తెలంగాణ జానపద కళారూపాలు

సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన మన తెలంగాణాలో జానపద కళారూపాలు వందకు పైగా ఉన్నాయి. ఇవి తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ఒక కులం సంస్కృతీ సంప్రదాయా లను, ఆ కుల పుట్టు పూర్వోత్తరాలను ఈ కళారూపాలు వివరిస్తాయి. ఈ కళారూపాలు ప్రదర్శించే వారిని ఉపకులాలకు చెందిన వారిగా, హక్కుదార్లుగా పిలుస్తూ, వారి కళారూపాలను ఆశ్రిత కళా రూపాలుగా పిలుస్తున్నారు. ఈ కళా రూపాల ప్రదర్శన విధానాన్ని బట్టి తొమ్మిది రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో బొమ్మలాటలు, అనుష్టాన కళారూపాలు, వాద్య కళారూపాలు, పటం కథలు, ఇంద్రజాల ప్రదర్శనలు, నృత్యాలు, కథాగాన కళారూపాలు వేషాలతో కూడిన కళారూపాలు, భజన సంప్రదాయ కళారూపాలు తదితరాలు ఉంటాయి.
బొమ్మలాటలు
బొమ్మల ద్వారా ప్రదర్శన ఇచ్చే కళారూపాలు. ఇవి వివిధ రకాల వస్తువులతో బొమ్మలు తయారు చేసి వాటితో ఆడించే బొమ్మలు, తోలుబొమ్మలు, చెక్క బొమ్మలు, మందిచ్చుల బొమ్మలు, పెద్దమ్మలోల్ల బొమ్మలు ప్రధానంగా కన్పిస్తాయి. ఇవే ప్రాచీన కళారూపాలుగా, ఛాయా చిత్రాలకు మాతృకలుగా నిలిచాయి.
తోలుబొమ్మలు
జంతు చర్మాలతో బొమ్మలను అందంగా తయారు చేసి వాటికి రంగులు అద్ది తెరమీద ఆడిస్తూ, తయారు చేసి వాటికి రంగులు అద్ది తెరమీద ఆడిస్తూ, రామాయణ, భారత, భాగవత కథలతో పాటు ఇతర కథలు కూడ ప్రదర్శిస్తారు. వరంగల్‍ జిల్లా తొర్రురు ప్రాం తాల్లోను, నల్లగొండ జిల్లా కోదాడ ప్రాంతాల్లో ఈ కళాకారులున్నారు. కనుమరుగై పోతున్న కళారూపాల్లో ఇది ఒకటి.
చెక్క బొమ్మలాట
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన కళారూపం చెక్క బొమ్మ లాట కళారూపం. వరంగల్‍ జిల్లా తొర్రురు మండలం అమ్మా పురం, వెంకటాపూర్‍ మండలం బూర్గుపేటలోను మాత్రమే ఈ ప్రదర్శన ఇచ్చే కళాకారులు ఉన్నారు. చెక్కతో తల, ఛాతి వరకు అందంగా తయారుచేసి మిగితా భాగాలను రంగు రంగుల గుడ్డలతో అలంకరి స్తారు. ఈ బొమ్మల చేతులకు దారాలు కట్టి తెరవెనుక ఉండి ఆడిస్తారు. వీరు ఎక్కువగా భారత, రామాయణాది కథలు ప్రదర్శిస్తారు.
మందెచ్చుల బొమ్మలు, ‘నకాశి’ వారు పొనిక కర్రతో, చింత గింజల అంబలితో వివిధ రకాలైన బొమ్మలు, పటం కథలకు సంబం ధించిన బొమ్మలు, కులపురాణాల వృత్తాంతాలను తెల్లటి గుడ్డమీద వేస్తారు. వీటితో పాటు వివిధ రకాల మాస్కులు, పెద్దమ్మ బొమ్మలు, లాంటివి తయారు చేస్తారు. వీరు తెలంగాణ ప్రాంతంలోని చేర్యాలలో ఉండటం మనకు గర్వకారణం. ఈ వృత్తి ద్వారా జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఏకైక కుటుంబం ధనాలకోట నాగేశ్వరరావుది.
యాదవులకు ఆశ్రితులైన మందెచ్చుల వాళ్ళు బుడిగె జంగం కులస్థులు. వీరు యాదవులకు సంబంధించిన కాటమరాజు కథ, ఎల్లమ్మకథ, పెద్దిరాజు కథలను ప్రదర్శించేటప్పుడు రంగస్థలం పైన వాటి సంబంధించిన బొమ్మలను చూపుతూ కథ చెపుతారు. వీరు వరంగల్‍ జిల్లా వెంకటాపూర్‍, నారాయణపురంలో ఈ కళాకారులు ఉన్నారు. పెద్దమ్మలోల్లు, పెద్దమ్మ దేవతను నెత్తిమీద పెట్టుకొని ఊరూరు తిరుగుతూ, చర్నకోలాతో కొట్టుకుంటూ, శరీరాన్ని కోసుకుంటూ భయానకంగా కనబడుతారు. వీరు తెలంగాణ అంతట జాతరల్లో ఎక్కువగా ఉంటారు.


అనుష్టాన కళారూపాలు
అనుష్టాన కళారూపాలను పండుగల్లో, దేవతల ఉత్సవాల్లో మా త్రమే ప్రదర్శిస్తారు. వీటిలో బతుకమ్మ, బోనాలు, దుబ్బుల కొలుపులు, పంబా, ఎల్లమ్మవేషం, వీరముష్ఠి వంటి కళారూపాలు మనకు కనబడుతాయి. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి సముచిత స్థానాన్ని కల్పించింది. దుబ్బుల వాళ్ళు దుబ్బు వాద్యంతో పెద్దేవరను కొలిచే పూజారులు.
పంబా కళారూపం
గ్రామదేవతల ఉత్సవాల్లో, బొడ్రాయి ప్రతిష్టాపనలో వీరి ప్రదర్శన తప్పక ఉంటుంది. ఎల్లమ్మవేషంలో ఊరు చుట్టూ పొలి చల్లుతూ గ్రామం బాగుండాలని కోరుకుంటారు. ఈ అనుష్టాన కళా రూపాలు తెలంగాణ ప్రజలతో విడదీయరాని సంబంధం ఉన్నప్పటికి ఆధునీ కరణ పేరుతో ఈ కళారూపాలు కూడ రంగస్థల ప్రవేశం చేస్తున్నాయి.
వాద్య కళారూపాలు
వాద్య కళారూపాల్లో ప్రధానంగా చెప్పుకునేవి డప్పు, దీనిని శుభాశుభాలకు వాడినప్పటికి ప్రత్యేకమైన దరువులను వాయిస్తూ రర రకాలుగా నృత్యాలు చేస్తారు. ఇక తెలంగాణకే తలమానికమైన ఒగ్గుడొల్లు, ఒగ్గు కథలతో పాటు వివిధ రకాల దరువులతో నృత్యాలు చేస్తారు.
బుడబుక్కలవాళ్ళు బుడగ అనే వాద్యంతో భవిష్యత్తు చెపుతూ ఇంటిముందు శ్రావ్యంగా వాయిస్తారు. ప్రజలకు వీరిమీద అపార నమ్మకం ఉంటుంది. విశ్వ బ్రాహ్మణులకు కులపురాణాన్ని చెప్పెవారు రుంజ కళాకారులు. ‘రుంజ’ అనే వాద్యంతో ముప్ఫై రెండు రకాల ద్వనులు చేస్తూ విశ్వకర్మ పురాణం, మూలస్తంభం వంటి కథలు చెపుతారు. తెలంగాణవ్యాప్తంగా ఒక్క మహబూబ్‍ నగర్‍ ప్రాంతాల్లో ఒకటి రెండు బృందాల వారు మాత్రమే ఉన్నారు.
పటం కళారూపాలు
తెలంగాణలోనే ప్రత్యేకంగా ప్రదర్శించే కళారూపాలు పటం కథలు. ఇవి పన్నెండు వరకు కలవు. వీటిలో ఒక్కొక్క కులం కుల పురాణాలను ప్రదర్శిస్తారు. వాటిలో పద్మశాలీ కులం వారికి ‘కూనపులి కళాకారులు’, మార్కెండేయ పురాణం, మాదిగ కులం వారికి ‘డక్కలీ వారు’ జాంబ పురాణం, మాల కులంవారికి ‘గుర్రపు వారు’ భేతాళ పురాణం, చాకలి వారికి ‘మా సయ్యలు’ మడెలు పురాణం, గౌడ కు లం వారికి ‘ఏనోటి వారు’, గౌడ జెట్టిలు’ గౌడ పురాణం, కుమ్మరి వారికి ‘పెక్కర్లు’ గుండ బ్రహ్మపురాణం, యాదవులకు ‘తెరచీరల వారు’ మల్లన్న కథను, ముదిరాజు కులస్థులకు ‘కాకి పడిగెలవారు’ పాండవుల కథలను చెపుతారు.
గిరిజన తెగైన నాయక పోడువారికి ‘తోటివారు’ పద్మనాయక వృత్తాంతమనే కథను ప్రదర్శిస్తారు. పై కులాల వారికి ఆశ్రితులుగా ఉంటూ కులపురాణాన్ని నకాశి ద్వారా బొమ్మలు వేయించి ఆ బొమ్మల ఆధారంగా ప్రేక్షకులకు కథను చెపుతారు. ఈ కళారూపాలు వరంగల్‍, కరీంనగర్‍ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయి.


నృత్యాలు
నృత్య కళారూపాలు ఎక్కువగా గిరిజన తెగలకు సంబంధించినవే ఉన్నాయి. ఇవి వారి ఐక్యత భావంను వెల్లడిస్తాయి. వీటిలో బంజారాలు -సుగాలి నృత్యం, గోండు గుస్సాడి నృత్యం, కోయ-కొమ్ము నృత్యాలు, ధింసా, రేలా, దండారి లాంటి నృత్యాలు కనబడుతాయి. వీటితో పాటు పండుగలకు సంబంధించిన నృత్యాలు ఆయా సందర్భాల్లో ప్రదర్శిస్తారు.
ఇంద్రజాల ప్రదర్శనలు
ఇంద్రజాల ప్రదర్శనలో ‘సాధన శూరులు’ పద్మశాలీ కులస్థులకు ఆశ్రితులుగా ఉంటారు. వీరు వివిధ రకాల విన్యాసాలు ప్రదర్శిస్తారు. చొప్ప బెండులతో పల్లకి చేసి అందులో కూర్చోవటం, నెత్తిమీద పొయ్యి పెట్టడం, చెవిలో నుండి నీళ్ళుపోసి ముక్కులో నుండి తీయడం, నీటి లో పసుపు కారం లాంటివి కలిపి మళ్ళి పొడి పసుపు, కారం తీయడం లాంటివి ఎన్నో అటు ఆనందాన్ని, భయాన్ని కల్గిస్తాయి. మరొక కళా రూపం ‘కాటిపాపల వాళ్ళు’ నోట్లో నుండి పాములను, తేళ్ళను, ఉంగరాలను తీస్తూ ప్రేక్షకులను ఆనందపరుస్తారు. ‘పాములవాళ్ళు, యక్షిణి వాళ్ళు కూడ రకరకాల ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తారు.
కథాగాన కళారూపాలు
కథాగాన కళారూపాల్లో రామాయణ, భారత, భాగవత కథలను పురాణాలుగా చెప్పేవారిలో చిందుయక్షగానం, గొందేళివీధి భాగోతం, దాసరి భాగోతం, వీధి భాగోతాలు వీధి నాటకాలు ఈ కోవలోకి వ స్తాయి. ఆ కథలకు సంబంధించి పాత్రలు-వేషధారణతో కథలను రక్తి కట్టిస్తారు. వీటిలో హాస్యగాడి పాత్ర అందరిని ఆకర్షిస్తుంది.
వేషాలతో కూడిన కళారూపాలు
కళారూపంలో ఎక్కువగా వేషాలతో అలరించేవి. ఇందులో పగటి వేష కళాకారులు ముప్ఫైకి పైగా వేషాలు వేసి ప్రదర్శన ఇస్తారు. ఇందులో అర్థనారీశ్వర, అదేవిధంగా, పులివేషాలు లాంటివి ఉం టాయి. అదేవిధంగా, పులివేషాలు, కాళిక వేషం వంటివి ఇందులోకి వస్తాయి. పగటి వేషకళాకారులు రోజుకొక వేషం వేస్తూ ఊళ్ళో ప్ర దర్శన ఇస్తారు. ఇందులో తుపాకి రాముడి వేషం తెలంగాణాలో ప్రత్యేకం.

జానపద కళారూపాల్లో పై కోవలోకి కాకుండా ఇతర జీవులతో ప్రదర్శన ఇచ్చే కళారూపాలు కూడ ఉన్నాయి. వాటిలో గంగిరెద్దులాట, చిలుక జ్యోసం, గారడి వంటివి ప్రేక్షకులకు హాస్యాన్ని పండిస్తాయి. ఈ విధంగా తెలంగాణ జిల్లాలకే ప్రత్యేకంగా నిలిచిన ఈ జానపద కళారూపాలను పరిరక్షించుటకు తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడం మరియు వారికి గుర్తింపు కార్డు ద్వారా పెన్షన్‍తో కళాకారులకు చేయుత నివ్వడం ఒక శుభ సంకేతంగా చెప్పవచ్చు.
ఈ కళా రూపాలను రక్షించి మన సంస్కృతిని మనమే కాపాడు కుందాం. తెలంగాణను సంస్కృతి రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం. ఈ కృషిలో మనందరం భాగస్వాములం అవుదాం.


– డా।। శ్రీమంతుల దామోదర్‍
9989139136

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *