1897 చట్ట ప్రకారం లాక్‍ డౌన్‍


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‍ వ్యాప్తిని నిరోధిం చేందుకు ఈ నెల 31దాకా రాష్ట్రంలో లాక్‍ డౌన్‍ పాటిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‍రావు ప్రకటించారు. తెలంగాణకు విదేశాల నుంచి వచ్చేవారి రాక ఆదివారంతో నిలిచిపోయిందని… ఇక వైరస్‍ వ్యాప్తిని నిరోధించినట్టయితే కరోనాపై విజయాన్ని సాధించినట్టేనని అన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూను తెలంగాణ సమాజం కనీవినీ ఎరుగని రీతిలో చారిత్రాత్మకంగా విజ యవంతం చేసిందంటూ.. ఇందుకు ప్రతి ఒక్కరికీ ధన్య వాదాలు తెలియజేశారు. కరో నాపై పోరా డుతున్న వైద్యసిబ్బంది, ఇతర సిబ్బందికి… చప్పట్లతో సంఘీభావ సంకేతాన్ని అద్భు తంగా ప్రదర్శించారని కొనియాడారు. ఆది వారం సాయంత్రం ప్రగతిభవన్లో ముఖ్య మంత్రి కేసీఆర్‍ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం నాటి స్ఫూర్తిని ఈ నెల 31దాకా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రజలను కోరారు.


అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు

‘ప్రపంచాన్ని భయకంపితంచేస్తున్న కరోనా వైరస్‍ వ్యాప్తి నిరోధానికి సంబంధించి ప్రధాని మోదీతో పాటు నేనుకూడా ఒక (జనతా కర్వ్యూ) పిలుపునిచ్చాం. కనీవినీ ఎరుగనిరీతిలో, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు ఇండ్లకే పరిమితమై అద్భుతాన్ని ఆవిష్కరించారు. నేను ఏదైతే కోరానో దాన్ని గౌరవించి రెండు పనులుచేశారు. ఒకటి.. వైరస్‍ వ్యాప్తిని నిరోధించేందుకు ఇండ్లకే పరిమితమై ప్రపంచంలోని మానవాళికి తెలంగాణ మంచి కంట్రి బ్యూషన్‍ ఇచ్చింది. రెండోది.. సంఘీభావ సంకేతం. కొందరికి పిచ్చిపిచ్చి ఆలోచన ఉండొచ్చు గానీ.. ఇది మంచిదని నేను ముందుగానే విజ్ఞప్తి చేశా. సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లు చరిచి సంఘీభావ సంకేతం ప్రదర్శించాలని కోరాను. తెలంగాణ సమాజం అద్భుతంగా ఆ సంకేతాన్ని ప్రకటించింది. ‘మేమంతా ఒకటి.. దేన్నైనా ఎదుర్కో గలం’ అనే ఒక సంఘీభావ సంకేత ప్రదర్శన అద్భుతంగా జరిగింది. ఇంతమంచి ప్రదర్శన, ఐక్యత, విజ్ఞతను చాటిచెప్పిన ప్రతి తెలంగాణ బిడ్డకు పేరు పేరునా నా తరఫున, ప్రభుత్వం తరపున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, ధన్య వాదాలు తెలుపున్నా.


1897 చట్టం ప్రకారం లాక్‍ డౌన్‍
వ్యాధులు ప్రబలినప్పుడు అత్యవసర సమయాల్లో అమలుచేసే 1897 ఎపిడ మిక్స్ డిసీస్‍ యాక్ట్ (అంటువ్యాధుల నియంత్రణ చట్టం) కింద ఈ లాక్‍డౌన్‍ను నోటిఫై చేసినం. ఈ చట్టానికి విశేషాధి కారాలు ఉంటయి. దాని కిందనే ఉత్తర్వులు జారీచేసినం. ఆ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ మొత్తం మార్చి 31 వరకు లాక్‍ డౌన్లో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇండ్లుదాటి బయటకు రావొద్దు. ఐదుగురికి మించి ఎట్టి పరిస్తితుల్లో బయట కూడవద్దు. బయటికొచ్చినా కూడా ఇద్దరి మధ్య మూడుఫీట్ల దూరం ఉండాలి. ఇంటి అవసరాల కోసం కావాల్సిన మందులు, పాలు, కూరగాయలు, నిత్యావసరాల వంటి అత్యవసర వస్తువుల సేకరణ కోసం కుటుంబానికి ఒక్క వ్యక్తిని మాత్రమే అనుమతిస్తరు. అది కచ్చితంగా తూ.చ. తప్పకుండా పాటించాలి. వీలైనంతవరకు బయటకు వెళ్లినపుడు 2-3 రోజులకు, సరిపడా వస్తువులు, సరుకులు తెచ్చుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవాలనే సోయి! ఉండాలే తప్ప ఇంకెవరో చెప్తరు, ఇదో బలవంతం అని అనుకోవద్దు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి… ఏ కుటుంబానికి ఆ కుటుంబం. ఆదివారం చూపించిన స్పూర్తిని ప్రదర్శించాలి. పౌరులందరికీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇండ్లకే పరిమితమవ్వాలి. లేని ఇబ్బందులు కొనితెచ్చుకోకండి. సమాజానికి ఇబ్బందులు తీసుకురాకండి. ఎమర్జెన్సీ సర్వీసులకు మినహాయింపు ఉంటుంది. వాటర్‍, విద్యుత్‍ సరఫరా, ఫైర్‍ సర్వీస్‍, గ్యాస్‍ ఏజెన్సీలు, పెట్రోల్‍ బంకులు వంటి సర్వీసులు పనిచేస్తాయి.


12 కిలోల బియ్యం… రూ.1500
రాష్ట్రంలో రెక్కాడితే డొక్కాడని నిరు పేదలు చాలా మంది ఉన్నారు. 31వ తేదీదాక లాక్‍డౌన్‍లో వాళ్లు ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్నది. వాళ్లందరికీ నెల రోజులకు సరిపడే రేషన్‍ బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తాం.. ఇతర సరుకుల కోసం ఒక్కో తెల్ల రేషన్‍కార్డుదారులకు రూ.1500 నగదు అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‍ రావు తెలిపారు. తెలంగాణ సంక్షేమంలో నంబర్‍వన్‍గా ఉన్నదని, రూ.40 వేల కోట్లతో సంక్షేమాన్ని అమలుచేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. ‘నిరుపేదలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకలికి గురికాకూడదని ఆలోచిస్తున్నం. వారం రోజుల లాక్‍డౌన్‍ అయినా.. దానిప్రభావం పది రోజులపాటు ఉంటుంది. అందుకే ఒక్క వారానికి సరిపడ సరుకులు అని కాకుండా నెల రోజులకు సరిపడే రేషన్‍ బియ్యం పంపిణీ చేస్తం. మన రాష్ట్రంలో బియ్యం నిల్వలు మరే రాష్ట్రంలో లేనివిధంగా ఉన్నాయి. 1.08 కోట్ల కుటుంబాలు ఉండగా.. అందులో 87.59 లక్షల మందికి తెల్ల రేషన్‍కార్డులు ఉన్నాయి. వాళ్లందరికీ ఉచితంగా 12 కిలోల బియ్యం ఇస్తాం’ అని సీఎం పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడున్న డీలర్ల వ్యవస్థ ద్వారానే అందిస్తామని తెలిపారు. సాధారణంగా తెల్లరేషన్‍ కార్డుదారు లందరికీ ప్రతినెలా 1.50 లక్షల టన్నులు ఇస్తున్నాం. . ఇప్పుడు డబుల్‍ ఇస్తున్నందున 3.86 లక్షలటన్నుల పైచిలుకు బియ్యం
ఉచితంగా పంపిణీ చేస్తాం.. దాని విలువ దాదాపు రూ.1103 కోట్లు అని చెప్పారు. ‘పేదలకు నెలదాకా సరిపడే బియ్యం పంపిణీతో పాటు పప్పు, ఉప్పులాంటి సరుకులు కూడా కొనుకోవాల్సి ఉంటుంది. అందుకే వాటికోసం బియ్యంతో పాటు ప్రతి రేషన్‍ కార్డుదారుడికి రూ.1500 నగదు కూడా ఇస్తాం. దీనితో ఎవరు ఏదికావాలి అంటే అది కొనుక్కుంటరు. ఇందుకోసం రూ.1,314 కోట్లు ఖర్చవుతుంది. అంటే బియ్యం, నగదుకు కలిపి మొత్తం రూ. 2,417 కోట్లు ఖర్చవుతున్నందున వెంటనే ప్రభుత్వం విడుదల చేస్తుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‍ పేర్కొన్నారు. ‘వాస్తవానికి కొందరు అధికారులు, నాయకులు రూ.1000 ఇవ్వమన్నారు. నేను దానిని రూ.500 పెంచి రూ.1500 ఇవ్వాలని చెప్పిన. ఔటాఫ్‍ బడ్జెట్‍ నుంచి ఇస్తున్నాం. ప్రతిరాష్ట్రంతో, కేంద్రంతో సమన్వయంతో – పనిచేస్తున్నాం. సంకుచితంగా ఆలోచించే సమయం కాదిది. రాజకీయాలు, చిల్లర ఆలోచనలు చేయరు’ అని పేర్కొన్నారు. కూరగాయలు, పాలు, కిరాణ షాపులు తెరిచి ఉంచాయని, వాళ్లు ఇంటికి ఒక్క వ్యక్తి మాత్రమేపోయి వాటిని కొనుక్కోవచ్చని సీఎం సూచించారు. ఇది కర్ఫ్యూ లాంటిది కాదుకానీ.. ఒక్కదగ్గర ఐదుగురి కంటే ఎక్కువ మందిని అనుమతించబోమని తెలిపారు. వాళ్లు కూడా మూడు ఫీట్ల దూరం పాటించాలని చెప్పారు.


ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‍రావు ఆదేశించారు. ఐకేపీ సెంటర్లు, పీఏసీఎస్‍లు, మార్కెట్‍ కమిటీల ద్వారా గ్రామస్థాయిలోనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని వ్యవసాయ, మార్కెటింగ్‍ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‍రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‍కుమార్‍కు సూచించారు. సోమవారం అత్యవసర సమీక్ష నిర్వహించి ధాన్యం కొనుగోళ్ల కోసం విధి విధానాలు రూపొందించాలని పేర్కొన్నారు. లక్ష టన్నుల వరకు ధాన్యం కొనుగోలుకు ఎఫెసీఐ సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.


అప్రమత్తంగా ఉండాలి
ప్రధానమైన విషయాన్ని ప్రజలకు మనవి చేస్తున్న. ఈ జబ్బు పెద్ద మహమ్మారి. యావత్‍ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. ఒక ఊరికో, పల్లెకో, వ్యక్తికో పరిమితం కాలేదు. పరిమిత సమస్య కాదు. ఇది ప్రత్యేక సందర్భం. ప్రత్యేక పరిస్థితి. కాబట్టి అందరం అప్రమత్తంగా ఉండాలి. కరోనాపై కొందరు కవులు మంచి కవిత్వాలు రాశారు. ఐనం పూడి శ్రీలక్ష్మి అనే కవయిత్రి అద్భుతమైన కవిత రాశారు. ఇప్పుడు క్వారంటైనే మన వాలంటైన్‍ అన్నారు. గొప్ప భావం ఇది. రాష్ట్రంలో ఉన్న కవులందరినీ కోరుతున్న. మంచి కవితలు రాయాలి. టీవీవాళ్లను కోరుతున్న.. కరోనా మీద ప్రజలను చైతన్యపర్చే విధంగా కవి సమ్మేళనాలు నిర్వహించాలి.

  • నమస్తే తెలంగాణ
    తెలుగు దినపత్రిక సౌజన్యం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *