తెలంగాణలో ఆనాడు, సంస్కరణ భావ విజృంభణతో సాహిత్య వికాస చైతన్య దీప్తులు ప్రసరించిన ఒద్దిరాజు సోదరులు బహు భాషా కోవిదులు, సకల శాస్త్ర కళాకోవిదులు. ఒద్దిరాజు సీతారామ చంద్రరావు గారు, ఒద్దిరాజు రాఘవ రంగారావుగార్లు ఏడేళ్ళ వయసు తేడాతో ఒకే తల్లి గర్భాన జన్మించిన అన్నదమ్ములు. వీరిది వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామం. రంగనాయకమ్మ, వెంకటరామారావు గార్లు వీరి తల్లిదండ్రులు. అమ్మానాన్నల సంస్కారాన్ని, పాండిత్యాన్ని వారసత్వంగా తెచ్చుకున్న ఒద్దిరాజు సోదరులు దేహాలు వేరైనా ఆత్మలొక్కటేనన్నట్లు పెరిగారు. 1887 ఏప్రిల్ 2 పెద్దవారు, 1894 ఏప్రిల్ 4 చిన్నవారు జన్మించారు.
తెలుగు,సంస్కృతం , తమిళం, కన్నడం, ఉర్దూ, పార్శి, హిందీ, ఇంగ్లీష్ వంటి అష్టభాషల్లో ప్రవీణులైన ఒద్దిరాజు సోదరులు ప్రబంధాలు, కావ్యాలు, నవలలు, నాటికలు, నాటకాలు, కథలు, కథానికలు, కవితలు, వ్యాసాలు, ప్రహసనాలు, శతకాలుగా దాదాపు 75 గ్రంథాలకు పైగా రచనలు చేశారు. ఒద్దిరాజు సోదరులు, ఇనుగుర్తి సోదరులుగా ప్రసిద్ధికెక్కిన వీరు సాహిత్యంతో పాటు సంగీతశాస్త్రాన్ని, జ్యోతిష్యశాస్త్రాన్ని, విజ్ఞానశాస్త్రాలైన వైద్య శాస్త్రాల్ని నేర్చుకున్నారు. హోమియో పతిలో డిగ్రీ చదివి, పట్టా పొందిన తర్వాత ఆయుర్వేదం, అల్లోపతి వైద్యాల్ని క్షుణ్ణంగా నేర్చుకొని, తాము కనుగొన్న ‘తిక్త’ అనే మందును కలరా, మలేరియా వంటి జబ్బులకు ఇస్తూ ప్రజలను కాపాడేవారు. ‘మధిర’ అనే మందును కనుగొని పశువులకు కూడా వైద్యం చేసి రైతులకు సేవ చేసేవారు. ఏ ఆధునిక వైద్య సౌకర్యాలు లేక అలమటించే సమాజానికానాడు సోదరులు ఉచిత సేవ చేసేవారు.
తెలుగు భాషా సేవ చేసేందుకు, విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాలను ఇనుగుర్తిలో 1918లోనే స్థాపించారు. మద్రాసు నుండి ప్రింటింగ్ ప్రెస్ భాగాలను కొనుక్కొని సిద్ధం చేసుకున్నారు. వారి గ్రంథాలతోబాటు ఇతరుల గ్రంథాలను ముద్రించి, ఉచితంగానే ఇచ్చేవారు. విద్యావకాశాలు ఎండమావులైన తెలంగాణ పల్లె జీవితాల్లో వెలుగులు నింపాలని ఆధునిక భావాలు ప్రజ్వరిల్లాలని వీరి ఇంట్లో ఎంతోమంది పేదలకు చదువులు చెప్పించేవారు, మూఢనమ్మకాలు పోవాలని ఎంతో కృషి చేసేవారు. కనీస ప్రయాణ సౌకర్యాలు కూడాలేని ఆ మారుమూల పల్లెటూళ్ళో తెనుగు పత్రికని స్థాపించి, తెలుగు భాష వెలుగులీనాలని అర్థపుష్కరకాలం అహర్నిశలు శ్రమించారు. 1922లో ఇనుగుర్తిలోని తమ ఇంట్లో నుండి నడిపిన తెనుగు పత్రిక ప్రారంభంలో 500 కాపీలతో ప్రచురించారు. ఒద్దిరాజు సీతారామచంద్రరావుగారు సంపాదకులు. అక్షరాలను కూర్చడం, ప్రూపులు దిద్దుకోవడం, వార్తలు సేకరించడం, వ్యాసరచన చేయడం పత్రికను బట్వాడా చేయడం వంటి పనులన్నీ ఒంటిచేత్తో నడుపుకున్న సోదరులు శ్రమ జీవులు. ‘వార్తయందు జగము వర్ధిల్లుచున్నది’ అనే సూక్తిని పత్రిక టైటిల్ దగ్గర ముద్రించిన వీరు అత్యంత సాహసంతో శక్తిసామర్థ్యాలతో ఎటువంటి వార్తలనైనా నిర్భయంగా ప్రచురిస్తూ 6 ఏళ్ళు దిగ్విజయంగా నడిపారు. పద్యావళి, వ్యాసావళి, నిజాం రాష్ట్రం వార్తలు, లేఖలు, సాహిత్య విషయాలకు స్థానమిచ్చిన ఈ తెనుగు పత్రిక ఆంధ్రోద్యమానికి చేయూత నిచ్చింది. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఒద్దిరాజు సోదరుల ‘తెనుగు పత్రిక’ ఎనలేని సేవచేసింది.
ఒద్దిరాజు సోదరుల పాండిత్య ప్రకర్షను తెలియజేసే ‘సౌదామినీ పరిణయం’ పధ్నాలుగు వందల ఎనభైఐదు గద్యపద్యాలతో కూడిన చంపూ కావ్యం. ఇందులో ఆరు ఆశ్వాసాలున్నాయి. దైవస్తుతి గ్రంథకర్తల వంశాభివర్ణనలతో 88 గద్యపద్యాలతో అవతారిక అలరారుతున్నది. సౌదామిని శ్రీకృష్ణులు ఈ కావ్య నాయికా నాయ కులు. విప్రలంభ శృంగారంతో కూడిన కొన్ని వర్ణనలతోను, పురవర్ణన, హిమగిరి వర్ణన, తపోవన వర్ణన, ఋతు వర్ణనలతో కథాగతికి ఒదిగిన ఈ ప్రబంధం పూర్వ ప్రబంధాలతో పోలుతుంది.
మన భారతీయ తాత్త్వికవేత్తలు, మేధావులు రూపొందించిన ధర్మార్థ కామమోక్షాలైన చతుర్విధ పురుషార్థాల ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నంలో వ్రాసిన ‘నిస్వార్థ దరిద్రులు’ అనే కావ్యం ఒద్దిరాజు సోదరుల నిరాపేక్ష భావాన్ని ప్రతిబింబిస్తుంది. ఎవరి బ్రతుకు వారిదే, ఏ ప్రభుత్వాలపైనా ఆధారపడకుండా ఆదర్శంగా బ్రతకాలి ప్రజలు అనే ఆలోచన రేకెత్తించారీ కావ్యంలో. ఒద్దిరాజు సోదరులు నాటికలు నాటకాలు చాలా వ్రాశారు. అనురాగాలు, ఆప్యాయతలతో జీవనం చేసే కుటుంబపరమైన నాటాకాలెక్కువుగా ఉన్నవి. కథాంశం ఏమాత్రం తక్కువకాకుండా వ్రాసిన ఈ నాటకాల్లో వరకట్నం, అవిద్యవంటి బాధలు, మద్యం సేవిస్తూ భార్యను దండిస్తూ ఇబ్బందిపెట్టే వారి స్వభావాలను, సహవాసదోషంవల్ల కలిగే అనర్థాలను చూపుతూ, వాటికి పరిష్కారమార్గాలను చూపుతూ వ్రాశారు. కష్టపడి సంపాదించిన ధనాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలో, మేనరిక వివాహాలు, వరకట్న సమస్యలు, ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో కుటుంబాల్లో పెరిగే దూరాలు, అట్లే గయ్యాళితనం చూపే ప్రభావంతో వచ్చే కష్టాలు గురించి వ్రాశారు. స్త్రీల ఔన్నత్యం కోసం ‘సంఘాలు’ ఉండాలని కోరుకోవడం వంటివి 7 దశాబ్దాల క్రితమే వ్రాసిన మార్గదర్శులు వీరు. ఈ ఉత్తమ నాటకాలు ఇప్పుడు ‘దుష్ట పంచాయితీ’ ‘మేనరికం’ అనే పేర్లతో పది నాటకాలు రెండు పుస్తకాలుగా ఒద్దిరాజువారి కుటుంబ సభ్యులు ఈ మధ్యే ముద్రించారు. ఎల్లన, తులసీబాయి, చింతాదేవి, రుధిరాభిషేకం వంటి పది నాటికలను ఈ సోదర కుటుంబాలు ముద్రణలోకి తెచ్చారు. ఆనాటి సుజాత, గోలకొండ పత్రికల్లో ఈ ఏకాంకికలు అచ్చయినవే!
ఒద్దిరాజు సోదరులు వ్రాసిన కథలు, నవలలు ఒక దానిని మించి మరొకటి గొప్పగా ఉన్నవి. స్నేహం విలువను తెలియజెప్పే రక్తమూల్యం కథ, శీల సంపద విలువ చెప్పే లండన్ విద్యార్థి కథ, భూమాత అంతటి ఓపిక ఉండే స్త్రీలు సరైన విద్యనందించి, ఉన్నతంగా చూస్తే వారి కుటుంబాలకు అవధుల్లేని కీర్తిని సంపాదించిపెడ్తారన్న సందేశమిచ్చిన నీవేనా కథ గొప్పగా ఉన్నది. సైన్స్ను ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. విచ్చలవిడిగా ఉపయోగిస్తే అంతం చేస్తుందని హెచ్చరించే హాస్యకథ ‘అదృశ్యవ్యక్తి’ కథ ఇష్టంగా చదివింపజేసేకథ. రుద్రమదేవి, శౌర్యశక్తి, భ్రమర, వీరావేశము, బ్రాహ్మణ సాహసము, ముక్తలవ, వరాహముద్ర, స్త్రీ సాహసము వంటి ఎన్నో నవలలు రచించిన ఒద్దిరాజు సోదరుల నవలలన్నీ లభ్యమై ఉంటే ఎంతో బావుండేది. అద్భుతమైన వీరి పుస్తక భాండాగారాన్ని ఆనాడు ముష్కరులు అగ్నికి ఆహుతి చేశారట.
1918లో ప్రథమ ముద్రణ చేసిన ‘రుద్రమదేవి’ నవల ఓరుగల్లు రాణి గొప్పదనాన్ని చాటుతూనే స్త్రీ శక్తి ఎంతటి అపూర్వమైందో రుద్రమదేవి పరిపాలనాదక్షత ఎంత గొప్పగా ఉండేదో తెలియ జేసిందీనవల. రవీంద్రనాథ్‍ఠాగూర్ ‘ది రెక్’ను ‘నౌకాభంగం’ పేరున అనువదించిన ఈ నవల తెలుగు భాషా పిపాసకులకు మనోహరంజకాన్ని కలిగిస్తుంది. ఈ మధ్యే దీన్ని ముద్రించారు.
ఒద్దిరాజు సోదరులు సంస్కృతం భాషలో ఉద్దండ పండితులు. పాణినీయ అష్టాధ్యాయి వ్యాకరణ సూత్రాలకు తెలుగు వ్యాఖ్యాంశాలను రచించారు. కృష్ణస్తవః, శ్రీస్తవః, ఉత్సవానందః, వైభవస్తవః వంటి రచనలు, శతకాలు వీరి పాండితీ గరిమను తెలుపుతాయి. అనువాద రచనలలో ముఖ్యంగా ‘ముదలాయిరం’, ‘వణ్ణమడఙ్గల్’ వంటి తమిళ రచనలు చేసిన ఒద్దిరాజు సోదరులు శ్రీవైష్ణవ సంప్రదాయవాదులు కాబట్టి సంప్రదాయార్థ బోధకాలైన తమిళ గ్రంథాలను, సర్వజన సౌభ్రాతృత్వాన్ని కోరిన రామానుజుల మార్గ సంప్రదాయాలను విశదీకరించారని తెలుస్తుంది. ఆర్తి ప్రబంధం, సప్తగాథా వ్యాఖ్యానం వంటివి కొన్ని ఆ పద్ధతిని పోలి ఉన్నాయని పెద్దలు వివరించారు.
‘మాన్యువల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్’ అనే ఇంగ్లీష్ వ్యాకరణ గ్రంథాన్ని వ్రాశారు సోదరులు. ఇందులో ఇంగ్లీషు పదాలకు కొత్త కొత్త పారిభాషిక పదాలను ఉపయోగించారు. రవీంద్రుని రచనల ప్రభావం షేక్స్పియర్ వంటి కవుల ప్రభావం బాగా పడిన ఒద్దిరాజు సోదరులు ఇంగ్లీష్‍లో “The Flower, The Pride of the Wealth” వంటి కవితలూ వ్రాశారు.
ఒక్క ‘లోకేశ్వర శతకం’ చదివితే చాలు ఒద్దిరాజు సోదరుల తాత్వికత, ఆధ్యాత్మికత, భక్తిభావ చింతనలెంత ఆదర్శంగా ఉన్నాయో తెలుస్తుంది. అనేకమైన వ్యాసాలు, కవితలు, పేరడీలు, చాటువులు, చతుర సంభాషణలు ఒద్దిరాజువారిలోని పరిశీలనత్వాన్ని, హాస్యప్రియ తత్వాన్ని, సామాజిక నేపథ్యాన్ని తెలుపుతాయి.
ఒద్దిరాజు సోదరులు సకల కళాపారంగతులు. వీరి గృహ ముఖద్వారంపైన కళాత్మకమైన చక్కడాన్ని వీరే స్వయంగా చేశారట. ఆ డిజైన్లలో వీరి పేర్లు, భగవద్గీత శ్లోకము వచ్చేలా చెక్కారు. తాపీపని, చెక్కపనీ వీరే చేసేవారట. కుమ్మరం, వడ్రంగం వంటి చేతిపనులు చేసేవారు. వీరు తొడుక్కునే చెప్పులు, వేసుకునే సంచులు వీరే తయారు చేసుకునేవారట. వీణ, ఫిడేలు, తంబుర వంటి వాయిద్యాలపై సంగీతం వాయించే ఒద్దిరాజు సోదరులు అష్టకోణాకృతిలో ‘మహతి’ అనే వీణను, సాధారణ కృతిలో కచ్ఛపి అనే వీణను వీరే స్వయంగా తయారుచేసుకొని హృద్యంగా వాయించేవారట. స్వయంగా చేసి, అందరూ చేయగలరని నమ్మకం కలిగిన వస్తువుల తయారీ పనులను గురించి 362 పేజీల ‘చేతిపనులు’ అనే గ్రంథాన్ని వ్రాశారు. సిరాలు, సబ్బులు, హేర్ ఆయిల్స్, ఐస్‍క్రీమ్స్ వంటివెన్నో ఎట్లా తయారు చేయాలో విధానాలు వ్రాశారు. 1920లోనే ‘బాల విజ్ఞాన మంజూష’ అనే పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకం చాలా ఉపయోగమైంది. పునఃముద్రణకు నోచుకోవాల్సినది.
ఫొటోలు తీయించుకుంటే ఆయుక్షీణమనే మూఢ నమ్మకాన్ని ఆ కాలంలో వీరు ఫొటోలు దిగి ప్రజల భయాన్ని పోగొట్టి, నేర్చుకొని ‘ఛాయకర్షణము’ (ఫొటోగ్రఫీ) అనే పుస్తకాన్ని వ్రాశారు. రసాయన, భౌతికశాస్త్ర విషయాలపైన శాస్త్ర, సాంకేతిక పారిభాషిక పదాలు గ్రంథంగా వ్రాశారు. ‘అనాటమి’ శారీరక శ్రాస్తాన్ని వ్రాశారు.
వేదాలను నీతిశాస్త్రాలను, శతకాలను పుక్కిటబట్టిన ఒద్దిరాజు సోదరులు ఎందరో విద్యార్థులకు, శిష్యులకు, విద్యాదానంతోపాటు అన్నదానం కూడా చేశారట. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఈ మధ్యనే వీరు వ్రాసిన కవితలను ‘హరివిల్లు’ పుస్తకంగా వేశారు. సాహిత్యంలో ఏకసూత్రాలు ఉన్న సోదరుల జీవనగమనంలో రామ లక్ష్మణులు వీరేనా అన్నట్లు ఉండేవారట.
దేశభక్తి, సాహిత్యభక్తి రెండూ స్రవంతులుగా ప్రవహించిన ఈ దైవ భక్తులైన ఒద్దిరాజు సోదరులు తెలుగు భాషపై ఒక చక్కని పద్యాన్ని వ్రాసి ధన్యులయ్యారు. మనల్ని ధన్యులజేశారు.
సీ. ఏరంగు పూత సింగారము గావలె
కెందామరల రేకులందములకు
ఏ అత్తరువు చేర్పులెందుకయ్యె
మెట్టదామరల బూపుట్టువులకు?
ఏ మెత్తరికముల నెక్కింపగావలె
ముద్దైన ఆవెన్నముద్దలకును?
ఏకమ్మ చక్కారపాక, చేర్చగ వలె
దాకొని పండినదా కులుకులను?
తే.గీ. తనకుగల చక్కదనమది తనకుగాని
వేరొకటి చేర్పమిక్కిలి ఐలయునెట్లు?
తెలుగులో విదుగాపుల పలుకులన్ని
గలుపబేకురు నెట్టుల కులుకుదనము!
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-డా।। కొండపల్లి నీహారిణి
9866360082