సాంఘిక సేవారంగంలో కృషి చేసిన మహిళలెందరో ఉన్నారు. సమాజంలో వున్న దురాచారాలను రూపుమాపటానికి వారంతా దీక్ష పూనినవారే. అనాధలు, పతితలు, భ్రష్టులు లాంటి వారెవరైనా సరే, వారెందరికీ తమవంతు సేవలందించటానికి వెనుకాడక ముందుకొచ్చే సాంఘిక సేవా తత్పరులైన మహిళామణులకు సమాజం ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే సాంఘిక సేవారంగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొంది, తెలంగాణా ప్రాంతం నుంచి వచ్చిన గొప్ప నాయకురాలు సుమిత్రాదేవి. దళితవాడలో పుట్టి, మహోన్నత వ్యక్తిత్వంతో అలరారిన సుమిత్రాదేవి విశిష్టమైన సేవలందించిన సంఘసేవిక, సంస్కార హృదయం మానవీయ విలువలకు పట్టం కట్టిన ఆదర్శమహిళ దళితురాలై, సాంఘిక సేవాతత్పరురాలై విశేషమైన కీర్తి నార్జించిన వ్యక్తి సుమిత్రా దేవి.
ఈమె వివాహమాడిన వ్యక్తి క్షత్రియ వంశీయుడైన దేవీప్రసాద్. సుమిత్రాదేవి, దేవిప్రసాద్లది ఆదర్శదాంపత్యం. భర్తను గురువుగా భావించి వారి అడుగుజాడలలో నడిచి, వారి ఆశయాలను అనుసరించింది సుమిత్రాదేవి. సంఘసేవ, దేశసేవ లక్ష్యంగా జీవితాన్ని సార్థకం చేసుకుంది సుమిత్రాదేవి. తన భార్య కూడా తనతోబాటు రాజకీయాల్లోకి రావాలిని, తోటి మానవులకు సేవలం దించాలని కోరుకున్నారు దేవీప్రసాద్‌గారు. భార్య సుమిత్రాదేవిని గాంధీయవాదిగా తీర్చిదిద్దారు. గాంధీ సిద్దాంతాలు ప్రచారం చేస్తూ, గాంధీ శిష్యురాలయింది సుమిత్రాదేవి. సత్యాహింసలు గాంధీగారి ఆయుధాలైతే, అవే తనూ స్వీకరించాలని త్రికరణశుద్దిగా విశ్వసించింది సుమిత్రాదేవి. గాంధీగారి వార్థా ఆశ్రమం ఆమెను చాలా ఆకర్షించింది. వార్ధా ఆశ్రమంలో గాంధీగారితోపాటు సేవాకార్యక్రమాలు చేస్తూ, మూడు సంవత్సరాలున్నారక్కడ. అక్కడనుంచి శ్రమసేవిక శిక్షను పొందటం సుమిత్రాదేవి జీవితంలో గొప్ప మలుపు.
సుమిత్రాదేవి కులమతాలకు అతీతంగా ఎదిగి పోయారు. గొప్ప కవయిత్రి అయిన సరోజినీ నాయుడుతోను, గడ్డిమోపు నెత్తినపెట్టుకు అమ్ముకునే ఆడవాళ్ళతోను సమంగా సమరస భావంతో మెలిగి అందరి మన్ననలను పొందారు. సుమిత్రాదేవిని అందరూ కూడా అక్క అని ఆత్మీయంగా పిలిచేవారు. అలాగే భావించి గౌరవించేవారు. సుమిత్రాదేవి ఎన్ని పదవుల్లోవున్నా, ఆపదవులు ప్రజాసంక్షేమం కోసమే ఉపయోగించారు. సుమిత్రాదేవి రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులరాలయ్యారు నగర పురపాలక సంఘం ప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు. గృహపరిశ్రమల సలహా సంఘ సభ్యురాలు. జిల్లా డెవలప్మెంటు బోర్డు సభ్యురాలు. వెనుకబడిన తరగుతుల సంస్థకు ఇండియన్ కాన్పరెన్స్ ఆఫ్ సోషల్ సర్వీసుకు సభ్యురాలు గౌరవ మెజిస్ట్రేటు. ఉస్మానియా విశ్వవిద్యాల సిండికేట్ సభ్యురాలు, ఈ పదవులేవీ ఆమెకి అధికారాన్ని, అహంకారాన్ని అందియ్యలేదు. ఈ పదువులు, బాధ్యతలు ఆమెను సంఘ సంస్కర్తగా, దళిత వర్గాల సేవలె దోహదం చేస్తాయి. శాసన సభ్యులు ఆమె ఆమటను గౌరవించి సుమిత్రక్కా అని పిలిచేవారు.
సుమిత్రాదేవి చేసిన మంచి పనులెన్నెన్నో. తన డబ్బు ఖర్చు చేసి ఓ మంచి పనికి అంకురార్పణ చేసారు. అదే చిక్కడపల్లి (హైదరాబాద్)లోని ఆర్య యువజన పాఠశాల. ఈ పాఠశాలను ఎంతో విజయవంతంగా నడిపి, విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపారు. గాంధీ మార్గానుయాయి అయిన సుమిత్రాదేవి, ఖాదీ, చెరఖా ప్రచార కేంద్రాలు నెలకొల్పారు. అంతేకాక, సుమిత్రాదేవి రాష్ట్ర కాంగ్రెస్ సభ్యురాలయినప్పుడు జగ్జీవన్ పాఠశాల నడిపారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసి అరెస్టయ్యారు.
సుమిత్రాదేవిగారి సాంఘీక సేవాకార్యక్రమాలు ఎన్నో మార్గాలలో సాగేవి. నిజాం ప్రభువు, కోడలు దుర్రెషనబేగమ్ గారి ఆధ్వర్యంలో నడుపబడే ఆహార ధాన్యాల చౌక దుకాణాలలో సభ్యురాలిగా చేసారు. సుమిత్రాదేవిగారు సంఘంలో సభ్యురాలిగా వుంటూ కార్యనిర్వహణ దక్షురాలిగా పేరు పొందారు. ఆంధ్రయువతీ మండలి కార్య నిర్వాహక సభ్యురాలిగా పనిచేసారు. నిజాం రాష్ట్రంలో నిమ్నజాతి మహా సభకు అధ్యక్షురాలిగా ఎన్నికై, చాలా సేవలందించారు దళిత సంఘాలకు చేయూతనిచ్చారు.
స్త్రీలకై సేవచేయుట ఆమె లక్ష్యమైంది. పోలీసు చర్య తర్వాత, రెస్క్యూ వర్క్ ఆర్గనైజేషన్‌లో సభ్యురాలిగా చేరి స్త్రీలను ఎన్నో విధాల రక్షించారు. దళితులకై ఐదువందల యిళ్ళు కట్టించి, ఆ ఇళ్ళలో వారిని ప్రవేశపెట్టడం కోసం చాలా శ్రమించారు. శాసన సభ్యురాలిగా ప్రజలమధ్యకెళ్ళి వారి అవసరాలు కనుగొనేవారు సుమిత్రాదేవిగారు. ఆ విధంగా రాజేంద్రనగర్, హయత్‌నగర్, మేడ్చల్‌లకు ఎంతో మేలు జరిగింది.
దళిత వాడలో మంచినీటి కరువును గుర్తించిన సుమిత్రాదేవి చాలా ఆవేదన చెందారు. ఆమె బాధ్యతగా అరవై మంచినీటి బావులు చెరువులు తవ్వించటం మరపు రాని మహోపకారం. విద్యుత్ దీపాలు పెట్టించారు. ఆమె చేసే సేవా కార్యక్రమాలు చాలామందికి జీవనోపాధి కల్పించాయి. సుమిత్రాదేవి గారి మనసు సహకార వ్యవసాయ పద్ధతిపై నిల్చింది. రెండువేలకు పైగా సహకార వ్యవసాయాన్ని ప్రవేశపెట్టి గొప్ప ఉపకారం చేసారు. ఉప్పల్ అన్నోజీగూడ గ్రామంలో దళితులకు భూమి మాత్రమే కాకుండా, భూమి దున్నటానికి వారికి ఎద్దులను కూడా పంచిపెట్టడం ఎంత ప్రత్యేకమైన పనో తల్చుకుంటే సుమిత్రాదేవి గారి సమర్థతకి ఆశ్చర్యపోక తప్పదు.
సమాజంలో జరిగే అక్రమాలను, అన్యాయాలను చూసి సహించలేకపోయేవారు. భార్య ఉండగా ద్వితీయ వివాహం చేసుకోరాదనే చట్టం వచ్చింది. ప్రభుత్వోద్యోగులు చేస్తే వారి ఉద్యోగాలు పోతాయి. ఇతరులు శిక్షార్హులే. ఈ చట్టం స్త్రీలకు న్యాయం చేస్తుందనింపించింది సుమిత్రాదేవికి. కాని ఒక విషయం ఆమె దృష్టికొచ్చింది. ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లు భార్యలుండగా మళ్ళీ వివాహం చేసుకున్న విషయం ఆమెకు తెలిసింది. సుమిత్రాదేవి మనసు రగిలిపోయింది. ఆ ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆమె రాష్ట్ర శాసనసభ వద్ద ఆ సంఘటనను పలువిధాల విమర్శించి, స్త్రీకి జరిగే అన్యాయాన్ని సాటి స్త్రీగా తను క్షమించనని, అందరి మనసులు కరిగేట్టుగా ప్రసంగించింది సుమిత్రాదేవి.
‘‘ఆ ప్రసంగం చాలా చారిత్రాత్మకమైంది. ఇప్పటి సభ్యుల హృదయాల్లో ఇంకా ఆ ప్రసంగం నిలిచేవున్నది ఇప్పటికి’’ అని ‘తేజోమూర్తులు’ గ్రంథంలో ఇల్లిందల సరస్వతీదేవీగారన్నారు. సుమిత్రాదేవి దళితజాతుల సంక్షేమానికే ఆమె జీవితాన్ని అంకితం చేసిందంటే అతిశయోక్తికాదు. ఆమె చదువుకోకపోయినా, దళిత పిల్లలుగూడ చదువుకోవాలని ఆమె కాంక్షించింది. దళిత స్త్రీ జనాభ్యుదయ లక్ష్యంతో ఉప్పల గ్రామాలలో బాపుజీ సేవా సదనాన్ని నిర్మించింది. ముప్పయిమందిదాకా దళిత స్త్రీలు ఆ సమాజంలో చేరి చేతిపనులలో శిక్షణ పొంది జీవనోపాధిని పొందారు. బాలబాలికలు దగ్గర పాఠశాలల్లో చదువుకున్నారు. ఆర్యసమాజ పద్ధతులు ఆ సేవాసదనంలో ప్రవేశపెట్టారు. ప్రార్థన చేయుటం, కవాతు చేయటం, కర్రసాము నేర్వటం మొదలైనవి నిత్య కార్యక్రమాలు.
నిస్వార్థ సేవాపరాయణురాలైన సుమిత్రాదేవి రాజకీయ బాధితుల కోసం ప్రభుత్వం ఇచ్చిన పదెకరాల భూమిని ఈ సంస్థకు విరాళంగా యిచ్చేసారు. ఆమెకు మంత్రి పదవి ఇస్తామంటే తిరస్కరించారన్న విషయం వింటే ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలుస్తుంది.
సుమిత్రాదేవి విశిష్ఠ వ్యక్తిత్వం గురించి ఎన్నో కోణాలలో ఆవిష్కరించారు. ఇల్లిందుల సర్వతీదేవిగారు. ‘‘మా తల్లి సల్లగుంటే మాకు బుక్కెడు బువ్వ దొరుకుద్ది’’ ‘‘మాయమ్మ సల్లగుంటె తల దాచుకోటానికి గుడిసెయిస్తది’’ ‘‘ఆ తల్లి సల్లగుంటే దున్నుకోటానికి చేరడు భూమియిస్తుంది’’ చల్లటివేళ ఇలా దళిత వర్గాలు ఆమె దొడ్డ మనసునూ శక్తి సామర్థ్యాలను తలుచుకుని ఆశలను వెలిబుచ్చుకుంటూ వుంటారు’’ అన్నారు. దీన జన బంధువుగా, కరుణామయిగా, బీదలపాలిట పెన్నిధిగా సుమిత్రాదేవి అందించిన సేవలు చిరస్మరణీయాలు.
సుమిత్రాదేవి గొప్ప సాహసవంతురాలు. చాలాసార్లు రజాకార్లను ఎదిరించారు. చాలాసార్లు ఏదో వంకతో నేరం మోపి, అరెస్టు చేసి వ్యానులో ఎక్కిస్తే సుమిత్రాదేవి వారందరితో పోట్లాడి, వాదించి, వారిని బెదరగొట్టినపుడు, రజకార్లు వ్యానులో ఆమెను ఊరంతా తిప్పి, ఆమె ముందు నిలువలేక, చివరకు, ఆ వ్యాన్‌లో ఎక్కించిన స్త్రీలందర్నీ హుస్సేన్‌సాగర్ కట్టమీద వదలి వెళ్ళిపోవటం సుమిత్రాదేవి దైర్యసాహసాలకి, స్త్రీల విజయానికి ఉదాహరణలు.
రాజబహదూర్ వేంకటరామిరెడ్డి కళాశాల భవనానికి శంఖుస్థాన జరగాలి. ఆ స్థలంలో దళితుల గుడిసెలున్నాయి. ఆ గుడిసెలు తియ్యాలి. నాయకురాలు సుమిత్రాదేవి ఆ గుడెసెలు తీయడానికి వీల్లేదంది. మాడపాటి హనుమంతరావుగారు సుమిత్రాదేవిని బతిమాలాడారు. ఎన్నో విధాల నచ్చచెప్పారు. సుమిత్రాదేవి పట్టువీడలేదు. గుడిసెల సంగతి తేల్చకుండా కళాశాల శంఖుస్థాపన చేయనీయనంది. మరొకచోట స్థలం చూపించండి. గుడిసెలు అక్కడ వేసుకోటానికి తగిన డబ్బు ఇయ్యండి అని హనుమంతరావుగారితో మాట్లాడింది. ఆమె మాట నెగ్గింది. వేరొకచోట గుడిసెల నిర్మాణం పూర్తయ్యింది. సుమిత్రాదేవి కళ్ళలో ఆనందభాష్పాలు. హనుమంతరావుగారితో వాగ్వాదానికి దిగినా, ఆయనపై తనకున్న గౌరవంతో, ఆ కాలనీకి హనుమంతరావు కాలని అని పేరు పెట్టడం సుమిత్రాదేవి సహృదయం.
దళిత వర్గాలు అందరితో సమంగా హక్కులు పొందాలనీ, వారిని ఉన్నతస్థాయిలో చూడాలని సుమిత్రాదేవి కోరిక. దళిత వర్గాలు ఆమెను దేవతలా సేవిస్తారు. ఆమె వారిపాలిట కల్పతరువని విశ్వసిస్తారు. ఆమె దళిత స్పృహతో వారి జీవితాలలో వెలుగులు ప్రసరింపజేసిన తేజోమయి.
-డా।। ముక్తేవి భారతి
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి )