువంటి రచనలకు ప్రజాదరణ ఉంటుందని, అలాంటి పుస్తకాలతో పిల్లలు స్నేహ హస్తాన్ని అందిస్తారని చెప్పారు. చక్కని లైబ్రరీలు నిర్వహించే ఏర్పాటు చేద్దామని, మంచి పుస్తకాలు అందించే బాధ్యతను తీసుకోనున్నట్లు తెలిపారు. ఎప్పుడైతే పిల్లలు పాఠ్యాంశాలతో పాటు ఇతర పుస్తకాలు చదువుతారో అప్పుడే అన్ని రంగాల్లో ఆల్‍రౌండర్‍గా ఉంటారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్‍ సాధించిన వ్యక్తి మైక్రోస్టాఫ్‍ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లారని, అదే క్లాస్‍లో 60 శాతం మార్కులతో పాస్‍ అయిన విద్యార్థి కూడా అదే ఇంటర్వ్యూకి వచ్చినట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఇద్దరు ఒకేచోట జాయిన్‍ అయినట్లు తెలిపారు. అక్కడ సెలక్షన్‍లో భాగంగా ఇంటర్నేషనల్‍ బిగ్‍ టాస్క్లో 60 మార్కులు వచ్చిన వాడిని టీమ్‍ లీడర్‍గా చేస్తే గోల్డ్మెడల్‍గా ఎంపికైన వారిని టీమ్‍లో సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. టాపర్‍కు పరీక్షలు రాయడం, మార్కులు తెచ్చుకొనే జ్ఞానం ఉంది కానీ టీమ్‍ను నడిపే జ్ఞానం అతనికి లేద న్నారు. తోటి మిత్రులతో కలిసి పనిచేసే జ్ఞానం అతనికి రాలేదన్నారు. అన్ని విషయాల్లో పాలుపంచుకుంటూ ఉండే విద్యార్థులే అగ్రభాగాన నిలుస్తారని చెప్పారు.


ప్రభుత్వ పాఠశాలల పిల్లలు చాలా అదృష్టవంతులని, అన్ని రంగాల్లో ముందుంటారన్నారు. నిజ జీవితాన్ని చూసేది ప్రభుత్వ పాఠశాల పిల్లలే అని, ఎలాంటి కష్టమొచ్చినా తట్టుకునే శక్తి ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకే ఉంటుందన్నారు. ప్రైవేటు పాఠశాలలో కంటే గొప్ప ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలోనే
ఉన్నట్లు తెలిపారు. కథలు ఎలాంటివి ఉండాలనే దానిపై కార్యశాల నిర్వహించి మంచి కథలను ఎంపిక చేశామని, చిన్న చిన్న లోపాలుంటే తప్పకుండా సవరించుకుంటామన్నారు. ఎన్నుకున్న కథలనే పుస్తకంలో అచ్చువేసినట్లు తెలిపారు. బడి పిల్లల కథల పుస్తకానికి ఆయా జిల్లాల ఆర్టిస్టులే బొమ్మలు గీశారని తెలిపారు. కథలకు తగ్గట్టు బొమ్మలు గీయడం అభినందనీయం అన్నారు.


పిల్లలకు నచ్చిన పుస్తకాలు చదవాలి : ఎన్‍బీటీ చైర్మన్‍ పత్తిపాక మోహన్‍

పిల్లలు అల్లరి చేయకుంటే అర్థంలేదని, నేటి పిల్లలకంటే చిన్నతనంలో తామే ఎక్కువగా అల్లరి చేసినట్లు ఎన్‍బీటీ చైర్మన్‍ పత్తిపాక మోహన్‍ పేర్కొన్నారు. ఇప్పటి పిల్లలు స్కూల్‍ నుంచి ఇంటికి రాగానే టీవీలు చూడటం, సెల్‍ఫోన్లలో ఆడుకుంటున్నట్లు తెలిపారు. కానీ తమ జనరేషన్‍లో ఇంటికి వెళ్లగానే ఎన్నో ఆటలు ఆడుకున్నట్లు తెలిపారు. తాము ఎంత పేద వాళ్లమైనా చక్కని పుస్తకాలు ఇంట్లో ఉండేవని, వాటిని ఖాళీ సమ యంలో చదువుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు నలభై నిమిషాల క్లాస్‍ విని పరీక్ష రాస్తే వందకు వంద మార్కులు తెచ్చుకుంటున్నారని, పిల్లలే రచయితలై రచనలు చేస్తే ఇంకెన్ని మార్కులు సాధిస్తారోనన్నారు. పిల్లలకు నచ్చిన పుస్తకాలు చదవాలన్నారు. తమ పాఠశాల టెక్టస్బుక్స్తోపాటు ఇతర సాహిత్య పుస్తకాలను చదివి జ్ఞానం పెంచుకోవాలన్నారు. హైదరాబాద్‍ కథలనగానే తనకు రెండు కథలు గుర్తుకు వస్తాయన్నారు. టి.రాము, ఓపెన్‍ చదువు..ఇవి చాలా సాధారణ అంశాలతో పిల్లలు రాసిన కథలన్నారు. ఇవి అమలైతే జ్ఞాన తెలంగాణ, జ్ఞాన భారతదేశంవైపు అడుగులు వేస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 200 మంది పిల్లల పుస్తకాలు అచ్చువేసుకుంటే, ఒక్క తెలంగాణ నుంచి 10 పుస్తకాలను అచ్చువేసిన ఏకైక సంస్థ బాలచెలిమి సంస్థ అని కొనియాడారు. ఇంతటితో ఈ పుస్తకాల కథ అయిపోలేదని, వీటిని ఇతర భాషల్లోకి కూడా అనువదించనున్నట్లు తెలిపారు. పిల్లలు రాసిన కథలు రేపటి రోజున స్కూల్‍ పాఠ్యాంశాల్లో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు.


నిజాయితీతో కథలు రాయాలి : కేంద్ర బాలసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ
హేతుదృక్ఫథంతో నిజాయితీతో కథలు రాయాలని, అప్పుడే పిల్లలకు గొప్ప తెలివితేటలు లభిస్తాయని కేంద్ర బాలసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ పేర్కొన్నారు. తాము చాలా పాఠశాలలకు వెళ్లామని, చాలా మంది పిల్లలు కథలు రాయడానికి ముందుకు రావడం చాలా సంతోషదాయకం అన్నారు. జీవితంలో కనిపించే ప్రతి వస్తువు మనకు సబ్జెక్టు అన్నారు. పిల్లలకు పలు కథలు చెప్పి వారిని ఇన్స్ఫైర్‍ చేశారు.


సాహిత్యానికి ఎంతో మంది ప్రభావితులు అవుతారు : గిరిజ
సాహిత్యానికి ఎంతో మంది ప్రభావితులు అవుతారని గిరిజ పేర్కొన్నారు. ఈ సాహిత్య సభలో రచయితలు రావడం, తాను కూడా పాల్గొనడం చాలా గర్వంగా ఉందన్నారు. ఏజీ ఆఫీసులో పనిచేసి రిటైర్డు అయిన పీఎస్‍.లక్ష్మీగారు భారతదేశంలోని యాత్ర స్థావరాలతో పుస్తకం రాసి ఎంతో ప్రాచుర్యం పొందినట్లు తెలిపారు. అమ్మమ్మ చెప్పిన పుస్తకం చాలా పాపులర్‍ అయిందని, అమ్మమ్మ లేని లోటును ఆ పుస్తకం తీర్చిందన్నారు.


కథలతోపాటు టెక్టస్బుక్స్ చదవాలి : శ్యాములు రాజ్‍

మంచి కథల్లో ఎంతో జ్ఞానం ఉందని, ప్రతి ఒక్క విద్యార్థి సాహిత్యపరమైన పుస్తకాలు చదవాలని శ్యాములు రాజ్‍ పేర్కొన్నారు. పాఠశాల టెక్టస్బుక్స్తోపాటు మంచి కథల పుస్తకాలను చదవాలన్నారు. చాలా మందికి కథలు చదవడం అలవాటు ఉంటుందని, సాహిత్య పుస్తకాల్లో ఎంతో జ్ఞాన సంపద దాగి ఉంటుందన్నారు.


లక్ష్యం ఎంచుకుంటే వదలొద్దు : సీహెచ్‍.మల్లేశం
సభకు అధ్యక్షత వహించిన సీహెచ్‍.మల్లేశం మాట్లాడుతూ లక్ష్యం ఎంచుకుంటే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండకూడదని అన్నారు. గోల్‍ను సాధించేవరకు విశ్రమించకుండా కృషి చేయాలన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‍, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారతదేశాన్ని తయారు చేసుకోవాలంటే పిల్లలు ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. లక్ష్యాన్ని చేరాలంటే మన మార్గాన్ని సమర్థవంతంగా నిర్వహించా లన్నారు. కఠినమైన నిర్ణయాలతోనే విజయం సాధిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జీ హెడ్మాస్టర్‍ కృష్ణమూర్తి, హైదరాబాద్‍ జిల్లా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు నర్సింహారెడ్డి, లక్ష్మీ, భాస్కర్‍, రామకృష్ణ, రమేష్‍, జయంతి పాల్గొన్నారు.

  • రామకృష్ణ కాంపాటి,
    ఎ : 9866168863

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *