దళితోద్యమానికి మూలమలుపు కారంచేడు

ఉమ్మడి ఆంధప్రదేశ్‍ చరిత్రలో తెలుగుదేశం పార్టీ స్థాపన, అధికారంలోకి రావడం ఒక కీలక మలుపు. మొదటి సారిగా జనవరి 9, 1983 నాడు తొలి  కాంగ్రేసేతర  వ్యక్తిగా ఎన్టీరామారావు ఉమ్మడి ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిండు. అంతకుముందూ కుల రాజకీయాలున్నప్పటికీ అవి అంత నగ్నంగా బయటికి రాలేదు. కమ్మ సామాజిక వర్గం నుంచి ఈయన తొలి ముఖ్యమంత్రి. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్టీరామారావు చరిత్ర సృష్టించిండు. ఈయన రాష్ట్రమంతటా పర్యటించి ‘తెలుగువారి ఆత్మగౌరవం’ పరిరక్షణ పేరిట ప్రచారం చేసిండు. కాంగ్రెస్‍ పార్టీ అంతర్గత కలహాలు, గాడి తప్పిన సుదీర్ఘ పాలన, చీటికి మాటికి ముఖ్యమంత్రుల మార్పు, అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన అంజయ్యకు బేగంపేట ఎయిర్‍పోర్టులో రాజీవ్‍గాంధి మూలంగా జరిగిన అవమానం అన్నీ కలగలిసి ఆ పార్టీ పతనానికి కారణ మయింది. అయితే ఆశ్చర్య కరంగా అంజయ్య మాట్లాడే భాషను అంటే తెలంగాణ భాషను, యాసను  ఎగతాళి చేస్తూ ఈనాడు పత్రిక ఆయన్ని ఒక బఫూన్‍గా చిత్రీకరిం చింది. ఎద్దేవా చేసింది. ఆయనకు పోటీగా సంస్కృత భూయిష్ట తెలుగును బట్టీపట్టి (సినీ డైలాగ్స్ మాదిరిగా) మాట్లాడే ఎన్టీ రామారావును ‘తెలుగువారి ఆత్మగౌరవ ప్రతినిధి’గా ప్రచారంలో పెట్టింది. ఈ స్పీచ్‍లను త్రిపురనేని మహారథి లాంటి సినీ రచయితలు, కొందరు పేరుమోసిన జర్నలిస్టులు రాసిచ్చేవారు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలతో సంబంధం లేకుండా సంస్కృతీకరించిన తెలుగు భాష మాట్లాడే ఆయన్ని మొత్తం తెలుగువారికి సరైన ప్రతినిధిగా ‘ఈనాడు’ ప్రచారం చేసింది. ఆయన రోడ్డు మీద స్నానం చేసినా దాన్ని ప్రధాన వార్తగా మొదటి పేజీలో అచ్చేసింది. అంతర్గత కుమ్ములాట, అభివృద్ధి రాహిత్యం కారణంగా కాంగ్రెస్‍పై విసిగి ఉన్న ప్రజలకు సర్వజనామోద ప్రత్యామ్నాయంగా ఎన్టీరామారావుని ‘ఈనాడు’ పత్రిక నిలబెట్టింది. అవును నిలబెట్టింది. ఎందుకంటే అంతకు ముందు ఎలాంటి రాజకీయ పరిజ్ఞానమే కాదు ప్రజలతో ఏనాడూ ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తిని కేవలం సినిమా గ్లామర్‍ మూలంగా భావి ముఖ్యమంత్రిగా ప్రచారం చేసింది. ఈ ప్రచారం, సినిమా గ్లామర్‍, కాంగ్రెస్‍పై ఆగ్రహం అన్నీ కలగలిసి ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం లోకి వచ్చి రెండేండ్లు కూడా గడవక ముందే ఎన్టీ రామారావు ప్రభుత్వం ఆగస్టు 16, 1984నాడు పతనమయింది.


తెలుగు దేశం పార్టీ అంతర్గత కుమ్ములాటలు, గవర్నర్‍ రామ్‍లాల్‍ అనాలోచిత చర్యల వల్ల నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయిండు. నెలరోజుల అధికారంలో ఉన్నడు. అయితే ఆయన అసెంబ్లీలో బలం నిరూపించుకోలేక పోయిండు. ఆ తర్వాత శాసనసభను రద్దు చేసి 1984లో ఎన్టీరామారావు మధ్యతంతర ఎన్నికలకు వెళ్ళిండు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్‍ గెలుచుకున్న స్థానాలను కూడా ఈసారి తెలుగుదేశం కైవసం చేసుకుంది. రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్టీరామారావు బాధ్యతలు స్వీకరించిండు. ఈ దశలో అధికార పార్టీ అండ చూసుకొని ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన కమ్మ భూస్వాములు జూలై 17, 1985 నాడు దళితులపై దాడికి దిగినారు. మారణ హోమాన్ని సృష్టించినారు. ఇందుకు ఎన్నికల్లో వారు కాంగ్రెస్‍కు ఓటెయ్యడం కూడా కారణమయింది. ఈ సంఘటన మొత్తం తెలుగు నాట దళితోద్యమాన్ని మలుపు తిప్పింది. దిశా నిర్దేశం చేసింది. దళిత సాహిత్యానికి బలమైన దారులు వేసింది. ఈ దశలో ఈనాడు పత్రికకు బలమైన పోటీగా వచ్చిన ‘ఉదయం’ పత్రికను కాపు కులానికి చెందిన దాసరి నారాయణరావు స్థాపించిండు. ఈ పత్రికలో ఎక్కువగా తెలంగాణకు చెందిన జర్నలిస్టులుండేవారు. ఇట్లా ఒక ప్రత్యామ్నాయ గొంతుక ‘ఉదయం’ రూపంలో ప్రజలకు అందు బాటులోకి వచ్చింది. ఈ పత్రిక కారంచేడు బాధితుల పక్షాన నిలబడింది.


‘‘1985 జూలై 16న పోతీన సీను, రాయినీడు ప్రసాద్‍ అనే కమ్మ యువకులు మాదిగవాడలో వున్న చెరువుకు గేదెలు తోలుకెళ్ళి, కుడితి పెట్టి ఆ కుడితి నీళ్ళ బకెట్లను చెరువులో కడగటం జరిగింది. కత్తి చంద్రయ్య అనే దళిత కుర్రవాడు (వికలాంగుడు) దీనికి అభ్యంతరం చెప్పాడు. అతని మీద కమ్మ యువకులు దాడికి దిగుతుండగా ఆ చెరువుకు నీళ్ళకు వచ్చిన మున్నంగి సువార్తమ్మ అడ్డుకోబోయింది. వాళ్ళు చండ్రకోలు విసిరారు. ఆమె బిందె అండం పెట్టింది. ఈ సువార్తమ్మ ఎత్తిన బిందె అందుకుముందే జరిగిన రాజకీయ ఘర్షణ నుండి అవకాశం కొరకు యెదురు చూస్తున్న కారంచేడు కమ్మవారి దాడికి ఆసరా అయింది’’.
ఈ సంఘటనను ఆసరగా చేసుకొని కమ్మవాండ్లు 17వతేది ఉదయం ట్రాక్టర్లలో వచ్చి దుడ్డు మోషె, దుడ్డు రమేశ్‍, తేళ్ళ యోహోషువ, తేళ్ళ మోషే, తేళ్ళ ముత్తయ్య, దుడ్డు అబ్రహాంలను హతమార్చినారు. స్త్రీలపై అత్యాచారానికి ఒడిగట్టారు. వేటాడి, వెంటాడి నరహంతకులైనారు. అయితే మొత్తం చనిపోయింది ఎనిమిది మంది అయితే కేవలం 1. దుడ్డు వందనం, 2. దుడ్డు రమేశ్‍, 3. తేళ్ళ యెహోషువ, 4. తేళ్ళ మోషే, 5. తేళ్ళ ముత్తయ్య, 6. దుడ్డు అబ్రహామ్‍లు చనిపోయినట్లుగా ప్రభుత్వం పేర్కొన్నది.


ఈ పోరాటంలో దళితులు ఐక్యంగా పాల్గొన్నారు. రాస్తా రోకో, రైల్‍ రోకో చేసిండ్రు. సైకిల్‍, పాదయాత్రలు చేసి ప్రజలను చైతన్యవంతులని చేసినారు. ఈ పోరాటాల పర్యవసానంగా 1985 సెప్టెంబర్‍ 1న ‘దళిత మహా సభ’ ఏర్పడింది. బాధితులు చీరాలలోని శిబిరానికి తరలించ బడ్డారు. ఆంధప్రదేశ్‍ ‘దళిత మహాసభ’  కార్యకలాపాలన్ని బొజ్జాతారకం అడ్రస్‍తో నిర్వ హించేవారు. అది హైదరాబాద్‍లో ఉండింది. ఆ తర్వాత 1986 జూలై 16న ‘నీరు కొండ’ సంఘటన జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని మాలలపై కమ్మ సామాజిక వర్గానికి చెందిన అగ్రకులాల వాండ్లు దాడి చేసి మన్నెం శేషయ్య అనే 70 ఏండ్ల వృద్ధుడిని హతమార్చారు. ఈ సంఘటనలో 30మందికి పైగా దళితులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలుగునాట ‘దళిత’ చైతన్యం పెరిగింది. ‘దళిత మహాసభ’ ఏర్పడింది. హైదరాబాద్‍ కేంద్రంగా ఎన్నో చర్చోపచర్చలు సాగినాయి. మెదక్‍ జిల్లా అవధత్‍ పూర్‍లో తెలుగుదేశం పార్టీకి చెందిన భూస్వాములను ఎదిరించి నందుకు దళితులకు చెందిన 30 ఇండ్లకు నిప్పుబెట్టినారు. ఈ సంఘటన 1986లో జరిగింది. అలాగే 1989లో రంగారెడ్డి జిల్లా జబ్బార్‍గూడెంలో టిడిపి గూండాలు ఒక దళితుణ్ణి చంపేసినారు.


ప్రజల్లో ముఖ్యంగా దళితుల్లో చైతన్యం తీసుకురావడంలో బొజ్జా తారకం అధ్యక్షుడిగా, కత్తి పద్మారావు కార్యదర్శిగా ‘దళిత మహాసభ’ కృషి చేసింది. తెనాలి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో వీళ్ళు సభలు నిర్వహించారు. ఈ దళితోద్యమం కొనసాగింపుగా జాతీయస్థాయిలో దళితుల సంఘీభావం ప్రదర్శించడానికి, ఐక్యతను చాటడానికీ, అందరికీ దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల పట్ల అవగాహన కలిగించేందుకు, సమాచారాన్ని, భావాలను ఇచ్చి పుచ్చుకునేందుకు గాను హైదరాబాద్‍లో ‘అఖిలభారత దళిత రచయితల’ మహాసభలు జరిగాయి. 1987లో ఎగ్జిబిషన్‍ గ్రౌండ్స్లో జరిగిన ఈ సభలు దేశవ్యాప్తంగా దళితులందరిదీ ఒకే దురవస్థ అని తెలియజెప్పింది. అంతేగాదు ధీటుగా పోరాడాల్సిన అవసరాన్ని కూడా ఈ సభలు చాటి చెప్పాయి. దీంట్లో బొంబాయికి చెందిన దళిత్‍ పాంథర్స్ సభ్యులు కూడా పాల్గొన్నారు. బొజ్జా తారకం పూనికతో జరిగిన ఈ సభల్లో ఆనాడు రాష్ట్రంలోని లబ్దప్రతిష్టులైన దళితులందరూ పాల్గొన్నారు. ఈ సదస్సు కార్యభారాన్ని గనుమల జ్ఞానేశ్వర్‍ లాంటి కార్యకర్తలు ఎక్కువగా మోసిండ్రు. ‘నీలిజెండా’ పత్రికను తీసుకొచ్చిండ్రు. ఇదే సమయంలో కంచె ఐలయ్య, గీతా రామస్వామి, తదితరుల సహకారంతో బొజ్జా తారకం ‘నలుపు’ అనే పక్షపత్రికను హైదరాబాద్‍ కేంద్రంగా 1989లో ప్రారంభించారు. ఈ పత్రిక కొంతమేరకు అతివాద రాజకీయాలతో అంటకాగుతూనే దళిత, బహుజన రాజకీయ ఆకాంక్షలకు సంఘీభావంగా నిలిచింది. బొజ్జా తారకం తదితర దళిత నాయకుల నిరంతర కృషి మూలంగా ‘ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోదక చట్టం-1989’ అమల్లోకి వచ్చింది. దీంట్లో మాజీ ఐఎఎస్‍ అధికారి ఎస్‍.ఆర్‍.శంకరన్‍ కీలక భూమిక పోషించిండు.
ఇంతకు ముందే చెప్పు కున్నట్లు తెలుగుదేశం పార్టీ ‘తెలు గువారి ఆత్మగౌరవం’ నినాదంతో అధికారంలోకి వచ్చింది. అయితే ఈ తెలుగువారిలో ‘దళితులు’ లేరనే విషయం ఏడాది రెండేండ్ల లోపే ‘కారంచేడు’ తదితర సంఘ టనల ద్వారా అర్థమయింది. దీంతో 1989లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్‍పార్టీ అధికారంలోకి వచ్చింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇందుకు ప్రధాన కారణం దళితుల ఓట్లు కాంగ్రెస్‍కు పడడమే! కారంచేడు సంఘటన ప్రధాన కారణం కాగా, దాన్ని ప్రజల్లోకి ‘దళితమహాసభ’ బలంగా తీసుకెళ్ళడం మరో కారణం. దీంతో ప్రజలు ముఖ్యంగా దళితులు చైతన్యంతో వ్యవహరించి ఆ పార్టీని ఓడించినారు.


కారంచేడు సంఘటన జరిగినప్పుడూ తర్వాత చీరాలలో శిబిరాలు నిర్వహించినప్పుడు బాధితుల పట్ల మావోయిస్టు పార్టీ బాధ్యత యుతంగా వ్యవహరించలేదనే అపవాదు ఉన్నది. కారంచేడు బాధితులకు కోర్టుల్లో కూడా ఎలాంటి న్యాయం జరగక పోవడంతో సిపిఐ ఎంఎల్‍ పార్టీ గెరిల్లా దళం కారంచేడు సంఘటనకు దగ్గుబాటి చెంచురామయ్యను బాధ్యుడిగా చేస్తూ ఆయన్ని ఏప్రిల్‍ ఆరు, 1989న హతమార్చింది. దీంతో దళితోద్యమకారులు, మావోయిస్టు సానుభూతి పరుల మధ్యన విబేధాలు ఏర్పడ్డాయి. ఈ సంఘటన కారణంగా ‘దళిత మహాసభ’ పైన నిర్బంధం పెరుగుతుందనే భయం వారికుండింది. అంతేగాకుండా సంస్థ కార్యకలాపాల్లో స్తబ్ధత ఏర్పడుతుందని వారు భావించారు. ఇదే సమయంలో పీపుల్స్వార్‍ పార్టీపై చెన్నారెడ్డి నిషేధాన్ని తొలగించిండు.
ఈ సమయంలో పీపుల్స్వార్‍ నుంచి బయటికొచ్చిన కెజి సత్యమూర్తి ‘సామాజిక విప్లవ వేదిక’ని ఏర్పాటు చేసిండు. దీని తరపున సైకిల్‍ యాత్ర నిర్వహించిండు. ‘ఆత్మగౌరవం-ఆత్మరక్షణ’ దళితుల ‘బర్త్ రైట్‍’ అని నినదించిండు. అలాగే ఈ దశలోనే దళిత చైతన్యం కోసం దళిత శక్తి, ఈనాటి ఏకలవ్య, కులనిర్మూలన, దళిత బహుజన పరివర్తన, దళిత రాజ్యం మొదలైన పత్రికలు ప్రారంభ మయ్యాయి. ఇదే సమయంలో తెలుగు నాట బహుజన సమాజ్‍ పార్టీ తమ కార్య కలాపాలను విస్తరించింది. ఈ ఉద్యమం కలేకూరి ప్రసాద్‍తో పాటు జంగా గౌతమ్‍ లాంటి యువకులను రంగం మీదికి తీసుకొచ్చింది. ఉ.సాంబశివ రావు లాంటి వారు కూడా ఇందులో కీలకంగా పనిచేశారు.


బహుజన సమాజ్‍ పార్టీ పంజాబ్‍లో 1984లో ఏర్పాటయింది. దీన్ని కాన్షిరామ్‍ ఏర్పాటు చేసిండు. ఆ పార్టీ మొదటిసారిగా 1990లో పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో దిగింది. ఇదే సమయంలో అప్పటి ప్రధాని వి.పి.సింగ్‍ మండల్‍ నివేదికను అమలు పరుస్తామని ప్రకటించాడు. దీంతో హిందూత్వ శక్తులు దాన్ని అడ్డుకునేందుకు ‘కమండల్‍’ ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. మరోవైపు బహుజన సమాజ్‍ పార్టీ మండల్‍ కమిషన్‍ నివేదికను అమలు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. మండల్‍ కమిషన్‍కు అనుకూలంగా ఉద్యమం చేసిన పార్టీల్లో బిఎస్‍పి ముందువరుసలో ఉండింది. 1993లో ఉత్తరప్రదేశ్‍ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ సమాజ్‍వాది పార్టీతో ఎన్నికలకు ముందే పొత్తు కుదుర్చుకుంది. రెండు పార్టీలు కలిసి పోటీజేసి బిజెపి, కాంగ్రెస్‍ పార్టీలను మట్టికరిపించి అధికారంలోకి వచ్చాయి. దీంతో దేశంలో మొదటిసారిగా బహుజన రాజ్యాధికారానికి బాటలు వేసినట్లయింది. అలాగే ఆంధప్రదేశ్‍లో కూడా బహుజన సమాజ్‍ పార్టీ విభాగం ఏర్పాటయింది. దీంట్లో ఎక్కువ మేరకు నక్సలైట్‍ పార్టీల్లో పనిచేసి బయటికి వచ్చిన దళిత నేతలు చురుగ్గా పాల్గొన్నారు. ఈ పార్టీ దళితుల్లో ఆత్మవిశ్వాసం కలిగించింది. ప్రశ్నించడమే కాదు, ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కొనే, అధిగమించే స్థైర్యాన్ని బిఎస్‍పి దళితుల్లో నింపింది. ఈ స్ఫూర్తితోనే తమపై దాడులు జరిగి నప్పుడు ఉద్యమాలు చేసినారు. ఇదే సమయంలో చెన్నారెడ్డి స్థానంలో నేదురు మల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి అయినాడు.


తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ కులస్తులు దాడికి దిగితే, కాంగ్రెస్‍ పార్టీ హయాంలో ‘రెడ్లు’ దాడులకు ఒడిగట్టారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుంటూరు జిల్లా తెనాలి దగ్గరలోని ‘చుండూరు’లో రెడ్లు దళితులపై దాడులకు దిగిండ్రు. సినిమా హాల్లో ఒక దళితుడు ముందు సీటుపై కాలుపెట్టి తమను తాకడాన్ని సాకుగా చెబుతూ మొత్తం ఎనిమిది మంది దళితులను ‘రెడ్లు’ చంపేసిండ్రు. ఈ సంఘటన ఆగస్టు ఆరు, 1991 నాడు జరిగింది. ఈ సంఘటనపై ప్రభుత్వం గంగాధరరావు కమిటీ వేసింది. ఆయన కూడా బాధితులకు ఎలాంటి న్యాయం చేయలేక పోయినాడు. అడ్డం వచ్చిన వారిని నరికేసినారు. కాంగ్రెస్‍ హయాంలోనే తిమ్మసముద్రం, చుండూరు సంఘటనలు జరిగినాయి. దళితులపై దాడులు పెరిగినాయి. కాంగ్రెస్‍ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకున్నది. (తరువాయి వచ్చే సంచికలో)


-సంగిశెట్టి శ్రీనివాస్‍,
9849220321

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *